అంటే...? | sakshi health councling | Sakshi
Sakshi News home page

అంటే...?

Published Wed, Nov 16 2016 10:35 PM | Last Updated on Wed, Oct 3 2018 6:52 PM

అంటే...? - Sakshi

అంటే...?

పాలు తాగుతావా?  అంటే?
మందులు  వేసు కున్నావా? అంటే?
నిద్ర వస్తోందా? అంటే?
బ్రష్ చేసుకున్నావా? అంటే?
ఆకలి వేస్తుందా?  అంటే?
అమ్మాయి ఎక్కడకు పోయింది? అంటే?

దేవుడికి దండం  పెట్టుకున్నావా?  అంటే?
ఇప్పుడు మేం మిమ్మల్ని అడుగుతున్నాం
అల్జైమర్స్... ‘అంటే’... మీకు తెలుసా?

ఆధునిక విజ్ఞాన శాస్త్ర పురోభివృద్ధి వల్ల ఇప్పుడు మరిన్ని ఆరోగ్య సౌకర్యాలు, చికిత్స ప్రక్రియల లాంటివి అందివచ్చాయి. దాంతో మనుషుల ఆయుఃప్రమాణం (అంటే బతికి ఉండే కాలం) బాగా పెరిగింది. ఫలితంగా వృద్ధుల సంఖ్య బాగా పెరిగింది. దాంతో వృద్ధాప్యంలో కనిపించే మతిమరపునకు మరింత తీవ్రమైన అల్జైమర్స్ వ్యాధి చాలా ఎక్కువమందిలో కనిపిస్తోంది.

సాధారణంగా వయసు పైబడుతున్న కొద్దీ మతిమరపు సమస్యను వృద్ధులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు. గణాంకాలను పరిశీలస్తే 65 ఏళ్లు -74 ఏళ్ల వయసులో ఉన్న వారిలోని 1.6 శాతం మందిలోనూ, 75 ఏళ్లు - 84 ఏళ్ల వయసు గలిగిన వారిలో 19 శాతం మందిలోనూ... 85 ఏళ్లు పైబడిన వారిలో 40 శాతం మందిలోనూ మతిమరపు చాలా కనిపిస్తుంటుంది. అయితే ఇటీవలి లెక్కల ప్రకారం భారత్‌లో అల్జైమర్స్‌తో బాధపడే రోగుల సంఖ్య 41 లక్షలు. ప్రపంచ రోగుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే... మనదేశం  మూడో స్థానంలో ఉంది. మొదటి స్ధానంలో చైనా, రెండో స్థానంలో అమెరికా ఉన్నాయి. మతిమరపుతో బాధపడుతున్న రోగులందరి లెక్కనూ పరిగణనలోకి తీసుకుంటే.... అందులో కేవలం 25 శాతం మందికి మాత్రమే తాము తీవ్రమైన మతిమరపుతో బాధపడుతున్నామని తెలుసు.

అల్జైమర్స్ అంటే ఏమిటంటే...
మనం ఒక వ్యక్తి పేరుగానీ, వస్తువును గాని తాత్కాలికంగా గుర్తు రాకపోవడాన్ని మతిమరపు అంటాం. కాకపోతే ఈ లక్షణాలు రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది కలిగించేంతగా ఉంటే అది అల్జైమర్స్ వ్యాధి లక్షణం. ముంచుకొస్తున్న ముప్పు ఎవరికీ తెలియడం లేదు. జ్ఞాపకశక్తి అనే చాప కింది నీరులా అది కమ్ముకొస్తోంది. గతంలో కంటే వేగంగా అది తరుముకుంటూ వస్తోంది.

లక్షణాలు: మొదట్లో ఏదో ఒక పదం లేదా పేరు పూర్తిగా మరిచిపోతారు. అయితే ఈ మతిమరపు మీ రోజువారీ జీవితంలోని పనులను ప్రభావితం చేయదు. అంతా సాఫీగానే నడుస్తుంది. కానీ ఒకవేళ ఏదైనా అంశాన్ని రోగి మరచిపోయాడని అనుకుందాం. అతడికి గుర్తు చేశాక కూడా ఆయన పదే పదే అదే అంశాన్ని అడుగుతున్నాడనుకోండి. అది అల్జైమర్స్ లక్షణం. తాను చదివిన, చూసినదాన్ని కూడా నిమిషాల్లో మరచిపోతాడు. తాను చూసిన వారినీ, తాను తిరిగిన ప్రదేశాలనూ గుర్తుపట్టలేడు. అలా వాళ్లు దారులు, తేదీలు, నెలలు, పండగలు, వారు గతంలో అభ్యసించిన విద్యలు (అంటే కార్ డ్రైవింగ్ లాంటివి కూడా) మరచిపోతారు.

మరింత ముదిరాక...
వ్యాధి మరీ పెరిగిపోయాక... వారు ఫోన్ ఉన్నదనే అంశమే గుర్తుండదు. దాంతో ఏం చేయగలమనే విషయాన్నీ మరచిపోతారు. అడ్రస్‌లనూ గుర్తుపెట్టుకోలేరు. అంతెందుకు... తాము రోజూ తిరిగే దారులనూ, తమ ఇంటిలోని మార్గాలను  మరచిపోతారు. తాము బట్టలు ధరించాలన్న విషయమూ వారికి గుర్తుండదు. పుట్టినరోజులూ, ముఖ్యమైన సందర్భాలూ, పనిచేసిన ప్రదేశాలూ... (అంటే రిమోట్ పాస్ట్) మాత్రం గుర్తుంచుకుంటారు. ఇలాంటి పాత జ్ఞాపకాలను అంత తేలిగ్గా మరచిపోరు. కొత్తగా తమ మెదడులోకి వచ్చి చేరిన జ్ఞాపకాలనే ఎక్కువగా మరచిపోతుంటారు. కుటుంబ సభ్యుల పేర్లనే అనేమిటి... వారెవరో, వారితో బంధుత్వం ఏమిటో కూడా తెలియకుండా పోయే పరిస్థితి. తాము తినడం, తాగడం అనే మాట మాత్రమే కాదు... అసలు టాయిలెట్‌కు వెళ్లాలనే విషయాన్నీ మరచిపోతారు. ఒక్కమాటలో చెప్పాలంటే వాళ్ల జీవితమంతా డైరీ రాశారనుకుంటే... అది అక్షరాలన్నీ చెరిగిపోయిన జీవనగ్రంథం అవుతుంది. మెదడులోని జ్ఞాపకాల ఫలకం... ఒక తుడిచిన పలకలా అయిపోతుంది.

మరిన్ని అనర్థాలు...
ఒక్క క్షణం విడిచిపెడితే మళ్లీ దొరకని విధంగా తప్పిపోవచ్చు  ఎన్నెన్నో చిత్రమైన భ్రాంతులకు (హెల్యూసినేషన్స్‌కు) గురికావచ్చు  త్వరత్వరగా అసహనానికి (ఇరిటేషన్‌కు) లోను కావచ్చు  ప్రవర్తనలో మార్పులు రావచ్చు  నిద్రకు సంబంధించిన రుగ్మతలు కనిపించవచ్చు.

ఒక్కొక్కరిలో ఒక్కోలా...
తీవ్రతను ముదరడానికి పట్టే వ్యవధి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉండవచ్చు. కొందరిలో చాలా వేగంగా పరిస్థితి విషమిస్తే... మరికొందరిలో అల్జైమర్స్‌లో వచ్చే శాశ్వత మతిమరపు మరికాస్త ఆలస్యంగా రావచ్చు. రోగి వయసు, ఆరోగ్య పరిస్థితి వంటి అంశాలపై ఆధారపడి ఈ వ్యవధి 4 - 20 ఏళ్ల వరకు ఉంటుంది.

కారణాలు: అల్జైమర్స్‌కు అసలు కారణాలు ఇంకా తెలియదు. అయితే మెదడులో అమైలాయిడ్, టావో అనే ప్రోటీన్ల సంఖ్య పెరగడం అన్నది దీనికి ఒక కారణంగా పరిశోధకులు భావిస్తున్నారు. దాంతో అల్జైమర్స్ రోగుల్లో మెదడు క్రమంగా కుంచించుకుపోతుంటుంది. దాంతో మెదడు కణాలు క్రమంగా నశించిపోతుంటాయి. అయితే ఎందుకిలా జరుగుతుందన్న అంశంపై ఇప్పటికీ పూర్తి స్పష్టత లేదు. ఈ విషయంపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే లభ్యమవుతున్న ప్రాథమిక సమాచారాన్ని బట్టి పర్యావరణ అంశాలతో పాటు, జన్యుపరమైన కారణాలూ ఈ వ్యాధికి దోహదపడుతున్నాయని కొందరు నిపుణుల అభిప్రాయం.

నిర్ధారణ ఇలా... : అల్జైమర్స్ వ్యాధి నిర్ధారణ కేవలం ఒక నిర్దిష్టమైన పరీక్షతో మాత్రమే జరపడం అన్నది  కుదరదు. రోగి ఆరోగ్య చరిత్రనూ, అనేక న్యూరలాజికల్ పరీక్షలనూ, మెమరీ స్కేల్‌పై రోగి మరపు స్థాయులను అంచనా వేయడం, బ్లడ్ ఎలక్ట్రోలైట్స్, క్యాల్షియమ్, థైరాయిడ్ ప్రొఫైల్, విటమిన్ బి-12 పాళ్లు తెలుసుకోడానికి చేసే అనేక రకాల రక్తపరీక్షలు చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇతర అంశాలను రూల్ అవుట్ చేయడానికి హెచ్‌ఐవీ వంటి పరీక్షలూ చేయాల్సి వస్తుంది. అది మెదడుకు నీరుపట్టడం వల్ల వచ్చిన సమస్య కాదని తెలుసుకోడానికీ (ఎందుకంటే హెచ్‌ఐవీలో డిమెన్షియా చాలా సాధారణం కాబట్టి ఆ అంశాన్ని రూల్ అవుట్ చేయడానికీ), అలాగే మెదడులో గడ్డలూ, రక్తపు గడ్డలు (క్లాట్స్) లేవని తెలుసుకోడానికీ... ఎమ్మారై (బ్రెయిన్) పరీక్ష చేయాల్సి ఉంటుంది. మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి పెట్ స్కాన్ వంటి పరీక్ష కూడా కొన్ని సమయాల్లో అవసరం. ఇక ఆ సమస్య వల్ల పొంచి ఉన్న ముప్పు తీవ్రతను అంచనా వేయడానికి జెనెటిక్ టెస్టింగ్ వంటి పరీక్షలు అవసరం.

మందులు: ప్రస్తుతం అల్జైమర్స్ వ్యాధిని తగ్గించేందుకు (క్యూర్ చేసేందుకు) మందులు లేవు. అయితే ఒకవేళ అల్జైమర్స్ వస్తే దాని తీవ్రత ముదరడానికి పట్టే సమయాన్ని వీలైనంతగా ఆలస్యం చేసేందుకు మాత్రమే మందులు ఉన్నాయి. అలాగే లక్షణాల తీవ్రతను తగ్గించడం కోసం మందులు ఉపయోగపడతాయి. 

రోగికి ఉన్న చిరు (మైల్డ్), లేదా ఓ మోస్తరు (మోడరేట్) లక్షణాల ఆధారంగా డోనెపెజిల్, రివాస్టిగ్మిన్, మెమాంటిన్, గ్యాలంటమైన్ వంటి మందులు ఇప్పుడు మన దేశంలోనూ లభ్యమవుతున్నాయి. మెదడులోని అన్ని కార్యకలాపాలను నిర్వహించే ఎసిటైల్ కోలిన్ అనే రసాయనం పాళ్లను సరైన స్థాయుల్లో ఉంచడానికి ఈ మందులు బాగా ఉపయోగపడతాయి. అలాగే ప్రవర్తనలో తేడాలను అరికట్టడానికీ, నిద్ర సంబంధమైన సమస్యలను చక్కబరచడానికీ పైన పేర్కొన్న మందులతో పాటు ఇతర మందులు కూడా అవసరం. అయితే మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు, జింకో బైలోబా, బాగా పనిచేస్తాయని అందరూ అనుకుంటున్నట్లుగా పేరు పొందిన ‘న్యూరో ప్రొటెక్టివ్ మందులు’ ఏ మాత్రం ఉపయోగపడవు. కాగా, అల్జైమర్స్ అసలు రాకుండానే నివారించడం కోసం వ్యాక్సిన్‌ను రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

నివారణ :  అధిక రక్తపోటును నివారించడం, డయాబెటిస్‌నూ, బీపీని ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవడం, పొగతాగే అలవాటును పూర్తిగా మానేయడం వంటివి  చాలావరకు అల్జైమర్స్ నివారణకు చాలా ప్రధానం

మంచి వ్యాయామం చేయడం... మెదడుకు మేత చేకూర్చే సుడోకు, వీడియోగేమ్స్, పజిల్స్ పూర్తి చేయడం, ఒక గమ్యాన్ని వేర్వేరు మార్గాల ద్వారా చేరుకుంటూ ఉండటం వంటివి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.మామూలుగా కంటే మరో రెండు భాషలు ఎక్కువగా మాట్లాడేవారికి అల్జైమర్స్ వచ్చే అవకాశాలు తక్కువ.

ఆహారం ద్వారా నివారణ...
బాదాము, వాల్‌నట్, ఆలివ్ ఆయిల్, తాజా ఆకుకూరలు పుష్కలంగా తినడం అల్జైమర్స్ నివారణకు బాగా తోడ్పడుతుంది.డార్క్ కలర్ చాక్లెట్లు కూడా అల్జైమర్స్‌ను నివారిస్తాయి. అయితే మితిమీరి వాటిని తినడం అంత మేలు చేకూర్చదు. తక్కువ మోతాదులో కాఫీ, గ్రీన్ టీ వంటివి అల్జైమర్స్ ముప్పును నివారిస్తాయి.ఇక మరీ ముఖ్యమైన అంశం ఏమిటంటే... అల్జైమర్స్ వ్యాధి బారిన పడే రోగులను సంరక్షించే కుటుంబ సభ్యులకు నిపుణుల నుంచి, మానసిక వైద్యుల నుంచి సూచనలు అవసరం. ఇలాంటి రోగుల చికిత్సలో వారి భూమిక చాలా కీలకం.

మరికొన్ని  ప్రధాన లక్షణాలివే...
సంఘటనలు, అపాయింట్‌మెంట్స్ మరచిపోతుంటారు. వ్యక్తిగతమైన వస్తువులను గుర్తుపెట్టుకోలేరు. ఇతరులను నిందిస్తుంటారు. అడిగిన ప్రశ్ననే పదే పదే అడుగుతుంటారు  క్రమేపీ మాట్లాడే సామర్థ్యాన్ని, రాసే సామర్థ్యాన్ని కోల్పోతారు. రాత, మాట అస్పష్టంగా ఉండవచ్చు  ఏకాగ్రతను కోల్పోవడంతో పాటు చదవడం, రాయడం, గతంలో ఆసక్తి పెంచుకున్న అంశాలపై అదే స్థాయి ఆసక్తి ఉండదు. చిన్ననాటి లెక్కలనే చేయలేకపోవచ్చు. కొత్తగా వచ్చే పరిజ్ఞానాలను (కంప్యూటర్స్‌లో వచ్చే అడ్వాన్స్‌మెంట్స్)ను అందిపుచ్చుకోలేకపోవచ్చు  ఆలోచన, రీజనింగ్ విషయంలో... చిన్న చిన్న విషయాలలో సైతం నిర్ణయాలు తీసుకోలేరు. చిన్న నిర్ణయాల విషయంలోనూ ఇతరులపై ఆధారపడతారు  రద్దీగా ఉండే వేళల్లో దారి తప్పిపోవడం, ఇంటి దారి మరచిపోవడం, రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు కలిగే ప్రమాదాలను గుర్తించి, తప్పుకోలేరు  వ్యక్తిగత ప్రణాళికలు వేసుకోలేకపోవడం, భావోద్వేగాలు లేకపోవడం లేదా కుంగుబాటు, చీకాకు ఆతృత లేదా దూకుడు స్వభావం  వివిధ సామాజిక కార్యకలాపాలకు దూరం కావడం  బంధువులనూ, తన ఉద్యోగులను అనవసరంగా అనుమానించడం వంటివి కూడా చేస్తారు.

డా. బి. చంద్రశేఖర్ రెడ్డి సీనియర్ న్యూరాలజిస్ట్
సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం.12, బంజారాహిల్స్, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement