రెండు సెషన్లూ క్లిష్టంగానే..! | Tough questions in the second day of JEE Main exams | Sakshi
Sakshi News home page

రెండు సెషన్లూ క్లిష్టంగానే..!

Published Fri, Jan 24 2025 4:54 AM | Last Updated on Fri, Jan 24 2025 4:54 AM

Tough questions in the second day of JEE Main exams

జేఈఈ మెయిన్‌ రెండోరోజు పరీక్షల్లో కఠిన ప్రశ్నలు

మ్యాథమెటిక్స్‌ మొదటిరోజు మాదిరిగానే సుదీర్ఘం, క్లిష్టం

ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రశ్నలు ఓ మోస్తరు కఠినంగా..

అన్ని ప్రశ్నలూ ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచే..

సాక్షి ఎడ్యుకేషన్‌: జేఈఈ మెయిన్‌ రెండోరోజు గురువారం రెండు సెషన్ల పరీక్షలూ మొదటి రోజుతో పోల్చితే క్లిష్టంగా ఉన్నా యని సబ్జెక్ట్‌ నిపుణులు తెలిపారు. మొదటిరోజు మాదిరిగానే రెండోరోజు కూడా మ్యాథమెటిక్స్‌ ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండడంతో అభ్యర్థులకు సమయం సరిపోలేదు. 

తొలి సెషన్‌లో విద్యార్థులు 55 నుంచి 60 ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వగలిగారు. ఫిజిక్స్‌లో కొన్ని సులభంగా, మరికొన్ని ఓ మోస్తరు క్లిష్టతతో ఉన్నాయి. కెమిస్ట్రీలో ప్రశ్నలన్నీ ఓ మోస్తరు క్లిష్టతతో అడిగారు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లో ద్వితీయ సంవత్సరం సిలబస్‌కు ఎక్కువ ప్రాధాన్యం కల్పించారు.

కొన్ని టాపిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత
రెండు సెషన్లలోనూ.. మూడు సబ్జెక్ట్‌ల ప్రశ్నలను పరిశీలిస్తే కొన్ని టాపిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత కనిపించింది. మ్యాథమెటిక్స్‌లో సిరీస్‌ (2 ప్రశ్నలు), ఇంటిగ్రెల్‌ కాలిక్యులస్‌ (4 ప్రశ్నలు), 3–డి వెక్టార్‌ అల్జీబ్రా (3 ప్రశ్నలు), కానిక్స్‌ (3 ప్రశ్నలు)కు ప్రాధాన్యత ఇచ్చారు. 

సిరీస్, కానిక్స్, పెర్ముటేషన్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, ఇన్వర్స్‌ ట్రిగనోమెట్రీ ప్రశ్నలు సులభంగా ఉన్నాయి. అయితే ఈ సబ్జెక్ట్‌లో దాదాపు ఏడు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఎక్కువ సమయం పట్టింది. 

కెమిస్ట్రీలో ఆర్గానిక్‌ కెమిస్ట్రీ (9 ప్రశ్నలు), పిరియాడిక్‌ టేబుల్‌ (2 ప్రశ్నలు), అటామిక్‌ స్ట్రక్చర్‌ (2 ప్రశ్నలు), కెమికల్‌ బాండింగ్‌ (2 ప్రశ్నలు)కు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. ఫిజిక్స్‌లో హీట్‌ అండ్‌ థర్మో డైనమిక్స్‌ (2 ప్రశ్నలు), ఎలక్ట్రిసిటీ (3 ప్రశ్నలు), ఏసీ సర్క్యూట్‌ (2 ప్రశ్నలు)కు వెయిటేజీ లభించింది. 

50% ప్రశ్నలు ఫార్ములా, కాన్సెప్ట్స్‌ ఆధారంగానే..
ఫిజిక్స్, కెమిస్ట్రీలలో దాదాపు 50 శాతం ప్రశ్నలు డైరెక్ట్‌ ఫార్ములా, కాన్సెప్ట్‌ ఆధారంగా సమాధానం ఇవ్వాల్సినవే ఉన్నాయి. దీంతో సబ్జెక్ట్‌ను పూర్తిగా చదివిన వారికే సమాధానం ఇచ్చే నేర్పు ఉంటుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. రెండోరోజు కూడా 2021, 2022 జేఈఈ మెయిన్‌ పేపర్స్‌ నుంచే ఎక్కువ ప్రశ్నలు అడగడం గమనార్హం. 

అదే విధంగా ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచే అన్ని ప్రశ్నలు ఉన్నాయని సబ్జెక్ట్‌ నిపుణులు ఎంఎన్‌ రావు తెలిపారు. పరీక్షకు సాధారణ స్థాయిలో ప్రిపరేషన్‌ సాగించిన విద్యార్థులకు 120 మార్కులు, పూర్తి స్థాయి పట్టు సాధించిన వారికి 270కు పైగా మార్కులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

బెంగళూరు సెంటర్‌లో రీ షెడ్యూల్‌
ఈ నెల 22వ తేదీన బెంగళూరులోని ఒక పరీక్షా కేంద్రంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా మొదటి సెషన్‌ పరీక్ష నిలిచిపోయింది. దీంతో ఆ సెంటర్‌లోని 114 మంది విద్యార్థులకు ఈ నెల 28 లేదా 29న పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement