కొందరిలో అకస్మాత్తుగా చెవులు వినపడకుండాపోయే సమస్య కనిపిస్తుంటుంది. అకస్మాత్తుగా కనిపించే ఈ వినికిడి సమస్యను ఇంగ్లిష్‌లో ‘సడెన్ డెఫ్‌నెస్’ అనీ, వైద్యపరిభాషలో ‘సడెన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్’ (సంక్షిప్తంగా ఎస్‌ఎస్ హెచ్‌ఎల్) అంటారు. అకస్మాత్తుగా వచ్చే ఈ సమస్య సాధారణంగా ఒక్క చెవినే ప్రభావితం చేస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది, అప్పుడు ఏం చేయాలి, వైద్యులు ఎలాంటి చికిత్సలు అందిస్తారనే అంశాలను తెలుసుకుందాం.
అకస్మాత్తు వినికిడి సమస్యను గుర్తించడం కాస్త విచిత్రంగానే జరుగుతుంది. ఉదాహరణకు పొద్దున్నే వాకింగ్‌కు వెళ్తున్నప్పుడు వినిపించే అలారం ఒకవైపే వినిపిస్తుండం లేదా ఫోన్ మాట్లాడుతుంటే ఒకవైపు చెవి వినిపించక... మరో చెవితో వినాల్సి రావడం వంటి అంశాలతో ఈ సమస్య తెలిసి వస్తుంది.
లక్షణాలు...
చెవి పూర్తిగా నిండిపోయినట్లు భావన కలుగుతుండటం
తల తిరుగు తున్నట్లుగా (డిజ్జీనెస్) అనిపిస్తుండటం
ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర నిల్చున్నప్పుడు వినిపిస్తున్నట్టుగా చెవిలో హోరుమనే శబ్దం వినిపిస్తుండటం (ఈ తరహా సమస్యను ‘టినైటస్’ అంటారు. ఇది విడిగా కూడా
కనిపించే అవకాశముంది).
గుర్తించడం / నిర్ధారణ ఎలా?
ఈఎన్‌టీ డాక్టర్‌ను సంప్రదిస్తే... కొన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ‘కండక్టివ్ హియరింగ్ లాస్’ అనే వినికిడి సమస్య లేదనే అంశాన్ని నిర్ధారణ చేయడం కోసం ఈ పరీక్షలు ఉపయోగపడతాయి. అంటే చెవిలో గులిమి గానీ లేదా ద్రవాలు గాని అడ్డుపడటం వల్ల వినికిడి సమస్య రావడాన్ని కండక్టివ్ హియరింగ్ లాస్ అంటారు. ఆ అడ్డంకిని తొలగించగానే ఈ సమస్య తొలగిపోతుంది. కానీ ‘అకస్మాత్తుగా వచ్చే వినికిడి సమస్య’ (ఎస్‌ఎస్‌హెచ్‌ఎల్)లో అలా జరగదు. అటు తర్వాత ‘ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ’ అనే మరో వైద్య పరీక్షతో చెవి ఏయే ఫ్రీక్వెన్సీలలో, ఎంతెంత గట్టి శబ్దాలు వినగలుగుతోందనే విషయాన్ని తెలుసుకుంటారు. అకస్మాత్తుగా వినికిడి సమస్య వచ్చిన వారు కేవలం 72 గంటల్లోనే 30 డెసిబుల్స్ కంటే తక్కువ తీవ్రత ఉన్న శబ్దాలను వినగలిగే శక్తిని కోల్పోతారు. ఇలా అకస్మాత్తుగా వినికిడి సమస్య వచ్చిన వారికి ఎదుటివారు మామూలుగా మాట్లాడుకుంటున్నప్పటికీ అవి గుసగుసల్లా అనిపిస్తుంటాయి.
పైన పేర్కొన్న పరీక్షలతో పాటు మరికొన్ని రక్తపరీక్షలు, ఎమ్మారై వంటి ఇమేజింగ్ పరీక్షలు, బ్యాలెన్స్ పరీక్షలూ బాధితుల్లో ఈ సమస్యకు కారణమేమిటో తెలుసుకోడానికి ఉపయోగపడతాయి.
కోల్పోయిన వినికిడి శక్తి మళ్లీ వస్తుందా?
వినికిడి శక్తి కోల్పోయిన వెంటనే ఎంత త్వరగా చికిత్సకోసం వస్తే అంతగా వినికిడిని మళ్లీ పొందడం సాధ్యమవుతుంది. అయితే... ఇందులో కొందరికి కోల్పోయిన వినికిడి శక్తి పూర్తిగా వస్తే మరికొందరికి కొద్దిగానే వస్తుంది. చికిత్స ఆలస్యమవుతున్న కొద్దీ కోల్పోయిన వినికిడి శక్తిని తిరిగి పొందడం అన్నది కూడా తగ్గుతూ పోతుంది. అందుకే వినికిడి కోల్పోయినట్లు అనిపించగానే తక్షణమే డాక్టర్‌ను సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మంచిది.
చికిత్స : వినికిడి శక్తిని కోల్పోయిన సందర్భాల్లో అది ఏ కారణం వల్ల జరిగిందో తెలియనప్పుడు ప్రధానంగా కార్టికో స్టెరాయిడ్స్ సహాయంతో చికిత్స అందిస్తారు. అవి చెవిలో వచ్చిన ఇన్‌ఫ్లమేషన్ (వాపు)ను తగ్గించి, వినికిడి శక్తిని పునరుద్ధరించడానికి తోడ్పడుతుంది. గతంలో ఈ స్టెరాయిడ్స్‌ను నోటి ద్వారా తీసుకునే మందుల రూపంలో ఇచ్చేవారు.
అయితే ఇటీవల వీటిని చెవిలోపలికి ఇచ్చే ఇంజెక్షన్‌ల (ఇంట్రా టింపానిక్ ఇంజెక్షన్స్) రూపంలో ఇస్తున్నారు. ఇలా ఇవ్వడం వల్ల ఈ మందులు ప్రభావపూర్వకంగా పనిచేస్తాయి. అంతేకాకుండా, ఈ స్టెరాయిడ్స్ కారణంగా శరీరంలో కలిగే దుష్ప్రభావాలనూ (సైడ్ ఎఫెక్ట్స్) నివరించ వచ్చు. అంతేకాదు, ఇలా ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం వల్ల మందు చెవిలో లోపలి వరకు మందు చేరడం సులువవుతుంది. వీటిని ఔట్ పేషెంట్స్ విభాగంలోనే ఓటోలారింగాల జిస్టుల ఆధ్వర్యంలో ఇస్తుంటారు. ఫలితాలు ప్రభావ పూర్వకంగా ఉండాలంటే ఈ ఇంజెక్షన్లను సమస్య కనుగొన్న వెంటనే ఇవ్వాల్సి ఉంటుంది.
ఒకవేళ ఈ అకస్మాత్తు వినికిడి సమస్యకు ఇంకేవైనా అంశాలు కారణమని తెలిస్తే... ముందుగా వాటికి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఏదైనా ఇన్షెక్షన్ వల్ల ఈ సమస్య వచ్చిందని తేలితే, యాంటీబయాటిక్స్ ఇవ్వడం, ఏవైనా హానికరమైన మందుల వల్ల ఈ సమస్య వచ్చిందని తేలితే, ఆ మందుల్ని ఆపేసి, ప్రత్యామ్నాయ ఔషధాలను ప్రిస్క్రయిబ్ చేయడం, ఒకవేళ తమ సొంత వ్యాధి నిరోధక వ్యవస్థ ఈ సమస్యను తెచ్చిపెట్టిందని తేలినప్పుడు... ఆ వ్యవస్థను నెమ్మదింపజేసే మందులను వాడటం వంటి చికిత్సలను డాక్టర్లు సూచిస్తారు.
ఒకవేళ వినికిడి లేమి సమస్య చాలా తీవ్రంగా ఉన్నా... లేదా సమస్య రెండువైపులా చెవులకూ వస్తే బయటి శబ్దాలను పెద్దగా వినిపింపజేసే ‘హియరింగ్ ఎయిడ్స్’ వాడటం లేదా నేరుగా చెవి నుంచి మెదడుకు శబ్దాలను వినిపించే ప్రక్రియను ప్రేరేపించే ‘కాక్లియార్ ఇంప్లాంట్స్’ అమర్చడం వంటి చికిత్సలు అవసరం కావచ్చు.
విస్మరించే అవకాశాలు ఎక్కువ...
అకస్మాత్తుగా తమకు ఒక చెవి వినిపించకుండా పోయిన ఈ సమస్యను కొందరు పూర్తిగా విస్మరిస్తుంటారు. దీనికి కారణం... తమకు ఏదో అలర్జీ కారణంగా చెవి దిబ్బెడ వేసినట్లు అనిపిస్తుందని అనుకుంటుంటారు లేదా తమకు సైనస్ వంటి ఇన్ఫెక్షన్ ఉన్నందున ఇలా జరుగుతుందని భావిస్తుంటారు. మరికొందరైతే చెవిలో గువిలి చేరిందనీ, అందువల్ల తమ చెవి నిండుగా అనిపిస్తుందనీ, దాన్ని శుభ్రం చేయిస్తే అంతా మామూలైపోతుందని భావిస్తుంటారు.
-డా. మోగంటి అశోక్ పృథ్విరాజ్,
సీనియర్ ఈఎన్‌టీ, హెడ్ అండ్ నెక్ సర్జన్
Comments
Please login to add a commentAdd a comment