రోజంతా తాజాగా ఉంచే పానీయం..!
మగమహారాజులకేం... బ్రష్ చేసుకుని రాగానే వేడివేడి కాఫీనో, టీనో భార్య తెచ్చి ఇస్తే ఊదుకుంటూ తాగుతారు. మరి ఆడవాళ్లేం చేయాలి? ‘అదేం ప్రశ్న? భర్తకి ఇచ్చేటప్పుడే తాను కూడా ఒక కప్పు కాఫీనో, టీనో కలుపుకుని తాగుతుంది కదా...’ అనుకోవద్దు. ఎందుకంటే కాఫీ, టీ లు ఎలాగూ తాగుతారు. అంతకన్నా ముందు ఓ గ్లాసుడు గోరువెచ్చటి నీటిలో టేబుల్ స్పూన్ తేనె, నిమ్మరసం కలుపుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇదేమీ కొత్త విషయం కాదు కానీ, ఎవరూ దీన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు. పొద్దున్నే తాగవలసిన ఈ పానీయం వల్ల ఏయే ప్రయోజనాలున్నాయో తెలుసుకుంటే దీనిని కూడా తమ అలవాట్లలో భాగం చేసుకుంటారని...
1. అజీర్తిని, మలబద్ధకాన్ని నివారించి, సాఫీగా మలవిసర్జన జరిగేటట్లు చూస్తుంది.
2. తాగిన వెంటనే రక్తంలో కలిసిపోవడం వల్ల కొత్త శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుంది.
3. ఆయుర్వేదం ప్రకారం కడుపులో చేరిన మలినాలను, ఆమాన్ని తొలగించి, శుభ్రంగా కడిగేస్తుంది.
4. రక్తపోటును అదుపు చేసి, మెదడును చైతన్యపరుస్తుంది.
5. నెగటివ్ మూడ్స్‌ను దరిచేరనివ్వకుండా చూస్తుంది.
6. రక్తాన్ని పరిశుభ్రం చేయడం వల్ల చర్మం ఆరోగ్యంగా నిగనిగలాడుతుంది.
7. మూత్రపిండాల పనితీరును మెరుగుపర చి, మలినాలను వడపోయడంలో సహకరిస్తుంది.
8. అదనపు కొవ్వును కరిగించి, శరీరం బరువు పెరగకుండా నిరోధిస్తుంది.
ఇన్ని ఉపయోగాలున్న ఈ పానీయాన్ని పరగడుపున తాగాలి. అంటే సాధారణంగా బ్రష్ చేసుకున్నాకే ఏదైనా తాగడం మనకు అలవాటు. అయితే, ఈ పానీయాన్ని మాత్రం బ్రష్ చేసుకోకమునుపే తాగడం మంచిదని నిపుణులంటున్నారు. పెద్ద గ్లాసునిండా గోరువెచ్చటి నీళ్లు తీసుకుని, అందులో సగం నిమ్మచెక్కను పిండాలి, దానికి టేబుల్‌స్పూన్ తేనె జతచేసి, బాగా కలిపి, వెంటనే తాగాలి. అయితే కాఫీ లేదా టీ తాగే అలవాటు మానుకోనక్కరలేదు. ఓ గంట ఆగి తీసుకోవడం మంచిది.