ఇదేం ‘లెక్క’ | Classes 6 And 7 Physics Teachers Are Instructed To Teach Mathematics: Telangana | Sakshi
Sakshi News home page

ఇదేం ‘లెక్క’

Published Mon, Jun 3 2024 3:39 AM | Last Updated on Mon, Jun 3 2024 3:39 AM

Classes 6 And 7 Physics Teachers Are Instructed To Teach Mathematics: Telangana

ఫిజిక్స్‌ టీచర్లు 6,7 తరగతులకు గణితం చెప్పాలని ఉత్తర్వులు 

అదనపు క్లాసులు చెప్పాలనడం అన్యాయమంటున్న ఫిజిక్స్‌ టీచర్లు 

స్కూళ్లు తెరిచే ముందు కొత్త పంచాయితీ

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పనిచేసే ఫిజిక్స్‌ టీచర్లు ఇక నుంచి ఆరు, ఏడు తరగతుల విద్యార్థులకు గణితం సబ్జెక్టు బోధించాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇది అన్యాయమంటూ ఫిజిక్స్‌ టీచర్లు ఉన్నతాధికారులను కలిశారు. దీనివల్ల తమకు తీవ్ర మానసికఒత్తిడి కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

గణితం బోధించే ఉపాధ్యాయులకు తక్కువ పనిగంటలు ఉంటాయని, తామే ఎక్కువ గంటలు పనిచేస్తామని, అయినా అదనంగా గణితం బోధించమనడం ఏమిటని ప్రశ్నించారు. అసలిది పాత విషయమేనని అనవసరంగా పెద్దది చేస్తున్నారని గణితం టీచర్లు అంటున్నారు. పరస్పర వాదనల నేపథ్యంలో ఈ ఏడాది బోధనకు ఏ స్థాయిలో సమస్య తలెత్తుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలూ ఆందోళన చెందుతున్నాయి.  

అసలేంటీ పంచాయితీ 
గతంలో ఫిజిక్స్‌ సబ్జెక్టు గణితం వారు, కెమిస్ట్రీ సబ్జెక్టు బయలాజికల్‌ సైన్స్‌ వారు చెప్పేవారు. 2000లో ఫిజికల్‌ సైన్స్‌ పోస్టులు మంజూరు చేసి, 2002లో భర్తీ చేశారు. ఆ సమయంలో ప్రభుత్వం ఓ టైంటేబుల్‌తో సర్క్యులర్‌ ఇచ్చింది. ఇందులో 8, 9, 10 ఫిజిక్స్‌ చెప్పాలని, 6, 7 తరగతులకు గణితం చెప్పాలని పేర్కొంది. 2017 వరకూ ఈ విధానం కొనసాగింది. 2017 తర్వాత సిలబస్‌లో మార్పులొచ్చాయి. గణితం వారికి ఎక్కువ బోధన, సైన్స్‌ వారికి తక్కువ బోధన క్లాసులు ఉన్నాయనే వాదన తెరమీదకొచ్చింది.

అప్పట్లో ఎస్‌ఈఆర్‌టీ 2017లో 6వ తరగతి గణితంను ఫిజిక్స్‌ టీచర్లు, 7వ తరగతి గణితంను 10 వరకూ చెప్పే గణితం టీచర్లే చెప్పాలని కొత్త ఆదేశాలు జారీ చేసింది. దీనిపై గణితం టీచర్లు ఆందోళనకు దిగారు. గణితం సబ్జెక్టులోనే ఎక్కువ మంది ఫెయిల్‌ అ వుతున్నారని, మరింత శ్రద్ధ అవసరమని తెలిపారు. దీంతో ఎస్‌సీఈఆర్‌టీ ఇచ్చిన ఆదేశాలు నిలిపివేసింది. అప్పట్నుంచీ వివాదం అలాగే కొనసాగింది. స్థానిక హెచ్‌ఎంలు సర్దుబాటు చేసుకొని క్లాసులు నిర్వహిస్తున్నారు. తాజాగా మళ్లీ ఫిజికల్‌ సైన్స్‌ టీచర్లు 6, 7 క్లాసుల గణితం చెప్పాలని ఆదేశాలివ్వడంతో వివాదం మొదలైంది.  

ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పం  
ఎట్టి పరిస్థితుల్లోనూ 6, 7 తరగతులకు గణితం సబ్జెక్టు బోధించం. దీనివల్ల 8, 9, 10 తరగతుల విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. సైన్స్‌ యాక్టివిటీ అయిన ఇన్‌స్పైర్‌ అవార్డులు, స్కూల్‌ ఇన్నోవేషన్‌ చాలెంజ్,, నేషనల్‌ చిల్డ్రన్స్‌ కాంగ్రెస్‌ తదితర ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టడం కష్టం. గణితం కన్నా భౌతిక, రసాయన శా్రస్తాల బోధనే కష్టం. డిగ్రీలో, బీఈడీలో గణితం చదవాలన్న అర్హత నిబంధనలు లేవు. ఇలా గణితం నేపథ్యం లేని ఫిజిక్స్‌ అధ్యాపకులూ ఉన్నారు. వారిని గణితం బోధించమంటే ఎలా వీలవుతుంది? తక్షణమే ప్రభుత్వం పునరాలోచన చేయాలి.  – అజయ్‌సింగ్, రాష్ట్ర ఫిజికల్‌ సైన్స్‌ టీచర్ల ఫోరం అధ్యక్షుడు  

జరిగే నష్టం ఏమిటి?
ప్రభుత్వ ఉపాధ్యాయులు బీఈడీ చేసిన సమయంలో ఇప్పుడున్న సిలబస్‌ లేదు. ఈ కారణంగా ఫిజిక్స్‌ మినహా 6, 7 తరగతుల గణితం చెప్పాలంటే కొంత ప్రిపేర్‌ అవ్వాల్సి ఉంటుంది. సమయాన్ని ఇలా వెచి్చస్తే కీలకమైన 9, 10 తరగతుల విద్యార్థులకు సైన్స్‌ సబ్జెక్టులో అన్యాయం జరుగుతుందనేది వారి వాదన. జాతీయస్థాయిలో జరిగే నీట్‌కు హాజరయ్యే విద్యార్థులకు 8వ తరగతి నుంచే సైన్స్‌లో గట్టి పునాది పడాలని ఫిజిక్స్‌ టీచర్లు చెబుతున్నారు.

రాష్ట్రంలో ఉన్న టీచర్లలో 25 శాతం మంది ఫిజిక్స్‌ టీచర్లు ఉన్నారు. వీరికన్నా 20 శాతం గణితం టీచర్లు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. అలాంటప్పుడు వారికే 6,7 మేథ్స్‌ బోధన అప్పగించాలని కోరుతున్నారు. స్కూళ్లు తెరిచేలోగా సమస్య పరిష్కరించకపోతే విద్యార్థులు నష్టపోయే ప్రమాదం కనిపిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement