Safeena Husain: ఆర్మీ ఆఫ్‌ జెండర్‌ చాంపియన్స్‌ | Safeena Husain is the first Indian woman to win the WISE Award for Education 2023 | Sakshi
Sakshi News home page

Safeena Husain: ఆర్మీ ఆఫ్‌ జెండర్‌ చాంపియన్స్‌

Published Thu, Nov 30 2023 1:05 AM | Last Updated on Thu, Nov 30 2023 1:05 AM

Safeena Husain is the first Indian woman to win the WISE Award for Education 2023 - Sakshi

పేదరికంలో పుట్టిన దిల్లీకి చెందిన సఫీనా హుసేన్‌ చదువును నమ్ముకొని ఉన్నత స్థాయికి చేరింది. లండన్‌లో చదువుకున్న సఫీనా అమెరికాలో ఉద్యోగం చేసింది. ఆ తరువాత మన దేశానికి తిరిగి వచ్చి పేదింటి ఆడపిల్లలు బడి బాట పట్టడానికి ‘ఎడ్యుకేట్‌ గర్ల్స్‌’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. ఎన్నో రాష్ట్రాలలో వేలాదిమంది ఆడపిల్లలు చదువుకోగలిగేలా చేసింది.

తాజాగా... ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో కృషి చేస్తున్న వారికి ‘వరల్డ్‌ ఇన్నోవేషన్‌ సమ్మిట్‌ ఫర్‌ ఎడ్యుకేషన్, ఖతర్‌’ వారు ఇచ్చే ‘వైజ్‌’ప్రైజ్‌కు ఎంపికైంది. ఈ ప్రైజుకు ఎంపికైన ఫస్ట్‌ ఇండియన్‌ సఫీనా హుసేన్‌ గురించి...

‘అబ్బాయిని స్కూలుకు పంపిస్తున్నారు కదా. మరి అమ్మాయిని ఇంటిపనులకే పరిమితం చేస్తున్నారేమిటి?’ అని అడిగినప్పుడు ఆ ఇంటిపెద్ద నవ్వుతూ ఇచ్చిన సమాధానం....
‘ఆడపిల్లలకు చదువెందుకు. ఏదో ఒకరోజు పెళ్లి చేయాల్సిందే కదా’ ఇంచుమించు ప్రతి ఇంటి నుంచి ఇలాంటి సమాధానమే వినిపించింది.
‘ఆడపిల్లలకు విద్య’ అనే నినాదం ప్రాధాన్యతకు నోచుకోని ఎన్నో ప్రాంతాలను చూసింది సఫీనా. దీనికి పేదరికం ఒక కారణం అయితే, ఆర్థికస్థాయి బాగున్నా ‘ఆడపిల్లకు చదువెందుకు’ అనే నిర్లిప్తత మరోకారణం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఇంటి ఆడపిల్ల బడికి వెళ్లాలనే లక్ష్యంతో ‘ఎ డ్యుకేట్‌ గర్ల్స్‌’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించింది సఫీనా.

‘ఒక సమస్య గురించి మాట్లాడేటప్పుడు దానితో మమేకం కావాలి’ అంటున్న సఫీనాకు పేదరికం అనేది అపరిచిత సమస్య కాదు. దిల్లీలోని ఒక పేదకుటుంబంలో పుట్టింది. ఎన్నో కష్టాల మధ్య కూడా ‘చదువు’ అనే ఆయుధాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఆ కుటుంబం నుంచి లండన్‌లో చదువుకున్న తొలి వ్యక్తి అయింది. లండన్‌ నుంచి అమెరికాకు వెళ్లి స్వచ్ఛంద సేవారంగంలో పని చేసిన సఫీనా 2005లో స్వదేశానికి తిరిగి వచ్చింది.

‘చదువుకోవడం వల్ల నేను ఎంతో సాధించాను. దేశదేశాలు తిరిగాను. చదువుకోకపోతే నా పరిస్థితి ఊహకు కూడా అందనంత దయనీయంగా ఉండేది’ అనుకున్న సఫీనా హుసేన్‌ పేదింటి ఆడపిల్లల చదువు కోసం తన వంతుగా ఏదైనా చేయాలనుకుంది. ప్రభుత్వ సంస్థల నుంచి వివరాలు సేకరించింది. చదువుకు సంబంధించి జెండర్‌–గ్యాప్‌ ఉన్న 26 జిల్లాల గురించి తెలుసుకుంది. అందులో తొమ్మిది రాజస్థాన్‌లో ఉన్నాయి.

రాజస్థాన్‌లో ఆడపిల్లల చదువుకు దూరంగా ఉన్న ప్రాంతాలను మొదట ఎంపిక చేసుకుంది సఫీనా బృందం. గ్రామానికి చెందిన స్వచ్ఛంద సేవకులతో ‘ఆర్మీ ఆఫ్‌ జెండర్‌ చాంపియన్స్‌’ను ఏర్పాటు చేసి ‘దయచేసి మీ అమ్మాయిని స్కూల్‌కు పంపించండి’ అంటూ ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ‘ఆడపిల్లలకు చదువు’ అనే అంశంపై గ్రామ సమావేశాలు ఏర్పాటు చేశారు. సఫీనా ఆమె బృందం కృషి వృథా పోలేదు. ఎన్నో గ్రామాల్లో ఎంతోమంది ఆలోచన తీరులో మార్పు వచ్చింది. తమ ఇంటి ఆడపిల్లలను స్కూలుకు పంపించడం ప్రారంభించారు.

చాలా బడులలో ఆడపిల్లల కోసం టాయిలెట్‌ సదుపాయాలు లేవు. అలాంటి బడులలో ప్రత్యేక టాయిలెట్‌లు నిర్మించేలా చేశారు. బడిలో అకాడమిక్‌ పాఠాలు మాత్రమే కాకుండా లైఫ్‌స్కిల్స్‌కు సంబంధించిన పాఠాలు కూడా చెప్పేవారు.

‘ఆడపిల్లలకు చదువు దూరం కావడం అనేది ఆర్థిక సమస్యతో ముడిపడి ఉన్న అంశం కాదు. అది పితృస్వామిక భావజాలానికి సంబంధించింది. మేము పనిచేసిన కొన్ని ప్రాంతాలలో ప్రజలు ఇంటి ఆడపిల్ల కంటే గొర్రెలు, మేకలను విలువైన ఆస్తిగా భావించడం చూశాం. ముందు వారి ఆలోచన తీరులో మార్పు తీసుకు రావాలనుకున్నాం. అది అంత తేలిక కాదని తెలిసినా రంగంలోకి దిగాం. ప్రభుత్వ సంస్థల నుంచి లోకల్‌ వాలెంటీర్స్‌ వరకు కలిసి పనిచేశాం. అయితే మేము నిరాశతో వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి  రాలేదు’ అంటుంది సఫీనా.

 ‘ఆడపిల్లలకు చదువు అందని ప్రాంతాలు ఏమిటి?’ అనే అంశంపై ఒకప్పుడు ప్రభుత్వ సంస్థల డాటాపైన ఆధారపడిన సఫీనా బృందం ఇప్పుడు డాటా ఎనాలటిక్స్, మెషిన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీలాంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటోంది. జియో–ట్యాగ్‌డ్‌ టార్గెట్‌ విలేజెస్‌ నుంచి మొబైల్‌ ఫోన్స్‌లో డాటా సేకరిస్తున్నారు. తమ పనితీరును మరింత మెరుగుపరుచుకొని ఉత్తమఫలితాలు సాధించడానికి వారికి ఇది ఉపయోగపడుతుంది. గతాన్ని గట్టిగా గుర్తు పెట్టుకున్న సఫీనా హుసేన్‌ ఎన్నో రాష్ట్రాలలో ఎంతోమంది పేదింటి అమ్మాయిల ఉజ్వల భవిష్యత్‌ కోసం ‘ఎడ్యుకేట్‌ గర్ల్స్‌’ ద్వారా కృషి చేస్తోంది.
 

అయినా వెనకడుగు వేయలేదు
‘ఎడ్యుకేట్‌ గర్ల్స్‌’తో తొలి అడుగులు వేసినప్పుడు ‘మీలాగే చాలామంది ప్రయత్నించి విఫలమయ్యారు’ అని నిరుత్సాహపరిచారు కొందరు. అయితే అలాంటి మాటలను మేము సీరియస్‌గా తీసుకోలేదు. ‘ఫలితం వచ్చేవరకు మా ప్రయత్నం’ అనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. బయటి వాళ్లు చెప్పే మాటల కంటే తమ ఊరి వాళ్లు చెప్పే మాటలకే గ్రామస్థులు ప్రాధాన్యత ఇస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామాలలో స్థానికులతో కలిసి ఆర్మీ ఆఫ్‌ జెండర్‌ ఛాంపియన్స్‌ను ప్రారంభించి ఆడపిల్లల విద్యకు సంబంధించి ఇంటింటి ప్రచారం నిర్వహించాం.
– సఫీనా హుసేన్, ఫౌండర్, ఎడ్యుకేట్‌ గర్ల్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement