ఓం భూం.. బుష్..: తెలంగాణ బడ్జెట్ పై బండి సంజయ్‌ | Union Minister Bandi Sanjay Satirical Comments On Telangana Budget 2025-26, More Details Inside | Sakshi
Sakshi News home page

ఓం భూం.. బుష్..: తెలంగాణ బడ్జెట్ పై బండి సంజయ్‌

Published Wed, Mar 19 2025 3:34 PM | Last Updated on Wed, Mar 19 2025 3:58 PM

Union Minister Bandi Sanjay On Telangana Budget

ఢిల్లీ:   తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. అబద్ధాల్లో, అంకెల్లో, అప్పుల్లో, దోపిడీలో బీఆర్ఎస్  సర్కార్ ను కాంగ్రెస్ మించిపోయిందంటూ ధ్వజమెత్తారు. అంతా ‘ఓం భూం.. బుష్’ అంటూ సెటైర్లు వేశారు బండి సంజయ్.

ఆరు గ్యారెంటీలపై ఆశలు వదలుకునేలా బడ్జెట్ తీరు.  గ్యారంటీలపై ఆశలు వదులుకునేలా బడ్జెట్ తీరు. కేటాయింపులకు, ఆచరణకు పొంతనే లేని బడ్జెట్. మేనిఫెస్టోలోని 10 శాతం హామీలను కూడా అమలు చేయలేని అసమర్ధ సర్కారని తేలిపోయింది. విద్య, వైద్య రంగాల కేటాయింపులు దారణం. అభయ హస్తం కాదు....మహిళల పాలిట శూన్య హస్తమని నిరూపించిన బడ్జెట్. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, రూ.4 వేల నిరుద్యోగ భృతి ఊసేలేదు. వృద్దుల పెన్షన్ పెంపును గాలికొదిలేసిన బడ్జెట్. విద్యార్థుల భవిష్యత్తును చిదిమే బడ్జెట్ ఇది. రైతుకిచ్చిన హామీలన్నీ హుష్ కాకి.. గోబెల్స్ ను మించిన అబద్దాల కోరులు కాంగ్రెస్ నేతలు. ఇచ్చిన హామీలను నెలబెట్టుకునే మోదీ సర్కార్ తో గోబెల్స్ ను మించి అబద్దాలు కోరు కాంగ్రెస్ కు పోలికా?,  రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ను పరిశీలిస్తే...డొల్ల అని తేలిపోయింది’ అన్నారు... ఇంకా బండి సంజయ్‌ ఏమన్నారంటే..

కేటాయింపులకు, ఖర్చులకు పొంతనే లేదు..
ముఖ్యంగా గత బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులను పరిశీలిస్తే పొంతనే లేదని తేలిపోయింది.  అయినప్పటికీ బడ్జెట్ కేటాయింపులు పెంచి తెలంగాణ ప్రజలను దారుణంగా మోసం చేసేందుకు బడ్జెట్ ను సాధనంగా ఉపయోగించుకోవడం సిగ్గు చేటు. పైగా 10 సార్లు చెబితే అబద్దమే నిజమైతుందనే నానుడిని బడ్జెట్ లో ప్రస్తావించిన కాంగ్రెస్ ప్రభుత్వం.... అదే ఒరవడిని కొనసాగించడం సిగ్గు చేటు. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు, ఆచరణకు ఏమాత్రం పొంతన లేని బడ్జెట్ ఇది. 6 గ్యారంటీలను పూర్తిగా తుంగలో తొక్కేశారు.

ఎన్నికలకు ముందు మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా పేర్కొన్న కాంగ్రెస్ నేతలు అదికారంలోకి వచ్చాక చిత్తుకాగితంగా మార్చినట్లు ఈ బడ్జెట్ ద్వారా వెల్లడైంది. మొత్తంగా బడ్జెట్ తీరును విశ్లేషిస్తే... అబద్దాలు...అంకెల గారడీ...6 గ్యారంటీలకు పాతరేసేలా రాష్ట్ర బడ్జెట్ ఉంది. ఓం భూం బుష్ అంటూ మాయ చేసేందుకే ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కన్పిస్తోంది. తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం భారీగా పెరిగినట్లు బడ్జెట్ లో గొప్పలు చెప్పిన ప్రభుత్వం... అప్పుల వివరాలను కూడా బడ్జెట్ లో పొందుపరిచి ఒక్కో తెలంగాణ పౌరుడిపైనా, చివరకు పుట్టబోయే బిడ్డపైనా ఎంత అప్పు భారం ఉందో వాస్తవాలను వివరిస్తే బాగుండేది.

హమీలను పూర్తిగా గాలికొదిలేశారు..
అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొన్న హామీలను పూర్తిగా గాలికొదిలేసినట్లు ఈ బడ్జెట్ తో తేటతెల్లమైంది. మహిళలకు  నెలనెలా రూ.2,500లు, తులం బంగారం, స్కూటీ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ గత బడ్జెట్ లోనూ నయాపైసా కేటాయించలేదు. ఈ బడ్జెట్ లోనూ ఆ ప్రస్తావన తీసుకురాకపోవడం దుర్మార్గం. 2 లక్షల ఉద్యోగాల భర్తీ,  నిరుద్యోగులకు  నెలనెలా రూ.4 వేల నిరుద్యోగ భ్రుతి ఇచ్చే అంశంపై బడ్జెట్ లో కేటాయింపులు జరపకపోవడం సిగ్గు చేటు. ఇక విద్యా భరోసా ప్రస్తావనే లేదు. వ్రుద్దుల పెన్షన్ పెంపును ప్రస్తావించకుండా వారిని గాలికొదిలేసింది. నేటి బడ్జెట్ కేటాయింపులను చూస్తుంటే...కాంగ్రెస్ తిరోగమమన పాలనకు నిలువుటద్దం ఈ బడ్జెట్ అని తేలిపోయింది. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న 420కిపైగా హమీల్లో 10 శాతం కూడా అమలయ్యే అవకాశం కన్పించడం లేదు.

కేటాయింపులకు, ఆచరణకు అసలు పొంతనే లేదు
బడ్జెట్ కేటాయింపులకు, ఆచరణకు అసలు పొంతనే లేదు. గత(2024-25) ఆర్ధిక సంవత్సరంలో 2 లక్షల 91 వేల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆచరణలోకి వచ్చేసరికి రూ.2 లక్షల కోట్లు కూడా ఖర్చయిన దాఖలాల్లేవు. కోతలు కోయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కార్ ను మించిపోయింది. గతంలో దళిత బంధు పేరుతో కేసీఆర్ ప్రభుత్వం 2023లో రూ.17 వేల కోట్లకు పైగా  కేటాయించినా....ఆచరణలో మాత్రం నయాపైసా ఖర్చు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అదే దారిన నడుస్తోంది. గత బడ్జెటట్ లో  ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున నిర్మిస్తామని పేర్కొంటూ ఇందిరమ్మ ఇండ్ల కోసమే రూ.7,500 కోట్లను కేటాయించిన ప్రభుత్వం ఆచరణలోకి వచ్చే సరికి నయా పైసా ఖర్చు చేయలేదు ఒక్క ఇల్లు కూడా కట్టియ్యలేదు.

వైద్య రంగం అస్తవ్యస్తం..
గత ఆర్ధిక సంవత్సరంలో  వైద్య రంగం అస్తవ్యస్తంగా మారింది. ఆసుపత్రుల్లో మందులిచ్చే పరిస్థితి లేదు. నేతన్నలను పూర్తిగా వంచించేలా బడ్జెట్ లో కోత విధించారు. ఆటో డ్రైవర్ల సంక్షేమ సంఘం ఏర్పాటు ఊసు లేదు.  కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం స్విగ్గీ, జొమాటో, అమెజాన్ వంటి సంస్థల్లో పనిచేసే గిగ్ వర్కర్స్ కు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని నిర్ణయిస్తే.... తెలంగాణలో గిగ్ వర్కర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ లో ఆ ఊసే ప్రస్తావించకపోవడం సిగ్గు చేటు. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఈ బడ్జెట్ లో పూర్తిగా విస్మరించింది. ఉద్యోగుల డీఏలు, పెండింగ్ సమ్యలు, పీఆర్సీ ప్రస్తావనే లేదు.

బీసీ కులాల సంక్షేమం ఏది?
కులగణన పేరుతో బీసీ రిజర్వేషన్లలో కోత విధించిన పార్టీ బడ్జెట్ కేటాయింపుల్లోనూ బీసీ కులాల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది.  అంబేద్కర్ అభయ హస్తం పేరుతో దళితులకు రూ.12 లక్షల చొప్పున ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ... బడ్జెట్ లో కనీసం ఆ ప్రస్తావన కూడా తీసుకురాకపోవడం సిగ్గు చేటు. 
తెలంగాణలో వైద్య, విద్యా రంగాల దుస్థితి దారుణంగా ఉంది. సర్కారీ ఆసుపత్రుల్లో సూది, మందులు, కాటన్ కూడా లేక అల్లాడుతుంటే నిధులు పెంచకుండా పేద రోగులను గాలికొదిలేసింది. ఎన్నికల్లో విద్యకు పెద్ద ఎత్తున  కేటాయింపులు చేస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ నేతలు బడ్జెట్ కేటాయింపులను చూస్తే పొంతనే లేదు.  

వ్యవసాయ రంగాన్ని విస్మరించారు..
వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించారు. రైతు సంక్షేమ రాజ్యంగా మారుస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నేతలు... రైతు రాబందు రాజ్యంగా మార్చేలా బడ్జెట్ కేటాయింపులు చేయడం దుర్మార్గం. 20 లక్షల మందికి పైగా రైతులకు నేటికీ రుణమాఫీ కాలేదు. అయినప్పటికీ బడ్జెట్ లో ఆ ఊసే ప్రస్తావించకుండా రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల మంది రైతు కుటుంబాలను దారుణంగా వంచించింది. కోటి మంది రైతు కూలీలకు ఏటా రూ.12 వేల ఆర్ధిక సాయం ఇస్తామని హామీనిచ్చిన ప్రభుత్వం.... వాటికి కేటాయింపులు జరపకపోగా సిగ్గు లేకుండా అబద్దాలను వల్లించడం దారణం.

అప్పులు  చేయడం, ఆస్తులు అమ్మడం
బడ్జెట్ తీరు తెన్నులను విశ్లేషిస్తే కాంగ్రెస పాలనలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పూర్తిగా గాడి తప్పినట్లు కన్పిస్తోంది.  ఆదాయ, వ్యయాలను చూస్తుంటే అప్పులు  చేయడం, ఆస్తులు అమ్మడం తప్ప మరో మార్గం  లేదన్నట్లుగా కాంగ్రెస్ పాలన మారింది.  కేసీఆర్ ప్రభుత్వం ఏటా రూ.67 వేల కోట్ల అప్పు చేస్తే... రేవంత్ రెడ్డి ప్రభుత్వం 15 నెలల్లోనే రూ.1.58లక్షల కోట్లు అప్పు తీసుకురావడాన్ని చూస్తుంటే..... అప్పులు చేయడంలో, ఆస్తుల అమ్మడంలో, రాష్ట్రాన్ని దివాళా తీయడంలో, ప్రజలపై భారం మోపడంలో, అబద్దాలను ప్రచారం చేయడంలో, అవినీతి, దోపిడీలో కేసీఆర్ ప్రభుత్వాన్ని మించిపోయినట్లు కన్పిస్తోంది.

కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా 6 గ్యారంటీల అమలు కోసం ఈ బడ్జెట్ లో కేటాయింపులను చేసేలా సవరణలు చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రవేశపెట్టిన బడ్టెట్ కేటాయింపులకు, వాస్తవిక ఖర్చు వివరాలతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది బడ్జెట్ కేటాయింపులు, వాస్తవిక ఖర్చు వివరాలను ప్రజల ముందుంచాలని కోరుతున్నాం’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement