విద్యా విధానంలో మార్పులు తప్పనిసరి | Article On Telangana Inter Results In Sakshi | Sakshi
Sakshi News home page

విద్యా విధానంలో మార్పులు తప్పనిసరి

Published Thu, May 16 2019 1:28 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Article On Telangana Inter Results In Sakshi

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ బోర్డు నిర్వాకం రెండు డజన్లకుపైగా విద్యార్థుల ప్రాణాలు హరించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్‌ విద్య అవసరం గురించి విస్తృత చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా తెలంగాణలో విద్యారంగంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి సంక్రమించిన ఒంటెత్తువాదం ప్రభావం గురించి చర్చిస్తే గానీ తెలంగాణ విద్యారంగం తీరుతెన్నులు అర్థం కావు.విద్యారంగంలో దేశంలోని 29 రాష్ట్రాల్లో తెలం గాణ స్థానం 28. దీని తర్వాత మిగిలింది బిహార్‌ రాష్ట్రం ఒక్కటే. దక్షిణాదిలో మనది అట్టడుగు స్థానం. విద్యాభివృద్ధి సూచికల విషయంలో 2018 లో ఇండియా టుడే సంస్థ నిర్వహించిన సర్వేలో కూడా మన ర్యాంక్‌ 18 మాత్రమే. విద్యారంగంలో వెనకబాటుకు ప్రధాన కారణాలు రెండు. ఒకటి, అందరికీ సమానమైన చదువు అందకూడదనే ఫ్యూడల్‌ భావజాలం. రెండు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుండి సంక్రమించిన విద్యారంగంలో ‘నా రూటే సెపరేట్‌‘ అనే వైఖరి. ఈ రెంటిలో మార్పు రానంత కాలం ఇంతే సంగతులు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో  విద్యారంగానికి సంబంధించిన సమగ్రమైన చట్టం 1982లో వచ్చింది. 37 సంవత్సరాలు గడిచినా కనీసం సమీక్ష కూడా లేకుండా అదే చట్టం కొనసాగుతోంది. దేశంలో జాతీయ విద్యా విధానం 1986 (1992లో అప్‌డేట్‌ చేశారు)లో వచ్చింది. ఆ తర్వాత వచ్చిన సర్వ శిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ), రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌ (ఆర్‌ఎంఎస్‌ఏ), విద్యాహక్కు చట్టం మున్నగునవి పాఠశాల విద్యా రంగాన్ని ఎంతోకొంత ప్రభావితం చేశాయి. కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోగానీ, తెలంగాణలో గానీ పాఠశాల విద్యా చట్రం ఎలాంటి సంస్థాగత మార్పులను అనుమతించకుండా ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్లుగా వుండిపోయింది.

గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ నేటి తెలం గాణలోగానీ ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ 1/1982లో ప్రీ–ప్రైమరీ (3–5 సం.ల వయసు) ఎడ్యుకేషన్‌ గురించి పేర్కొన్నా కొన్ని ప్రైవేట్‌ స్కూళ్లలో తప్ప ప్రభుత్వ పాఠశాలల్లో అమలుకావడం లేదు. మరో ముఖ్య విషయం, 1968 జాతీయ విద్యా విధానంలోని 10+2+3 విధానాన్ని అమలు చేయడంలో వ్యత్యాసం. కేంద్ర ప్రభుత్వంలో,  అన్ని రాష్ట్రాల్లో హైస్కూళ్లు 12వ తరగతి (+2) వరకు ఉన్నవి. తెలంగాణలో కూడా సీబీఎస్‌ఈ అనుబంధ ప్రైవేట్‌ కార్పొరేట్‌ స్కూళ్లు మరియు ఇటీవల వచ్చిన ప్రభుత్వ గురుకులాలు, మోడల్‌ స్కూల్స్, కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు 12వ తరగతి (ఇంటర్మీడియట్‌) వరకు నడుస్తున్నవి. కానీ అనాదిగా వస్తున్న ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్‌ హైస్కూళ్లు మాత్రం 10 వ తరగతి వరకే పరిమితమైనవి. 11, 12 తరగతులను విడగొట్టి ఇంటర్మీడియట్‌ విద్యగా జూనియర్‌ కాలేజీలను నిర్వహిస్తున్నారు. ఈ ఏర్పాటు విద్యారంగంలో  తెలంగాణ వెనుకబాటుతనానకి ఒక ముఖ్య కారణం. మరోవైపు ప్రైవేట్‌ కార్పొరేట్‌ విద్యా వ్యాపారానికి ఇంటర్మీడియట్‌ విద్యావ్యవస్థ వనరుగా మారింది.

ఇంటర్మీడియట్‌ విద్యా విధానం వలన తెలంగాణకు జరుగుతున్న లాభం కంటే నష్టం ఎక్కువ. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో సంవత్సరానికి ఐదారొందల మందికి సీట్లు వస్తూ ఉండవచ్చు. కానీ అందుకు భారీ మూల్యం చెల్లించడం జరుగుతోంది. ఐఐటీ, నీట్‌ తదితర పరీక్షల్లో సీట్లు వస్తున్న వారిలో అత్యధికులు కార్పొరేట్‌ కాలేజీల్లో ప్రత్యేక తర్ఫీదు పొందినవారే. ప్రభుత్వ రెసిడెన్షియల్‌ కాలేజీల్లో చదివిన వారికి కూడా కొన్ని రావచ్చు. కానీ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదివిన వారికి వస్తున్నవి చెప్పుకోదగినంత లేవు. ఇంటర్మీడియట్‌ విద్యా వ్యాపారంపైన జరుగుతున్న టర్నోవర్‌ సంవత్సరానికి రూ. పదివేల కోట్లు పైగా ఉన్నట్లు అంచనా. లక్షల మంది తల్లిదండ్రులు తమ కష్టార్జితాన్ని ప్రైవేట్‌ కార్పొరేట్‌ విద్యా వ్యాపారులకు ధారబోస్తున్నారు. టీనేజ్‌ దశలోని అమ్మాయిలు, అబ్బాయిలు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కోల్పోయి భావోద్వేగాలకు సామాజిక జీవనానికి దూరమై యంత్రాల్లా బతుకుతున్నారు. ఒత్తిడి తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలకు, బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. చనిపోతున్న వారిలో, ఫెయిలవుతున్న విద్యార్థుల్లో దళిత, గిరిజన, మైనార్టీ మరియు అమ్మాయిలే ఎక్కువ. ఇన్ని రకాల నష్టాలు కల్గిస్తూ రాష్ట్ర విద్యారంగానికి గుదిబండగా మారిన ఇంటర్మీడియట్‌ విద్యా అవస్థను ఇకనైనా విరమిస్తేనే మంచిది. జాతీయ విద్యా ప్రధాన స్రవంతిలో కలిసి పురోగమించే విద్యా విధానానికి మరలాలి.

తెలుగు రాష్ట్రాల్లో పాఠశాల విద్యా వ్యవస్థకు జాతీయ పాఠశాల విద్యా స్థాయిని కల్పించాలి. బడిలో చేరిన బాలబాలికలు అందరూ తమ నివాస ప్రాంతంలోనే 12వ తరగతి వరకు చదువుకునే అవకాశం కల్గుతుంది. సార్వత్రిక సెకండరీ విద్యను సాధిస్తూ విద్యాభివృద్ధిలో ఏపీ, తెలంగాణ ముందడుగు వేయగలవు. ఇందుకు అనువుగా మన విద్యా విధానాన్ని మార్చుకుంటే ఎంతో మేలు. నాగటి నారాయణ, విద్యారంగ విశ్లేషకులు మొబైల్‌ : 94903 00577 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement