ఆదిలోనే మొరాయింపు
►నిరుపయోగంగా బయోమెట్రిక్ యంత్రాలు
►పాఠశాలల్లో అమలుకాని ఈ–హాజరు
►చోద్యం చూస్తున్న అధికారులు
ఉపాధ్యాయులు, విద్యార్థులు సమయపాలన పాటించడం, మధ్యాహ్నభోజనంలో అక్రమాలు నిరోధించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఉన్నత పాఠశాలల్లో ఈ–హాజరు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇందుకు గాను కోట్ల రూపాయల వ్యయంతో బయోమెట్రిక్ యంత్రాలు అందజేసి సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. కానీ ప్రారంభంలోనే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ–హాజరు అటకెక్కింది.
బద్వేలులోని ఉన్నత పాఠశాలలో దాదాపు 1,100 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ బయోమెట్రిక్ హాజరు నమోదు చేసేందుకు పది యంత్రాలను ప్రభుత్వం అందజేసింది. కానీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఉపయోగించలేదు. ఉపాధ్యాయులు,విద్యార్థులు హాజరు వేయలేదు. జిల్లాలో 3,178 పాఠశాలలు ఉండగా వీటిలో 11,743 మంది ఉపాధ్యాయులు ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. మొదటి విడతగా 361 పాఠశాలలో ఈ–హాజరు ప్రవేశపెట్టారు. వీటిల్లో ఉన్న 3,764 మంది ఉపాధ్యాయులు, 55,886 మంది విద్యార్థులు బయోమెట్రిక్ హాజరు వేయాలని పేర్కొన్నారు. ఇందుకుగాను మొత్తం 5,129 బయోమెట్రిక్, ఐరిష్ యంత్రాలు అవసరమవుతాయని నిర్ణయించారు. ఇప్పటి వరకు 359 ఉన్నత పాఠశాలల్లో 989 యంత్రాలను రిజిస్టర్ చేశారు. మిగిలినవి అందజేసినా వాటిని రిజిస్టర్ చేయకుండా బీరువాల్లో భద్రపరిచారు.
ఒక శాతం ఉపాధ్యాయులు కూడా బయోమెట్రిక్ యంత్రాలను ఉపయోగించడం లేదు. విద్యార్థుల ఈ–హాజరు శాతం సున్నా. జిల్లాలో ప్రతి రోజు ఐదు యంత్రాలను మాత్రమే వినియోగిస్తున్నారు. ఈ నెల 17న పరిశీలించగా 13మంది ఉపాధ్యాయులు ఈ–హాజరు వేశారు. వారిలో కొండాపురం మండలంలో ఆరుగురు, దువ్వూరులో ఐదుగురు, వీరబల్లి, చిన్నమండెం మండలాలలో ఒకరు వంతున ఈ–హాజరు నమోదు చేశారు. 18న కొండాపురంలో 11 మంది, దువ్వూరులో ఐదుగురు, వీరబల్లిలో నలుగురు, చిన్నమండెంలో ఒకరు వంతున హాజరు నమోదు చేశారు. 19న కొండాపురంలో 9 మంది , దువ్వూరులో ఇద్దరు, ఒంటిమిట్టలో ముగ్గురు, వీరబల్లిలో నలుగురు, చిన్నమండెంలో ముగ్గురు మాత్రమే బయోమెట్రిక్ హాజరు వేశారు.
పని చేయకపోవడంతోనే...
బయోమెట్రిక్ హాజరుకు ప్రభుత్వం అందజేసిన యంత్రాలు నాసిరకంగా ఉన్నాయని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. కొన్నిచోట్ల 3–జీ నెట్‌వర్క్ ఉండకపోవడంతో హాజరు వేయడం కుదరడం లేదని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వేద్దామన్నా ఒక్కో పర్యాయం 3 నుంచి 5 నిమిషాల వరకు సమయం పడుతుందంటున్నారు. ఒక్కో యంత్రంలో వందమంది విద్యార్థులు హాజరు వేయాలని నిర్ణయించారు. నెట్‌వర్క్ సరిగా లేని సమయంలో వంద మంది నమోదు చేయాలంటే 3 నుంచి 4 గంటల సమయం పట్టవచ్చని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఒక్కొ యంత్రానికి ప్రభుత్వం రూ.7వేలకు పైనే వెచ్చించిందని సమాచారం. ఈ లెక్కన రూ.లక్షల ఖర్చు చేసి అందజేసిన యంత్రాలు మూలన పడటంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ–హాజరు విషయమై ఆయా పాఠశాలల నుంచి ఒక్కో ఉపాధ్యాయుడిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు.
అవగాహన లోపం.. అందని సాంకేతిక సహాయం
యంత్రాల వినియోగంలో చిన్నపాటి సాంకేతిక సమస్య వచ్చినా పరిష్కరించలేక ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు చేతులెత్తేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యుత్ సమస్య కూడా ఉండటంతో చార్జింగ్ విషయంలో ఇబ్బందులు వస్తున్నాయి. ఈ విషయాలు ప్రభుత్వం దృష్టికి వచ్చినా సమస్య పరిష్కరించడంలో చొరవ చూపడం లేదు. వీటిని సరఫరా చేసిన ఏజెన్సీ నిర్వాహకులు సహకారం అంతంతమాత్రమే. సాంకేతిక సమస్యలపై ఫిర్యాదు చేస్తే తాము ఇచ్చే సమయంలో సరిగానే ఉన్నాయని చెబుతూ తప్పించుకుంటున్నారని కొంతమంది ఉపాధ్యాయులు చెబుతున్నారు.