![22 Teachers Transferred On Filmnagar Government High School](/styles/webp/s3/article_images/2024/06/18/teachers.jpg.webp?itok=eYM2USsC)
ఒకే బడిలోంచి 22 మంది టీచర్ల బదిలీపై అధికారుల ఆరా
ఫిలింనగర్: రాష్ట్రంలో ఏ ప్రభుత్వ పాఠశాలలోనూ లేని సమస్యను ఫిలింనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎదుర్కొంటోంది. ఈ పాఠశాలకు చెందిన 22 మంది టీచర్లు ఒకేసారి బదిలీ కావడానికి గల కారణాలపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.
మూడురోజుల క్రితం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ టీచర్ల మూకుమ్మడి బదిలీలపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 948 మంది విద్యార్థులున్న ఈ బడిలో ఇప్పుడు హెచ్‌ఎంతోపాటు ఇంకొక టీచర్ మాత్రమే మిగిలారు. కొత్తగా విద్యార్థులు చేరడం లేదు. బోధన సాగడంలేదు. ఇక్కడ తెలుగు మీడియం బోధనను పూర్తిగా తొలగించారు. పదో తరగతిలోని తెలుగు మీడియం విద్యార్థులను ఒక్కసారిగా ఇంగ్లిష్ మీడియంలోకి మార్చడంతో దిక్కుతోచక తలలు పట్టుకుంటున్నారు.
ఈ పాఠశాలకు రావడానికి టీచర్లు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఒక్క ఈ పాఠశాలకే టీచర్లు ఎందుకు రావడం లేదు, ఉన్న టీచర్లు ఎందుకు వెళ్లారు.. అన్నదానిపై విచారణ చేపట్టాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. చాలామంది విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నారు. ఇదే జరిగితే స్కూల్‌లో విద్యార్థుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment