విఠల్‌రావు విషాదాంతం | Ghazal singer Vithal Rao passes away | Sakshi
Sakshi News home page

విఠల్‌రావు విషాదాంతం

Published Sat, Jun 27 2015 5:25 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

విఠల్‌రావు విషాదాంతం - Sakshi

విఠల్‌రావు విషాదాంతం

ప్రముఖ గజల్ గాయకుడు విఠల్‌రావు కన్నుమూత
* మతిస్థిమితం కోల్పోయి గతనెల 29న షిర్డీలో అదృశ్యం
* చివరికి అనామకుడిగా గాంధీ ఆస్పత్రిలో మరణం
* మార్చురీలో మృతదేహాన్ని గుర్తించిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్
* తొలి తరం తెలంగాణ గజల్ గాయకుడు విఠల్‌రావు
* నిజాం ఆస్థాన కవిగా కీర్తిప్రతిష్టలు.. దేశవిదేశాల్లో వేలాది ప్రదర్శనలు


సాక్షి, హైదరాబాద్: తొలితరం తెలంగాణ గజల్ గాయకుడు పండిట్ శివపూర్కర్ విఠల్‌రావు (86) అదృశ్యం మిస్టరీ విషాదాంతమైంది. అద్భుతమైన గాత్రంతో దశాబ్దాలకు పైగా సాహితీ ప్రియులను అలరించిన ఆయన చివరికి అనామకుడిలా మరణించారు. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న విఠల్‌రావు మే 29న షిర్డీలో కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఆచూకీ కోసం పోలీసులు, కుటుంబసభ్యులు తీవ్రంగా వెతుకుతున్నారు. ఈ నెల 24న హైదరాబాద్‌లోని బేగంపేట కంట్రీ క్లబ్ ఫ్లై ఓవర్ కింద అపస్మారక స్థితిలో పడి ఉన్న విఠల్‌రావును స్థానికులు యాచకునిగా భావించి 108కు సమాచారమిచ్చారు.
 
గాంధీ ఆస్పత్రికి తరలించగా ఆయన అదే రోజు మరణించారు. గుర్తు తెలియని మృతదేహంగా పోలీసులు కేసు నమోదు చేసి మార్చురీలో భద్రపరిచారు. కాగా, విఠల్‌రావు అదృశ్యం కేసు దర్యాప్తు చేస్తున్న సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శాంబాబు.. ఫొటోల ఆధారంగా మార్చురీలోని మృతదేహం ఆయనదేనని గుర్తించారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న విఠల్‌రావు మృతదేహాన్ని ఆయనకు అమర్చిన కృత్రిమ కన్ను ద్వారా కుమారుడు సంతోష్ గుర్తించారు.

కొన్నేళ్ల కింద ఆయన ఎడమ కన్ను తొలగించి కృత్రిమ కన్ను అమర్చారు. విఠల్‌రావుకు భార్య తారాభాయి, కుమారులు సంజయ్, సంతోష్, కుమార్తెలు సంధ్య, వింధ్య, సీమ ఉన్నారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆస్థాన గాయకుడిగా , దేశ,విదేశీల్లో పేరొందిన ఆయన మృతి చెందిన తీరు కుటుంబసభ్యులు, బంధువులు, అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది. విఠల్‌రావు అంత్యక్రియలను ఆయన స్వస్థలమైన గోషామహల్‌లో శనివారం నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు సంతోష్‌తెలిపారు.
 
సన్మానం అందుకోకుండానే...
జూన్ 2న తెలంగాణ అవతరణ వేడుకల సందర్భంగా విఠల్‌రావుకు సన్మానం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. అయితే అప్పటికే ఆయన అదృశ్యం కావడంతో ఆయనను సన్మానించలేకపోయింది. ఆయన ఆచూకీ కనిపెట్టాలని పోలీసులను ఆదేశించింది. దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం పంపించారు. మరోవైపు కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు షిర్డీ పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు. షిర్డీలో పోలీసులు, కుటుంబసభ్యులు గాలింపు చేపట్టారు. అయినా ఎక్కడా ఆయన ఆచూకీ దొరకలేదు.
 
కుటుంబసమేతంగా షిర్డీకి..
విఠల్‌రావు కుటుంబసభ్యులంతా కలసి మే 26న గోషామహల్ నుంచి షిర్డీ యాత్రకు బయలుదేరారు. మార్గ మధ్యలో విఠల్ చెల్లెలు అంబిక ఇంటికి వెళ్లి అక్కడ రెండు రోజులున్నారు. ఆ తర్వాత మే 29న అందరూ కలసి షిర్డీ చేరుకున్నారు. బాబా దర్శనం చేసుకున్నాక తిరిగి వస్తుండగా విఠల్‌రావు కనిపించకుండా పోయారు. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న ఆయన షిర్డీలో తప్పిపోయి హైదరాబాద్‌లో ఎలా ప్రత్యక్షమయ్యారో తెలియడం లేదు. ఈ నెల 23 రాత్రి నాగర్‌సోల్‌లో అజంతా ఎక్స్‌ప్రెస్ ఎక్కి 24న ఉదయం బేగంపేట రైల్వేస్టేషన్‌లో దిగి ఉంటారని, కాలినడకన బయల్దేరి నీరసంతో బేగంపేట ఫ్లైఓవర్ కింద కుప్పకూలి ఉంటారని అంటున్నారు.
 
దేశవిదేశాల్లో ప్రదర్శనలు: విఠల్‌రావు ప్రస్థానం నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆస్థాన గాయకుడిగా మొదలైంది. చివరగా ఆయన ఈ ఏడాది ఏప్రిల్ 28న ఢిల్లీలో ప్రదర్శన ఇచ్చారు. భారతరత్న ఉస్తాద్ బిస్మిల్లాఖాన్‌తో కలసి హైదరాబాద్‌లో ఆయన ప్రదర్శన ఇచ్చారు. చౌమొహల్లాప్యాలెస్, రవీంద్రభారతి, తారామతి బారదరిలో విఠల్ ఇచ్చిన ప్రదర్శనలు చరిత్రలో నిలిచిపోతాయనే చెప్పుకోవచ్చు. చాలామంది ప్రముఖులు ఆయన గజల్స్‌కు మంత్రముగ్ధులయ్యేవారు. రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, గవర్నర్లు, సీఎంలను ఆయన గజల్స్ అలరించాయి. కువైట్, కెనడా,అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్, దుబాయ్ తదితర దేశాల్లోనూ ఆయన ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయనను వరించాయి.
 
సీఎం కేసీఆర్ సంతాపం

విఠల్‌రావు మృతి పట్ల శుక్రవారం సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఏడో నిజాం ఆస్థానంలో విద్వాంసుడిగా పని చేసిన విఠల్‌రావు దేశవ్యాప్తంగా పేరొందిన కళాకారుడని సీఎం గుర్తు చేశారు. విఠల్‌రావు కుటుంబసభ్యులకు, శిష్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం విఠల్‌రావును ప్రత్యేకంగా గుర్తించి పారితోషికాన్ని అందించింది. అలాగే ప్రముఖ పర్యావరణవేత్త, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజామణి మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement