Alzheimers disease
-
కోవిడ్ కారణంగా అల్జీమర్స్ ముప్పు
వాషింగ్టన్: కోవిడ్ సోకిన వారు అల్జీమర్స్ వ్యాధి బారిన పడే అవకాశాలు పెరుగుతున్నట్లు తాజాగా ఒక అధ్యయనంలో తేలింది. మధ్యస్థాయిలో కోవిడ్ కారణంగా ఆయా వ్యక్తుల మెదడులో అల్జీమర్స్ కారక ప్రోటీన్ క్రియాశీలకమవుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు చేసిన అధ్యయనం వివరాలు తాజాగా ‘నేచర్ మెడిసిన్’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. బ్రిటన్‌లో కోవిడ్ బారిన పడి కోలుకున్న 46 నుంచి 80 ఏళ్ల వయసు వేలాది మంది వ్యక్తుల సమాచారాన్ని సేకరించి వాటిపై పరిశోధన చేయడంలో ఈ ఫలితాలొచ్చాయి. ‘‘కోవిడ్ బారిన పడిన వారిలో మెదడులోని బీటా రకం ప్రోటీన్‌లో జీవక్రియలు గతంతో పోలిస్తే మరింత క్రియాశీలకమవుతున్నాయి. ఇవి త్వరలో మెదడు న్యూరాన్లు క్షీణించడానికి, అల్జీమర్స్(మతిమరుపు) వ్యాధి వచ్చే అవకాశాలను పెంచుతోంది. కోవిడ్ కాలంలో వచ్చే వాపు భవిష్యత్తులో ఈ వ్యాధి ముప్పుకు ప్రధాన కారణం. అయితే సార్స్–కోవ్2 వైరస్ అనేది అల్జీమర్స్‌కు నేరుగా హేతువు కాదుకానీ భవిష్యత్తులో అల్జీమర్స్ రిస్క్ ను మాత్రం పెంచుతుంది. ఇప్పటికే అల్జీమర్స్ వచ్చే అవకాశాలు ఉన్న వ్యక్తుల్లో ఈ రిస్క్‌ను కోవిడ్ ఎగదోస్తుంది. పలు రక్త ప్రోటీన్లలోనూ మార్పుల కోవిడ్ కారణం. ఈ రక్త ప్రోటీన్లలో కొన్నింటికి మెదడులోని బీటా ప్రోటీన్‌తో సంబంధం ఉంది. కోవిడ్ కారణంగా మెదడులో పీటీఏయూ181 అనే ప్రోటీన్ స్థాయిలు పెరుగుతాయి. వీటి కారణంగా టవూ ప్రోటీన్ ముద్దలు ఏర్పడటం, ఈ ప్రతిబంధకాల కారణంగా న్యూరాన్లు దెబ్బతింటాయి. అది చివరకు మతిమరుపునకు దారితీస్తాయి’’అని ఈ పరిశోధనలో ప్రధాన రచయిత డాక్టర్ ఎజీన్ డఫ్ వ్యాఖ్యానించారు. కోవిడ్ బారిన పడిన వారిలో డిమెన్షియా (చిత్రభ్రంశం) వ్యాధి ముప్పు పెరిగిన నేపథ్యంలో ఆ కోణంలోనే ఈసారి కూడా పరిశోధన చేశారు. -
చిన్న చిన్న విషయాలను కూడా మరిచిపోతున్నారా?.. కారణం ఇదే కావచ్చు..!
సాక్షి, కర్నూలు జిల్లా : అల్జీమర్స్ ఈ పేరు చాలా మందికి తెలియదు. వయస్సు పైబడిన వారిలో మతిమరుపు అంటే.. ఓ అదా అంటారు. ఈ సమస్య ఉన్న వారు ఆ రోజు జరిగే చిన్న చిన్న విషయాలు మరిచిపోతుంటారు గానీ ఎప్పుడో చిన్నప్పుడు జరిగినవి గుర్తుకు తెచ్చుకుని మరీ చెబుతుంటారు. ఇలాంటి వ్యాధితో బాధపడే వారు ఒకరుంటే ఆ కుటుంబం మొత్తం పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఒంట్లో సత్తువ క్షీణించి, జ్ఞాపకశక్తి నశించిన మనుషులను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ అల్జీమర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. చదవండి: వీరి సంపాదన నెలకు రూ.90 వేలకుపైనే.. భవిష్యత్తు స్కిల్ వర్కర్లదే..! కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల మానసిక విభాగం, ఇతర ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లలో సైకియాట్రిస్ట్‌ల వద్దకు వచ్చే వారిలో ప్రస్తుతం 10 శాతానికి పైగా అల్జీమర్స్‌తో బాధపడే వారు ఉంటున్నారు. ఇలాంటి వారికి అడ్మిషన్ అవసరం ఉండదు. ఓపీలో మందులు, కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తారు. అయితే డిమెన్షియాతో బాధపడే వారికి మందులతో పాటు ఒక్కోసారి అడ్మిషన్ అవసరం అవుతుంది. కొన్నిరోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స ఇచ్చాక ఇంటికి పంపిస్తారు. పెరుగుతున్న బాధితుల సంఖ్య అల్జీమర్స్ దాదాపు 60 నుంచి 80 శాతం మతిమరుపు జబ్బులకు కారణం అవుతుంది. ఇది వారి కుటుంబసభ్యులపైనా ప్రభావం చూపుతుంది. సాధారణంగా అల్జీమర్స్ 65 సంవత్సరాలు పైబడిన వారికి వస్తుంది. ఇటీవల 65 ఏళ్లలోపు వారూ దీని బారిన పడుతున్నారు. ఈ జబ్బు ఆలోచనా విధానం, ప్రవర్తనపై ప్రభావం చూపుతుంది. అల్జీమర్స్‌తో బాధపడే వారి సంఖ్యలో చైనా, అమెరికా తర్వాత మూడో స్థానంలో భారత్ ఉంది. 65 ఏళ్లు పైబడిన వారిలో 5 శాతం మందికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉండగా వయసుపెరిగే కొద్దీ 80 ఏళ్ల వయస్సు వారిలో 20 శాతం మందికి వచ్చేందుకు అవకాశం ఉంది. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. అల్జీమర్స్ లక్షణాలు కళ్లద్దాలను, ఇంటి తాళాలను ఎక్కడో భద్రంగా పెట్టి మరిచిపోతారు. కుటుంబసభ్యుల పేర్లు కూడా మరిచిపోతుంటారు. మాట్లాడేటప్పుడు పదాల కోసం తడుముకుంటారు. కొద్దినిమిషాల కిందటే జరిపిన సంభాషణను కూడా మరిచిపోతుంటారు. అడిగిపవే పదేపదే అడగడం, ఎక్కువసేపు నిద్ర, మెలకువగా ఉన్నా పనులపై ఆసక్తి చూపరు. బయటకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి చేరుకోవడానికి నానా తంటాలు పడతారు. అల్జీమర్స్‌కు కారణాలు ♦మతిమరుపు జబ్బు వారసత్వంగా సంక్రమించే అవకాశం ఎక్కువ. 60 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా వస్తుంది. ♦మెదడులో ‘అసిటైల్ కోలిన్’ అనే రసాయన ద్రవం తగ్గడం, సాధారణ ప్రొటీన్లు మెదడు కణజాలంలో చేరడం వల్ల సంక్రమిస్తుంది ♦దీర్ఘకాలంగా ఆల్కహాల్ లాంటి మత్తు పదార్థాలు తీసుకోవడం, అకారణంగా నిద్రమాత్రలు వాడడం వల్ల కూడా వస్తుంది ♦సంవత్సరాల కొద్దీ మానసిక ఒత్తిడి, సరైన పోషకాహారం తీసుకోకపోవడం, అదుపులో లేని బీపీ, షుగర్ వల్ల సమస్య తీవ్రం అయ్యే అవకాశం ఉంది. మతిమరుపులన్నీ అల్జీమర్స్ కాదు మతిమరుపు లక్షణాలు పలు రకాల ఆరోగ్య సమస్యలు, వ్యాధుల వల్ల కూడా రావచ్చు. మతిమరుపు మాత్రమే అల్జీమర్స్ కాదు. ఈ వ్యాధి ఉన్నదీ లేనిదీ నిర్ధారించుకోవడానికి వ్యాధి లక్షణాలు పరిశీలించడమే గాక కొన్ని నిర్థిష్టమైన పరీక్షలు కూడా నిర్వహిస్తాం. రోగి ఏకాగ్రత స్థాయిని, గ్రహింపు శక్తిని, జ్ఞాపక శక్తిని తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహిస్తాం. జన్యుపరమైన, వైద్యపరమైన కారణాలను కనుగొనేందుకు బ్రెయిన్ ఇమేజింగ్, రక్తపరీక్షలు వంటివి నిర్వహించాల్సి వస్తుంది. అవసరమైన పరీక్షలన్నీ నిర్వహించిన తర్వాతనే రోగికి అల్జీమర్స్ వ్యాధిపై ఒక నిర్ధారణకు వచ్చి తగిన చికిత్స అందిస్తాం. ఈ వ్యాధితో బాధపడే వారిని చిన్నచూపు చూడకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. – డాక్టర్ నిషాంత్‌రెడ్డి, న్యూరాలజిస్టు, కర్నూలు కచ్చితమైన వైద్యం లేదు అల్జీమర్స్‌కు కచ్చితమైన, పూర్తిగా నయం చేసే వైద్యం ఇంతవరకు అందుబాటులో లేదు. వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు కొన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. అల్జీమర్స్‌తో బాధపడే వారితో పాటు కుటుంబసభ్యులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా జబ్బున పడ్డ వారిని ఎలా నియంత్రించాలో కుటుంబసభ్యులు శిక్షణ తీసుకోవాలి. మెదడును పదును పెట్టే కొన్ని రకాల వ్యాయామాలు చేయడం, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం, సరైన పోషకాహార అలవాట్లు పాటించాలి. – డాక్టర్ కె.నాగిరెడ్డి, మానసిక వైద్య నిపుణులు, కర్నూలు -
గుడ్‌న్యూస్! కాఫీతాగే అలవాటు మతిమరుపును నివారిస్తుంది.. ఎలాగంటే..
Consumption of coffee Daily can prevent development of Alzheimer's disease: ప్రతి ఉదయం వేడివేడిగా కప్పు కాఫీ తాగందే చాలా మందికి రోజు ప్రారంభం కాదు. అటువంటి కాఫీ ప్రియులకు ఓ గుడ్‌న్యూస్! కాఫీ తాగనివారితో పోల్చితే తాగేవారికి మతిమరుపు వచ్చే అవకాశం తక్కువని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. ఆస్ట్రేలియాలోని ఎడిత్ కొవాన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు 200 మందిపై 10 యేళ్లపాటు నిర్వహించిన అధ్యయనాల్లో అధికంగా కాఫీతాగే వారిలో అల్జీమర్స్ వంటి జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు తక్కువగా తలెత్తుతున్నట్లు పేర్కొన్నారు. ఈ అధ్యయనాల్లో కాఫీకి, జ్ఞాపకశక్తికి మధ్య సంబంధం ఉన్నట్లు తెలిపారు. ముఖ్యంగా మెదడులోని అల్జీమర్స్ అభివృద్ధలో కీలకంగా వ్యవహరించే అమిలాయిడ్ ప్రొటీన్‌ను నిరోధించడంలో కాఫీలోని కారకాలు ఉపయోగపడతాయని, అల్జీమర్స్ వ్యాధిని ఆలస్యం చేయడానికి కాఫీ తాగడం సులువైన మార్గమని పేర్కొన్నారు. మతిమరుపుతో బాధపడే వ్యక్తులకు ఇది ఎంతో సంతోషకరమైన వార్తని చెప్పవచ్చు. చదవండి: కన్నీటిని కన్నీటితోనే తుడవలేం! స్త్రీలపై జరిగే హింసకు వ్యతిరేకంగా పోరాడుదాం.. మధ్య వయస్సు వ్యక్తుల జీవనశైలిలో కాఫీని తప్పకుండా చేర్చుకోవాలి. రోజుకు 240 గ్రాముల చొప్పున ఒక కప్పు కాఫీ తాగేవారైతే, అదనంగా మరో కప్పును చేర్చడం మంచిది. ఫలితంగా 18 నెలల తర్వాత 8% వరకు మతిమరుపు సమస్య నివారణ ఔతుందని, అదేవిధంగా మెదడులో అమిలాయిడ్ ప్రొటీన్ ఏర్పడటం 5% తగ్గుతుందని పరిశోధకులు వెల్లడించారు. మెదడులో అమిలాయిడ్ బలమైన ఫలకాలు ఏర్పడేలా చేసి అల్జీమర్స్ వ్యాధిదారి తీస్తుంది. మెదడు ఆరోగ్యంపై కాఫీలో ఏ కారకాలు సానుకూలంగా పనిచేస్తున్నాయనే అంశంపై ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, అల్జీమర్స్ వ్యాధిని ఆలస్యం చేయడానికి ఇది ఏకైక కారణమని దీనిపై మరిన్ని పరిశోధనలు చేయవలసి ఉందని పరిశోధకులు తెలిపారు. చదవండి: అతనికి అదృష్టం 17 కేజీల ఉల్కరూపంలో తగిలింది.. బంగారం కంటే ఎన్నో రెట్లు!! -
మతిమరుపు నివారణకు మందులు లేవు..ఇలా చేస్తే మాత్రం..
అల్జైమర్స్... ఓ చిత్రమైన మరపు. సాధారణ మతిమరపుగా చెప్పలేని విచిత్రమైన మరపు. పలకపై తుడిచేసిన అక్షరాలు అలా కనిపించీ.. కనిపించకుండా పలుచగా అల్లుకుపోయినట్టుగా అనిపించినట్టుగానే... మెదడు ఫలకంపైన ఉండే జ్ఞాపకాలూ, అనుభవాలూ, నేర్పులూ, నైపుణ్యాలూ, శక్తులూ, సామర్థ్యాలూ... అన్నీ క్రమంగా చెరుపుకుపోయినట్టుగా చెరిగిపోయే రుగ్మత ‘అల్జైమర్స్’. బైక్ లేదా కారు తాళాలు మరచిపోవడం సాధారణ మతిమరపు. కానీ నేర్చుకున్న ‘డ్రైవింగ్’నే మరచిపోవడం... అల్జైమర్స్. కిచెన్‌లో అగ్గిపెట్టె ఎక్కడో పెట్టి మరిపోవడం మతిమరపు. కానీ అగ్ని లేదా మంట అనే జ్ఞానాన్నే పూర్తిగా మరచిపోవడం... అల్జైమర్స్. మన అందరిలోనూ ఏదో ఒక దశలో కనిపించే సాధారణ అంశం ‘మతిమరపు’. కానీ దాని తారస్థాయిలా... ఓ రుగ్మతగా కొందరిలో కనిపించే మెదడు సమస్య ఈ ‘అల్జైమర్స్’! గతంలో ఈ రుగ్మతతో చాలా కొద్దిమందిమాత్రమే బాధపడేవారు. ఇటీవల ఈ సంఖ్య చాలా ఎక్కువగా పెరుగుతోంది. ఈనెల 21న అల్జైమర్స్ డే. ఈ సందర్భంగా అల్జైమర్స్ అంటే ఏమిటి, ఎందుకొస్తుంది, దానికి నివారణ, పరిష్కారాలను తెలుసుకోవడం కోసమే ఈ కథనం. ఏమిటీ అల్జైమర్స్... అలాయ్ అల్జైమర్స్ అనే ఓ జర్మన్ సైకియాట్రిస్ట్ ఈ రుగ్మతను కనుగొన్నారు. దాంతో అతడి పేరే ఈ వ్యాధికి పెట్టారు. పురుషులతో పోలిస్తే మహిళలు మూడు రెట్లు ఎక్కువగా అల్జైమర్స్‌కు గురవుతారు. దీనికి గురైన మెడికల్ హిస్టరీఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. వయసు పైబడటం ప్రారంభమయ్యాక అన్ని కణాలతో పాటు మెదడు కణాలూ అంతో ఇంతో శిథిలమైపోతుంటాయి. కానీ కొందరిలో మాత్రం మెదడు కణాలు మరీ ఎక్కువగా నశించిపోతుంటాయి. వారి మెదడు క్రమంగా కుంచించుకుపోతుంటుంది. అందునా ప్రధానంగా ఫ్రంటల్, టెంపోరల్, పెరైటల్ అనే భాగాల్లోని కణాలు కుంచించుకుపోవడం వల్ల మెదడు తన బరువులో 20% కోల్పోతుంది. ఇది బయటకు కనిపించేది. కానీ అత్యంత నిశితంగా (మైక్రోస్కోపిక్ స్థాయిలో) పరిశీలించినప్పుడు ‘న్యూరో ఫైబ్రిలేటరీ టాంజిల్స్’ అనే అమైలాయిడ్ ప్రోటీన్లు మెదడు మీద కనిపిస్తాయి. ఆ ఆధారంగానే అల్జైమర్స్ ను నిర్ధారణ చేస్తారు. కారణాలు.. సాధారణంగా చాలావరకు జన్యుపరమైన కారణాలూ, ఆ తర్వాత కొంతవరకు పర్యావరణ అంశాలూ ఈ రుగ్మతకు కారణం కావచ్చని నిపుణుల అంచనా. దశలు ఇవీ... అల్జైమర్స్‌ను తొలిదశల్లో గుర్తుపట్టడం చాలా కష్టం. దాంతో అటు కుటుంబసభ్యులూ, కొన్ని సందర్భాల్లో ఇటు డాక్టర్లు కూడా దీన్ని తేలిగ్గా గుర్టుపట్టలేరు. తొలుత మతిమరపులా కనిపించే ఇది మూడు దశల్లో తన తీవ్రత చూపుతుంది. తొలిదశలో... రోజువారీ చిన్న చిన్న విషయాలు కూడా మరపునకు వస్తుంటాయి. తాము చేయాల్సిన రొటీన్ పనులూ మరచిపోతుంటారు. చాలా విలువైన వస్తువులను ఎక్కడో పెట్టేసి, పెట్టిన విషయాన్నీ, చోటునూ మరుస్తుంటారు. చాలా దగ్గరి స్నేహితుల పేర్లనూ... అంతెందుకు పొద్దున్న చదివిన న్యూస్పేపర్లోని అంశాలూ మరిచిపోతుంటారు. గతంలో జరిగిన బలమైన సంఘటనలుగాక... ప్రస్తుత (రీసెంట్ పాస్ట్) అంశాలను తొలుత మరుస్తుంటారు. రెండో దశలో... తాము ఎక్కడున్నామన్న విషయాన్ని మరచిపోతుంటారు. ఆరోజు తేదీ ఏమిటి, ఆ రోజు ఏ వారం అన్న విషయం గుర్తుండదు. మూడీగా ఉంటూ, ముడుచుకుపోతుంటారు. మూత్రం, మలవిసర్జనలపై అదుపు ఉండకపోవచ్చు. పగలంతా నిద్రపోతూ ఉండి, రాత్రంతా మెలకువతో, అస్థిమితంగా ఉంటారు. మూడో దశలో... తాము రోజూ ఉపయోగించే రేజర్ వంటి వాటినీ గుర్తించలేరు. సరిగా గడ్డం కూడా గీసుకోలేరు. తలుపు గడేసుకోవడం వంటి సాధారణ అంశాల్నీ మరచిపోవచ్చు. దుస్తులు ధరించడం, షేవింగ్, స్నానం చేయాలన్న విషయాలేవీ వారి గమనంలో ఉండకపోవచ్చు. నిలబడలేకపోవడం, నడవలేకపోవడంతో పడక మీద అలా పడి ఉంటారు. అంతకు మునుపు తామంతట తాము రోజూ చేసే అన్ని పనుల్లోనూ ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి రావచ్చు. కొందరైతే జీవించి ఉండి కూడా, పూర్తి స్పృహలో ఉండికూడా... ఏదీ చేయలేని ఓ దుంపలా (వెజిటేటివ్ స్టేట్‌లో) పడి ఉంటారు. నిర్ధారణ పరీక్షలు : సీటీ / ఎమ్మారై స్కాన్ నిర్ధారణకు ఉపయోగపడతాయి. కానీ నిర్దిష్టంగా వాటితోనే తెలుస్తుందని చెప్పడానికి లేదు. ఇక స్పెక్ట్, పెట్ స్కాన్ వంటివి కొంతవరకు ఉపయోగపడతాయి. చికిత్స: ఇప్పటికీ ఫలానా మందులే పనిచేస్తాయని నిర్ధారణగా చెప్పడానికి వీల్లేదు. అలాగే ఫలానా మందుల ద్వారా రాకుండా చేసేందుకు వీలూ లేదు. అయితే ఇలా వచ్చేందుకు అవకాశాలున్నవారిలో మాత్రం కొన్ని మందుల ద్వారా దాని తీవ్రతను తగ్గించేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతానికి డొనేజిపిల్, గాలాంటమైన్, రివాస్టిగ్మయిన్ వంటి అసిటైల్ కోలిన్ ఔషధాలతో పరిస్థితిని చాలావరకు మెరుగుపరచవచ్చు. వీటన్నింటిలోనూ రివాస్టిగ్మయిన్ ప్రస్తుతానికి చాలా మంచి మందు. అలాగే మామాంటైన్ అనే మందు ద్వారా అల్జైమర్స్‌ను మరింత ఆలస్యంగా వచ్చేలా చేయవచ్చు. ఇక ‘అడ్యుకాన్యుమాబ్’ అనే మందు మెదడుపై ఏర్పడి అంటుకుపోయినట్లుగా ఉండే ‘అమైలాయిడ్’ వంటి ప్రోటీన్ ప్లాక్ (పాచి వంటిదాన్ని) తొలగించి శుభ్రపరుస్తుంది. ఈ ఏడాది జూన్‌లో ఈ ఔషధాన్ని ‘ఎఫ్‌డీఏ’ ఆమోదించింది. ఇక మన ఆహారంలో అల్జైమర్స్‌కు మంచి ఔషధంగా పనిచేసేవీ ఉన్నాయి. అవే... విటమిన్–ఈ, ఒమెగా ఫ్యాటీ–3 యాసిడ్స్, కర్క్యుమైన్, రెస్వెరటాల్ వంటివి. ఇందులో కర్క్యుమైన్ అనేది మనం రోజూ వంటలో వాడే పసుపులోనూ, రెస్వెటరాల్ పోషకం ద్రాక్షగింజల్లో పుష్కలంగా ఉంటుంది. ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ చేపల్లో ఎక్కువ. విటమిన్–ఈ పసుపురంగు పండ్లలో పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు... క్యారట్లో ఉండే ‘బీటా కెరోటిన్’, ఆపిల్స్‌లో ఉండే ‘యాంథోసయనిన్’, బెర్రీ పండ్లలో ఉండే ‘ఫ్లేవోన్స్’లో కూడా అల్జైమర్స్‌ను నివారించే అంశాలున్నాయి. నివారణ... మంచి పోషకాలను ఇచ్చే సమతుల ఆహారం, ఆకుపచ్చని ఆకుకూరలు, తాజా కూరగాయలు, తాజా పండ్లు, చేపలు, పసుపు, క్యాటర్, బెర్రీ, రేగుపండ్లు, ద్రాక్ష, దానిమ్మ, అవకాడో (బటర్ ఫ్రూట్), వాక్కాయ (కలిమకాయ/కలెంకాయ) వంటివి అన్నీ అల్జైమర్స్‌ను చాలావరకు నివారిస్తాయి. ∙ పైవాటికి తోడు పొగతాగడం, ఆల్కహాల్ వంటి అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండటం, కనీసం రోజుకు 20 నిమిషాలకు పైబడి చేసే వ్యాయామాలు (శరీరాన్ని శ్రమకు గురిచేయకుండా నడక వంటి వ్యాయామాలు), కంటినిండా నిద్రపోవడం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు డయాబెటిస్, హైబీపీ వంటి జీవనశైలి రుగ్మతలను నియంత్రణలో పెట్టుకోవడం వంటివి అల్జైమర్స్ నివారణకు తోడ్పడతాయి. ∙మంచి మంచి పుస్తకాలు చదవడం లేదా కొత్త భాషలనూ, విద్యలను నేర్చుకోవడం, కొత్త నైపుణ్యాలను పెంచుకోవడం, మెదడును చురుగ్గా ఉంచేలా చేసే పజిల్స్ (ప్రహేళికలను) పరిష్కరించడం వంటి ఆరోగ్యకరమైన హాబీలు అల్జైమర్స్‌ను దూరంగా ఉంచుతాయి. ∙ఫ్రెండ్స్, బంధువులతో ఆరోగ్యకరమైన సంబంధాలను నెరపడం, మంచి చురుకైన సామాజిక జీవనాన్ని గడపటం వంటి అంశాలన్నీ అల్జైమర్స్‌ను నివారిస్తాయి... లేదా వీలైనంత ఆలస్యం చేస్తాయి. మన దేశంలో... ప్రస్తుతం యూఎస్ వంటి దేశాలతో పోలిస్తే మన దేశంలో ‘అల్జైమర్స్’తో బాధపడేవారి సంఖ్య ఇప్పటికి ఒకింత తక్కువే గానీ వీరి సంఖ్య క్రమంగా విపరీతంగా పెరుగుతోంది. 2031 నాటికి మన దేశంలోని జనాభాలో సీనియర్ సిటిజెన్ల సంఖ్య 19.4 కోట్లు ఉండవచ్చనీ... వీరిలో దాదాపు 4.4% – 5% వరకు అలై్జమర్స్ బాధితులు ఉండవచ్చని ఒక అంచనా. అచ్చం అల్జైమర్స్ లాంటివే... అచ్చం అల్జైమర్స్లాగే అనిపించేవీ, అలాంటి లక్షణాలే కనిపించేవీ మరికొన్ని కండిషన్స్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వాటిని అల్జైమర్స్గా పొరబడే ప్రమాదం కూడా ఉంటుంది. కాకపోతే అల్జైమర్స్‌కు న్యూరో ఫిజీషియన్ల ఆధ్వర్యంలో చికిత్స జరగాల్సి ఉండగా... అవే లక్షణాలతో వ్యక్తమయ్యే వీటికి న్యూరోసర్జన్ ఆధ్వర్యంలో శస్త్రచికిత్స నిర్వహించాల్సి ఉంటుంది. అవి... ∙నార్మల్ ప్రెషర్ హైడ్రోసెఫాలస్ : ఈ కండిషన్లో మెదడు కుహరంలోని అదనపు ‘సెరిబ్రో స్పైనల్ ఫ్యూయిడ్’ అనే ద్రవాన్ని షంట్ శస్త్రచికిత్స ద్వారా దారి మళ్లించి నార్మల్‌గా మారుస్తారు. ∙క్రానిక్ సబ్డ్యూరల్ హిమటోమా: హిమటోమా అంటే రక్తం పేరుకుపోయి గడ్డకట్టినట్లుగా కావడం. మెదడులో ఇలా జరిగినప్పుడు ‘లోకల్ అనస్థీషియా’ ఇచ్చి తలకు రెండు చిన్న రంధ్రాల ద్వారా పరిస్థితిని చక్కబరుస్తారు. ∙ట్యూమర్స్: అంటే గడ్డలు అన్న విషయం తెలిసిందే. మెదడులోని ఫ్రంటల్, టెంపోరల్ అనే భాగాల్లో గడ్డలు వచ్చిన సందర్భాల్లోనూ శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగిస్తారు. ఇలాంటివే ‘అల్జైమర్స్’ను పోలిన మరికొన్ని కండిషన్లూ ఉన్నాయి. వాటిని శస్త్రచికిత్స ద్వారా సరిచేయాల్సి ఉంటుంది. -డాక్టర్ పి. రంగనాథం సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ -
ఆ వ్యాధి మరణిస్తేనే తెలుస్తుంది!
వయసు మీదపడిన తర్వాత చాలా మందిలో మతిమరుపు ఉండటం సహజం. కానీ ఓ వ్యక్తి చొక్కాకు గుండీలు పెట్టుకోవడం కూడా తెలియని స్థితికి చేరితే? తిట్టినా.. కొట్టినా ఏ రకమైన ఉద్వేగమూ కనిపించకుండా మారిపోతే? తిండి తినడం మొదలుకొని రోజూ వెళ్లే దారి వరకూ చాలా అంశాలు కూడా మరిచిపోతే? అది అల్జీమర్స్ కావచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. నలభై యాభై ఏళ్ల వయసులో మొదలై 65 దాటిన తర్వాతగానీ గుర్తించేంత స్థాయికి ముదరని ఈ వ్యాధికి కారణమేమిటో తెలియదు. చికిత్స కూడా లేదు. ఈ సమస్యలకు పరిష్కారాలు కనుక్కునేందుకు ఒకవైపు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ముదిమిలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్న అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులు మాత్రం ఏటా పెరిగిపోతూనే ఉన్నారు. 2050నాటికి భూమ్మీద కనీసం 15.2 కోట్ల మంది వ్యాధిగ్రస్తులు ఉంటారని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. (కోపంగా ఉన్నారా.. ఈ సమస్య ఉన్నట్లే) 130 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో 40 లక్షల మంది అల్జీమర్స్ వ్యాధి బారిన పడ్డారు. ఇది ఏమంత పెద్ద సంఖ్యగా కనిపించకపోవచ్చు. అయితే ఈ వ్యాధి విషయంలో చైనా, అమెరికాల తర్వాతి స్థానం మనదే కావడం గమనార్హం. 2030 నాటికల్లా దేశంలో అల్జీమర్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్య 75 లక్షలకు చేరుకుంటుందని అంచనా. కాకపోతే భారతదేశంలో ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య ఇతర దేశాల కంటే తక్కువగా ఉందని, పసుపు వాడకం ఇందుకు కారణమని ఇటీవలే జరిగిన ఒక అధ్యయనం చెబుతోంది. పసుపులోని కర్కుమిన్.. అల్జీమర్స్‌కు కారణమని భావిస్తున్న ప్రొటీన్ ఒకటి మెదడులో ఎక్కువ కాకుండా నియంత్రిస్తుందని కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో తెలిసింది. (బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే..) అల్జీమర్స్ అంటే... మతిమరుపు బాగా ముదిరితే వచ్చే సమస్య. మతిమరుపుతో బాధపడుతున్న వారిలో కనీసం 60–80 శాతం మంది అల్జీమర్స్ బారిన పడవచ్చు. వ్యాధులు లేదా మెదడుకు తగిలిన దెబ్బల కారణంగా జ్ఞాపక శక్తి, ఆలోచించే విధానం, ప్రవర్తనలో మార్పులు వస్తాయి. అల్జీమర్స్ సమస్య ఉన్నట్లు చాలా లేటుగా అంటే 65 ఏళ్ల తర్వాత గుర్తిస్తుండటం గమనార్హం. ఒకవేళ అంతకంటే ముందుగా గుర్తించినప్పటికీ దాన్ని ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ అల్జీమర్స్‌గానే పరిగణిస్తుంటారు. ఈ సమస్యకు కచ్చితమైన చికిత్స అంటూ ఏదీ లేదు. కాకపోతే సమస్య మరీ ఎక్కువ కాకుండా నియంత్రించే పద్ధతులు మాత్రం అందుబాటులో ఉన్నాయి. మతిమరుపు కంటే ఎలా భిన్నం? మతిమరుపు.. అల్జీమర్స్ రెండూ ఒకటే అన్నది చాలా మందిలో ఉన్న అభిప్రాయం. కానీ అల్జీమర్స్ అనేది ఒక రకమైన మతిమరుపుగా మాత్రమే వైద్యశాస్త్రం గుర్తిస్తుంది. విషయాలను మరచిపోవడం, గందరగోళానికి గురవడం డిమెన్షియా తాలూకూ స్థూల లక్షణాలు. అయితే అల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధి, మెదడుకు తీవ్రమైన దెబ్బ తగలడం వంటివి కూడా ఈ లక్షణాలను కలుగజేస్తాయి. సాధారణంగా చేసే పనులను కూడా చేయలేకపోవడం అల్జీమర్స్ లక్షణాల్లో ఒకటి. ఉదాహరణకు మైక్రోవేవ్‌ను చాలాకాలంగా వాడుతున్నప్పటికీ అకస్మాత్తుగా అదెలా వాడాలో స్పష్టంగా తెలియకపోవడం అన్నమాట. దీంతోపాటు మాట, రాతల్లో సమస్యలు ఏర్పడటం, వ్యక్తిగత శుభ్రత లోపించడం, ప్రాంతాలకు సంబంధించిన విషయాలు గుర్తులేకపోవడం వంటివన్నీ అల్జీమర్స్ లక్షణాలుగా పరిగణించవచ్చు. భావోద్వేగాల్లో మార్పులు, బంధు మిత్రులకు దూరంగా ఉండటం కూడా ఈ వ్యాధి సమస్యలే. మరణిస్తేనే తెలుస్తుంది! మతిమరుపునకు, అల్జీమర్స్‌కూ తేడా ఉన్న విషయం మనకు తెలుసు. మరి వైద్యులు ఏది ఏ సమస్యో ఎలా గుర్తిస్తారు. అల్జీమర్స్‌ను నిర్ధారించడం మెదడు కణజాలాన్ని పరిశీలించడం ద్వారా మాత్రమే సాధ్యం. అంటే మరణం తర్వాతే వ్యాధిని గుర్తించగలమన్నమాట. మరి బతికుండగా వ్యాధి ఉంటే? మరి గుర్తించడం ఎలా?ఇందుకోసం చాలా పద్ధతులు ఉన్నాయి లెండి. కుటుంబ చరిత్రను బట్టి అంచనా వేయడం, జన్యు పరీక్షల ద్వారా అల్జీమర్స్ కారక జన్యువుల ఉనికి తెలుసుకోవడం వీటిల్లో కొన్ని. దీంతోపాటు వైద్యులు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడం ద్వారా అల్జీమర్స్, డిమెన్షియాల మధ్య తేడాను గుర్తించగలరు. మానసిక పరిస్థితిని గుర్తించిన తర్వాత మీ షార్ట్‌టర్మ్, లాంగ్‌టర్మ్ మెమొరీని గుర్తించేందుకు ప్రశ్నలు వేస్తారు. దీనికి రక్తపోటు, గుండె కొట్టుకునే వేగం, ఉష్ణోగ్రతలు, అవసరమైతే మూత్ర పరీక్షలు నిర్వహించి ఒక అంచనాకు వస్తారు. నాడీ సంబంధిత సమస్యలేవైనా ఉన్నాయా? అన్నది పరిశీలిస్తారు. ఎమ్మారై, సీటీ, పీఈటీ వంటి స్కాన్ల ద్వారా మెదడు నిర్మాణం, అందులోని తేడాలను తెలుసుకుంటారు. వీటన్నింటి ఆధారంగా వైద్యులు తుది నిర్ణయానికి వస్తారు. నివారణ ఎలా? అల్జీమర్స్‌కు కచ్చితమైన చికిత్స ఏదీ లేదు. కానీ.. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి రాకను ఆలస్యం చేయడంతోపాటు లక్షణాల తీవ్రతను కొంత వరకు తగ్గించవచ్చు అని ఇప్పటివరకు జరిగిన పరిశోధనలు చెబుతున్నాయి. ధూమపానానికి దూరంగా ఉండటం వ్యాయామం క్రమం తప్పకుండా చేయడం బుర్రకు పదునుపెట్టే కార్యకలాపాలు చేపట్టడం శాఖాహారం తీసుకోవడం.. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా తీసుకునేలా జాగ్రత్త పడితే ప్రయోజనం ఉంటుందని అంచనా ఏకాగ్రత పెంచుకునేందుకు ప్రయత్నించడం, వాగ్వాదాలకు దూరంగా ఉండటం రోజూ తగినంత విశ్రాంతి తీసుకోవడం వీటన్నింటినీ జాగ్రత్తగా పాటిస్తే వ్యాధిని కొంత వరకు నివారించవచ్చు. 1,850 కోట్ల గంటలు : అమెరికాలో వైద్య సిబ్బంది వేతనం లేకుండా అల్జీమర్స్ బాధితుల కోసం వెచ్చించిన సమయం 5.2 శాతం : మతిమరుపు (డిమెన్షియా) సమస్య ఉన్న 60 ఏళ్ల పైబడ్డవారు 204 శాతం: 2018–2050 మధ్యకాలం లో పెరిగే అల్జీమర్స్ బాధితులు 10 శాతం: దిగువ, మధ్యాదాయ దేశాల్లో 2050 నాటికి పెరిగే మతిమరుపు బాధితులు నలుగురిలో ఒకరు.. అల్జీమర్స్ వ్యాధిగ్రస్తుల్లో వ్యాధి నిర్ధారణ జరిగే వారు 27,700 కోట్ల డాలర్లు: ఒక్క అమెరికాలో అల్జీమర్స్, మతి మరుపులపై పెట్టిన ఖర్చు -
మతిమరపు.. చికిత్స తియ్యతియ్యగా!
మానవుల్లో ఒక వయసు దాటాక మతిమరపు రావడం చాలా చాలా సాధారణం. పెద్ద వయసులో సాధారణంగా అల్జైమర్స్ వల్ల మతిమరపు రావడం ఎక్కువ. పైగా వృద్ధాప్యంలో దాపురించే అల్జైమర్స్ వ్యాప్తి కూడా ఇటీవల బాగా పెరిగింది. అయితే చాలా తియ్యని మార్గంలో, చాలా సహజసిద్ధమైన రీతిలో మతిమరపును ఎదుర్కొనే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. ప్రతి రోజూ పరిమితమైన మోతాదులో తీసుకునే చాక్లెట్ వల్ల వృద్ధాప్యంలో వచ్చే మతిమరపు (డిమెన్షియా), అఅల్జైమర్స్ను నివారించవచ్చని పేర్కొంటున్నారు. చాక్లెట్లో ఉపయోగించే కోకో... అందులోని పోషకాల్లో ఒకటైన ఫ్లేవనాల్ వల్ల ఈ ప్రయోజనం ఒనగూరుతుందంటున్నారు వారు. ఇటీవల కొద్దికాలం కిందట ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్ ఎల్ అక్విలాకు చెందిన వైద్య నిపుణుడు డాక్టర్ గియోవాబాటిస్టా దేసిదెరి ‘‘మనం మితిమీరిన క్యాలరీలు తీసుకోకుండా పరిమితంగా కోకో ఉన్న చాక్లెట్లను తినడం వల్ల మన జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది’’ అని పేర్కొన్నారు. అంతేకాదు... చాలా పరిమితంగా చాక్లెట్ డ్రింక్ (ఫ్లేవనాల్ డ్రింక్) తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గే అవకాశం కూడా ఉందంటున్నారు నిపుణులు. అందుకే వృద్ధాప్యానికి ముందరే చాలా పరిమితంగా చాక్లెట్లు తినడం మంచిదనే అంటున్నారు. అయితే చక్కెర వ్యాధి ఉన్నవారు మాత్రం ఈ విషయంలో ఒకసారి తమ మెడికల్ స్పెషలిస్ట్‌ను సంప్రదించాకే తాము తీసుకోగలిగే చాక్లెట్ మోతాదును నిర్ణయించుకోవడం మంచిదని వారు హెచ్చరిస్తున్నారు. అయితే ఇలా చాక్లెట్లతో ఇన్ని మేళ్లు ఉన్నాయంటూ మితిమీరి తింటే మనకు ప్రయోజనం కలగకపోగా... ప్రతికూల ఫలితాలే ఉంటాయంటూ హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. -
సీసం వల్ల అల్జీమర్స్..
సాక్షి, హైదరాబాద్: సౌందర్య సామగ్రితోపాటు పలు ఇతర పదార్థాల్లో కనిపించే సీసం వల్ల అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. సీసం కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరును ప్రభావితం చేస్తుందని ఇప్పటికే తెలిసినప్పటికీ మతిమరుపు లాంటి లక్షణాలను కనబరిచే అల్జీమర్స్‌కూ కారణం కావచ్చని తెలియడం ఇదే మొదటిసారి. సమాచారాన్ని నిక్షిప్తం చేసుకుని అవసరమైనప్పుడు అందించే మెదడు కణాలు క్రమేపీ నాశనం కావడం అల్జీమర్స్ వ్యాధిలో ముఖ్యమైన అంశం. ఈ వ్యాధికి కారణం ఏమిటన్నది ఇప్పటికీ స్పష్టం కానప్పటికీ బీటా అమొలాయిడ్ అనే మెదడు ప్రొటీన్ ముక్క ప్రభావం ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రొటీన్ ముక్కలు పోగుపడటం వల్ల మెదడు కణాల మధ్య సమాచార ఆదాన, ప్రదానాలపై దుష్ప్రభావం పడుతుంది. ఈ క్రమంలో కణాలు చచ్చిపోతాయి కూడా. ఈ నేపథ్యంలో జాతీయ పోషకాహార సంస్థ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ చల్లా సురేష్ సీసం, బీటా అమొలాయిడ్‌కు మధ్య ఉన్న సంబంధాలపై పరిశోధన చేపట్టారు. మెదడు కణాలపై జరిపిన ఈ పరిశోధనల్లో సీసం కారణంగా కణాలు చచ్చిపోవడం ఎక్కువైనట్లు గుర్తించారు. అంతేకాకుండా నాడుల అభివృద్ధి, పునరుత్పత్తికి సంబంధించిన ప్రొటీన్ల మోతాదు కూడా తగ్గిపోతున్నట్లు తెలిసింది. దీంతో సైనాప్టోఫైసిన్ మోతాదులు కూడా తగ్గిపోయి అల్జీమర్స్‌కు దారితీస్తున్నట్లు తేలింది. గర్భధారణ సమయంలో సీసం కాలుష్యానికి గురైతే దాని ప్రభావం బిడ్డపై ఉంటుందని, పుట్టిన బిడ్డకు కూడా అల్జీమర్స్ సోకే అవకాశం ఉంటుందని సురేష్ వెల్లడించారు. -
అధిక కొవ్వుతో అల్జీమర్స్ ముప్పు
లండన్ : అధిక కొవ్వుతో పలు రకాల అనారోగ్యాలు దరిచేరతాయని వైద్యులు హెచ్చరిస్తుంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వుతో మెదుడులో అల్జీమర్ ప్రొటీన్స్ 20 రెట్లు అధికంగా చేరే ముప్పు పొంచి ఉందని తాజా అథ్యయనం తేల్చిచెప్పింది. హై కొలెస్ర్టాల్ డిమెన్షియాకు దారితీస్తుందని ఈ అథ్యయనం హెచ్చరించింది. అల్జీమర్స్‌కు నూతన చికిత్సా విధానాల రూపకల్పనలో తమ అథ్యయనం తోడ్పడుతుందని కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధకుల బృందం పేర్కొంది. మెదుడులో కొవ్వులు పేరుకుపోయే జీన్స్‌ను కొందరు కలిగిఉంటారని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు మెదడు నుంచి కొవ్వు పేరుకుపోవడాన్ని ఎలా నిరోధించాలన్నది ప్రశ్న కాదని, అల్జీమర్స్ వ్యాధిలో కొలెస్ర్టాల్ పాత్రను నియంత్రించడమేనని అథ్యయన రచయిత, కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మైఖేల్ వెండ్రుస్కోలో చెప్పారు. కొలెస్ర్టాల్ ఒక్కటే ఈ వ్యాధులను ప్రేరేపించడం లేదని, వ్యాధి కారకాల్లో ఇది కూడా ఒకటని ఆయన పేర్కొన్నారు. అధ్యయన వివరాలు నేచర్ కెమిస్ర్టీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
నిద్రలేమితో అల్జిమర్స్ ముప్పు
దీర్ఘకాలం నిద్రలేమితో బాధపడే వారు తర్వాతి కాలంలో అల్జిమర్స్ వ్యాధికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయని ఒక తాజా పరిశోధనలో తేలింది. నిద్రలేమితో బాధపడేవారికి దీర్ఘకాలంలో వెన్నెముకలోని ద్రవాలలో మార్పులు ఏర్పడతాయని, ఇవి మెదడుపై ప్రభావం చూపి, అల్జిమర్స్ వ్యాధికి దారి తీస్తాయని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్–మాడిసన్‌కు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా పరిశోధనలో తేలింది. నిద్రలేమి వల్ల మెదడులో ‘అమిలాయిడ్ ప్లేక్’ పేరుకుంటుందని, దీనివల్ల మెదడు పనితీరు క్షీణిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్–మాడిసన్లోని న్యూరాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ బార్బరా బెండ్లిన్ వివరించారు. అల్జిమర్స్ వ్యాధితో బాధపడేవారు నిద్రలేమితో కూడా బాధపడుతున్నట్లయితే, అలాంటి వారిలో వ్యాధి తీవ్రత పెరుగుతుందని ఇదివరకటి పరిశోధనల్లోనే తేలిందని ఆమె తెలిపారు. -
అంటే...?
పాలు తాగుతావా? అంటే? మందులు వేసు కున్నావా? అంటే? నిద్ర వస్తోందా? అంటే? బ్రష్ చేసుకున్నావా? అంటే? ఆకలి వేస్తుందా? అంటే? అమ్మాయి ఎక్కడకు పోయింది? అంటే? దేవుడికి దండం పెట్టుకున్నావా? అంటే? ఇప్పుడు మేం మిమ్మల్ని అడుగుతున్నాం అల్జైమర్స్... ‘అంటే’... మీకు తెలుసా? ఆధునిక విజ్ఞాన శాస్త్ర పురోభివృద్ధి వల్ల ఇప్పుడు మరిన్ని ఆరోగ్య సౌకర్యాలు, చికిత్స ప్రక్రియల లాంటివి అందివచ్చాయి. దాంతో మనుషుల ఆయుఃప్రమాణం (అంటే బతికి ఉండే కాలం) బాగా పెరిగింది. ఫలితంగా వృద్ధుల సంఖ్య బాగా పెరిగింది. దాంతో వృద్ధాప్యంలో కనిపించే మతిమరపునకు మరింత తీవ్రమైన అల్జైమర్స్ వ్యాధి చాలా ఎక్కువమందిలో కనిపిస్తోంది. సాధారణంగా వయసు పైబడుతున్న కొద్దీ మతిమరపు సమస్యను వృద్ధులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు. గణాంకాలను పరిశీలస్తే 65 ఏళ్లు -74 ఏళ్ల వయసులో ఉన్న వారిలోని 1.6 శాతం మందిలోనూ, 75 ఏళ్లు - 84 ఏళ్ల వయసు గలిగిన వారిలో 19 శాతం మందిలోనూ... 85 ఏళ్లు పైబడిన వారిలో 40 శాతం మందిలోనూ మతిమరపు చాలా కనిపిస్తుంటుంది. అయితే ఇటీవలి లెక్కల ప్రకారం భారత్‌లో అల్జైమర్స్తో బాధపడే రోగుల సంఖ్య 41 లక్షలు. ప్రపంచ రోగుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే... మనదేశం మూడో స్థానంలో ఉంది. మొదటి స్ధానంలో చైనా, రెండో స్థానంలో అమెరికా ఉన్నాయి. మతిమరపుతో బాధపడుతున్న రోగులందరి లెక్కనూ పరిగణనలోకి తీసుకుంటే.... అందులో కేవలం 25 శాతం మందికి మాత్రమే తాము తీవ్రమైన మతిమరపుతో బాధపడుతున్నామని తెలుసు. అల్జైమర్స్ అంటే ఏమిటంటే... మనం ఒక వ్యక్తి పేరుగానీ, వస్తువును గాని తాత్కాలికంగా గుర్తు రాకపోవడాన్ని మతిమరపు అంటాం. కాకపోతే ఈ లక్షణాలు రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది కలిగించేంతగా ఉంటే అది అల్జైమర్స్ వ్యాధి లక్షణం. ముంచుకొస్తున్న ముప్పు ఎవరికీ తెలియడం లేదు. జ్ఞాపకశక్తి అనే చాప కింది నీరులా అది కమ్ముకొస్తోంది. గతంలో కంటే వేగంగా అది తరుముకుంటూ వస్తోంది. లక్షణాలు: మొదట్లో ఏదో ఒక పదం లేదా పేరు పూర్తిగా మరిచిపోతారు. అయితే ఈ మతిమరపు మీ రోజువారీ జీవితంలోని పనులను ప్రభావితం చేయదు. అంతా సాఫీగానే నడుస్తుంది. కానీ ఒకవేళ ఏదైనా అంశాన్ని రోగి మరచిపోయాడని అనుకుందాం. అతడికి గుర్తు చేశాక కూడా ఆయన పదే పదే అదే అంశాన్ని అడుగుతున్నాడనుకోండి. అది అల్జైమర్స్ లక్షణం. తాను చదివిన, చూసినదాన్ని కూడా నిమిషాల్లో మరచిపోతాడు. తాను చూసిన వారినీ, తాను తిరిగిన ప్రదేశాలనూ గుర్తుపట్టలేడు. అలా వాళ్లు దారులు, తేదీలు, నెలలు, పండగలు, వారు గతంలో అభ్యసించిన విద్యలు (అంటే కార్ డ్రైవింగ్ లాంటివి కూడా) మరచిపోతారు. మరింత ముదిరాక... వ్యాధి మరీ పెరిగిపోయాక... వారు ఫోన్ ఉన్నదనే అంశమే గుర్తుండదు. దాంతో ఏం చేయగలమనే విషయాన్నీ మరచిపోతారు. అడ్రస్‌లనూ గుర్తుపెట్టుకోలేరు. అంతెందుకు... తాము రోజూ తిరిగే దారులనూ, తమ ఇంటిలోని మార్గాలను మరచిపోతారు. తాము బట్టలు ధరించాలన్న విషయమూ వారికి గుర్తుండదు. పుట్టినరోజులూ, ముఖ్యమైన సందర్భాలూ, పనిచేసిన ప్రదేశాలూ... (అంటే రిమోట్ పాస్ట్) మాత్రం గుర్తుంచుకుంటారు. ఇలాంటి పాత జ్ఞాపకాలను అంత తేలిగ్గా మరచిపోరు. కొత్తగా తమ మెదడులోకి వచ్చి చేరిన జ్ఞాపకాలనే ఎక్కువగా మరచిపోతుంటారు. కుటుంబ సభ్యుల పేర్లనే అనేమిటి... వారెవరో, వారితో బంధుత్వం ఏమిటో కూడా తెలియకుండా పోయే పరిస్థితి. తాము తినడం, తాగడం అనే మాట మాత్రమే కాదు... అసలు టాయిలెట్‌కు వెళ్లాలనే విషయాన్నీ మరచిపోతారు. ఒక్కమాటలో చెప్పాలంటే వాళ్ల జీవితమంతా డైరీ రాశారనుకుంటే... అది అక్షరాలన్నీ చెరిగిపోయిన జీవనగ్రంథం అవుతుంది. మెదడులోని జ్ఞాపకాల ఫలకం... ఒక తుడిచిన పలకలా అయిపోతుంది. మరిన్ని అనర్థాలు... ఒక్క క్షణం విడిచిపెడితే మళ్లీ దొరకని విధంగా తప్పిపోవచ్చు ఎన్నెన్నో చిత్రమైన భ్రాంతులకు (హెల్యూసినేషన్స్కు) గురికావచ్చు త్వరత్వరగా అసహనానికి (ఇరిటేషన్‌కు) లోను కావచ్చు ప్రవర్తనలో మార్పులు రావచ్చు నిద్రకు సంబంధించిన రుగ్మతలు కనిపించవచ్చు. ఒక్కొక్కరిలో ఒక్కోలా... తీవ్రతను ముదరడానికి పట్టే వ్యవధి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉండవచ్చు. కొందరిలో చాలా వేగంగా పరిస్థితి విషమిస్తే... మరికొందరిలో అల్జైమర్స్‌లో వచ్చే శాశ్వత మతిమరపు మరికాస్త ఆలస్యంగా రావచ్చు. రోగి వయసు, ఆరోగ్య పరిస్థితి వంటి అంశాలపై ఆధారపడి ఈ వ్యవధి 4 - 20 ఏళ్ల వరకు ఉంటుంది. కారణాలు: అల్జైమర్స్‌కు అసలు కారణాలు ఇంకా తెలియదు. అయితే మెదడులో అమైలాయిడ్, టావో అనే ప్రోటీన్ల సంఖ్య పెరగడం అన్నది దీనికి ఒక కారణంగా పరిశోధకులు భావిస్తున్నారు. దాంతో అల్జైమర్స్ రోగుల్లో మెదడు క్రమంగా కుంచించుకుపోతుంటుంది. దాంతో మెదడు కణాలు క్రమంగా నశించిపోతుంటాయి. అయితే ఎందుకిలా జరుగుతుందన్న అంశంపై ఇప్పటికీ పూర్తి స్పష్టత లేదు. ఈ విషయంపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే లభ్యమవుతున్న ప్రాథమిక సమాచారాన్ని బట్టి పర్యావరణ అంశాలతో పాటు, జన్యుపరమైన కారణాలూ ఈ వ్యాధికి దోహదపడుతున్నాయని కొందరు నిపుణుల అభిప్రాయం. నిర్ధారణ ఇలా... : అల్జైమర్స్ వ్యాధి నిర్ధారణ కేవలం ఒక నిర్దిష్టమైన పరీక్షతో మాత్రమే జరపడం అన్నది కుదరదు. రోగి ఆరోగ్య చరిత్రనూ, అనేక న్యూరలాజికల్ పరీక్షలనూ, మెమరీ స్కేల్‌పై రోగి మరపు స్థాయులను అంచనా వేయడం, బ్లడ్ ఎలక్ట్రోలైట్స్, క్యాల్షియమ్, థైరాయిడ్ ప్రొఫైల్, విటమిన్ బి-12 పాళ్లు తెలుసుకోడానికి చేసే అనేక రకాల రక్తపరీక్షలు చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇతర అంశాలను రూల్ అవుట్ చేయడానికి హెచ్ఐవీ వంటి పరీక్షలూ చేయాల్సి వస్తుంది. అది మెదడుకు నీరుపట్టడం వల్ల వచ్చిన సమస్య కాదని తెలుసుకోడానికీ (ఎందుకంటే హెచ్ఐవీలో డిమెన్షియా చాలా సాధారణం కాబట్టి ఆ అంశాన్ని రూల్ అవుట్ చేయడానికీ), అలాగే మెదడులో గడ్డలూ, రక్తపు గడ్డలు (క్లాట్స్) లేవని తెలుసుకోడానికీ... ఎమ్మారై (బ్రెయిన్) పరీక్ష చేయాల్సి ఉంటుంది. మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి పెట్ స్కాన్ వంటి పరీక్ష కూడా కొన్ని సమయాల్లో అవసరం. ఇక ఆ సమస్య వల్ల పొంచి ఉన్న ముప్పు తీవ్రతను అంచనా వేయడానికి జెనెటిక్ టెస్టింగ్ వంటి పరీక్షలు అవసరం. మందులు: ప్రస్తుతం అల్జైమర్స్ వ్యాధిని తగ్గించేందుకు (క్యూర్ చేసేందుకు) మందులు లేవు. అయితే ఒకవేళ అల్జైమర్స్ వస్తే దాని తీవ్రత ముదరడానికి పట్టే సమయాన్ని వీలైనంతగా ఆలస్యం చేసేందుకు మాత్రమే మందులు ఉన్నాయి. అలాగే లక్షణాల తీవ్రతను తగ్గించడం కోసం మందులు ఉపయోగపడతాయి. రోగికి ఉన్న చిరు (మైల్డ్), లేదా ఓ మోస్తరు (మోడరేట్) లక్షణాల ఆధారంగా డోనెపెజిల్, రివాస్టిగ్మిన్, మెమాంటిన్, గ్యాలంటమైన్ వంటి మందులు ఇప్పుడు మన దేశంలోనూ లభ్యమవుతున్నాయి. మెదడులోని అన్ని కార్యకలాపాలను నిర్వహించే ఎసిటైల్ కోలిన్ అనే రసాయనం పాళ్లను సరైన స్థాయుల్లో ఉంచడానికి ఈ మందులు బాగా ఉపయోగపడతాయి. అలాగే ప్రవర్తనలో తేడాలను అరికట్టడానికీ, నిద్ర సంబంధమైన సమస్యలను చక్కబరచడానికీ పైన పేర్కొన్న మందులతో పాటు ఇతర మందులు కూడా అవసరం. అయితే మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు, జింకో బైలోబా, బాగా పనిచేస్తాయని అందరూ అనుకుంటున్నట్లుగా పేరు పొందిన ‘న్యూరో ప్రొటెక్టివ్ మందులు’ ఏ మాత్రం ఉపయోగపడవు. కాగా, అల్జైమర్స్ అసలు రాకుండానే నివారించడం కోసం వ్యాక్సిన్‌ను రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నివారణ : అధిక రక్తపోటును నివారించడం, డయాబెటిస్‌నూ, బీపీని ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవడం, పొగతాగే అలవాటును పూర్తిగా మానేయడం వంటివి చాలావరకు అల్జైమర్స్ నివారణకు చాలా ప్రధానం మంచి వ్యాయామం చేయడం... మెదడుకు మేత చేకూర్చే సుడోకు, వీడియోగేమ్స్, పజిల్స్ పూర్తి చేయడం, ఒక గమ్యాన్ని వేర్వేరు మార్గాల ద్వారా చేరుకుంటూ ఉండటం వంటివి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.మామూలుగా కంటే మరో రెండు భాషలు ఎక్కువగా మాట్లాడేవారికి అల్జైమర్స్ వచ్చే అవకాశాలు తక్కువ. ఆహారం ద్వారా నివారణ... బాదాము, వాల్నట్, ఆలివ్ ఆయిల్, తాజా ఆకుకూరలు పుష్కలంగా తినడం అల్జైమర్స్ నివారణకు బాగా తోడ్పడుతుంది.డార్క్ కలర్ చాక్లెట్లు కూడా అల్జైమర్స్‌ను నివారిస్తాయి. అయితే మితిమీరి వాటిని తినడం అంత మేలు చేకూర్చదు. తక్కువ మోతాదులో కాఫీ, గ్రీన్ టీ వంటివి అల్జైమర్స్ ముప్పును నివారిస్తాయి.ఇక మరీ ముఖ్యమైన అంశం ఏమిటంటే... అల్జైమర్స్ వ్యాధి బారిన పడే రోగులను సంరక్షించే కుటుంబ సభ్యులకు నిపుణుల నుంచి, మానసిక వైద్యుల నుంచి సూచనలు అవసరం. ఇలాంటి రోగుల చికిత్సలో వారి భూమిక చాలా కీలకం. మరికొన్ని ప్రధాన లక్షణాలివే... సంఘటనలు, అపాయింట్మెంట్స్ మరచిపోతుంటారు. వ్యక్తిగతమైన వస్తువులను గుర్తుపెట్టుకోలేరు. ఇతరులను నిందిస్తుంటారు. అడిగిన ప్రశ్ననే పదే పదే అడుగుతుంటారు క్రమేపీ మాట్లాడే సామర్థ్యాన్ని, రాసే సామర్థ్యాన్ని కోల్పోతారు. రాత, మాట అస్పష్టంగా ఉండవచ్చు ఏకాగ్రతను కోల్పోవడంతో పాటు చదవడం, రాయడం, గతంలో ఆసక్తి పెంచుకున్న అంశాలపై అదే స్థాయి ఆసక్తి ఉండదు. చిన్ననాటి లెక్కలనే చేయలేకపోవచ్చు. కొత్తగా వచ్చే పరిజ్ఞానాలను (కంప్యూటర్స్‌లో వచ్చే అడ్వాన్స్మెంట్స్)ను అందిపుచ్చుకోలేకపోవచ్చు ఆలోచన, రీజనింగ్ విషయంలో... చిన్న చిన్న విషయాలలో సైతం నిర్ణయాలు తీసుకోలేరు. చిన్న నిర్ణయాల విషయంలోనూ ఇతరులపై ఆధారపడతారు రద్దీగా ఉండే వేళల్లో దారి తప్పిపోవడం, ఇంటి దారి మరచిపోవడం, రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు కలిగే ప్రమాదాలను గుర్తించి, తప్పుకోలేరు వ్యక్తిగత ప్రణాళికలు వేసుకోలేకపోవడం, భావోద్వేగాలు లేకపోవడం లేదా కుంగుబాటు, చీకాకు ఆతృత లేదా దూకుడు స్వభావం వివిధ సామాజిక కార్యకలాపాలకు దూరం కావడం బంధువులనూ, తన ఉద్యోగులను అనవసరంగా అనుమానించడం వంటివి కూడా చేస్తారు. డా. బి. చంద్రశేఖర్ రెడ్డి సీనియర్ న్యూరాలజిస్ట్ సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం.12, బంజారాహిల్స్, హైదరాబాద్ -
విఠల్‌రావు విషాదాంతం
ప్రముఖ గజల్ గాయకుడు విఠల్‌రావు కన్నుమూత * మతిస్థిమితం కోల్పోయి గతనెల 29న షిర్డీలో అదృశ్యం * చివరికి అనామకుడిగా గాంధీ ఆస్పత్రిలో మరణం * మార్చురీలో మృతదేహాన్ని గుర్తించిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ * తొలి తరం తెలంగాణ గజల్ గాయకుడు విఠల్‌రావు * నిజాం ఆస్థాన కవిగా కీర్తిప్రతిష్టలు.. దేశవిదేశాల్లో వేలాది ప్రదర్శనలు సాక్షి, హైదరాబాద్: తొలితరం తెలంగాణ గజల్ గాయకుడు పండిట్ శివపూర్కర్ విఠల్‌రావు (86) అదృశ్యం మిస్టరీ విషాదాంతమైంది. అద్భుతమైన గాత్రంతో దశాబ్దాలకు పైగా సాహితీ ప్రియులను అలరించిన ఆయన చివరికి అనామకుడిలా మరణించారు. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న విఠల్‌రావు మే 29న షిర్డీలో కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఆచూకీ కోసం పోలీసులు, కుటుంబసభ్యులు తీవ్రంగా వెతుకుతున్నారు. ఈ నెల 24న హైదరాబాద్‌లోని బేగంపేట కంట్రీ క్లబ్ ఫ్లై ఓవర్ కింద అపస్మారక స్థితిలో పడి ఉన్న విఠల్‌రావును స్థానికులు యాచకునిగా భావించి 108కు సమాచారమిచ్చారు. గాంధీ ఆస్పత్రికి తరలించగా ఆయన అదే రోజు మరణించారు. గుర్తు తెలియని మృతదేహంగా పోలీసులు కేసు నమోదు చేసి మార్చురీలో భద్రపరిచారు. కాగా, విఠల్‌రావు అదృశ్యం కేసు దర్యాప్తు చేస్తున్న సీసీఎస్ ఇన్స్పెక్టర్ శాంబాబు.. ఫొటోల ఆధారంగా మార్చురీలోని మృతదేహం ఆయనదేనని గుర్తించారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న విఠల్‌రావు మృతదేహాన్ని ఆయనకు అమర్చిన కృత్రిమ కన్ను ద్వారా కుమారుడు సంతోష్ గుర్తించారు. కొన్నేళ్ల కింద ఆయన ఎడమ కన్ను తొలగించి కృత్రిమ కన్ను అమర్చారు. విఠల్‌రావుకు భార్య తారాభాయి, కుమారులు సంజయ్, సంతోష్, కుమార్తెలు సంధ్య, వింధ్య, సీమ ఉన్నారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆస్థాన గాయకుడిగా , దేశ,విదేశీల్లో పేరొందిన ఆయన మృతి చెందిన తీరు కుటుంబసభ్యులు, బంధువులు, అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది. విఠల్‌రావు అంత్యక్రియలను ఆయన స్వస్థలమైన గోషామహల్లో శనివారం నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు సంతోష్తెలిపారు. సన్మానం అందుకోకుండానే... జూన్ 2న తెలంగాణ అవతరణ వేడుకల సందర్భంగా విఠల్‌రావుకు సన్మానం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. అయితే అప్పటికే ఆయన అదృశ్యం కావడంతో ఆయనను సన్మానించలేకపోయింది. ఆయన ఆచూకీ కనిపెట్టాలని పోలీసులను ఆదేశించింది. దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం పంపించారు. మరోవైపు కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు షిర్డీ పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు. షిర్డీలో పోలీసులు, కుటుంబసభ్యులు గాలింపు చేపట్టారు. అయినా ఎక్కడా ఆయన ఆచూకీ దొరకలేదు. కుటుంబసమేతంగా షిర్డీకి.. విఠల్‌రావు కుటుంబసభ్యులంతా కలసి మే 26న గోషామహల్ నుంచి షిర్డీ యాత్రకు బయలుదేరారు. మార్గ మధ్యలో విఠల్ చెల్లెలు అంబిక ఇంటికి వెళ్లి అక్కడ రెండు రోజులున్నారు. ఆ తర్వాత మే 29న అందరూ కలసి షిర్డీ చేరుకున్నారు. బాబా దర్శనం చేసుకున్నాక తిరిగి వస్తుండగా విఠల్‌రావు కనిపించకుండా పోయారు. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న ఆయన షిర్డీలో తప్పిపోయి హైదరాబాద్‌లో ఎలా ప్రత్యక్షమయ్యారో తెలియడం లేదు. ఈ నెల 23 రాత్రి నాగర్సోల్లో అజంతా ఎక్స్‌ప్రెస్ ఎక్కి 24న ఉదయం బేగంపేట రైల్వేస్టేషన్లో దిగి ఉంటారని, కాలినడకన బయల్దేరి నీరసంతో బేగంపేట ఫ్లైఓవర్ కింద కుప్పకూలి ఉంటారని అంటున్నారు. దేశవిదేశాల్లో ప్రదర్శనలు: విఠల్‌రావు ప్రస్థానం నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆస్థాన గాయకుడిగా మొదలైంది. చివరగా ఆయన ఈ ఏడాది ఏప్రిల్ 28న ఢిల్లీలో ప్రదర్శన ఇచ్చారు. భారతరత్న ఉస్తాద్ బిస్మిల్లాఖాన్‌తో కలసి హైదరాబాద్‌లో ఆయన ప్రదర్శన ఇచ్చారు. చౌమొహల్లాప్యాలెస్, రవీంద్రభారతి, తారామతి బారదరిలో విఠల్ ఇచ్చిన ప్రదర్శనలు చరిత్రలో నిలిచిపోతాయనే చెప్పుకోవచ్చు. చాలామంది ప్రముఖులు ఆయన గజల్స్‌కు మంత్రముగ్ధులయ్యేవారు. రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, గవర్నర్లు, సీఎంలను ఆయన గజల్స్ అలరించాయి. కువైట్, కెనడా,అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్, దుబాయ్ తదితర దేశాల్లోనూ ఆయన ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయనను వరించాయి. సీఎం కేసీఆర్ సంతాపం విఠల్‌రావు మృతి పట్ల శుక్రవారం సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఏడో నిజాం ఆస్థానంలో విద్వాంసుడిగా పని చేసిన విఠల్‌రావు దేశవ్యాప్తంగా పేరొందిన కళాకారుడని సీఎం గుర్తు చేశారు. విఠల్‌రావు కుటుంబసభ్యులకు, శిష్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం విఠల్‌రావును ప్రత్యేకంగా గుర్తించి పారితోషికాన్ని అందించింది. అలాగే ప్రముఖ పర్యావరణవేత్త, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజామణి మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. -
పళ్లు శుభ్రంగా ఉంటే అల్జైమర్స్ దూరం!!
మీకు రోజూ చక్కగా బ్రష్ చేసుకుంటుంటారా? మీకు దీర్ఘకాలం పాటు జ్ఞాపకశక్తి పదిలంగా ఉంటుంది. అంతేకాదు... అల్జైమర్స్ వ్యాధికి గురయ్యే అవకాశాలూ తక్కువే. ఇది పరిశోధనలు చెప్పిన సత్యం. మతిమరపుతో బాధపడుతున్న కొందరి మెదడు ఫిల్ములనూ, అలాగే డిమెన్షియా (మతిమరపు), అల్జైమర్స్ లాంటి వ్యాధులు లేని ఆరోగ్యవంతుల మెదడు ఫిల్మలను పరిశీలించారు. దీనితో పాటు ఈ రెండు కేటగిరీలకు సంబంధించిన వారి మెదడు నమూనాలనూ సేకరించి పరీక్షించారు. ఇందులో డిమెన్షియా (మతిమరపు)తో బాధపడుతున్న వారి మెదళ్లలో పార్ఫైరోమోనాస్ జింజివాలిస్ అనే బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. ఈ బ్యాక్టీరియా సాధారణంగా పంటి చిగుర్లలో నివాసం ఉంటుంది. ఆహారం నములుతున్నప్పుడుగానీ, చిగురుకు దెబ్బతగిలి స్వల్ప రక్తస్రావం జరిగినప్పుడుగానీ ఆ బ్యాక్టీరియమ్... రక్తప్రవాహంతో కలిసి మెదడును చేరుతుంది. ఒక్కోసారి పంటిచికిత్స చేయించుకున్నవారిలో సైతం చికిత్స తర్వాత ఏర్పడే గాట్ల ద్వారా ఆ బ్యాక్టీరియా రక్తప్రవాహంలో కలిసి శరీరంలోని వేర్వేరు భాగాలకు చేరే అవకాశం ఉంది. అదే క్రమంలో మెదడునూ చేరి అక్కడి వ్యాధినిరోధక రసాయనాలను ప్రభావితం చేయవచ్చు. దాంతో నరాల చివరలు దెబ్బతినవచ్చు. ఫలితంగా అయోమయం, జ్ఞాపకశక్తి క్షీణించడం వంటి లక్షణాలు బయటపడతాయి. అంతేకాదు... పళ్లను శుభ్రంగా ఉంచుకోకపోతే అక్కడి బ్యాక్టీరియా గుండెను చేరి గుండె సంబంధ వ్యాధులనూ, డయాబెటిస్‌ను కలిగించవచ్చని ఇప్పటికే నిరూపితమైంది. బ్రిటిష్ పరిశోధకులు చేసిన అధ్యయనాల్లో తేలిన ఈ విషయాలన్నీ ‘జర్నల్ ఆఫ్ అల్జైమర్స్ డిసీజ్’లో ప్రచురితమయ్యాయి. అందుకే రోజూ పళ్లు శుభ్రంగా తోముకుంటే కేవలం నోరు శుభ్రంగా ఉండటం మాత్రమే కాదు... గుండెజబ్బులూ, డయాబెటిస్తో పాటు మతిమరపు, అల్జైమర్స్ కూడా నివారితమవుతాయన్నమాట. - డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి, స్మైల్ మేకర్స్ డెంటల్ హాస్పిటల్, హైదరాబాద్ -
బాదంతో... గుండెజబ్బులకు చెక్
దినుసు ‘ఫలాలు’ బాదం పప్పులో విటమిన్ ‘ఇ’, కాపర్, మెగ్నీషియం, ఎక్కువ మోతాదులో ప్రోటీన్లు ఉంటాయి. బాదం గింజలలోని బయో యాక్టివ్ మాలిక్యూల్స్ (పీచు, ఫైటోస్టెరోల్స్, విటమిన్లు, ఖనిజలవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు) గుండె సంబంధ వ్యాధులను నివారిస్తాయి. * బాదంలోని రిబోఫ్లేవిన్, ఎల్- కామిటైన్‌లు మెదడుకు పోషకాలుగా పని చేస్తాయి. కాబట్టి ఇవి మెదడును చురుగ్గా ఉంచుతాయి. వార్ధక్యంలో ఎదురయ్యే అల్జీమర్స్ వ్యాధిని నివారిస్తాయి. * బాదం గింజలలోని సూక్ష్మ పోషకాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. నరాల వ్యవస్థను శక్తిమంతం చేస్తాయి. రక్తాన్ని వృద్ధి చేస్తాయి. దంతాలు, ఎముకలను గట్టిపరుస్తాయి. కాబట్టి వార్ధక్యంలో వచ్చే ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల వ్యాధులను నివారించవచ్చు. చర్మం కాంతివంతమవుతుంది. * పిల్లలకు రోజూ రెండు లేదా మూడు బాదం గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తినిపిస్తే మంచిది. * బాదం తింటే దేహంలో కొవ్వు స్థాయులు పెరుగుతాయనే అపోహ చాలా బలంగా ఉంది. కానీ నిజానికి ఇది పూర్తిగా అవాస్తవం. ఇందులోని ఫ్యాటీ యాసిడ్ల వల్ల దేహ నిర్మాణానికి, జీవక్రియలకు అవసరమైన కొవ్వు సమృద్ధిగా లభిస్తుంది. ఇవి దేహంలోని కొలెస్ట్రాల్ స్థాయులను సమన్వయం చేస్తాయి. -
మర్చిపోకుండా చికిత్స!
నిర్ధారణ మతిమరుపును గుర్తించడానికి కొత్తగా పరీక్షలెందుకు... అనిపించడం సహజమే. కానీ శాస్త్రబద్ధంగా చికిత్స చేయాలంటే మతిమరుపును నిర్ధారించే పరీక్షలు చేయాల్సిందే. అవి ఏమిటంటే... * కుటుంబ చరిత్ర (రక్తసంబంధీకుల్లో ఎవరికైనా అల్జీమర్స్ ఉందేమోననే వివరాలు), ఆహారపు అలవాట్లు, మద్యపానం, ఇతర అనారోగ్యాలకు ఏవైనా మందులు వాడుతుంటే ఆ మందుల వివరాలను పరిశీలిస్తారు. రక్తపోటు, గుండె, ఊపిరితిత్తులు కొట్టుకునే వేగాన్ని గమనిస్తారు. సాధారణ ఆరోగ్యవివరాలను తెలుసుకుంటారు. వీటితోపాటు రక్తం, మూత్ర పరీక్షలు చేస్తారు. * కండరాల శక్తిని, కంటి కదలికలు, మాట, స్పర్శ, చర్యకు ప్రతిచర్యలు ఎలా ఉన్నాయనేది గమనిస్తారు. * నరాల వ్యాధి నిపుణులు... పార్కిన్సన్స్ (చేతులు, మెడ వణకడం), మెదడులో కణుతులు, మెదడులో నీరు చేరడం, జ్ఞాపకశక్తిని తగ్గించే ఇతర అనారోగ్యాలు, పక్షవాతం వంటివి ఉన్నాయేమోనని పరీక్షిస్తారు. సి.టి.స్కాన్, ఎమ్ఆర్ఐ పరీక్షలు చేసి బ్రెయిన్ ఇమేజింగ్ స్టడీ చేస్తారు. * మెంటల్ స్టేటస్ టెస్ట్‌లు... చిన్న చిన్న లెక్కలను పరిష్కరించడం, ఒక విషయాన్ని విడమరిచి చెప్పడం, రోగి చేత ఆ రోజు తేదీ, సమయం, తాను ఎక్కడున్నాననే వివరాలు చెప్పించడం, కొన్ని పదాల పట్టిక ఇచ్చి వాటిని తిరిగి చెప్పించడం వంటి పరీక్షలు చేస్తారు. * ఇంతగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే మతిమరుపు ఉన్నట్లు నిర్ధారించి తగిన వైద్యం చేస్తారు. -
ఆలోచనలు అధికమైతే అల్జీమర్స్!
ఎక్కువగా ఉద్వేగపడటం, దేని గురించయినా తీక్షణంగా ఆలోచిస్తూ ఉండటం, కొన్ని విషయాల్లో.. కొందరి గురించి ఈర్ష్య కలిగి ఉండటం... చాలా మంది మహిళలు ఇలాంటి ఆలోచనలకు అతీతులు కాదు. అయితే వీటన్నింటినీ కొంచెం హద్దులో పెట్టుకోవాలని, లేకపోతే వృద్ధాప్యంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని సూచిస్తున్నారు వైద్యపరిశోధకులు. అనవసరమైన ఆలోచనలు నిద్రలేకుండా చేస్తున్నట్లయితే... వృద్ధాప్యంలో మహిళలు అల్జీమర్స్ బారిన పడే అవకాశాలు అధికం అవుతాయని పరిశోధకులు అంటున్నారు. ఉన్న బాధ్యతలకు అనవసరమైన ఆలోచనలు తోడు అయినప్పుడే ఇలాంటి ప్రమాదం ఉంటుందని వారు పేర్కొన్నారు. మెదడును తొలిచేసే ఆలోచనల ఫలితంగా తరచూ మూడీగా మారిపోవడం... రాత్రుళ్లు నిద్రపోకుండా ఎక్కువసేపు ఆలోచిస్తూ గడిపేయడం... నిద్రలో కూడా ఇలాంటి టెన్షన్లే వెంటాడుతుండటం నరాల పనితీరుపై ప్రభావితం చేస్తుందని, అది మహిళల్లో అల్జ్జీమర్స్కు దారి తీస్తుందని పరిశోధకులు వివరించారు. భవిష్యత్తులో అల్జీమర్స్ బారిన పడకుండా ఉండాలంటే అనవసర ఆలోచనలను మానేయమనేది వారి సలహా! -
అల్జీమర్స్‌ను నివారించవచ్చు!
(సెప్టెంబర్ 21న ప్రపంచ అల్జీమర్స్ దినం) ఆరోగ్యకరమైన జీవనశైలితో వార్ధక్యంతో వచ్చే మతిమరుపును జయించవచ్చు. ఇందుకు ప్రధానంగా... రోజూ వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, మానసికంగా ఉత్తేజంగా ఉండడం, సుఖనిద్ర, ఒత్తిడి లేకుండా పనులను చక్కబెట్టుకోగలిగిన నేర్పు, మానవ సంబంధాలను కలిగి ఉండడం (యాక్టివ్ సోషల్ లైఫ్)... అనే ఆరు సూత్రాలను పాటించాలి. నడక, ఈత, యోగసాధన, ఏరోబిక్స్ వంటి వాటిల్లో దేహానికి సౌకర్యంగా ఉండే వ్యాయామం చేయాలి. వారానికి కనీసం ఐదు రోజుల పాటు రోజుకు అరగంట సేపు ఎక్సర్సైజ్ ఉండాలి. మెదడును చురుగ్గా ఉంచే ప్రహేళికల (పజిల్స్)ను పరిష్కరిస్తుండాలి. చేపలు, గింజలు, పొట్టుతీయని ధాన్యాలు, తాజా కూరగాయలు, పండ్లు సమృద్ధిగా తీసుకోవాలి. కొవ్వుతో కూడిన పదార్థాలు, మాంసం, ఫాస్ట్‌ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్‌ను వీలయినంతగా తగ్గించాలి. గుండెకు మంచి చేసే ఆహారాలన్నీ మెదడుకు కూడా మేలు చేస్తాయి. గుండెకు హాని చేసే పదార్థాలు మెదడు పని తీరును మందగింపచేస్తాయి. పాలు కలిపిన టీకి బదులు గ్రీన్ టీ తీసుకుంటే మంచిది. రోజుకు రెండు నుంచి నాలుగు కప్పులు గ్రీన్ టీ తీసుకుంటే జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.