
సాధారణంగా పెద్దవయసులోని వారు పడిపోయారనీ, బాత్‌రూమ్‌లో జారిపడ్డారనీ... లాంటి మాటలు
తరచూ వినవస్తూ ఉంటాయి. దాదాపు 65 ఏళ్లు దాటిన చాలామంది ఇలా పడిపోతుంటారనే న్యూస్ వింటుండటం మామూలే. పెద్దవారు ఇలా పడిపోతుండటం వల్ల ఒక్కోసారి ఎముకలు విరగడం (ఫ్రాక్చర్స్), తలకు గాయాలు (హెడ్ ఇంజరీస్) కావడం లాంటి అనర్థాలెన్నో జరుగుతుంటాయి. వీటిల్లో బాత్‌రూముల్లో జారిపోవడం మినహాయించి మిగతాచోట్ల పడిపోవడానికి చాలా కారణాలే ఉంటాయి. పెద్దవాళ్లు అలా ఎందుకు పడిపోతుంటారో, అందుకు రకరకాల కారణాలేమిటో, వాళ్లు అలాపడిపోవడాన్నినివారించడమెలాగో చూద్దాం.
ప్రస్తుతం మనదేశంలో 60 ఏళ్లు పైబడిన పెద్దవాళ్ల సంఖ్య 15 కోట్లు. అంటే మొత్తం జనాభా అయిన 140 కోట్లలో దాదాపు 10.5% మంది పెద్దవాళ్లే. వీళ్లలో దాదాపు 60 నుంచి 70 ఏళ్ల వాళ్లలో 25–30 శాతం మంది పడిపోతూ ఉండగా... 70 నుంచి 80 ఏళ్ల మధ్యవాళ్లలో పడిపోయే వారి శాతం 35%గా ఉంది. మామూలుగా పదిమందిలో ఆరుగురు ఇండ్లలోనే పడుతుంటారు. పడిపోవడం మెల్లగానే పడిపోయినట్లు కనిపించినా ఆ పడటం తాలూకు పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉండవచ్చు. ఉదాహరణకు అలా పడినప్పుడు మెదడులోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని ‘సబ్‌డ్యూరల్ హిమటోమా’ అంటారు. దీనికి శస్త్రచికిత్స అవసరం పడుతుంది. ఇక తుంటి ఎముక ఫ్రాక్చర్ అయిపోయి మంచానికే పరిమితం కావడం చాలామంది ఎదుర్కొనే సమస్య. అప్పుడప్పుడూ పెద్దవారే కాదు... కొందరు మధ్యవయస్కులూ పడిపోవడం ఇటీవల సాధారణంగా జరుగుతోంది. ఇలా పడిపోడానికి కారణాలేమిటో తెలుసుకుందాం.
కారణాలివే...
కొందరు పెద్ద వయసువారిలో వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ల పాదాల్లో స్పర్శ కొంతమేర తగ్గవచ్చు. దాంతో తాము పడి΄ోతున్నామనే సంగతి కూడా వాళ్లకు తెలియకుండానే వాళ్లు పడిపోవచ్చు.
వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకల సాంద్రతతో పాటు మజిల్ మాస్ కూడా క్రమంగా తగ్గుతూ పోతుంది. దాంతో కండరాల్లోని శక్తి కూడా క్షీణించడంతో పడిపోవడానికి అవకాశాలు పెరుగుతాయి. అలాగే మోకాలు, చీలమండ, తుంటి ఎముకల కీళ్లలోనూ కొన్ని మార్పులు రావడం కారణంగా పడిపోవడాలు జరగవచ్చు.
పెరుగుతున్న వయసుకు తగ్గట్లు చూపు మందగించడం, వినికిడి శక్తి కూడా క్షీణించడం వంటి అంశాలు కూడా ఒక్కోసారి అకస్మాత్తుగా పడిపోవడానికి కారణాలు కావచ్చు.
వయసు పెరుగుతున్న కొద్దీ వారిలో నిటారుగా నిలబడి ఉండే శక్తి తగ్గుతుంది. వయసు పెరిగిన పెద్దవాళ్లు పడిపోకుండా ఉండటానికి ప్రకృతి ఆ వృద్ధుల్ని కాస్త ముందుకు ఒంగిపోయేలా చేస్తుంది. పడి΄ోయేవాళ్లలో ఇలాంటివాళ్లే ఎక్కువ.
కొన్నిసార్లు గుండె / మెదడు / శరీరంలోని ఇతర అవయవాలు లేదా వివిధ వ్యవస్థల్లోని ఆరోగ్య సమస్యలు నయం కావడం కోసం వాళ్లు వాడే మందుల కారణంగా కూడా వాళ్లు తూలిపడిపోయే ప్రమాదమూ ఉంటుంది.
కొన్నిసార్లు నరాలకు సంబంధించిన కారణాలతోనూ పడిపోయే అవకాశాలుంటాయి.
ఒక్కోసారి కారణాలేమీ లేకుండానే ముందుకో వెనక్కో పడిపోయే ప్రమాదం ఉంది. మాట్లాడుతూ నడుస్తున్నప్పుడు ఇలాంటి ప్రమాదం జరగవచ్చు. అందుకే పెద్దవయసు వారు మాట్లాడుతూ నడవకూడదు. నడుస్తూ మాట్లాడకూడదు.
వృద్ధాప్యంలో పడిపోవడానికి కారణమయ్యే మరికొన్ని ఆరోగ్య సమస్యలు
పోష్చరల్ హై΄ోటెన్షన్ (లో బీపీ) : అకస్మాత్తుగా బీపీ తగ్గిపోయే కండిషన్ ఇది. ఇలా జరగడానికి అనేక కారణాలు ఉంటాయి. సాధారణంగా శరీరంలోని ద్రవాలూ లేదా ఖనిజ లవణాల మోతాదులు తగ్గడం వల్ల ఇలా జరగవచ్చు. అలాగే కొందరిలో ఏదైనా మందు/ఔషధం తీసుకోగానే ఇలా జరగడానికి అవకాశముంది. ఒక్కోసారి పెద్దవాళ్లు తాము కూర్చున్న స్థితి నుంచి అకస్మాత్తుగా పైకి లేవడం లేదా ఉన్నట్టుండి పక్కపై నుంచి లేవడం జరిగినప్పుడు అకస్మాత్తుగా బీపీ పడిపోవచ్చు. ఇలాంటప్పుడు బీపీ 20 హెచ్‌జీ/ఎంఎం కంటే తక్కువగా ఉన్నప్పుడు మెదడుకు చేరాల్సిన రక్తం మోతాదులు కాస్తా అకస్మాత్తుగా తగ్గడం వల్ల పడిపోవచ్చు.
కొందరు నిలబడి మూత్రవిసర్జన చేసేవాళ్లలో ఆ సమయంలోనూ లేదా కొందరిలో అకస్మాత్తుగా దగ్గు రావడం వల్ల కూడా ఒక్కోసారి బీపీ హఠాత్తుగా పడిపోయే ప్రమాదం ఉంది.
సింకోప్ : కొందరు అకస్మాత్తుగా కొద్దిసేపు స్పృహ కోల్పోయినట్లుగా అయిపోతారు. కళ్లు తిరుగుతూ, చూపు తాత్కాలికంగా మసకబారుతుంది. ముఖంలో రక్తపు చుక్కలేనట్లుగా పాలిపోతారు. శరీరమంతా చల్లబడి, ఒళ్లంతా చెమటలు పట్టవచ్చు. దాంతో ఉన్నవారు ఉన్నట్టుగా అకస్మాత్తుగా పడిపోయి, ఎముకలు విరగడం, తలకు గాయం కావడం వంటి ప్రమాదం జరగవచ్చు.
ఇలాంటి వాళ్లలో కొందరు ఒక్కోసారి తమ మూత్రవిసర్జనపై నియంత్రణ కోల్పోయే ప్రమాదమూ ఉంది. ఇలా అకస్మాత్తుగా కళ్లు తిరుగుతూ పడిపోవడాన్ని ‘సింకోప్’ అంటారు. మానసికంగా ఒత్తిడి తీవ్రమైనప్పుడు, మనకు అంతగా ఇష్టం లేని దృష్యాలనూ / అంశాలనూ చూసినప్పుడు (ఎవరైనా గాయపడటం లేదా రక్తస్రావం అవుతుండటం, ఇంకెవరైనా తీవ్రమైన నొప్పితో బాధపడుతుండటం వంటి తమకు ఆమోదం కాని అన్‌ప్లెజెంట్ విజువల్ స్టిములై కారణంగా) ఇలా జరగవచ్చు.
వర్టిగో : ఒక్కోసారి కొందరిలో కళ్లు తిరిగినట్లుగా అయి΄ోయి ఒళ్లు స్వాధీనం తప్పి పడిపోవచ్చు. సాధారణంగా లోపలిచెవి లేదా బ్రెయిన్ స్టెమ్‌లో ఉన్న వ్యాధుల కారణంగా ఇలా జరగడానికి అవకాశాలెక్కువ.
ఫిట్స్ : ఒక్కోసారి కొందరిలో ఫిట్స్ రావడం / స్పృహ కోల్పోవడం / శరీరమంతా కుదుపునకు (జెర్క్) లోనుకావడం వల్ల.
ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ ఎటాక్ (టీఐఏ) : ఒక్కోసారి కొందరిలో తక్కువ తీవ్రతతో పక్షవాతం వచ్చి, మళ్లీ వెంటనే సాధారణ స్థితికి వచ్చేస్తారు. ఈ కండిషన్‌ను వైద్య పరిభాషలో ‘ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ ఎటాక్’ అంటారు. అకస్మాత్తుగా పడిపోవడానికి ఇది కూడా ఒక కారణం. ఇలాంటి సందర్భాల్లో కొందరిలో సరిగా మాట రాకపోవడం, మాటలు ముద్దగా రావడం, కాళ్లూ, చేతులు తాత్కాలికంగా బలహీనంగా మారడం జరగవచ్చు.
పార్కిన్‌సన్ డిసీజ్ : ఈ ఆరోగ్య సమస్య ఉన్నవాళ్లలో వణుకు కారణంగా శరీరానికి సరైన బ్యాలెన్స్ లేకపోవడంతో పడిపోవడం జరుగుతుంది. వీళ్లలో శరీరం కదలికలు నెమ్మదించడం వల్ల కూడా వారు పడిపోయే ప్రమాదముంటుంది.
వెన్నెముక / నరాలు / కండరాల వ్యాధుల వల్ల ఒక్కోసారి కాళ్లూ చేతులు బలహీనమైపోయినప్పుడు.
దేహంలో సోడియమ్, పొటాషియమ్ వంటి లవణాలూ లేదా చక్కెర మోతాదులు తగ్గిపోయినప్పుడు.
చాలా అరుదుగా మెదడులో కణుతులు, మతిమరపు, సైకోసిస్ వంటి అంశాలు కూడా పడిపోడానికి కారణాలు కావచ్చు.
అకస్మాత్తుగా పడిపోవడాన్ని నివారించండి ఇలా...పడిపోవడానికి సరైన కారణాలను తెలుసుకొని... వాటిని సరిదిద్దుకోవాలి. అంటే... పడుకున్నవారు / కూర్చున్నవారు అకస్మాత్తుగా లేవడం వల్ల పడి΄ోవడం జరుగుతున్నా అలా ఉన్నపళంగా లేవడం సరికాదు. పడుకున్న వారు తాము పక్క నుంచి లేస్తున్నప్పుడు మొదట మెల్లగా ఒక పక్కకు ఒరుగుతూ... ఆ తర్వాత లేచి కూర్చుని... అప్పుడు మెల్లగా నిల్చోవాలి. కూర్చున్న వారు కూడా ఒకేసారి కుర్చీలోంచి లేవకుండా... మెల్లగా లేని నిలబడాలి.
ఆరోగ్య కారణాల వల్ల ఇలా పడిపోయే మెడికల్ హిస్టరీ ఉన్నవారు అందుకు కారణాన్ని తెలుసుకోడానికి అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకుని, సమస్యను గుర్తించి అందుకు అవసరమైన చికిత్స తీసుకోవడం ద్వారా.
అకస్మాత్తుగా పడిపోవడానికి నరాలకు సంబంధించిన (న్యూరలాజికల్) కారణాలుంటే అవేమిటో తెలుసుకుని, తగిన చికిత్స తీసుకోవాలి.
ఉపకరణాలు వాడటం : అకస్మాత్తుగా పడిపోయే వారు తమకు అవసరమయ్యే ఉపకరణాలు... అంటే చేతికర్ర (వాకింగ్ స్టిక్) / వాకర్ / కళ్లజోడు వంటివి దూరంగా పెట్టుకోకుండా, ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి.
కాస్తంత పెద్ద వయసు మహిళలు హైహీల్స్ తొడగడం సరికాదు. తమకు సురక్షితంగా ఉండే ఫ్లాట్ హీల్ పాదరక్షలు వాడాలి.
కాలి కండరాల బలాన్ని పెంచే వ్యాయామాలు, వాకింగ్ వంటివి చేయడం చాలా రకాల పడి΄ోవడాలను (ఫాల్స్‌ను) నివారిస్తాయి.
ఇతరత్రా మరికొన్ని మార్గాలివి...
చాలా సార్లు పడిపోవడం అన్నది ఇండ్లలోనే జరుగుతుంటుంది. అందువల్ల ఇంటివాతావరణాన్ని పెద్దవారికి ఫ్రెండ్లీగా మార్చడం చాలా మేలు చేస్తుంది. పడకుండా నివారిస్తుంది.
ఇందుకు చేయాల్సిన కొన్ని పనులు...
నాన్‌స్టిక్ మ్యాట్స్ వాడటం.
ఫ్రిక్షన్ బాగా ఉంటే ఫ్లోరింగ్ వేయించడం.
కాలుజారనివ్వని కార్పెట్స్ పరవడం.
గదిలో మంచి వెలుతురు / గాలి వచ్చేలా చేసుకోవడం.
టాయిలెట్స్, బాత్‌రూమ్స్‌లో మంచి పట్టు ఉండటానికి వీలుగా హ్యాండ్ రెయిల్స్ అమర్చుకోవడం, బాత్‌రూమ్ బయట కాలుజారనివ్వని మ్యాట్స్ వాడటం
మరీ అవసరమైతే తప్ప ఎక్కడా ఎక్కకుండా ఉండటం...వంటి జాగ్రత్తలతో పెద్దవారు పడిపోయే ప్రమాదాలను నివారించవచ్చు.
పడిపోయే అవకాశాలు ఎవరిలో ఎక్కువ...
చిన్న చిన్న అడుగులు వేస్తూ, రెండు కాళ్ల మధ్య ఖాళీ తక్కువగా ఉంచేవారు.
నిల్చున్నప్పుడు రెండు కాళ్ల మధ్య ఖాళీ తక్కువగా ఉంచేవారు.
నడిచే సమయంలో కళ్లు మూసుకునేలా ముఖం ఎక్కువగా రుద్దుకునేవారు.
చికిత్స
ఫాల్ క్లినిక్స్ : ఇటీవల చాలా ఆసుపత్రుల్లో ‘ఫాల్ క్లినిక్స్’ ప్రారంభిస్తున్నారు. వీటిలో పడి΄ోయిన వాళ్లకు ఇవ్వాల్సిన చికిత్స అందిస్తుంటారు.
పడిపోయాక తలకు దెబ్బతగిలినప్పుడు తక్షణం న్యూరో సర్జన్ చేత చికిత్సలు అందించాల్సిన అవసరముంటుంది.
ఫ్రాక్చర్స్ వంటివి అయితే ఆర్థో నిపుణులతో చికిత్స అందించాల్సి ఉంటుంది.