glaucoma
-
కంజెనిటల్ గ్లుకోమా: ఒకసారి వస్తే.. జీవితాంతం పరీక్షలు చేయించుకోవాల్సిందేనా?
కంటిలో ఉండే ఓ ద్రవం తాలూకు ఒత్తిడి పెరగడం వల్ల కంటి నరం (ఆప్టిక్ నర్వ్) దెబ్బతిని చూపు కోల్పోయే పరిస్థితిని గ్లుకోమా (నీటికాసుల జబ్బు) అంటారన్న విషయం తెలిసిందే. చిన్న పిల్లల్లోనూ పుట్టుకతో వచ్చే కారణాలతో గ్లుకోమా వస్తే, దాన్ని కంజెనిటల్ గ్లుకోమాగా చెబుతారు. గతంలో కాస్త అరుదుగా కనిపించే ఈ కేసులు ఇటీవల విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కంజెనిటల్ గ్లుకోమా అంటే ఏమిటి, దాని లక్షణాలూ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సల వంటి అంశాలపై అవగాహన కోసమే ఈ కథనం. కన్ను ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతూ... కంటిలో ప్రవహించే ‘యాక్వస్ హ్యూమర్’ అనే ఒక ద్రవం సరైన రీతిలో ఎప్పటికప్పుడు ఒక డ్రైనేజ్ యాంగిల్ ద్వారా బయటకు ప్రవహిస్తూ ఉంటుంది. కొంతమంది చిన్నారుల్లో ఈ యాక్వస్ హ్యూమర్ ప్రవహించాల్సిన డ్రైనేజీ యాంగిల్ సరిగా అభివృద్ధి కాదు. దాంతో యాక్వస్ హ్యూమర్ బయటకు ప్రవహించలేక అక్కడే చిక్కుబడి΄ోతుంది. దాంతో కంటిలో ఒత్తిడి పెరిగి, కంటి నరంపైన కూడా ఒత్తిడి పెరిగి కంటి నరం దెబ్బతింటుంది. ఇలా కంటిలోని యాక్వస్ హ్యూమర్ బయటకు వెళ్లలేక ఒత్తిడి పెరిగి చూపు కోల్పోయే పరిస్థితినే ‘కంజెనిటల్ గ్లుకోమా’ లేదా చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చే గ్లుకోమా అంటారు. ఎప్పుడు బయటపడుతుంది?కంజెనిటల్ గ్లుకోమా ముఖ్యంగా రెండు రకాలు. మొదటిది ప్రైమరీ కంజెనిటల్ గ్లుకోమా, రెండోది సెకండరీ కంజెనిటల్ గ్లుకోమా. ప్రైమరీ కంజెనిటిల్ గ్లుకోమాలో ఇతరత్రా అబ్నార్మాలిటీస్ ఉండవు. సెండకరీ కంజెనిటల్ గ్లుకోమాలో కార్నియాకు, ఐరిస్లకు సంబంధించిన అబ్ నార్మాలిటీస్ కూడా ఉంటాయి. ఇక ప్రైమరీ కంజెనిటల్ గ్లుకోమాలో వయసును బట్టి మరో మూడు రకాలుంటాయి. అవి... పుట్టుకతోనే వస్తే దాన్ని కంజెనిటల్ గ్లుకోమా. పుట్టిన మూడేళ్లప్పుడు (0 – 3) బయట పడేవి ఇన్ఫెంటైల్ గ్లుకోమా. మూడేళ్ల తర్వాతది జువెనైల్ గ్లుకోమా. లక్షణాలు... కొన్ని లక్షణాలను బట్టి పిల్లల్లో కంజెనిటల్ గ్లుకోమా ఉందేమోనని సాధారణంగా అనుమానిస్తుంటారు. ఉదాహరణకు పిల్లల కంట్లోంచి అదేపనిగా ఎక్కువగా నీరు స్రవిస్తున్నా, కొద్ది΄ాటి వెలుతురునూ పిల్లలు భరించలేక΄ోతున్నా లేదా కాంతి పడగానే కన్ను గట్టిగా మూయడం లేదా కనుగుడ్డు పెద్దదిగా మారడం, కంట్లోని నల్ల΄ాప మసకగా మారిపోతున్నా పిల్లల్లో కంజెనిటల్ గ్లుకోమా ఉందేమోనని అనుమానించాలి. వీటన్నింటిలోనూ కనుగుడ్డు పరిమాణం (సైజ్) పెద్దగా మారి΄ోతుండటాన్ని తీవ్రంగా పరిగణించాలి. ఈ లక్షణాలతో పాటు పిల్లలు అదేపనిగా ఏడుస్తుండటం, తరచూ వాంతులు చేసుకుంటుండటం, ముఖ్యంగా తిన్న వెంటనే ఇలా జరుగు తుంటే తక్షణం కంటి వైద్యనిపుణులకు తప్పనిసరిగా చూపించాలి. నిర్ధారణ ఇలా... ∙కంట్లో ఉండే ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్‌ను కొలవడం ∙కంట్లోని నల్ల΄ాప వ్యాసాన్ని కొలవడం ∙కంటోని నల్ల΄ాప ఎంత స్పష్టంగా ఉందో చూడటం ∙కనుగుడ్డు మొత్తం పరిమాణం (యాగ్జియల్ లెంగ్త్)కొలవడం కంటి నరం, కంటి డిస్క్‌కు జరిగిన నష్టాన్ని తెలుసుకోవడం కంటిలో దృష్టిలోపాలు ఏవైనా ఉన్నాయేమో తెలుసుకోవడం ∙యాక్వియస్ హ్యూమర్ బయటకు వెళ్లే డ్రైనేజీ యాంగిల్‌ను అంచనా వేయడం కోసం ‘గోనియోస్కోపీ’ అనే పరీక్షను నిర్వహించడం. సర్జికల్ చికిత్సలు... ఇందులో యాంగిల్ సర్జరీ, ఫిల్టరేషన్ సర్జరీ, డ్రైయినేజ్ సర్జరీ అనే మూడు అంశాల కోసం సర్జరీలు జరుగుతాయి. యాంగిల్ సర్జరీ కోసం గోనియాటమీ, ట్రాబెక్యులాటమీ అనే శస్త్రచికిత్సలు చేస్తారు. కార్నియా స్పష్టంగా (క్లియర్‌గా) ఉన్నవాళ్లలో గోనియాటమీ అనే శస్త్రచికిత్స చేస్తారు. ఇందులో 70% వరకు మంచి ఫలితాలే వస్తాయి ∙కార్నియా మసకగా ఉన్నవాళ్లలో ట్రాబ్యెక్యులాటమీ అనే శస్త్రచికిత్స చేస్తారు ∙ఇంకా కొంతమందిలో ఫిల్టరింగ్ ఆపరేషన్స్ అనే ట్రాబెక్యులెక్టమీ, క్లియరెక్టమీ అనే శస్త్రచికిత్సలూ చేస్తారు ∙డ్రైయినేజ్ ప్రొసీజర్ కోసం షంట్ సర్జరీ / వాల్వ్ సర్జరీ అనేది చేస్తారు ∙చికిత్స కోసం పిల్లలను బాగా ఆలస్యంగా తీసుకువచ్చినప్పుడు వాళ్లలో క్రైయో లేదా డయోడ్ లేజర్ అనే ప్రక్రియలతో చికిత్స అందిస్తారు. ఈ చికిత్సలకు తోడు... పిల్లల్లో రెఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉన్నప్పుడు వాళ్లకు కంటి అద్దాలు ఇస్తారు. కొందరిలో ఒక కన్ను మూసి, ఒక కన్ను తెరచి ఉంచే ప్యాచింగ్ /ఆంబ్లోపియా చికిత్సలు అందిస్తారు. జెనెటిక్స్ విభాగంలోని ఇప్పుడు వచ్చిన పురోగతితో ఈ తరహా జెనెటికల్ సమస్యలకు మూడు రకాల జన్యువులు కారణం అని తెలుసుకున్నారు. తల్లిదండ్రుల్లో ఈ జన్యువులు ఉంటే, పుట్టిన పిల్లలను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి. ఒకసారి గ్లుకోమా శస్త్రచికిత్స అయ్యాక... ఆ పిల్లలు క్రమం తప్పకుండా జీవితాంతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలి. వంశపారంపర్యమా... కాదా?ఇది పూర్తిగ వంశ పారంపర్యమే అని చెప్పలేకపోయినప్పటికీ... తల్లిదండ్రులిద్దరిలోనూ గ్లుకోమా ఉంటే... వారి పిల్లల్లో ఛైల్డ్‌హుడ్ గ్లుకోమా వచ్చే అవకాశాలు 10 శాతం వరకు ఉంటాయి. ఒకవేళ తలిదండ్రులిద్దరిలో ఒకరికి గ్లుకోమా ఉంటే వారి తొలిచూలు, మలిచూలులో పుట్టిన పిల్లల్లో కంజెనిటల్ గ్లుకోమా వచ్చే అవకాశాలు 5 శాతం మందిలో ఉంటాయి. ఒకవేళ పుట్టిన తొలిచూలు, మలిచూలు పిల్లల్లో కంజెనిటల్ గ్లుకోమా ఉంటే... ఆ తర్వాత పుట్టే పిల్లల్లో గ్లుకోమా వచ్చే అవకాశాలు 25 శాతం మేరకు ఉంటాయి. కంజెనిటల్ గ్లుకోమా నిర్ధారణ అయితే... దానికి శస్త్రచికిత్స చేయడమన్నదే ప్రధానంగా అందించాల్సిన చికిత్స. గ్లుకోమా ఉన్నట్లు తేలగానే డాక్టర్లు ఇచ్చే చుక్కల మందులు కేవలం తాత్కాలిక ఉపశమనం కోసం మాత్రమే. ఇవి కంట్లో పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడమే కాకుండా కార్నియల్ క్లారిటీ కోసం ఉపయోగపడతాయి. ఈ కార్నియల్ క్లారిటీ వల్ల చిన్నారులకు ఏ ఆపరేషన్ ఉపయోగపడుతుందో నిర్ధారణ చేయవచ్చు. ఈ శస్త్రచికిత్సలో... కంట్లో యాక్వియస్ హ్యూమర్ వల్ల పెరుగుతున్న ఒత్తిడంతా తొలగి΄ోయేలా... ఆ ద్రవాన్నంతా బయటకు పంపుతారు (అంటే డ్రైయిన్ చేస్తారు). అయితే... కంట్లోని ఆ ఒత్తిడి తొలగించడానికి ఒక్కోసారి ఒకటి కంటే ఎక్కువ శస్త్రచికిత్సా విధానాలు (మల్టిపుల్ సర్జికల్ ప్రొసిజర్స్) అవసరం పడవచ్చు. డాక్టర్ రవికుమార్ రెడ్డి సీనియర్ కంటి వైద్య నిపుణులు -
విజృంభిస్తున్న ‘గ్లకోమా’
సాక్షి, సిటీబ్యూరో: అనారోగ్య సమస్యల్లో రెండు రకాలుంటాయి. ముందుగా లక్షణాలను ప్రస్ఫుటింపజేసి చికిత్స ఇచ్చేందుకు అనువైనవి కొన్నయితే... లక్షణాలు లేకుండా శరీరంలో తిష్టవేసి పెద్ద సమస్యగా మారి పెను ప్రమాదాల ను సృష్టించేవి కొన్ని. వైద్య రంగానికి తరచూ సవాలు విసిరేవి రెండో రకమే. అటువంటిదే కంటి వ్యాధి గ్లకోమా అని నిర్వచిస్తున్నారు నగరానికి చెందిన అగర్వాల్ కంటి ఆసుపత్రి రీజనల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ మరుగంటి వంశీధర్. గ్లకోమా వీక్ (మార్చి 10–16) సందర్భంగా ఈ వ్యాధి గురించి ఆయన చెప్పిన విషయాలివీ... అంధత్వ కారకం.. అంతర్జాతీయంగా అంధత్వ కారకాల్లో రెండోది గ్లకోమా. మన దేశంలో అంధత్వం బారిన పడుతు న్న వారిలో అత్యధిక శాతం దీనివల్లే. దాదాపుగా 12 మిలియన్ల మంది దీని బారిన పడతుంటే వీరి లో 1.2 మిలియన్ల మంది అంధులుగా మారుతున్నారు. అంతర్జాతీయంగా 60 మిలియన్ల కేసులు నమోదైతే 2020 నాటికి ఈ సంఖ్య 80 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. అలాగే ప్రస్తుతం అంతర్జాతీయంగా దీనివల్ల అంధులవుతున్న వారి సంఖ్య 3 మిలియన్లుగా అంచనా. తెలుగు రాష్ట్రాల్లో 3.5శాతం మంది గ్లకోమా బారిన పడ్డారని, కేవలం హైదరాబాద్‌లోనే 2.4లక్షల కేసులు నమోదయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. వయసుతో పాటు పెరిగే సమస్య... దీని ప్రభావం 40 సంవత్సరాలు దాటిన వారిలో అధికం. మన దేశంలో 40ఏళ్లు దాటిన ప్రతి 20 మందిలో ఒకరు గ్లకోమా బాధితులుగానో, బాధితులు అయ్యేందుకు అవకాశాలున్న వారిగానో గుర్తించడం జరుగుతోంది. ఈ వ్యాధి కారణంగా కంటి లోపల ఆప్లిక్ నరం డ్యామేజ్ అయి అది క్రమేపీ 60 ఏళ్ల వయసులో అంధత్వానికి దారి తీస్తుంది. ఈ వ్యాధి సాధారణంగా దృష్టి అంచున ప్రారంభం అవుతుంది. దీని లక్షణాలు గుర్తించడం కష్టం కావడంతో దాదాపు 50శాతం మంది బాగా ముదిరాకే దీన్ని తెలుసుకోవడం జరుగుతోంది. వ్యాధి గురించి పూర్తిగా తెలిసే సరికే దృష్టికి చెందిన మధ్యస్థానాన్ని నాశనం చేస్తుంది. దీని వల్ల సంక్రమించే దృష్టి లోపం శాశ్వతంగా ఉండే అవకాశాలు ఎక్కువ. ఈ వ్యాధిలో రెండు రకాలున్నాయి. ఓపెన్ యాంగిల్ గ్లకోమా, క్లోజర్ గ్లకోమా. అత్యధికంగా అంటే దాదాపు 90శాతం కేసులు మొదటివే. ఇది చాలా నెమ్మదిగా వృద్ధి చెందు తుంది. రోగికి తన చూపు మందగిస్తోందన్న సంగతి తెలిసేటప్పటికి చాలా ఆలస్యం అవుతుంది. ముందుగా గుర్తిస్తే నివారించొచ్చు... తీవ్రమైన తలనొప్పి, కంటినొప్పి, వాంతులవుతున్నట్టు అనిపించడం, బాగా ప్రకాశవంతంగా ఉన్న దీపం చుట్టూ ఇంద్రధనస్సు రంగులు కనిపించడం వంటి లక్షణాలుంటాయి. దీనిని నివారించడం కష్టసాధ్యమైనప్పటికీ... తీవ్రతను తగ్గించడం సాధ్యమే. క్రమం తప్పని పరీక్షల ద్వారా గ్లకోమాను నిర్ధారించిన తర్వాత నిర్దేశించిన పరిమాణంలో కంటి చుక్కలను వాడే తక్షణ చికిత్సను ప్రారంభించాలి. దీనివల్ల కంటి లోపల ఫ్లూయిడ్స్ ఏర్పడడం, ఔట్ ఫ్లో వృద్ధి చెందడం తగ్గిస్తుంది. తాత్కాలిక, శాశ్వత దృష్టిలోపం సంభవించకుండా లేజర్ లేదా మైక్రో సర్జరీ అవసరం అవుతుంది. శిశువులు చిన్నారుల్లో పుట్టిన సంవత్సరం లోపే గుర్తించడం జరుగుతుంది. శిశువు పుట్టకముదు కంటి లోపల ఫ్లూయిడ్ ఫ్లో వ్యవస్థ సరిగా వృద్ధి చెందకపోవడం వల్ల ఇది ఏర్పడుతుంది. తొలుత కంటి సంబంధ మందులతో ప్రారంభించి, తీవ్రవతను బట్టి లేజర్, కంటి శస్త్ర చికిత్సావకాశాలను చూస్తారు. ప్రస్తుతం గ్లకోమా చికిత్సకు ఎన్నో నూతన విధానాలు అందుబాటులోకి వచ్చాయి. సింగిల్ పాస్ ఫోర్ త్రో ప్యుపిల్లోప్లాస్టీ ద్వారా ఈ వ్యాధి మూలకానికి చికిత్స చేయవచ్చు. దీని నివారణలో భాగంగా 40ఏళ్లు దాటాక తప్పకుండా తరచూ కంటి పరీక్షలు చేయించుకోవాలి. బీపీ, మధుమేహం అదుపులో ఉంచుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిఅనుసరించాలి. -
తొమ్మిదినెలల బిడ్డకు గ్లకోమా శస్త్రచికిత్స
గోపాలపట్నం(విశాఖపశ్చిమ): శంకర్‌ఫౌండేషన్ కంటి ఆస్పత్రి వైద్యులు మరో మారు సాహసోపేత శస్త్రచికిత్స చేశారు. తొమ్మిది నెలల బిడ్డకు రెండు నేత్రాలకూ అరుదైన శస్త్రచికిత్స జరిపి ప్రశంసలందుకున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం జగన్నాథపురం గ్రామానికి చెందిన నడుపూరు నాగేశ్వరరావు, దేవి దంపతులకు తొమ్మిది నెలల చిన్నారి గగనప్రియ ఉంది. నెల రోజుల క్రితం గగన ప్రియ రెండు కళ్లలో నల్లగుడ్డును కప్పేస్తూ తెల్లపొరలు కమ్ముకొస్తుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అక్కడి వైద్యులను సంప్రదించారు. విశాఖనగరం వేపగుంట శంకర్‌ఫౌండేషన్ కంటి ఆస్పత్రిలో ఈతరహా వైద్యం అందుబాటులో ఉందని అక్కడి వైద్యులు సూచించారు. గగనప్రియను ప్రముఖ డాక్టర్ రవీంద్ర వైద్యబృందంతో పరిశీలించారు. రెండు కళ్లకూ కంజెంటల్ గ్లకోమా వచ్చినట్లు వెల్లడించారు. ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ మణిమాల స్పందించారు. ఇక్కడ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే ఈబిడ్డకు రెండుకళ్లకూ శస్త్రచికిత్స చేయాలంటే ఆషామాషీ కాదు. ఇటీవల శస్త్రచికిత్సకు అన్ని ఏర్పాట్లూ చేసే సరికి ఆ బిడ్డకు జ్వరం సోకింది. దీంతో ఆపరేషన్ వాయిదా వేసి పరిశీలనలో ఉంచారు. ఇలా గగన ప్రియ ఆరోగ్యం సహకరించడంతో శుక్రవారం డాక్టర్ రవీంద్ర బృందం శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ విజయవంతమైంది. ఆయన కృషిని మదనమాల, ఏజీఎం వడలి రమేష్‌కుమార్ ప్రశంసించారు. కౌన్సిలర్ అనురాధను కూడా అభినందించారు. సాహసమే చేశాం తొమ్మిది నెలల బిడ్డకు అదీ రెండు కళ్లకూ కంజెంటల్ గ్లకోమా శస్త్రచికిత్స సాహసంగానే చే శాం. టైలర్ నాగేశ్వరరావుకు పెద్ద మొత్తంలో ఈచికిత్స చేయించే స్తోమత లేని తరుణంలో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స ఉచితంగా చేశాం. ఇక్కడ తప్పితే చెన్నైకో, హైదరాబాద్‌కో వెళ్లి ఆపరేషన్ చేయించాలి.–డాక్టర్ రవీంద్ర -
ముందు‘చూపు’తో రక్షించుకుందాం
శ్రీకాకుళం పాతబస్టాండ్: సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. తెలిసోతెలియకో కొంతమంది కంటి వ్యాధుల బారిన పడటంతో జీవితం అంధకారమయం అవుతోంది. ఈ వ్యాధుల్లో అత్యంత ప్రమాదకరమైనదిగా గ్లకోమాను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. గ్రామీణ ప్రాంతాల్లో నీటికాసులు, నల్లముత్యంగా వ్యవహరించే ఈ వ్యాధి తెలియకుండానే కళ్లపై దాడి చేస్తోంది. కంటి చూపును శాశ్వతంగా దూరం చేసి చీకటిమయం చేసేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 6 కోట్ల మంది, భారతదేశంలో 1.2కోట్ల మంది కంటే ఎక్కువగా గ్లకోమా కారణంగా చూపును కోల్పోతున్నారు. అంటే జనాభాలో ఒక శాతం దీని బారిన పడుతున్నారంటే ఈ వ్యాధి ఎంత తీవ్రంగా ప్రభావం చూపుతోందో అర్థం చేసుకోవచ్చు. ప్రారంభంలోనే ముందుచూపుతో వ్యవహరించి దీనిని గుర్తిస్తే నివారించడం సాధ్యమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఈ వ్యాధిపై అవగాహన లేకపోవడంతో ఎక్కువ మంది దీని బారిన పడుతున్నారని తేలింది. గ్లకోమాపై ప్రజల్లో అవగాహన కల్పించి ఆదిలోనే గుర్తించి సరైన చికిత్స అందించేందుకు ప్రపంచవ్యాప్తంగా మార్చి 11 నుంచి 17 వరకు ‘ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు’ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కంటి పరీక్షలు, వ్యాధి నివారణకు సూచనలు, మందులు అందజేస్తారు. అవరసమైతే శస్త్ర చికిత్సలు చేస్తారు. గ్లకోమా అంటే.. అంధత్వానికి కారణమయ్యే వ్యాధుల్లో గ్లకోమా (నీటి కాసుల వ్యాధి) ప్రమాదకరమైంది. కంటి ముందు భాగం అక్వయిస్ హ్యూమర్ అనే ఒక ద్రవంతో నిండి ఉంటుం ది. అది నిత్యం ఉత్పత్తి అవుతుంది. ఈ క్రమంలో కొత్త ద్రవం ఉత్పత్తి అయిన కొద్దీ పాత ద్రవం బయటకు వెళుతుంది. కొన్ని కారణాల వల్ల ఈ ద్రవం బయటకు వెళ్లే మార్గంలో అడ్డుంకులు ఏర్పడతాయి. అప్పు డు కంటిలో ఒత్తిడి పెరిగి ప్రధాన నాడి దెబ్బతింటుంది. పక్కచూపు నుంచి మొదలై క్రమంగా చూపు మందగిస్తుంది. దీని ఫలితంగా పూర్తిగా చూపుపోయే ప్రమాదం కలుగుతుంది. లక్షణాలు ♦ ప్రారంభ దశలో ఎటువంటి లక్షాలు కనిపించవు. గ్లకోమా బారిన పడిన వారిలో 50 శాతానికి పైగా తమకు వ్యాధి వచ్చినట్టు తెలియదు. ఈ దశలో గుర్తించగలిగితే సరైన చికిత్సతో చూపు కాపాడవచ్చు. ఎలా గుర్తిస్తారు ♦ కంటిలోని నీటి ఒత్తిడిని టోనోమీటర్ అనే పరికరంతో కొలుస్తారు. గోనియోస్కోపి(నీటి సరఫరా మార్గం పరీక్ష) ద్వారా తెలుసుకుంటారు. ఇందులో కంటి ప్రధాన నాడిని పరీక్షిస్తారు. దృష్టి లోపాలను గుర్తించేందుకు విజువల్ ఫీల్డ్ టెస్ట్ చేస్తారు. ప్రారంభ దశలో వ్యాధిని గుర్తించేందుకు ఓసీటీ, జీడీఎక్స్ అనే అధునాతన పరికరాలు అందుబాటులో ఉన్నాయి. గ్లకోమాను కనుగొనడానికి కంటి వైద్యులచే పూర్తి పరీక్ష చేయించుకోవడం ఒక ఉత్తమ మార్గం. సంపూర్ణ కంటి పరీక్షలో ఐఓపీ కొలత, కంటి డ్రైనేజీ యాంగిల్ ఆప్టిక్ నరాన్ని పరిశీలిస్తారు. అదనంగా విజువల్ ఫీల్డ్ పరీక్షల ద్వారా కంటి చూపు ఫెరిఫెరీని పరిశీలిస్తారు. ఎన్ని రకాలు ♦ ప్రైమరీ, సెకండరీ (కంటి గాయల వలన, ఇతర మందుల వాడకం వల్ల), కంజెనిటర్ గ్లకోమా (పుట్టుకతో సంక్రమించేది) అనే రకాలు ఉన్నాయి. పరీక్ష ఎవరు చేయించుకోవాలి ♦ 40 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ, దీర్ఘకాలం నుంచి ఏదో ఒక రూపంలో స్టెరాయిడ్ మందులు వాడినవారు, మధుమేహ వ్యాధి గ్రస్తులు, కంటికి గాయాలైనవారు, కుటుంబంలో పెద్దలు ఎవరికైనా గ్లకోమా ఉంటే వారి పిల్లలు, అతిమూత్ర (మధుమేహ) వ్యాధి ఉన్నవారు పరీక్ష చేయించుకోవాలి. చిక్సిత విధానాలు గ్లకోమాను పూర్తిగా నయం చేయలేం. పోయిన చూపును తీసుకురావడం సాధ్యపడదు. కానీ సరైన చికిత్స తీసుకో వడం వల్ల మిగిలి ఉన్న చూపు దెబ్బతినకుండా కాపాడవ చ్చు. కంటి చుక్కల మందులు వేయడం వల్ల ద్రవఉత్పత్తి నియంత్రించవచ్చు. ఇవి జీవితాంతం వాడాలి. కొన్ని రకా ల గ్లకోమాలకు లేజర్ ఉపయోగపడుతుంది. మందులు గానీ, లేజర్ గానీ గ్లకోమాను నియంత్రించలేకపోతే శస్త్ర చికిత్స చేయించుకోవాలి. ఆధునిక చికిత్సలైన ట్రేబెక్యులేక్టమీ, స్టంట్ సర్జరీ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. నేత్రాలు జాగ్రత్తగా కాపాడుకోవాలి సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. శరీరంలో ఉన్న భాగాల్లో కళ్లు అత్యంత ప్రధానమైనవి, వీటిని సురక్షితంగా కాపాడుకోవాలి. జిల్లాలో ఏడు విజన్ సెంటర్లలో రణస్థలం, రాజాం, పాతపట్నం, పలాస, ఇచ్ఛాపురం, ఆమదాలవలస, నరసన్నపేటలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి సీఎం ఈఐ స్టెంట్లు పేరిట గ్లకోమాపై పరీక్షలు చేస్తున్నాం. రిమ్స్‌లో వైద్యం అందుబాటులో ఉంది. నేత్రాలకు సంబంధించి సమస్య చిన్నదైనా, పెద్దదైనా కంటి వైద్య నిపుణులను సంప్రదించాలి. శస్త్ర చికిత్సలు కూడా ఉచితంగానే చేస్తున్నారు. – డాక్టర్ ఎస్ తిరుపతిరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, శ్రీకాకుళం -
గ్లూకోమాకు ముందస్తు చికిత్స..
కంటి వ్యాధి అయిన గ్లూకోమాను ముందుగానే నిరోధించేందుకు కాలిఫోర్నియా, టొరంటో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఓ వినూత్న చికిత్స విధానాన్ని ఆవిష్కరించారు. సహజసిద్ధంగా లభించే లిపిడ్ మీడియేటర్స్ అనే కణాల ద్వారా గ్లూకోమాను నిరోధించవచ్చని గుర్తించారు. ఈ వ్యాధి వల్ల ఏటా కొన్ని లక్షల మంది చూపును కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో కార్స్టెన్ గ్రోనెర్ట్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఎలుకలపై ప్రయోగాలు చేసింది. శరీరంలోని ఆస్ట్రోసైట్స్ కణాలు స్రవించే లిపోక్సిన్ అనే రసాయనం కంటిలోని గాంగ్లియన్ కణాలు నాశనమైపోవడాన్ని అడ్డుకుంటున్నట్లు తెలుసుకున్నారు. లిపోక్సిన్లు వాపు/మంటలను తగ్గించేందుకు మాత్రమే ఉపయోగపడతాయని ఇప్పటివరకూ అనుకునే వారు. ఇవే కణాలు గ్లూకోమా నివారణకూ ఉపయోగపడుతున్నాయని తమ ప్రయోగాల్లో తేలినట్లు శాస్త్రవేత్తలు వివరించారు. లిపోక్సిన్ ద్వారా ఇతర నాడీ సంబంధిత వ్యాధుల్లోనూ మెరుగైన చికిత్స అందించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. -
గ్లకోమాపై అవగాహన ర్యాలీ
బంజారాహిల్స్‌లోని ఎల్వీప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ప్రసాద్ ల్యాబ్స్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు గ్లకోమా అవగాహన కోసం నడక కార్యక్రమం నిర్వహించారు. ఈ వాక్‌ను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ రాయల్స్ టీమ్ వైస్ చైర్మన్ డాక్టర్ జి. చంద్రశేఖర్, ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి గ్లకోమా సెంటర్ హెడ్ డాక్టర్ శిరీష సెంథిల్, వైద్యులు, రోగులు, ప్రజలు ఈ వాక్‌లో పాల్గొన్నారు. ఈ నెల 6 నుంచి 12వ తేదీ వరకు గ్లకోమా అవేర్నెస్ వీక్‌లో భాగంగా ఈ వాక్ నిర్వహించడం జరిగిందని డాక్టర్ శిరీషా సెంథిల్ తెలిపారు. ఈవ్యాధిపై మరింత అవగాహన పెంచేందుకు ఈ నెల 12న గ్లకోమా ఎడ్యుకేషన్ ఫోరం నిర్వహిస్తున్నామన్నారు.