భయోమెట్రిక్!
♦ కొత్త విధానాన్ని వ్యతిరేకిస్తూ ఏడుగురు డీలర్ల రాజీనామా
♦ కమీషన్ పెంచకుండా ఈ-పాస్ అమలుపై నిరసన
♦ పెరిగిన నిర్వహణ భారంతో రేషన్‌షాపులకు గుడ్‌బై
♦ కమీషన్ పెంపుపై సర్కారుకు జిల్లా యంత్రాంగం లేఖ
ఈ- పాస్ అమలు చేస్తే ప్రభుత్వం ఇచ్చే కమీషన్ ఏ మూలకూ సరిపోదని ఉప్పల్‌లో ఇద్దరు, కాప్రా లో ఒకరు, బాలానగర్‌లో ఇద్దరు, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి సర్కిళ్లలో ఒక్కొక్కరు చొప్పున డీలర్ షిప్‌నకు రిజైన్ చేశారు. రేషన్ డీలర్లకు ప్రభుత్వం చెల్లిస్తున్న కమీషన్‌పై పునరాలోచన చేయాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి లేఖ రాసింది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : పౌరసరఫరాల శాఖకు కొత్త చిక్కు వచ్చింది. ప్రజాపంపిణీ వ్యవస్థ పక్కదారి పట్టకుండా బయోమెట్రిక్ యంత్రాలను ప్రవేశపెడుతుంటే.. వాటి రాక తమ పొట్టకొడుతుందని భావిస్తున్న చౌకధరల దుకాణాల డీలర్లు రాజీనామా బాట పడుతున్నారు. స్టాకు విడుదల నుంచి కార్డుదారులకు పంపిణీ వరకు ప్రతిది ఈ -పాస్ యంత్రం కనుసన్నల్లో కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రేషన్ షాపుల్లో వీటిని అమలు చేస్తోంది. ఏప్రిల్ నుంచి వీటి ద్వారా సరుకులను జారీ చేయనున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ యంత్రాలు తమను మరింత నష్టాల్లోకి నెడతాయని అంచనాకొచ్చిన పలువురు డీలర్‌షిప్‌ను వదులుకుంటున్నారు.
బయోమెట్రిక్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఏడుగురు డీలర్లు రాజీనామా చేయడం జిల్లాయంత్రాంగాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ యంత్రాల అమలుతో నల్లబజారుకు తరలుతున్న సరుకుకు అడ్డుకట్ట వేయవచ్చని, కనిష్టంగా 14 నుంచి 20 శాతం మేర సరుకు ఆదా అవుతుందని యంత్రాంగం అంచనా వేసింది. తద్వారా సర్కారుకు గుదిబండగా మారిన సబ్సిడీ భారాన్ని కొంత మేర తగ్గించగలమని భావించింది. జిల్లావ్యాప్తంగా ఉన్న 11.40 లక్షల రేషన్‌కార్డులకు ప్రతినెలా 25వేల మెట్రిక్ టన్నుల బియ్యం, 1,800 కిలోలీటర్ల కిరోసిన్, అరకేజీ చొప్పున చక్కెర, కందిపప్పును అందజేస్తోంది. ఇవి పక్కదారి పట్టకుండా ఆపగలిగితే ఖజానాకు మంచిదనే అంచనాకొచ్చింది.
నిజాయితీతో కష్టమే సుమా!
అవినీతికి పాల్పడకుండా సరుకులు విక్రయిస్తే తమకు గిట్టుబాటు కాదని, ప్రభుత్వం ఇచ్చే కమీషన్ ఏ మూలకూ సరిపోదని కొంతకాలంగా రేషన్‌డీలర్లు వాపోతున్నారు. ఈ-పాస్ విధానాన్ని ప్రవేశపెడితే తమ కమీషన్‌ను గణనీయంగా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం కమీషన్ పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం.. వచ్చే నెలలో బయోమెట్రిక్ యంత్రాలు అమలులోకి తేనుండడంతో దిక్కుతోచని పలువురు డీలర్‌షిప్ నుంచి తప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఉప్పల్‌లో ఇద్దరు, మల్కాజిగిరి, కాప్రాలో ఒకరు, బాలానగర్‌లో ఇద్దరు, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి సర్కిళ్లలో ఒక్కొక్కరు చొప్పున డీలర్ షిప్‌కు రాజీనామా చేశారు. ఈ పరిణామాలను ముందే ఊహించిన అధికారులు మాత్రం.. ఇన్నాళ్లు సరుకు బ్లాక్ మార్కెట్‌కు తరలించి జేబులు నింపుకున్నారని, ఇప్పుడు దానికి బ్రేక్ పడుతుందని భయపడే ముందస్తుగానే డీలర్లుగా వైదొలుగుతున్నారని అంటున్నారు. బినామీ డీలర్లే రాజీనామాలు చేస్తున్నారని మరికొందరు చెబుతున్నారు.
కాగా, రేషన్ డీలర్లకు ప్రభుత్వం చెల్లిస్తున్న కమీషన్‌పై పునరాలోచన చేయాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి లేఖ రాసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో రేషన్ షాపుల నిర్వహణ భారంగా మారినందున.. కమీషన్‌ను పెంచాలని సిఫార్సు చేసింది. ప్రస్తుతం వర్తింజేస్తున్న కమీషన్‌ను రెట్టింపు చేసిన కొన్ని దుకాణాలు నష్టాల్లోనే నడిచే అవకాశమున్నందున.. కార్డుల ప్రాతిపదికన కమీషన్‌ను నిర్దేశించాలని కోరింది. కార్మికశాఖ లెక్కల ప్రకారం నెలకు 26 రోజులు పనిచేసే కూలీకి రూ.275 నుంచి రూ.287 చెల్లించినా నెలకు రూ.7152 లేదా 7482 వస్తుందని, అలాంటిది చౌక దుకాణం నిర్వహించే డీలరుకు ఆస్థాయిలో కమీషన్ ఇవ్వకపోవడం సహేతుకం కాదని అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే ఇటీవల రేషన్ డీలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి.. సాధకబాధకాలను తెలుసుకుంది. దీనికి అనుగుణంగా వారిచ్చిన నివేదికను మదింపు చేసి.. రేషన్ షాపుల నిర్వహణ ఖర్చులను లెక్కించింది.