రెండు మూడు రోజుల్లో సెకండ్‌ ఇంటర్‌ ఫలితాలు! | Telangana: Within Two Days Inter Second Year Results Will Be Realeased | Sakshi
Sakshi News home page

25 లేదా 26న ఫలితాలు వెలువడే అవకాశం

Published Thu, Jun 24 2021 4:53 AM | Last Updated on Thu, Jun 24 2021 5:09 AM

Telangana: Within Two Days Inter Second Year Results Will Be Realeased - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సర విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫలితాలు రాబోతున్నాయి. ఈనెల 25 లేదా 26 తేదీల్లో విడుదల చేసేందుకు ఇంటర్మీడియెట్‌ బోర్డు సన్నాహాలు చేస్తోంది. కరోనా కారణంగా ఇంటర్‌ ప్రథమ సంవత్సర విద్యార్థులను ప్రమోట్‌ చేసి, సెకండియర్‌ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మార్కులు కేటాయించే విధానంపై ఏర్పాటు చేసిన కమిటీ చేసిన సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది.

దీంతో ఫలితాల వెల్లడికి మార్గం సుగమమైంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా బుధవారం ఉత్తర్వులు (మెమో నంబరు 1583/ఎంసీ/2021) జారీ చేశారు. ఫలితాల వెల్లడికి అనుసరించాల్సిన విధి విధానాలను అందులో పొందుపరిచారు. ఈ ఫలితాల కోసం 4,73,967 మంది సెకండియర్‌ విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. వారిలో ఫస్టియర్‌ ఫెయిలైన 1,99,019 మంది ఉన్నారు. ఫలితాలను  https://tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చని బోర్డు తెలిపింది.
మార్గదర్శకాల్లోని ప్రధాన అంశాలివీ..

  • 2020–21లో విద్యార్థులకు ప్రథమ సంవత్సరం (జనరల్, వొకేషనల్, బ్రిడ్జి కోర్సు)లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు సెకండియర్‌ (2021–22)లో మార్కులను కేటాయిస్తారు.
  • ప్రతి సబ్జెక్టులో ప్రథమ సంవత్సరంలో వచ్చిన మార్కులనే సెకండియర్‌లోనూ ఇస్తారు.
  • సెకండియర్‌ ఫీజు చెల్లించిన విద్యార్థులు (రెగ్యు లర్, ప్రైవేటు) ఫస్టియర్‌లో ఫెయిలై ఉంటే 35% కనీస పాస్‌ మార్కులను కేటాయిస్తారు.
  • కరోనా కారణంగా ఈ సంవత్సరం ప్రాక్టికల్స్‌ నిర్వహించలేదు కాబట్టి అందరికీ ప్రాక్టికల్స్‌లో 100 శాతం మార్కులను ఇస్తారు
  • ప్రైవేటు విద్యార్థులు ఏయే సబ్జెక్టుల్లో ఫెయిలై ఉంటారో ఆయా సబ్జెక్టుల్లో 35 శాతం కనీస పాస్‌ మార్కులను ఇస్తారు.
  • హాజరు మినహాయింపు కేటగిరీలో, అదనపు సబ్జెక్టుల్లో పరీక్షలకు హాజరు కావాలనుకున్న మ్యాథమెటిక్స్‌ జనరల్‌ బ్రిడ్జి కోర్సు, వొకేషనల్‌ బ్రిడ్జి కోర్సు, హ్యుమానిటీస్‌ కోర్సుల విద్యార్థులు ఫస్టియర్‌లో ఫెయిలై ఉంటే ఆయా సబ్జెక్టుల్లో 35 శాతం కనీస మార్కులను ఇస్తారు. వారికి సెకండియర్‌లోనూ ఆయా సబ్జెక్టుల్లో అవే మార్కులను కేటాయిస్తారు. 
  • ఎథిక్స్, హ్యూమన్‌ వ్యాల్యూస్, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత పొందని సెకండియర్‌ విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో 35 శాతం కనీస మార్కులను ఇస్తారు.
  • ఈ మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులు తరువాత పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పిస్తారు. కరోనా అదుపులోకి వచ్చి, సాధారణ పరిస్థితులు నెలకొన్నాక పరీక్షలను నిర్వహిస్తారు. విద్యార్థులు ఆ పరీక్షలకు హాజరై మార్కులను పెంచుకోవచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement