తొమ్మిదినెలల బిడ్డకు గ్లకోమా శస్త్రచికిత్స | Glaucoma Surgery For Nine Months Baby In Visakhapatnam | Sakshi
Sakshi News home page

తొమ్మిదినెలల బిడ్డకు గ్లకోమా శస్త్రచికిత్స

Published Sat, Aug 11 2018 1:36 PM | Last Updated on Wed, Aug 15 2018 7:01 AM

Glaucoma Surgery For Nine Months Baby In Visakhapatnam - Sakshi

ఆపరేషన్‌ విజయవంతమయ్యాక విశ్రాంతి పొందుతున్న గగనప్రియ

గోపాలపట్నం(విశాఖపశ్చిమ): శంకర్‌ఫౌండేషన్‌ కంటి ఆస్పత్రి వైద్యులు మరో మారు సాహసోపేత శస్త్రచికిత్స చేశారు. తొమ్మిది నెలల బిడ్డకు రెండు నేత్రాలకూ అరుదైన శస్త్రచికిత్స జరిపి ప్రశంసలందుకున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం జగన్నాథపురం గ్రామానికి చెందిన నడుపూరు నాగేశ్వరరావు, దేవి దంపతులకు తొమ్మిది నెలల చిన్నారి గగనప్రియ ఉంది. నెల రోజుల క్రితం గగన ప్రియ రెండు కళ్లలో నల్లగుడ్డును కప్పేస్తూ తెల్లపొరలు కమ్ముకొస్తుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అక్కడి వైద్యులను సంప్రదించారు. విశాఖనగరం వేపగుంట శంకర్‌ఫౌండేషన్‌ కంటి ఆస్పత్రిలో ఈతరహా వైద్యం అందుబాటులో ఉందని అక్కడి వైద్యులు సూచించారు. గగనప్రియను ప్రముఖ డాక్టర్‌ రవీంద్ర వైద్యబృందంతో పరిశీలించారు. రెండు కళ్లకూ కంజెంటల్‌ గ్లకోమా వచ్చినట్లు వెల్లడించారు. ఆస్పత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ మణిమాల స్పందించారు.

ఇక్కడ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే ఈబిడ్డకు రెండుకళ్లకూ శస్త్రచికిత్స చేయాలంటే ఆషామాషీ కాదు. ఇటీవల శస్త్రచికిత్సకు అన్ని ఏర్పాట్లూ చేసే సరికి ఆ బిడ్డకు జ్వరం సోకింది. దీంతో ఆపరేషన్‌ వాయిదా వేసి పరిశీలనలో ఉంచారు. ఇలా గగన ప్రియ ఆరోగ్యం సహకరించడంతో శుక్రవారం డాక్టర్‌ రవీంద్ర బృందం శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్‌ విజయవంతమైంది. ఆయన కృషిని మదనమాల, ఏజీఎం వడలి రమేష్‌కుమార్‌ ప్రశంసించారు. కౌన్సిలర్‌ అనురాధను కూడా అభినందించారు.

సాహసమే చేశాం
తొమ్మిది నెలల బిడ్డకు అదీ రెండు కళ్లకూ కంజెంటల్‌ గ్లకోమా శస్త్రచికిత్స సాహసంగానే చే శాం. టైలర్‌ నాగేశ్వరరావుకు పెద్ద మొత్తంలో ఈచికిత్స చేయించే స్తోమత లేని తరుణంలో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స ఉచితంగా చేశాం. ఇక్కడ తప్పితే చెన్నైకో, హైదరాబాద్‌కో వెళ్లి ఆపరేషన్‌ చేయించాలి.–డాక్టర్‌ రవీంద్ర

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement