మర్చిపోకుండా చికిత్స!
నిర్ధారణ
మతిమరుపును గుర్తించడానికి కొత్తగా పరీక్షలెందుకు... అనిపించడం సహజమే. కానీ శాస్త్రబద్ధంగా చికిత్స చేయాలంటే మతిమరుపును నిర్ధారించే పరీక్షలు చేయాల్సిందే. అవి ఏమిటంటే...
* కుటుంబ చరిత్ర (రక్తసంబంధీకుల్లో ఎవరికైనా అల్జీమర్స్ ఉందేమోననే వివరాలు), ఆహారపు అలవాట్లు, మద్యపానం, ఇతర అనారోగ్యాలకు ఏవైనా మందులు వాడుతుంటే ఆ మందుల వివరాలను పరిశీలిస్తారు. రక్తపోటు, గుండె, ఊపిరితిత్తులు కొట్టుకునే వేగాన్ని గమనిస్తారు. సాధారణ ఆరోగ్యవివరాలను తెలుసుకుంటారు. వీటితోపాటు రక్తం, మూత్ర పరీక్షలు చేస్తారు.
* కండరాల శక్తిని, కంటి కదలికలు, మాట, స్పర్శ, చర్యకు ప్రతిచర్యలు ఎలా ఉన్నాయనేది గమనిస్తారు.
* నరాల వ్యాధి నిపుణులు... పార్కిన్‌సన్స్ (చేతులు, మెడ వణకడం), మెదడులో కణుతులు, మెదడులో నీరు చేరడం, జ్ఞాపకశక్తిని తగ్గించే ఇతర అనారోగ్యాలు, పక్షవాతం వంటివి ఉన్నాయేమోనని పరీక్షిస్తారు. సి.టి.స్కాన్, ఎమ్‌ఆర్‌ఐ పరీక్షలు చేసి బ్రెయిన్ ఇమేజింగ్ స్టడీ చేస్తారు.
* మెంటల్ స్టేటస్ టెస్ట్‌లు... చిన్న చిన్న లెక్కలను పరిష్కరించడం, ఒక విషయాన్ని విడమరిచి చెప్పడం, రోగి చేత ఆ రోజు తేదీ, సమయం, తాను ఎక్కడున్నాననే వివరాలు చెప్పించడం, కొన్ని పదాల పట్టిక ఇచ్చి వాటిని తిరిగి చెప్పించడం వంటి పరీక్షలు చేస్తారు.
* ఇంతగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే మతిమరుపు ఉన్నట్లు నిర్ధారించి తగిన వైద్యం చేస్తారు.