బడిబాటలో టీచర్లకు ఝలక్..
అల్లాదుర్గం: మెదక్ జిల్లా అల్లాదుర్గంలో బుధవారం చేపట్టిన బడిబాట కార్యక్రమం టీచర్లకు చేదు అనుభవం ఎదురైంది. స్థానిక జిల్లా పరిషత్ బాలికల పాఠశాల టీచర్లు గ్రామంలో బుధవారం బడిబాట ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి తమ పాఠశాలలో నాణ్యమైన విద్యనందిస్తామని, పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు.
దీంతో ముచ్చుల సంగమేశ్వర్ అనే వ్యక్తి మీ పిల్లలు ఏ పాఠశాలలో చదివిస్తున్నారని టీచర్లను ఎదురు ప్రశ్నించారు. ప్రైవేట్ పాఠశాలలో అని ఉపాధ్యాయ బృందం బదులిచ్చింది. దీంతో ఆయన మీరు మాత్రం మీ పిల్లలను మంచి ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తారు. మా పిల్లలను మాత్రం ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించమని అడుగుతారా... అంటూ నిలదీయడంతో దీంతో టీచర్లు అవాకయ్యారు. ‘మీ ఇష్టం ఉంటే చేర్పించండి.. లేకుంటే ఎక్కడైనా చదివించుకోండి..’ అని చెప్పి వెనుతిరిగారు. పాఠశాలలో పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించామని, విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకుంటూ విద్యబోధన ప్రైవేటుకు దీటుగా అందిస్తున్నామని హెచ్‌ఎం అనూరాధ విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తూ విద్యార్థులను చేర్పించే ప్రయత్నం చేశారు.