– అడ్వకసి టు యాక్షన్
ఏయిర్ ఫోర్స్ అధికారి కూతురు అయిన బవ్రీన్ దేశంలోని వివిధప్రాంతాలలో చదువుకుంది. అలా ఎన్నో సంస్కృతులు, కళలు, ప్రకృతి అందాలతో పరిచయం
అయింది. లండన్‌లోని వాయు కాలుష్యం గురించి వ్యాసం ఒకటి చదివింది బవ్రీన్.
‘దిల్లీలో కూడా ఇలాంటి పరిస్థితే కదా’ అని నిట్టూర్చింది. ‘ఇది లోకల్ ప్రాబ్లం కాదు. గ్లోబల్ ప్రాబ్లమ్’ అనుకుంది. వర్తమానం సంగతి ఎలా ఉన్నా పొగచూరిన భవిష్యత్ మసక మసకగా కనిపిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాపీరైటర్ ఉద్యోగాన్ని వదులుకొని ‘వారియర్ మామ్స్’కు శ్రీకారం చుట్టింది బవ్రీన్. ‘ వాయుకాలుష్యం అనేది చర్మం, జుట్టు, ఊపిరితిత్తులు, గుండెపై ప్రభావం చూపుతుంది. ఆహార ఉత్పత్తులలోని పోషక విలువలను నాశనం చేస్తుంది. అన్నిరకాలుగా హాని కలిగిస్తుంది’ అంటున్న బవ్రీన్ ‘వారియర్ మామ్స్’ ద్వారా పల్లె నుంచి పట్టణం వరకు ఎన్నోప్రాంతాలు తిరిగింది.
క్షేత్రస్థాయిలో వాయుకాలుష్యం గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తనలాగే ఆలోచించే మహిళలు తోడు కావడంతో ‘వారియర్ మామ్స్’కు బలం పెరిగింది. మొదట్లో వాయుకాలుష్యం ప్రమాదాల గురించి ప్రచారం మొదలుపెట్టినప్పుడు ‘ఈ విషయాలు మాకు ఎందుకు’ అన్నట్లుగా ముఖం పెట్టేవారు. ప్రమాద తీవ్రత గురించి తెలుసుకున్న తరువాత మాత్రం వారిలో మార్పు రావడం మొదలైంది.
‘మీ పిల్లల భవిష్యత్ గురించి కూడా ఆలోచించండి’ అనే మాట వారిని కదిలించి కార్యక్షేత్రంలోకి తీసుకువచ్చింది. ప్రపంచం ఎలా మారాల్సి వచ్చిందో చెప్పడానికి కోవిడ్ మహమ్మారి పెద్ద ఉదాహరణ. ఈ నేపథ్యంలోనే... ‘మరొక మహమ్మారిని నివారించడానికి మనం ఎందుకు మారకూడదు?’ అని ప్రశ్నిస్తోంది. ‘అభివృద్ధి’ గురించి మాట్లాడినప్పుడు ‘పర్యావరణ హితం’ గురించి కూడా మాట్లాడాలి అంటుంది బవ్రీన్.
‘కొన్నిసార్లు దూకుడుగా ముందుకు వెళ్లాలి’ అనేది కొన్ని సందర్భాలలో బవ్రీన్ నోటినుంచే వినిపించే మాట. సమస్య గురించి అధికారుల దృష్టికి తెచ్చినప్పుడు, వారి స్పందనలో అలసత్వం కనిపించినప్పుడు, ‘నా కంపెనీకి మేలు జరిగితే చాలు పర్యావరణం ఏమైపోతే నాకెందుకు!’ అనుకునేవాళ్లను చూసినప్పుడు బవ్రీన్ దూకుడుగా ముందుకు వెళుతుంది, తాను ఆశించిన ఫలితం వచ్చే వరకు మడమ తిప్పకుండా పోరాడుతుంది.
‘మార్పు మన ఇంటి నుంచే మొదలు కావాలి’ అంటున్న బవ్రీన్ మాటలు ఎంతోమందిలో మార్పు తీసుకువచ్చాయి. ‘పదిమందిలో ఏడుగురు వాతావరణ మార్పుల గురించి ఆందోళన చెందుతున్నారు. పదిమందిలో తొమ్మిదిమంది వాతావరణ మార్పులపై తగిన కార్యాచరణ అవసరం అంటున్నారు. కానీ పదిమందిలో నలుగురు మాత్రమే కార్యాచరణలో భాగం అవుతున్నారు’ అంటున్న బవ్రీన్ ఆశ మాత్రం కోల్పోలేదు. ‘వారియర్ మామ్స్’ ద్వారా అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉంది.
‘ఏమీ చేయలేమా?’ అనే ప్రశ్న ముందుకు వచ్చినప్పుడు వినిపించే జవాబులు రెండు... ‘మనం మాత్రం ఏం చేయగలం!’ ‘కచ్చితంగా మనమే చేయగలం’
‘మనం మాత్రమే చేయగలం’ అని దిల్లీకి చెందిన బవ్రీన్ కాంధరీ అనుకోవడం వల్లే‘వారియర్ మామ్స్’ పుట్టుక సాధ్యం అయింది. ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా
పదమూడు రాష్ట్రాలలో క్షేత్రస్థాయిలో పర్యావరణ హిత ప్రచారాన్ని నిర్వహిస్తోంది బవ్రీన్. కాపీరైటర్ నుంచి ఎన్విరాన్‌మెంటల్ యాక్టివిస్ట్‌గా ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకం...
Comments
Please login to add a commentAdd a comment