వృత్తి విద్యా కోర్సుల రీడిజైనింగ్
- ఇంటర్ బోర్డు పాలకమండలి సమావేశంలో నిర్ణయం
- వచ్చే ఏడాది మరిన్ని కొత్త
- జూనియర్ కాలేజీలు: కడియం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్‌లో వృత్తి విద్యా కోర్సులను మరింత పటిష్టం చేయాలని ఇంటర్ బోర్డు పాలక మండలి సంకల్పించింది. ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి వెంటనే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించేలా రీడిజైన్ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం జేఎన్‌టీయూ, వైద్య, ఆరోగ్య శాఖ, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రెండు నెలల్లో ఈ కమిటీ తన నివేదిక ఇవ్వాలని, దానికనుగుణంగా మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కోర్సులను రూపొందించి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. అలాగే డిమాండ్ లేని కోర్సులను తొలగించాలని నిర్ణయించింది. బోర్డు చైర్మన్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన మంగళవారం బోర్డు పాలక మండలి సమావేశం జరిగింది. అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కడియం వెల్లడించారు.
దేశంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దుతాం...
ఇంటర్ బోర్డును దేశంలోనే ఉత్తమమైనదిగా తయారు చేస్తామని కడియం చెప్పారు. ఇప్పటికే దేశంలో బెస్ట్ డిజిటలైజ్డ్ బోర్డుగా వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో తెలంగాణ ఇంటర్ బోర్డుకు అవార్డు లభించిందన్నారు. ప్రైవేట్ జూనియర్ కాలేజీల అనుమతుల్లో బోర్డు కఠినంగా ఉంటుందని తెలిపారు. త్వరలోనే అనుబంధ గుర్తింపు ఉన్న, లేని కళాశాలల జాబితాను వెబ్‌సైట్‌లో పెడతామన్నారు. ఇప్పటికే ఇంటర్ బోర్డులో 22 సర్వీస్‌లను ఆన్‌లైన్ చేశామని, త్వరలో మరిన్ని సేవలను ఆన్‌లైన్ చేస్తామన్నారు. విద్యాశాఖ చేపట్టిన పలు సంస్కరణల వల్ల జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల నమోదు శాతం పెరిగిందన్నారు.
ఎక్కడెక్కడ జూనియర్ కాలేజీలు అవసరమో గుర్తించి, వచ్చే ఏడాది అక్కడ కొత్త కాలేజీలను మంజూరు చేస్తామని తెలిపారు. గతంలో మంజూరు చేసిన 59 కాలేజీల్లో పోస్టుల భర్తీకి సీఎం ఓకే చెప్పారని, దీంతో పోస్టుల భర్తీకి మార్గం సుగమమైందన్నారు. భవిష్యత్తులో ఇంటర్‌లోనూ ఆన్‌లైన్ ద్వారా ప్రవేశాలు చేపడతామని కడియం చెప్పారు. ఈసారి ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ద్వితీయ భాషల సిలబస్‌ను మార్చుతున్నామని, వచ్చే ఏడాది ఈ మార్పులు అమల్లోకి వస్తాయన్నారు. సమావేశంలో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఉన్నత విద్య కమిషనర్ వాణిప్రసాద్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల విద్య డైరెక్టర్ కిషన్ పాల్గొన్నారు.