ఆగస్టు 1నుంచి అమలుకు ఏర్పాట్లు
500 డిపోలకు బయోమెట్రిక్ మెషిన్లు
మండలాలకు చేరిన పరికరాలు
డీలర్లకు పూర్తయిన శిక్షణ
అక్రమాల నిరోధమే లక్ష్యం
నరసన్నపేట :సాంకేతిక పరిజ్ఞానంతో క్షేత్ర స్థాయిలో రేషన్‌సరకుల పంపిణీలో అక్రమాలను నివారించేందుకు జిల్లా పౌర సరఫరాల విభాగం సన్నద్ధమైంది. ఆగస్టు ఒకటి నుంచి జిల్లాలో రెండో విడతగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 500 రేషన్‌డిపోల్లో ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్స్(ఈ-పాస్) అమలుచేయనున్నారు. ఇందుకు అవసరమైన కసరత్తు ఇప్పటికే పూర్తయింది. నియోజకవర్గ స్థాయిలో డీలర్లకు ఈ -పాస్ యంత్రాల వినియోగంపై శిక్షణ కూడా పూర్తి చేశారు. ఇందులో భాగంగా నరసన్నపేటలో 21న నాలుగు మండలాలకు చెందిన డీలర్లకు శిక్షణ నిచ్చారు. ఈ-పాస్ అమలైతే రేషన్‌డిపోల్లో అక్రమాలను అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. మొదటి విడతగా మండల కేంద్రాలు, మున్సిపాల్టీల్లోని 282 రేషన్‌డిపోల్లో అమలు చేశారు. ఒక్క నరసన్నపేట మండలంలోనే నెలకు 50 క్వింటాళ్ల వరకూ బియ్యం ఆదా కన్పించింది. 500 కార్డు దారులు సరుకులు విడిపించలేదు. దీనివల్ల ప్రభుత్వానికి మంచి ఆదాయం వచ్చింది. ఇక పల్లెల్లోనూ వీటిని ఉపయోగించడం ద్వారా మరిన్ని ఫలితాలు సాధించవచ్చని, ప్రభుత్వానికి అధికంగా మిగులు చూపించవచ్చని అధికారులు భావించి ఆగస్టు నుంచి అమలుకు ఏర్పాట్లు చేశారు.
జిల్లాలో ఉన్న అన్ని రేషన్ షాపుల్లో మరో రెండు నెలల్లో ఈ-పాస్ అమలు కానుంది. జిల్లాలో మొత్తం 2020 రేషన్‌షాపులున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ-పాస్ అమలైతే 20 శాతం వరకూ సరకులు మిగిలే అవకాశం ఉంది. ఆమదాలవలసలో 15, సరుబుజ్జిలి మండలంలో 13, బూర్జలో 11, పొందూరులో 13 డిపోల్లో ఈ-పాస్ అమలు కానుంది. అలాగే ఎచ్చెర్ల, కంచిలి, పోలాకి, సోంపేట, జలుమూరు, పాలకొండ, మందస, మెళియాపుట్టి, పాతపట్నం, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, రేగిడి ఆమదాలవలస, సంతకవిటి, గార, కోటబొమ్మాళి, నందిగాం, సంతకవిటిమండలాల్లో 13 డిపోల చొప్పున్న ఈ-పాస్ అమలు చేయనున్నారు. అలాగే లావేరు, రణస్థలం, నరసన్నపేట, కొత్తూరు, రాజాం మండలాల్లో 15 డిపోలు చొప్పున అమలు చేస్తారు. జి.సిగడాంలో 11, ఇచ్ఛాపురంలో 14, కవిటిలో 12, భామినిలో11, సీతంపేటలో 8, పలాసలో10, వీరఘట్టంలో 11, వంగరలో 12, శ్రీకాకుళం రూరల్ మండలంలో 20, టెక్కలిలో 17 డిపోల్లో ఈ-పాస్ అమలు చేస్తారు.
డీలర్లలో ఆందోళన
జిల్లా సివిల్ సపై్ల అధికారులు ఈ-పాస్ అమలుకు ఒక వైపు చర్యలు తీసుకుంటుంటే మరో వైపు రేషన్ డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ పాస్‌తో చిన్న తప్పు చేయలేమనీ, కచ్చినమైన తూకం అమలు చేయాలని దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని భయపడుతున్నారు. అన్ని స్థాయిల్లో అధికారులకు నెలవారీ మామూళ్లు చెల్లించుకుని నిజాయితీగా సరకులు అందిస్తే తాము చేతులు కాల్చుకోవాల్సిందేనని వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి బియ్యం, పంచదార, పప్పు ఇతర సరుకులు ఇస్తున్నప్పుడు తూకంవేసి అప్పగించడంలేదనీ, ప్రతీ బస్తాకు కనీసం రెండు నుంచి 4 కేజీలు తరుగు ఉంటోందని చెబుతున్నారు. ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారని ప్రశ్నిస్తున్నారు. కమీషన్ పెంచకుండా... నిర్బంధంగా ఈపాస్ అమలు చేస్తే డీలర్‌షిప్ కొనసాగించలేమని స్పష్టం చేస్తున్నారు.
ఎంఎల్‌ఎస్ పాయింట్లో తూకంవేసి సరకులు అప్పగించాలి
ఈ-పాస్ అమలు మంచిదే. అయితే మమ్మల్ని ఇబ్బంది పెట్టి, నష్టాలకు గురి చేసి ఈ పద్ధతి అమలు చేయడం సరికాదు. ఈ-పాస్ అమలు చేస్తున్న డిపోలకు కచ్చితంగా సరకులు సరైన తూకంతో అప్పగించాలి. అలాగైతే పూర్తిగా సహకరిస్తాం. డీలర్లకు ఇచ్చే కమీషన్ పెంచాలి. ఇతర ఖర్చులుతగ్గించాలి.పాసిన ఆదెయ్య. డీలరు, గంగివలస
పల్లెల్లోనూ ఈ- పాస్
Published Wed, Jul 29 2015 2:45 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 AM
Advertisement