పిల్లలు... పరిమళించాలి
పిల్లలు ఎలా ఉండాలి? వికసించే పువ్వుల్లా ఉండాలి. సంతోషానికి చిరునామాలా ఉండాలి. ఆందోళన అంటే ఏమిటో తెలియకుండా పెరగాలి. స్కూల్ బ్యాగ్‌లో భవిష్యత్తును నింపుకెళ్లిన పిల్లలు...
అదే స్కూల్ బ్యాగ్‌లో భయాన్ని పోగుచేసుకుని వస్తే... తల్లిదండ్రులు అప్పుడేం చేయాలి? పిల్లలను దగ్గరకు తీసుకోవాలి... చేతల్లో ధైర్యాన్నివ్వాలి. ఆనందాల రెక్కలను విరిచేసే దుష్టశక్తుల బారి నుంచి కాపాడాలి. పువ్వుల్లా పరిమళించడానికి కావల్సినంత భరోసా కల్పించాలి.
స్కూల్లో అందరు పిల్లలూ ఒకేలా చేరుతారు. స్నేహానికి చిరునామాల్లా, ఉత్సాహంగా ఉంటారు. కొందరు అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తుంటే, మరికొందరు మాత్రం వెనుకపడుతుంటారు. స్వతహాగా ఉండే ఐక్యూ లెవెల్స్ పరిమితులకు లోబడి చదువులో వెనుకబడడం కాదిది. ఉత్సాహంగా ఉంటే పిల్లలు కూడా నిరుత్సాహంగా మారి అన్నింటిలోనూ వెనుకబడుతుంటారు. ఆ వెనుకబాటు వెనుక వాళ్లను వెనుకపడేటట్లు చేసిన కారణం ఏదో ఉండే ఉంటుంది. ఎందుకు బిడియపడుతున్నారో, ఎందుకు తమను తాము ఒంటరిని చేసుకున్నారో బయటకు తెలియదు.
ఆ పిల్లల ప్రవర్తనలో అనారోగ్యకరమైన మార్పు మొదలవుతుంది. అది క్రమంగా మొండితనానికి, ధిక్కారతకు దారి తీస్తుంటుంది. స్కూల్ డైరీలో ‘డిస్ ఒబీడియెంట్, ప్రాబ్లమాటిక్ బిహేవియర్ అనే పదాలతో పేరెంట్స్‌కి పిలుపు వస్తుంది. ఆ పరిస్థితి పేరెంట్స్‌కి ఊహించని శరాఘాతం. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని అయోమయంలో, కొంత అపరాధ భావానికి లోనయ్యి, ఓవర్‌గా రియాక్ట్ అవుతూ పిల్లలను దోషులుగా నిలబెడుతుంటారు. ఈ పరిస్థితిని జాగ్రత్తగా సరిదిద్దకపోతే పిల్లలు దిక్కారతను అలాగే కొనసాగిస్తారు. ఈ సిచ్యుయేషన్ని సున్నితంగా డీల్ చేయడానికి కొన్ని సూచనలు చేశారు క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ సుదర్శిని.
పిల్లలు అద్దం వంటి వాళ్లు
‘‘పిల్లల్లో చురుకుదనం తగ్గడం, ఎప్పుడూ డల్‌గా ఉండడం, నిద్రలో ఉలిక్కి పడడం వంటివి కనిపిస్తుంటాయి. పిల్లల మనసులో చెలరేగిన అనేక ఆందోళనలు, భయాలు, అవమానం, అపరాధ భావం వంటి అనేక సమస్యలను వ్యక్తం చేసే లక్షణాలివి. ఈ లక్షణాలను గమనించిన తర్వాత ఇక ఆలస్యం చేయకూడదు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు దగ్గర కూర్చుని పిల్లలను మాటల్లో పెట్టాలి. నేరుగా ‘ఎందుకిలా ఉన్నావని’ అడిగే సమాధానం రాదు. స్కూలు గురించి, ఫ్రెండ్స్ గురించి కదిపితే వాళ్లే ఒక్కొక్కటీ చెప్పడం మొదలుపెడతారు.
ఆ చెప్పిన కబుర్లలోనే కారణాలు ఉంటాయి. స్కూల్లో తోటి విద్యార్థులు బాడీ షేమింగ్, బుల్లీయింగ్, ఫిజికల్– ఎమోషనల్ అబ్యూజ్ చేస్తున్నట్లు, భయపెడుతున్నట్లు, బెదిరిస్తున్నట్లు అనిపిస్తే ఆ విషయాన్ని నిర్ధారించుకోవడానికి పిల్లలను ఒకటికి రెండుసార్లు గద్దించి అడగడం ఏ మాత్రం సరికాదు. పిల్లలు మరింతగా బిగుసుకుపోతారు, కాబట్టి వాళ్ల క్లాస్ టీచర్ దృష్టికి తీసుకువెళ్లాలి. అయితే ఇక్కడ మన పిల్లల్ని అబ్యూజ్ చేస్తున్న పిల్లలను దోషులుగా, నేరస్థులుగా చూడవద్దు. వాళ్లూ పసిపిల్లలేనని మర్చిపోవద్దు. అయితే వాళ్లు ఆరోగ్యకరంగా పెరగడం లేదని అర్థం. ఎందుకంటే... పిల్లలు తాము దేనిని తీసుకుంటారో దానినే డెలివర్ చేస్తారు.
అమ్మానాన్నలు మరెవరినో ఉద్దేశించి ‘వాళ్ల ఎత్తుపళ్ల గురించో, నడక తీరు మీదనో, దేహం లావు– సన్నం, పొడవు, పొట్టి వంటి విషయాల్లో కామెంట్స్ చేసి నవ్వుతూ ఉంటే’ పిల్లలకు అదే అలవాటవుతుంది. పిల్లలు వాళ్లు చూసిన దాన్ని స్కూల్లో తోటి పిల్లల మీద ప్రదర్శిస్తారు. నిజానికి ఎదుటి వాళ్లను అనుకరిస్తూ గేలి చేయడం, లోపాలను ఎత్తి చూపుతూ ఎగతాళి చేయడం అనేది అభద్రతలో ఉంటూ, ఆత్మవిశ్వాసం లేని వాళ్లు చేసే పని. ఆ పని ఇంట్లో పేరెంట్స్ చేస్తుంటే పిల్లలకు అలవడుతుంది. బాల్యంలో ఇలాంటి బీజాలు పడితే ఇక అలాంటి వాళ్లు జీవితాంతం ఏదో ఒక సందర్భంలో ఈ లక్షణాలను బహిర్గతం చేస్తూనే ఉంటారు. జీవితంలో ప్రతి రిలేషన్షిప్కీ విఘాతం కలిగించుకుంటూ ఉంటారు. కాబట్టి చిన్నప్పుడే సరిదిద్దాలి.
బొమ్మల్లో వ్యక్తమవుతుంది
పిల్లలు మూడీగా ఉంటున్నట్లు గమనిస్తే వాళ్లను డ్రాయింగ్, క్లేతో బొమ్మలు చేయడంలో ఎంగేజ్ చేయాలి. ఇది మంచి స్ట్రెస్ బస్టర్ మాత్రమే కాదు, చక్కటి పరిష్కారమార్గం కూడా. బొమ్మలు వేయడం, బొమ్మలు చేయడం ఒత్తిడికి అవుట్లెట్లా పని చేస్తుంది. మాటల్లో చెప్పలేని విషయాలు బొమ్మల్లో వ్యక్తమవుతాయి. ఆ బొమ్మల్లోని పాత్రలు... పిల్లల్లో దాగి ఉన్న కోపాన్ని, ఇష్టాన్ని, అయిష్టాన్ని, భయాన్ని, బాధించే గుణాన్ని కూడా ప్రతిబింబిస్తుంటాయి. పిల్లల మానసిక సంఘర్షణకు అద్దం పడతాయి. పిల్లల మనసు చదవడానికి ఆ బొమ్మలు ఉపయోగపడతాయి. బాధించే పిల్లలు, బాధితులయ్యే పిల్లలను అధ్యయనం చేయడానికి కూడా ఇదే సరైన మార్గం.
బిహేవియరల్ ప్రాబ్లెమ్స్‌తో మా దగ్గరకు తీసుకువచ్చిన పిల్లలకు మేమిచ్చే మొదటి టాస్క్ కూడా అదే. తల్లిదండ్రులకు సూచన ఏమిటంటే... పిల్లలు డల్‌గా ఉంటే ఉపేక్షించవద్దు, అలాగే మీ పిల్లల మీద టీచర్ నుంచి కంప్లయింట్ వస్తే ఆవేశపడవద్దు. టీచర్ ఒక సూచన చేశారంటే ఆ సూచన వెనుక బలమైన కారణం ఉండి తీరుతుందని గ్రహించాలి. టీచర్లు కూడా పిల్లల కాండక్ట్ మీద డిజ్ ఒబీడియెన్స్, బిహేవియరల్ ప్రాబ్లమ్స్’ అని రాసే ముందు వాళ్ల పేరెంట్స్‌కు అర్థమయ్యేలా వివరించి చెప్పగలగాలి. ఎందుకంటే పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దగలిగేది పేరెంట్స్– టీచర్స్ మధ్య సమన్వయం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది’’ అని వివరించారు డాక్టర్ సుదర్శిని. పిల్లల మనసు సున్నితం. పువ్వులాంటి పిల్లలు పువ్వుల్లానే పెరగాలి. వారి భవిష్యత్తు సుమపరిమళాలతో వికసించాలి.
బాధించే పిల్లల మీదా శ్రద్ధ పెట్టాలి!
పిల్లల్లో స్వతహాగానే ఒకరికొకరు సహకరించుకునే తత్వం ఉంటుంది. అలాంటిది టీచర్ ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఆ సమాచారాన్ని కొందరికి తెలియచేసి, వాళ్లకు కోపం ఉన్న పిల్లలకు సమాచారం చేరనివ్వరు, ఆ టాస్క్‌లో ఫెయిల్ అవ్వాలనే దురుద్దేశంతో ఇలాంటి పని చేస్తారు. ఇది ఏ రకంగానూ పిల్లలను వెనకేసుకు రాదగిన విషయం కాదని పేరెంట్స్ గ్రహించాలి. బాధితులవుతున్న పిల్లల పేరెంట్స్ అయితే విషయం తెలియగానే స్పందించి తమ బిడ్డను కాపాడుకుంటారు. కానీ బాధించే పిల్లల తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో తేలిగ్గా తీసుకునే అవకాశం ఉంది. ఇది ఆ పిల్లలకు, సమాజానికి కూడా చాలా ప్రమాదకరం.
– డాక్టర్ సుదర్శిని రెడ్డి సబ్బెళ్ల, క్లినికల్ సైకాలజిస్ట్, జీజీహెచ్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్
– వాకా మంజులారెడ్డి