అల్జీమర్స్‌ను నివారించవచ్చు!
(సెప్టెంబర్ 21న ప్రపంచ అల్జీమర్స్ దినం)
ఆరోగ్యకరమైన జీవనశైలితో వార్ధక్యంతో వచ్చే మతిమరుపును జయించవచ్చు. ఇందుకు ప్రధానంగా... రోజూ వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, మానసికంగా ఉత్తేజంగా ఉండడం, సుఖనిద్ర, ఒత్తిడి లేకుండా పనులను చక్కబెట్టుకోగలిగిన నేర్పు, మానవ సంబంధాలను కలిగి ఉండడం (యాక్టివ్ సోషల్ లైఫ్)... అనే ఆరు సూత్రాలను పాటించాలి.
నడక, ఈత, యోగసాధన, ఏరోబిక్స్ వంటి వాటిల్లో దేహానికి సౌకర్యంగా ఉండే వ్యాయామం చేయాలి. వారానికి కనీసం ఐదు రోజుల పాటు రోజుకు అరగంట సేపు ఎక్సర్‌సైజ్ ఉండాలి. మెదడును చురుగ్గా ఉంచే ప్రహేళికల (పజిల్స్)ను పరిష్కరిస్తుండాలి.
చేపలు, గింజలు, పొట్టుతీయని ధాన్యాలు, తాజా కూరగాయలు, పండ్లు సమృద్ధిగా తీసుకోవాలి. కొవ్వుతో కూడిన పదార్థాలు, మాంసం, ఫాస్ట్‌ఫుడ్, ప్యాకేజ్‌డ్ ఫుడ్‌ను వీలయినంతగా తగ్గించాలి. గుండెకు మంచి చేసే ఆహారాలన్నీ మెదడుకు కూడా మేలు చేస్తాయి. గుండెకు హాని చేసే పదార్థాలు మెదడు పని తీరును మందగింపచేస్తాయి.
పాలు కలిపిన టీకి బదులు గ్రీన్ టీ తీసుకుంటే మంచిది. రోజుకు రెండు నుంచి నాలుగు కప్పులు గ్రీన్ టీ తీసుకుంటే జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.