కంజెనిటల్‌ గ్లుకోమా: ఒకసారి వస్తే.. జీవితాంతం పరీక్షలు చేయించుకోవాల్సిందేనా? | Does the pupil have watery eyes?do you know about Congenital glaucoma: | Sakshi
Sakshi News home page

కంజెనిటల్‌ గ్లుకోమా : ఒకసారి వస్తే.. జీవితాంతం పరీక్షలు చేయించుకోవాల్సిందేనా?

Published Tue, Dec 17 2024 3:09 PM | Last Updated on Tue, Dec 17 2024 3:20 PM

Does the pupil have watery eyes?do you  know about Congenital glaucoma:

 కంటిపాపకు  నీటి కాసులున్నాయా?

కంటిలో ఉండే ఓ ద్రవం తాలూకు ఒత్తిడి పెరగడం వల్ల కంటి నరం (ఆప్టిక్‌ నర్వ్‌) దెబ్బతిని చూపు కోల్పోయే పరిస్థితిని గ్లుకోమా (నీటికాసుల జబ్బు) అంటారన్న విషయం తెలిసిందే. చిన్న పిల్లల్లోనూ పుట్టుకతో వచ్చే కారణాలతో గ్లుకోమా వస్తే, దాన్ని కంజెనిటల్‌  గ్లుకోమాగా చెబుతారు. గతంలో కాస్త అరుదుగా కనిపించే ఈ కేసులు ఇటీవల  విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కంజెనిటల్‌ గ్లుకోమా అంటే ఏమిటి, దాని లక్షణాలూ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సల వంటి అంశాలపై అవగాహన కోసమే ఈ కథనం.  

కన్ను ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతూ... కంటిలో ప్రవహించే ‘యాక్వస్‌ హ్యూమర్‌’ అనే ఒక ద్రవం సరైన రీతిలో ఎప్పటికప్పుడు ఒక డ్రైనేజ్‌ యాంగిల్‌ ద్వారా బయటకు ప్రవహిస్తూ ఉంటుంది.  కొంతమంది చిన్నారుల్లో ఈ యాక్వస్‌ హ్యూమర్‌ ప్రవహించాల్సిన డ్రైనేజీ యాంగిల్‌ సరిగా అభివృద్ధి కాదు. దాంతో యాక్వస్‌ హ్యూమర్‌ బయటకు ప్రవహించలేక అక్కడే చిక్కుబడి΄ోతుంది. దాంతో కంటిలో ఒత్తిడి పెరిగి, కంటి నరంపైన కూడా ఒత్తిడి పెరిగి కంటి నరం దెబ్బతింటుంది. ఇలా కంటిలోని యాక్వస్‌ హ్యూమర్‌ బయటకు వెళ్లలేక ఒత్తిడి పెరిగి చూపు కోల్పోయే పరిస్థితినే ‘కంజెనిటల్‌ గ్లుకోమా’ లేదా చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చే గ్లుకోమా అంటారు. 

ఎప్పుడు బయటపడుతుంది?
కంజెనిటల్‌ గ్లుకోమా ముఖ్యంగా రెండు రకాలు. మొదటిది ప్రైమరీ కంజెనిటల్‌ గ్లుకోమా, రెండోది సెకండరీ కంజెనిటల్‌ గ్లుకోమా. ప్రైమరీ కంజెనిటిల్‌ గ్లుకోమాలో ఇతరత్రా అబ్‌నార్మాలిటీస్‌ ఉండవు. సెండకరీ కంజెనిటల్‌ గ్లుకోమాలో కార్నియాకు, ఐరిస్‌లకు సంబంధించిన అబ్‌ నార్మాలిటీస్‌ కూడా ఉంటాయి.  ఇక ప్రైమరీ కంజెనిటల్‌ గ్లుకోమాలో వయసును బట్టి మరో మూడు రకాలుంటాయి. అవి... పుట్టుకతోనే వస్తే దాన్ని కంజెనిటల్‌ గ్లుకోమా. పుట్టిన మూడేళ్లప్పుడు  (0 – 3)  బయట పడేవి ఇన్‌ఫెంటైల్‌ గ్లుకోమా. మూడేళ్ల తర్వాతది జువెనైల్‌ గ్లుకోమా. 

లక్షణాలు...  
కొన్ని లక్షణాలను బట్టి పిల్లల్లో కంజెనిటల్‌ గ్లుకోమా ఉందేమోనని సాధారణంగా అనుమానిస్తుంటారు. ఉదాహరణకు పిల్లల కంట్లోంచి అదేపనిగా ఎక్కువగా నీరు స్రవిస్తున్నా, కొద్ది΄ాటి వెలుతురునూ పిల్లలు భరించలేక΄ోతున్నా లేదా కాంతి పడగానే కన్ను గట్టిగా మూయడం లేదా కనుగుడ్డు పెద్దదిగా మారడం,  కంట్లోని నల్ల΄ాప మసకగా మారిపోతున్నా పిల్లల్లో కంజెనిటల్‌ గ్లుకోమా ఉందేమోనని అనుమానించాలి. వీటన్నింటిలోనూ కనుగుడ్డు పరిమాణం (సైజ్‌) పెద్దగా మారి΄ోతుండటాన్ని తీవ్రంగా పరిగణించాలి. ఈ లక్షణాలతో పాటు పిల్లలు అదేపనిగా ఏడుస్తుండటం, తరచూ వాంతులు చేసుకుంటుండటం, ముఖ్యంగా తిన్న వెంటనే ఇలా జరుగు తుంటే తక్షణం కంటి వైద్యనిపుణులకు తప్పనిసరిగా చూపించాలి. 

నిర్ధారణ ఇలా... ∙కంట్లో ఉండే ఇంట్రా ఆక్యులార్‌ ప్రెషర్‌ను కొలవడం ∙కంట్లోని నల్ల΄ాప వ్యాసాన్ని కొలవడం ∙కంటోని నల్ల΄ాప ఎంత స్పష్టంగా ఉందో చూడటం ∙కనుగుడ్డు మొత్తం పరిమాణం (యాగ్జియల్‌ లెంగ్త్‌)

కొలవడం కంటి నరం, కంటి డిస్క్‌కు జరిగిన నష్టాన్ని తెలుసుకోవడం కంటిలో దృష్టిలోపాలు ఏవైనా ఉన్నాయేమో తెలుసుకోవడం ∙యాక్వియస్‌ హ్యూమర్‌ బయటకు వెళ్లే డ్రైనేజీ యాంగిల్‌ను అంచనా వేయడం కోసం ‘గోనియోస్కోపీ’ అనే పరీక్షను నిర్వహించడం. 

సర్జికల్‌ చికిత్సలు... 
ఇందులో యాంగిల్‌ సర్జరీ, ఫిల్టరేషన్‌ సర్జరీ, డ్రైయినేజ్‌ సర్జరీ అనే మూడు అంశాల కోసం సర్జరీలు జరుగుతాయి. 

యాంగిల్‌ సర్జరీ కోసం గోనియాటమీ, ట్రాబెక్యులాటమీ అనే శస్త్రచికిత్సలు చేస్తారు.  కార్నియా స్పష్టంగా (క్లియర్‌గా) ఉన్నవాళ్లలో గోనియాటమీ అనే శస్త్రచికిత్స చేస్తారు. ఇందులో 70% వరకు మంచి ఫలితాలే వస్తాయి ∙కార్నియా మసకగా ఉన్నవాళ్లలో ట్రాబ్యెక్యులాటమీ అనే శస్త్రచికిత్స చేస్తారు ∙ఇంకా కొంతమందిలో ఫిల్టరింగ్‌ ఆపరేషన్స్‌ అనే ట్రాబెక్యులెక్టమీ, క్లియరెక్టమీ అనే శస్త్రచికిత్సలూ చేస్తారు ∙డ్రైయినేజ్‌ ప్రొసీజర్‌ కోసం షంట్‌ సర్జరీ / వాల్వ్‌ సర్జరీ అనేది చేస్తారు ∙చికిత్స కోసం పిల్లలను బాగా ఆలస్యంగా తీసుకువచ్చినప్పుడు వాళ్లలో క్రైయో లేదా డయోడ్‌ లేజర్‌ అనే ప్రక్రియలతో చికిత్స అందిస్తారు. ఈ చికిత్సలకు తోడు... పిల్లల్లో రెఫ్రాక్టివ్‌ ఎర్రర్స్‌ ఉన్నప్పుడు వాళ్లకు కంటి అద్దాలు ఇస్తారు. 

కొందరిలో ఒక కన్ను మూసి, ఒక కన్ను తెరచి ఉంచే ప్యాచింగ్‌ /ఆంబ్లోపియా చికిత్సలు అందిస్తారు. జెనెటిక్స్‌ విభాగంలోని ఇప్పుడు వచ్చిన పురోగతితో ఈ తరహా జెనెటికల్‌ సమస్యలకు మూడు రకాల జన్యువులు కారణం అని తెలుసుకున్నారు. తల్లిదండ్రుల్లో ఈ  జన్యువులు ఉంటే, పుట్టిన  పిల్లలను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి.  ఒకసారి గ్లుకోమా శస్త్రచికిత్స అయ్యాక... ఆ పిల్లలు క్రమం తప్పకుండా జీవితాంతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలి. 

వంశపారంపర్యమా... కాదా?
ఇది పూర్తిగ వంశ పారంపర్యమే అని చెప్పలేకపోయినప్పటికీ... తల్లిదండ్రులిద్దరిలోనూ గ్లుకోమా ఉంటే... వారి పిల్లల్లో ఛైల్డ్‌హుడ్‌ గ్లుకోమా వచ్చే అవకాశాలు 10 శాతం వరకు  ఉంటాయి. ఒకవేళ తలిదండ్రులిద్దరిలో ఒకరికి గ్లుకోమా ఉంటే వారి తొలిచూలు, మలిచూలులో పుట్టిన పిల్లల్లో కంజెనిటల్‌ గ్లుకోమా వచ్చే అవకాశాలు 5 శాతం మందిలో ఉంటాయి. ఒకవేళ పుట్టిన తొలిచూలు, మలిచూలు పిల్లల్లో కంజెనిటల్‌ గ్లుకోమా ఉంటే... ఆ తర్వాత పుట్టే పిల్లల్లో గ్లుకోమా వచ్చే అవకాశాలు 25 శాతం మేరకు ఉంటాయి. కంజెనిటల్‌ గ్లుకోమా నిర్ధారణ అయితే...  దానికి శస్త్రచికిత్స చేయడమన్నదే ప్రధానంగా అందించాల్సిన చికిత్స. గ్లుకోమా ఉన్నట్లు తేలగానే డాక్టర్లు ఇచ్చే చుక్కల మందులు కేవలం తాత్కాలిక ఉపశమనం కోసం మాత్రమే. ఇవి కంట్లో పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడమే కాకుండా కార్నియల్‌ క్లారిటీ కోసం ఉపయోగపడతాయి. ఈ కార్నియల్‌ క్లారిటీ వల్ల చిన్నారులకు ఏ ఆపరేషన్‌ ఉపయోగపడుతుందో నిర్ధారణ చేయవచ్చు. ఈ శస్త్రచికిత్సలో... కంట్లో యాక్వియస్‌ హ్యూమర్‌  వల్ల పెరుగుతున్న ఒత్తిడంతా తొలగి΄ోయేలా... ఆ ద్రవాన్నంతా బయటకు పంపుతారు (అంటే డ్రైయిన్‌ చేస్తారు).  అయితే... కంట్లోని ఆ ఒత్తిడి తొలగించడానికి ఒక్కోసారి ఒకటి కంటే ఎక్కువ శస్త్రచికిత్సా విధానాలు (మల్టిపుల్‌ సర్జికల్‌ ప్రొసిజర్స్‌) అవసరం పడవచ్చు. 

డాక్టర్‌  రవికుమార్‌ రెడ్డి సీనియర్‌  కంటి వైద్య నిపుణులు 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement