Pneumonia Causes, Symptoms, Diagnosis And Treatment - Sakshi
Sakshi News home page

Pneumonia: అశ్రద్ధ చేస్తే ‘ఊపిరి’ తీస్తుంది

Published Mon, Dec 12 2022 8:15 PM | Last Updated on Mon, Dec 12 2022 9:33 PM

Pneumonia Causes, Symptoms, Diagnosis And Treatment - Sakshi

గుంటూరు మెడికల్‌: ఊపిరితిత్తులకు వచ్చి, ప్రాణాలు తీసే వ్యాధుల్లో న్యుమోనియా ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం అప్పుడే పుట్టిన పిల్లల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు న్యుమోనియా వ్యాధితో చనిపోతున్నారు. ప్రతి ఏడాది ఐదేళ్లలోపు పిల్లలు రెండు మిలియన్ల మంది ఈ వ్యాధి బారిన పడి చనిపోతున్నారు. భారత దేశంలో ప్రతి ఏడాది రెండులక్షల మంది పిల్లలు ఈ వ్యాధి సోకి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ వ్యాధి నివారణకు ఉన్న టీకాను వినియోగించటం ద్వారా ఒక మిలియన్‌ పిల్లల మరణాలు తగ్గించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిస్తుంది. చలికాలంలో న్యుమోనియా సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధి బారినపడకుండా ఉండవచ్చని వైద్య నిపుణులు  తెలియజేస్తున్నారు.  

వ్యాధి లక్షణాలు... 
ఈ వ్యాధి అన్ని వయస్సుల వారికి వస్తుంది. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లుదాటిన వారిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దగ్గు, కళ్లె పడటం, కళ్లె పసుపు లేదా పచ్చగా ఉండటం, దగ్గినప్పుడు రక్తం పడటం, ఆయాసం, అలసట, ఛాతీలో నొప్పి, ఊపిరి పీల్చుకోవటం కష్టంగా ఉండటం, జ్వరం, చలి, వణుకు ఉండటం, తలనొప్పి, కండరాల నొప్పులు, చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవటం లేదా తక్కువగా కొట్టుకోవటం, వికారం, వాంతులు, విరేచనాలు,  పిల్లలు పాలు తాగలేకపోవటం తదితర లక్షణాలు వ్యాధి సోకిన వారిలో కనిపిస్తాయి. చలికాలంలో న్యూమోనియా కేసులు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఎక్కువ. ఆడవారితో పోల్చితే మగవారిలోనే వ్యాధి బాధితులు ఎక్కువగా ఉంటున్నారు. 

కారణాలు... 
వ్యాధి ఉన్న వ్యక్తి ముఖానికి కర్చీఫ్‌ పెట్టుకోకుండా దగ్గినా, తుమ్మినా వారి నోటి తుంపర్ల ద్వారా పక్కన ఉండే వారికి వ్యాధి సోకుతుంది. వైరస్, బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందుతుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవారిలో, దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారిలో, పొగతాగేవారిలో, మద్యపానం చేసేవారిలో, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి ఈ వ్యాధి సోకే ప్రమాదం అధికం. 

నిర్ధారణ... 
ఛాతీ ఎక్సరే, సీటీ స్కాన్‌ పరీక్ష, రక్తపరీక్షలు, కళ్లె పరీక్ష, బ్క్రాంకోస్కోపీ, పల్స్‌ ఆక్సీమెట్రీ, ఫ్లూయిడ్‌ కల్చర్‌ పరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారణ చేస్తారు. 

వ్యాధి బాధితులు... 
ఉమ్మడి గుంటూరు జిల్లాలో 200 మంది, పిల్లల వైద్య నిపుణులు, 300 మంది పల్మనాలజిస్టులు ఉన్నారు. ఒక్కో వైద్యుడి వద్దకు ప్రతిరోజూ ఇద్దరు బాధితులు చికిత్స కోసం వస్తున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు.


నివారణ చర్యలే ఉత్తమం.. 

వ్యాధి రాకుండా ముందస్తుగా పుట్టిన ప్రతి బిడ్డకు వ్యాక్సిన్‌లు చేయించాలి. వ్యాధి సోకకుండా నివారించే వ్యాక్సిన్‌లు పిల్లలకు, పెద్దవారికి అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఉచితంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పిల్లలకు వ్యాక్సిన్లు వేయిస్తుంది. విచ్చలవిడిగా యాంటిబయోటిక్స్‌ వినియోగించకూడదు. పబ్లిక్‌ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు ముఖానికి మాస్క్‌ అడ్డుపెట్టుకోవటం చాలా మంచిది. 
– డాక్టర్‌ పి.పద్మలత, జీజీహెచ్‌ పిల్లల వైద్య విభాగాధిపతి


జాగ్రత్తలు తీసుకోవాలి... 

వ్యాధి బాధితులు త్వరగా కోలుకోవటానికి వైద్యులు రాసిన మందులు క్రమం తప్పకుండా వాడాలి. ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. ధూమపానం చేసేవారికి దూరంగా ఉండటంతోపాటుగా మద్యపానం, ధూమపానం చేయకూడదు. దగ్గినా, తుమ్మినా ముఖానికి కర్చీఫ్‌ అడ్డుపెట్టుకోవాలి. తరచుగా చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. వారంలో కనీసం ఐదురోజులపాటు వ్యాయామం చేయాలి.               
– డాక్టర్‌ గోపతి నాగేశ్వరరావు, పల్మనాలజిస్ట్, గుంటూరు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement