![Covid-19 linked to rise in Alzheimers risk](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/covid.jpg.webp?itok=joCBTKhH)
వెల్లడించిన అధ్యయనం
వాషింగ్టన్: కోవిడ్ సోకిన వారు అల్జీమర్స్ వ్యాధి బారిన పడే అవకాశాలు పెరుగుతున్నట్లు తాజాగా ఒక అధ్యయనంలో తేలింది. మధ్యస్థాయిలో కోవిడ్ కారణంగా ఆయా వ్యక్తుల మెదడులో అల్జీమర్స్ కారక ప్రోటీన్ క్రియాశీలకమవుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు చేసిన అధ్యయనం వివరాలు తాజాగా ‘నేచర్ మెడిసిన్’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. బ్రిటన్‌లో కోవిడ్ బారిన పడి కోలుకున్న 46 నుంచి 80 ఏళ్ల వయసు వేలాది మంది వ్యక్తుల సమాచారాన్ని సేకరించి వాటిపై పరిశోధన చేయడంలో ఈ ఫలితాలొచ్చాయి.
‘‘కోవిడ్ బారిన పడిన వారిలో మెదడులోని బీటా రకం ప్రోటీన్‌లో జీవక్రియలు గతంతో పోలిస్తే మరింత క్రియాశీలకమవుతున్నాయి. ఇవి త్వరలో మెదడు న్యూరాన్లు క్షీణించడానికి, అల్జీమర్స్(మతిమరుపు) వ్యాధి వచ్చే అవకాశాలను పెంచుతోంది. కోవిడ్ కాలంలో వచ్చే వాపు భవిష్యత్తులో ఈ వ్యాధి ముప్పుకు ప్రధాన కారణం. అయితే సార్స్–కోవ్2 వైరస్ అనేది అల్జీమర్స్‌కు నేరుగా హేతువు కాదుకానీ భవిష్యత్తులో అల్జీమర్స్ రిస్క్ ను మాత్రం పెంచుతుంది. ఇప్పటికే అల్జీమర్స్ వచ్చే అవకాశాలు ఉన్న వ్యక్తుల్లో ఈ రిస్క్‌ను కోవిడ్ ఎగదోస్తుంది. పలు రక్త ప్రోటీన్లలోనూ మార్పుల కోవిడ్ కారణం.
ఈ రక్త ప్రోటీన్లలో కొన్నింటికి మెదడులోని బీటా ప్రోటీన్‌తో సంబంధం ఉంది. కోవిడ్ కారణంగా మెదడులో పీటీఏయూ181 అనే ప్రోటీన్ స్థాయిలు పెరుగుతాయి. వీటి కారణంగా టవూ ప్రోటీన్ ముద్దలు ఏర్పడటం, ఈ ప్రతిబంధకాల కారణంగా న్యూరాన్లు దెబ్బతింటాయి. అది చివరకు మతిమరుపునకు దారితీస్తాయి’’అని ఈ పరిశోధనలో ప్రధాన రచయిత డాక్టర్ ఎజీన్ డఫ్ వ్యాఖ్యానించారు. కోవిడ్ బారిన పడిన వారిలో డిమెన్షియా (చిత్రభ్రంశం) వ్యాధి ముప్పు పెరిగిన నేపథ్యంలో ఆ కోణంలోనే ఈసారి కూడా పరిశోధన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment