సాక్షి, హైదరాబాద్: సౌందర్య సామగ్రితోపాటు పలు ఇతర పదార్థాల్లో కనిపించే సీసం వల్ల అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. సీసం కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరును ప్రభావితం చేస్తుందని ఇప్పటికే తెలిసినప్పటికీ మతిమరుపు లాంటి లక్షణాలను కనబరిచే అల్జీమర్స్‌కూ కారణం కావచ్చని తెలియడం ఇదే మొదటిసారి. సమాచారాన్ని నిక్షిప్తం చేసుకుని అవసరమైనప్పుడు అందించే మెదడు కణాలు క్రమేపీ నాశనం కావడం అల్జీమర్స్ వ్యాధిలో ముఖ్యమైన అంశం.
ఈ వ్యాధికి కారణం ఏమిటన్నది ఇప్పటికీ స్పష్టం కానప్పటికీ బీటా అమొలాయిడ్ అనే మెదడు ప్రొటీన్ ముక్క ప్రభావం ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రొటీన్ ముక్కలు పోగుపడటం వల్ల మెదడు కణాల మధ్య సమాచార ఆదాన, ప్రదానాలపై దుష్ప్రభావం పడుతుంది. ఈ క్రమంలో కణాలు చచ్చిపోతాయి కూడా. ఈ నేపథ్యంలో జాతీయ పోషకాహార సంస్థ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ చల్లా సురేష్ సీసం, బీటా అమొలాయిడ్‌కు మధ్య ఉన్న సంబంధాలపై పరిశోధన చేపట్టారు.
మెదడు కణాలపై జరిపిన ఈ పరిశోధనల్లో సీసం కారణంగా కణాలు చచ్చిపోవడం ఎక్కువైనట్లు గుర్తించారు. అంతేకాకుండా నాడుల అభివృద్ధి, పునరుత్పత్తికి సంబంధించిన ప్రొటీన్ల మోతాదు కూడా తగ్గిపోతున్నట్లు తెలిసింది. దీంతో సైనాప్టోఫైసిన్ మోతాదులు కూడా తగ్గిపోయి అల్జీమర్స్‌కు దారితీస్తున్నట్లు తేలింది. గర్భధారణ సమయంలో సీసం కాలుష్యానికి గురైతే దాని ప్రభావం బిడ్డపై ఉంటుందని, పుట్టిన బిడ్డకు కూడా అల్జీమర్స్ సోకే అవకాశం ఉంటుందని సురేష్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment