కనువిందు చేసే పచ్చని చెట్లు... బడలికను పోగొట్టే చల్లగాలి... ఎవరైనా సరే ఆ మార్గంలో ఒకసారి ప్రయాణిస్తే ఫిదా అవ్వాల్సిందే. మళ్లీ మళ్లీ ఆ దారిలో వెళ్లాలనే కోరిక తట్టాల్సిందే. రహదారికి పచ్చటి తోరణం కట్టినట్లుండి.. వాటి కిందకు వెళ్లగానే ఏదో గుహలోకి ప్రవేశించినట్లుగా కలిగే అనుభూతి ప్రయాణికులను కొద్దిసేపు అక్కడ ఆగేలా చేస్తోంది. అనంతపురం జిల్లా గార్లదిన్నె నుంచి మిడ్‌పెన్నార్ డ్యాంకు వెళ్లే మార్గంలో రోడ్డుకిరువైపులా చెట్లు ప్రయాణికులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పరిసర ప్రాంతాలు అంటే గుర్తుకువచ్చేది పత్తి, మిర్చి సాగు. దశాబ్దాలుగా ఇవే పంటలు ఈ ప్రాంతంలో సాగుచేస్తుంటారు. కానీ ఇటీవల ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగానే బంతి పూల తోటలు కూడా సాగుచేశారు. గుంటూరు పర్చూరు పాత మద్రాసు రోడ్డు వెంబడి పుల్లడిగుంట సమీపంలో పండించిన బంతి పూలు పసుపు, ఆరెంజ్ రంగుల్లో చూపరులను ఆకర్షిస్తున్నాయి.
నిత్యం అలలతో ఎగసి పడే సంద్రం.. వెనక్కు తగ్గింది. ఇప్పటి వరకు అలల మాటున ఉన్న శిలలు అందమైన ఆకృతులతో సరికొత్తగా పరిచయం చేసుకున్నాయి. వాతావరణ మార్పులతో సముద్రం వెనక్కు వెళ్లడంతో విశాఖ బీచ్‌లోని వైఎంసీఏ ప్రాంతంలో నల్లని రాళ్లు కనువిందు చేశాయి. దీంతో సందర్శకులు సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం
కాకినాడ జిల్లా తుని పట్టణంలోని ఓ రైతుకు చెందిన నాటుకోడి అతి చిన్న గుడ్డు పెట్టడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. రైతు గండి రమణ నాటు కోళ్లు పెంచుతున్నారు. ఇందులో ఒక పెట్ట ముందు రోజు సాధారణ పరిమాణం కలిగిన గుడ్డు పెట్టగా.. మంగళవారం చిన్న గుడ్డు పెట్టింది. జన్యుపరమైన లోపం వల్ల ఇలా జరుగుతుందని పశు వైద్యుడు శ్రీధర్ చెప్పారు.
విశాఖ కేంద్ర కారాగారం ఆవరణలో సీజనల్ పంటలు పండిస్తున్నారు. ప్రస్తుతం శీతాకాలం కూరగాయల పంటలు ప్రారంభమయ్యాయి. కొన్ని కాపు దశకు వచ్చాయి. జైలులో ఉండే ఓపెన్ ఎయిర్ ఖైదీలచే రసాయనిక ఎరువుల్లేకుండా అధికారులు ఇక్కడ పంటలు పండిస్తుంటారు. జైలు లోపల మామిడి, కొబ్బరితోపాటు, బయట ఆవరణ సుమారు 20 ఎకరాల్లో సీజనల్ పంటలు పండించి వాటిని ఖైదీలకు వినియోగిస్తుంటారు. మిగిలిన వాటిని జైలు గేటు ముందు బీఆర్‌టీఎస్ పక్కన సుధార్ కేంద్రంలో విక్రయిస్తుంటారు. ప్రస్తుతం వంగ, బీర, క్యాబేజీ, టమాటా, ఆనప (సొర) సాగు చేస్తున్నారు. ఈ పంటలతో జైలు ఆవరణ అన్ని కాలాల్లోను పచ్చదనంతో కళకళలాడుతోంది.
తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కిన ఘటన సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. మండలంలోని వీర్నమల ఎస్సీ కాలనీలో మూడు నెలలుగా తాగునీటి సమస్యతో సతమతమవుతున్నామని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. ఎస్సీ కాలనీలో ఉన్న బోరులో నీరు ఇంకిపోవడంతో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చిందని, డబ్బులిచ్చి నీళ్లు కొనుక్కోవాల్సిన ఖర్మ పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోకపోవడంతో వారంతా ఖాళీ బిందెలతో ఆంధ్ర–తమిళనాడు సరిహద్దు రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఈ కారణంగా వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది.
చౌక దుకాణాల వద్ద రేషన్ కోసం లబ్ధిదారులు గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి మళ్లీ ఎదురైంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో ఇంటి వద్దకే రేషన్ పథకాన్ని అమలు చేసింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాల్లో ఈ వ్యవహారాన్ని తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు. చిత్తూరులోని 27వ వార్డు చామంతిపురం రేషన్‌షాపు వద్ద మంగళవారం ప్రజలు రేషన్ కోసం గంటల కొద్దీ పడిగాపులు కాశారు. గంటల కొద్దీ నిలబడలేక తాము తెచ్చుకున్న సంచులను వరుస క్రమంలో పెట్టారు. సమీపంలోని 28వ వార్డులో, మరికొన్ని మండలాల్లో సైతం ఇదే పరిస్థితులు ఉన్నట్లు సమాచారం. దీంతో ప్రజలు గత ప్రభుత్వ పాలనే బాగుందని వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment