మానవుల్లో ఒక వయసు దాటాక మతిమరపు రావడం చాలా చాలా సాధారణం. పెద్ద వయసులో సాధారణంగా అల్జైమర్స్ వల్ల మతిమరపు రావడం ఎక్కువ. పైగా వృద్ధాప్యంలో దాపురించే అల్జైమర్స్ వ్యాప్తి కూడా ఇటీవల బాగా పెరిగింది. అయితే చాలా తియ్యని మార్గంలో, చాలా సహజసిద్ధమైన రీతిలో మతిమరపును ఎదుర్కొనే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు.
ప్రతి రోజూ పరిమితమైన మోతాదులో తీసుకునే చాక్లెట్ వల్ల వృద్ధాప్యంలో వచ్చే మతిమరపు (డిమెన్షియా), అఅల్జైమర్స్‌ను నివారించవచ్చని పేర్కొంటున్నారు. చాక్లెట్‌లో ఉపయోగించే కోకో... అందులోని పోషకాల్లో ఒకటైన ఫ్లేవనాల్ వల్ల ఈ ప్రయోజనం ఒనగూరుతుందంటున్నారు వారు. ఇటీవల కొద్దికాలం కిందట ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్ ఎల్ అక్విలాకు చెందిన వైద్య నిపుణుడు డాక్టర్ గియోవాబాటిస్టా దేసిదెరి ‘‘మనం మితిమీరిన క్యాలరీలు తీసుకోకుండా పరిమితంగా కోకో ఉన్న చాక్లెట్లను తినడం వల్ల మన జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది’’ అని పేర్కొన్నారు.
అంతేకాదు... చాలా పరిమితంగా చాక్లెట్ డ్రింక్ (ఫ్లేవనాల్ డ్రింక్) తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గే అవకాశం కూడా ఉందంటున్నారు నిపుణులు. అందుకే వృద్ధాప్యానికి ముందరే చాలా పరిమితంగా చాక్లెట్లు తినడం మంచిదనే అంటున్నారు. అయితే చక్కెర వ్యాధి ఉన్నవారు మాత్రం ఈ విషయంలో ఒకసారి తమ మెడికల్ స్పెషలిస్ట్‌ను సంప్రదించాకే తాము తీసుకోగలిగే చాక్లెట్ మోతాదును నిర్ణయించుకోవడం మంచిదని వారు హెచ్చరిస్తున్నారు. అయితే ఇలా చాక్లెట్లతో ఇన్ని మేళ్లు ఉన్నాయంటూ మితిమీరి తింటే మనకు ప్రయోజనం కలగకపోగా... ప్రతికూల ఫలితాలే ఉంటాయంటూ హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
Comments
Please login to add a commentAdd a comment