నిద్రలేమితో అల్జిమర్స్ ముప్పు
దీర్ఘకాలం నిద్రలేమితో బాధపడే వారు తర్వాతి కాలంలో అల్జిమర్స్ వ్యాధికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయని ఒక తాజా పరిశోధనలో తేలింది. నిద్రలేమితో బాధపడేవారికి దీర్ఘకాలంలో వెన్నెముకలోని ద్రవాలలో మార్పులు ఏర్పడతాయని, ఇవి మెదడుపై ప్రభావం చూపి, అల్జిమర్స్ వ్యాధికి దారి తీస్తాయని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్–మాడిసన్‌కు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా పరిశోధనలో తేలింది. నిద్రలేమి వల్ల మెదడులో ‘అమిలాయిడ్ ప్లేక్’ పేరుకుంటుందని, దీనివల్ల మెదడు పనితీరు క్షీణిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్–మాడిసన్‌లోని న్యూరాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ బార్బరా బెండ్లిన్ వివరించారు. అల్జిమర్స్ వ్యాధితో బాధపడేవారు నిద్రలేమితో కూడా బాధపడుతున్నట్లయితే, అలాంటి వారిలో వ్యాధి తీవ్రత పెరుగుతుందని ఇదివరకటి పరిశోధనల్లోనే తేలిందని ఆమె తెలిపారు.