పళ్లు శుభ్రంగా ఉంటే అల్జైమర్స్ దూరం!!
మీకు రోజూ చక్కగా బ్రష్ చేసుకుంటుంటారా? మీకు దీర్ఘకాలం పాటు జ్ఞాపకశక్తి పదిలంగా ఉంటుంది. అంతేకాదు... అల్జైమర్స్ వ్యాధికి గురయ్యే అవకాశాలూ తక్కువే. ఇది పరిశోధనలు చెప్పిన సత్యం.
మతిమరపుతో బాధపడుతున్న కొందరి మెదడు ఫిల్ములనూ, అలాగే డిమెన్షియా (మతిమరపు), అల్జైమర్స్ లాంటి వ్యాధులు లేని ఆరోగ్యవంతుల మెదడు ఫిల్మలను పరిశీలించారు. దీనితో పాటు ఈ రెండు కేటగిరీలకు సంబంధించిన వారి మెదడు నమూనాలనూ సేకరించి పరీక్షించారు. ఇందులో డిమెన్షియా (మతిమరపు)తో బాధపడుతున్న వారి మెదళ్లలో పార్‌ఫైరోమోనాస్ జింజివాలిస్ అనే బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. ఈ బ్యాక్టీరియా సాధారణంగా పంటి చిగుర్లలో నివాసం ఉంటుంది. ఆహారం నములుతున్నప్పుడుగానీ, చిగురుకు దెబ్బతగిలి స్వల్ప రక్తస్రావం జరిగినప్పుడుగానీ ఆ బ్యాక్టీరియమ్... రక్తప్రవాహంతో కలిసి మెదడును చేరుతుంది. ఒక్కోసారి పంటిచికిత్స చేయించుకున్నవారిలో సైతం చికిత్స తర్వాత ఏర్పడే గాట్ల ద్వారా ఆ బ్యాక్టీరియా రక్తప్రవాహంలో కలిసి శరీరంలోని వేర్వేరు భాగాలకు చేరే అవకాశం ఉంది. అదే క్రమంలో మెదడునూ చేరి అక్కడి వ్యాధినిరోధక రసాయనాలను ప్రభావితం చేయవచ్చు. దాంతో నరాల చివరలు దెబ్బతినవచ్చు.
ఫలితంగా అయోమయం, జ్ఞాపకశక్తి క్షీణించడం వంటి లక్షణాలు బయటపడతాయి. అంతేకాదు... పళ్లను శుభ్రంగా ఉంచుకోకపోతే అక్కడి బ్యాక్టీరియా గుండెను చేరి గుండె సంబంధ వ్యాధులనూ, డయాబెటిస్‌ను కలిగించవచ్చని ఇప్పటికే నిరూపితమైంది. బ్రిటిష్ పరిశోధకులు చేసిన అధ్యయనాల్లో తేలిన ఈ విషయాలన్నీ ‘జర్నల్ ఆఫ్ అల్జైమర్స్ డిసీజ్’లో ప్రచురితమయ్యాయి. అందుకే రోజూ పళ్లు శుభ్రంగా తోముకుంటే కేవలం నోరు శుభ్రంగా ఉండటం మాత్రమే కాదు... గుండెజబ్బులూ, డయాబెటిస్‌తో పాటు మతిమరపు, అల్జైమర్స్ కూడా నివారితమవుతాయన్నమాట.
- డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి, స్మైల్ మేకర్స్ డెంటల్ హాస్పిటల్, హైదరాబాద్