Environmental activists
-
పత్తి మనదే ప్రతిఫలం మనదే
హైదరాబాద్‌కు చెందిన దండోతికర్ అంబిక చిన్నప్పటి నుంచి మూసీ నది కాలుష్యాన్ని చూస్తూ పెరిగింది. ప్లాస్టిక్ వ్యర్థాలు మూసి నీళ్లలో నింపుతున్న విషాన్ని గురించి తెలుసుకుంది. అప్పటి నుంచే ప్లాస్టిక్‌కు ప్రత్నామ్నాయాలు వెదకడం మొదలుపెట్టింది. ప్రత్యామ్నాయంగా కాటన్ బ్యాగులను తయారుచేయడమే కాదు వాటి గురించి విస్తృత ప్రచారం చేస్తోంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేస్తున్న ఆమె కృషికి గుర్తింపుగా ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. తాజాగా ఎంఎస్ స్వామినాథన్ అవార్డు అందుకుంది.ఉస్మానియా యూనివర్సిటీలో ‘సోషల్ సర్వీసెస్’లో పీజీ చేసింది అంబిక. ఇది కేవలం చదువు కాదు. సామాజిక సేవ దిశగా వేసిన తొలి అడుగు. రైతుల ఆత్మహత్యలతో కలత చెందిన అంబిక ఎన్నో గ్రామాల్లోకి వెళ్లి ఎంతోమంది పత్తి రైతులతో మాట్లాడింది. వారి సమస్యలను తెలుసుకుంది.ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా కాటన్ బ్యాగులను వినియోగంలోకి తీసుకువస్తే పర్యావరణానికే కాదు పత్తి రైతుకూ మేలు జరుగుతుందని ఆలోచించింది. మచ్చలు వచ్చిన పత్తిని కూడా సేకరించి వస్త్రాన్ని తయారుచేసి, బ్యాగులు తయారు చేయాలని నిర్ణయించుకుని ముందడుగు వేసింది. పర్యావరణ స్పృహ, ఉపాధి కల్పన, కాటన్ దుస్తుల గురించి ప్రచారం... అనే మూడు లక్ష్యాలను నిర్దేశించుకుంది. మూసీ ప్రక్షాళన చేసే దిశగా విద్యార్థులతో కలిసి ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. 2016లో జరిగిన హిల్లరీ వెబర్ బూట్ క్యాంప్‌లో పాల్గొని కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంది. ఎన్ ఐఆర్డీ ఏర్పాటు చేసిన రిస్క్ కాంక్లేవ్‌లో అంబిక ఇచ్చిన ప్రెజెంటేషన్ కు ‘బెస్ట్ స్టార్టప్ ఇన్ సస్టెయినబుల్ లైవ్లీహుడ్’ ‘బెస్ట్ ఇన్నొవేటివ్ ఆస్పైరింగ్ ఎంటర్ప్రెన్యూర్’ అవార్డులు వచ్చాయి. సామాజిక సేవ పునాదిపై సొంతంగా స్టార్టప్‌ను నిర్మించిన అంబిక రూపాయి లాభంతో మాత్రమే సేవలు అందించింది. రైతుల నుంచి పత్తిని సేకరించడం నుంచి బ్యాగులు తయారు చేయడం వరకు ఎంతో మందికి శిక్షణ ఇచ్చింది. సంప్రదాయంగా వస్తున్న డైయింగ్, ప్రింటింగ్ కళలను ప్రోత్సహించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ‘పర్యావరణ స్పృహతో ఒక్క అడుగు పడినా....ఒక్క అడుగేనా అని నిరాశపడాల్సిన పనిలేదు. ఆ అడుగును అనుసరిస్తూ వందల అడుగులు పడతాయి’ అంటుంది దండోతికర్ అంబిక. కాలుష్య సమస్యకు కలత చెందడం కంటే ‘నా వంతుగా ఒక పరిష్కారం’ అనుకుంటే ఎంతో కొంత పరిష్కారం దొరుకుతుంది. ఎటు చూస్తే అటు ప్లాస్టిక్ వ్యర్థాల వరద భయపెడుతున్న వేళ, వాటి దుష్పరిణామాల గురించి తెలిసినా....అవి మన దైనందిన జీవితంలో భాగమైన దురదృష్ట కాలాన.....అంబికలాంటి పర్యావరణ ప్రేమికులు పరిష్కార మార్గాలు ఆలోచిస్తున్నారు.తన వంతు పరిష్కారంగా ప్లాస్టిక్ బ్యాగులకు ప్రత్యామ్నాయంగా కాటన్ బ్యాగులు తయారుచేస్తూ వాటి ్రపాముఖ్యత గురించి ప్రచారం చేస్తోంది దండోతికర్ అంబిక. ‘పత్తి మనదే ప్రతి ఫలం మనదే’ అనే నినాదంతో రైతుల కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న అంబికకు ‘యూనివర్శిటీ ఆఫ్ దిల్లీ’ ఎంఎస్ స్వామినాథన్ అవార్డ్‌ను ప్రధానం చేసింది.– ఎన్.సుధీర్‌రెడ్డి, సాక్షి, హైదరాబాద్ -
ఈ నేల ఈ గాలి... పర్యావరణ గీతం
ఏయిర్ ఫోర్స్ అధికారి కూతురు అయిన బవ్రీన్ దేశంలోని వివిధప్రాంతాలలో చదువుకుంది. అలా ఎన్నో సంస్కృతులు, కళలు, ప్రకృతి అందాలతో పరిచయం అయింది. లండన్‌లోని వాయు కాలుష్యం గురించి వ్యాసం ఒకటి చదివింది బవ్రీన్. ‘దిల్లీలో కూడా ఇలాంటి పరిస్థితే కదా’ అని నిట్టూర్చింది. ‘ఇది లోకల్ ప్రాబ్లం కాదు. గ్లోబల్ ప్రాబ్లమ్’ అనుకుంది. వర్తమానం సంగతి ఎలా ఉన్నా పొగచూరిన భవిష్యత్ మసక మసకగా కనిపిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాపీరైటర్ ఉద్యోగాన్ని వదులుకొని ‘వారియర్ మామ్స్’కు శ్రీకారం చుట్టింది బవ్రీన్. ‘ వాయుకాలుష్యం అనేది చర్మం, జుట్టు, ఊపిరితిత్తులు, గుండెపై ప్రభావం చూపుతుంది. ఆహార ఉత్పత్తులలోని పోషక విలువలను నాశనం చేస్తుంది. అన్నిరకాలుగా హాని కలిగిస్తుంది’ అంటున్న బవ్రీన్ ‘వారియర్ మామ్స్’ ద్వారా పల్లె నుంచి పట్టణం వరకు ఎన్నోప్రాంతాలు తిరిగింది.క్షేత్రస్థాయిలో వాయుకాలుష్యం గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తనలాగే ఆలోచించే మహిళలు తోడు కావడంతో ‘వారియర్ మామ్స్’కు బలం పెరిగింది. మొదట్లో వాయుకాలుష్యం ప్రమాదాల గురించి ప్రచారం మొదలుపెట్టినప్పుడు ‘ఈ విషయాలు మాకు ఎందుకు’ అన్నట్లుగా ముఖం పెట్టేవారు. ప్రమాద తీవ్రత గురించి తెలుసుకున్న తరువాత మాత్రం వారిలో మార్పు రావడం మొదలైంది.‘మీ పిల్లల భవిష్యత్ గురించి కూడా ఆలోచించండి’ అనే మాట వారిని కదిలించి కార్యక్షేత్రంలోకి తీసుకువచ్చింది. ప్రపంచం ఎలా మారాల్సి వచ్చిందో చెప్పడానికి కోవిడ్ మహమ్మారి పెద్ద ఉదాహరణ. ఈ నేపథ్యంలోనే... ‘మరొక మహమ్మారిని నివారించడానికి మనం ఎందుకు మారకూడదు?’ అని ప్రశ్నిస్తోంది. ‘అభివృద్ధి’ గురించి మాట్లాడినప్పుడు ‘పర్యావరణ హితం’ గురించి కూడా మాట్లాడాలి అంటుంది బవ్రీన్.‘కొన్నిసార్లు దూకుడుగా ముందుకు వెళ్లాలి’ అనేది కొన్ని సందర్భాలలో బవ్రీన్ నోటినుంచే వినిపించే మాట. సమస్య గురించి అధికారుల దృష్టికి తెచ్చినప్పుడు, వారి స్పందనలో అలసత్వం కనిపించినప్పుడు, ‘నా కంపెనీకి మేలు జరిగితే చాలు పర్యావరణం ఏమైపోతే నాకెందుకు!’ అనుకునేవాళ్లను చూసినప్పుడు బవ్రీన్ దూకుడుగా ముందుకు వెళుతుంది, తాను ఆశించిన ఫలితం వచ్చే వరకు మడమ తిప్పకుండా పోరాడుతుంది. ‘మార్పు మన ఇంటి నుంచే మొదలు కావాలి’ అంటున్న బవ్రీన్ మాటలు ఎంతోమందిలో మార్పు తీసుకువచ్చాయి. ‘పదిమందిలో ఏడుగురు వాతావరణ మార్పుల గురించి ఆందోళన చెందుతున్నారు. పదిమందిలో తొమ్మిదిమంది వాతావరణ మార్పులపై తగిన కార్యాచరణ అవసరం అంటున్నారు. కానీ పదిమందిలో నలుగురు మాత్రమే కార్యాచరణలో భాగం అవుతున్నారు’ అంటున్న బవ్రీన్ ఆశ మాత్రం కోల్పోలేదు. ‘వారియర్ మామ్స్’ ద్వారా అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉంది. ‘ఏమీ చేయలేమా?’ అనే ప్రశ్న ముందుకు వచ్చినప్పుడు వినిపించే జవాబులు రెండు... ‘మనం మాత్రం ఏం చేయగలం!’ ‘కచ్చితంగా మనమే చేయగలం’‘మనం మాత్రమే చేయగలం’ అని దిల్లీకి చెందిన బవ్రీన్ కాంధరీ అనుకోవడం వల్లే‘వారియర్ మామ్స్’ పుట్టుక సాధ్యం అయింది. ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా పదమూడు రాష్ట్రాలలో క్షేత్రస్థాయిలో పర్యావరణ హిత ప్రచారాన్ని నిర్వహిస్తోంది బవ్రీన్. కాపీరైటర్ నుంచి ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్‌గా ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకం... -
గడ్డ కట్టే చలిలో 16 రోజులుగా ‘‘క్లైమేట్ ఫాస్ట్"
లడఖ్‌కు చెందిన ప్రముఖ సామాజిక, వాతావరణ కార్యకర్త మెగసెసే అవార్డు గ్రహీత, సోనమ్ వాంగ్‌చుక్ 'లడఖ్‌ను రక్షించేందుకు' నిరాహార దీక్షకు దిగారు. పర్యావరణ పరిరక్షణోద్యమంలో స్వరాన్ని వినిపిస్తున్న సోనమ్ లడఖ్‌ను కాలుష్య కోరల నుంచి రక్షించాలంటూ గత కొంత కాలంగా పోరాడుతున్నారు. లడఖ్‌కు పూర్తి రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ ప్రకారం రాజ్యాంగ భద్రత కల్పించాలన్న అంశంపై ప్రభుత్వం, లేహ్ అపెక్స్ బాడీ (LAB), కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (KDA) నాయకుల మధ్య చర్చలు విఫలమైన నేపథ్యంలో వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. నాలుగేళ్లపాటు తూతూమంత్రంగా సాగిన వ్యూహాల తర్వాత, హామీలను నెరవేర్చేందుకు కేంద్రం నిరాకరించిందని వాంగ్‌చుక్ విమర్శించారు. వాతావరణ మార్పులను నిరసిస్తూ, లడఖ్‌లోని హిమాలయ ప్రాంతంలోని పర్యావరణ భద్రత, లడఖ్‌కు ప్రజాస్వామ్య హక్కుల రక్షణ డిమాండ్‌తో మార్చి 6వ తేదీన మొదలైన ఈ ‘‘క్లైమేట్ ఫాస్ట్" 21 రోజులు పాటు కొనసాగనుంది. అవసరమైతే ఈ దీక్షను ఆమరణ దీక్షగా పొడిగించవచ్చని తెలుస్తోంది. ఈ సందర్భంగా సోనమ్ వాంగ్‌చుక్ వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగించారు. BEGINNING OF DAY 16 OF #CLIMATEFAST 120 people sleeping outdoors under clear skies. Temperature: - 8 °C 16 days of just water n salts is finally taking a toll. Feeling quite week. But I can still drag for another 25 days n perhaps will. I'm sure our path of truth will win… pic.twitter.com/jsTFlvgD4c — Sonam Wangchuk (@Wangchuk66) March 21, 2024 > సాదాసీదాగాజీవనాన్ని ఎంచుకోవాలని ప్రపంచానికి విజ్ఞప్తి చేశారు. సోనమ్ వాంగ్‌చుక్ క్లైమాట్ ఫాస్ట్‌కు దేశంలోని వివిధ ప్రాంతాల పౌరులు, రాజకీయ నాయకులు, సామాజిక-పర్యావరణ కార్యకర్తలు మద్దతుగి నిలిచారు. అలాగే ఈయనకు సంఘీభావంగా కాశ్మీర్ టూరిజం విభాగం కూడా 'క్లైమేట్ ఫాస్ట్'లో పా ల్గొనడం విశేషం. ఎప్పటికపుడు దీక్ష వివరాలను ట్వటర్లో షేర్ చేస్తున్నారు. 16 వ రోజు దీక్ష వివరాలను కూడా ఆయన పంచుకున్నారు. ‘‘8 డిగ్రీల సెల్సియస్ ఉష్టోగ్రత వద్ద 120 మంది ఆరుబయట నిద్రిస్తున్నారు. నీరు, లవణాలుకొద్దిగా తగ్గుతున్నాయి. నేను ఇంకా 25 రోజులు దీక్ష కొనసాగించగలను అని విశ్వసిస్తున్నాను. సత్యం గెలుస్తుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను’’ - సోనమ్ వాంగ్‌చుక్ కాగా ఇక్కడ పరిశ్రమల వల్ల పర్యావరణం దెబ్బ తింటోందని, రాబోయే రోజుల్లో హిమానీ నదాలు అంతరించి పోయే ప్రమాదం ఉందని ఇప్పటికే చాలా సార్లు హెచ్చరించిన సోనమ్ అనేక ఉద్యమాలు కూడా చేపట్టిన సంగతి తెలిసిందే. ఎవరీ సోనమ్ వాంగ్‌చుక్ 1966లో ఆల్చి సమీపంలోని ఉలేటోక్పోలో పుట్టారు సోనమ్.విద్యాభ్యాసం కోసం వసతుల్లేక 1977లో ఢిల్లీకి తరలిపోయాడు. ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసి 2011లో ఫ్రాన్స్‌లో ఎర్త్ ఆర్కిటెక్చర్ ను అధ్యయనం చేశారు. 1993 నుండి 2005 దాకా వాంగ్ చుక్ లడాగ్స్ మెలాంగ్ పత్రికకు ఎడిటర్‌గా పనిచేశారు. అలాగే 2018లో రామన్ మెగసెసే అవార్డు , ఐసీఏ, సోషల్ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్, రోలెక్స్, ఇంటర్నేషనల్ టెర్రా అవార్డుతో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు ఆయన దక్కించుకున్నారు. -
Dr Supraja Dharini: తాబేలు గెలవాలి
కుందేలు, తాబేలు కథలో తాబేలు మెల్లగా అయినా సరే రేస్ పూర్తి చేసి గెలుస్తుంది. కాని గెలవాలంటే తాబేళ్లు ఉండాలి కదా. కాలుష్యం వల్ల, వలలకు చిక్కుకుని, గుడ్లు పెట్టే ఏకాంతం కోల్పోయి.. సముద్ర తాబేళ్లు ప్రమాదంలో పడ్డాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో తాబేళ్ల సంరక్షణ కోసం పని చేస్తున్న డాక్టర్ సుప్రజ ధారిణి కృషి. ‘సముద్ర తీరానికి వెళ్లి చూస్తే అంతా ప్రశాంతం గా అనిపిస్తుంది. నీలి ఉపరితలం, ఒడ్డుకు వచ్చి వెళ్లే కెరటాలు... ఎంత బాగుందో కదా అని మనసు ఆహ్లాదపడుతుంది. కాని సముద్ర గర్భంలో ఏం జరుగుతున్నదో మనకు తెలియదు. మనిషి చర్యల వల్ల సముద్రం లోపల ఎంత ధ్వంసమవుతోందో తెలుసుకోవాలి. జలధి పర్యావరణాన్ని కాపాడుకోవాలి’ అంటుంది డాక్టర్ సుప్రజ ధారిణి. చెన్నైలో స్థిరపడ్డ ఈ తెలుగు పర్యావరణ కార్యకర్త ఇప్పడు సముద్ర తాబేళ్లకి రక్షకురాలిగా మారింది. లక్షలాది తాబేళ్లు మృత్యవాత పడకుండా తిరిగి సముద్రానికి చేరేలా చూడగలిగింది. చెన్నై తీరం, ఆంధ్రా తీరం, ఒడిశా తీరంలో ఆమె తయారు చేసిన దళాలు గస్తీ తిరుగుతూ తాబేళ్లను కాపాడుతున్నాయి. అంతులేని విధ్వంసం ‘సముద్ర ఆరోగ్యం బాగుంటే మత్స్యకారుల జీవితాలు బాగుంటాయి. ఎందుకంటే సముద్రమే వారి జీవనాధారం కాబట్టి. సముద్ర ఆరోగ్యం, అందులోని పర్యావరణం ఎలా ఉందో తెలియాలంటే తాబేళ్ల ఉనికి, వాటి జనాభా ఒక కొండ గుర్తు. ఎందుకంటే సముద్రగర్భంలో ఉండి నేల మీదకు వచ్చే ఏకైక జలచరం అదే. తాబేళ్లలో ఒక ముఖ్యలక్షణం ఏమిటంటే అవి గుడ్డు పగిలి ఏ నేల మీద ప్రాణం పోసుకున్నాయో ఆ నేలను గుర్తు పెట్టుకుని పెరిగి పెద్దవై గుడ్లు పెట్టడానికి అదే నేలకు వస్తాయి. అంటే పుట్టింటికి వచ్చినట్టే. కాని అవి మనుషుల మీద నమ్మకంతో పెట్టిన గుడ్లను మత్స్యకారులు నిర్లక్ష్యం చేయడం నేను చూశాను. ఇక కుక్కలు దాడి చేసి గుడ్లు తవ్వుకుని తినేస్తాయి. కొన్ని పిల్లలు బయటకు తీసి ఆడుకుంటారు. వాటి వల్ల తాబేళ్ల సంఖ్య తగ్గి సముద్ర జీవ సమతుల్యత దెబ్బ తింటుంది. అందుకని మొదట మేము మత్స్యకారులను చైతన్యవంతం చేశాం. తాబేళ్లను కాపాడితే సముద్రం బాగుంటుంది.... సముద్రం బాగుంటే మీ జీవితాలు బాగుంటాయి అని చెప్పాం. వారిప్పుడు కార్యకర్తలుగా మారి తాబేళ్లను కాపాడుతున్నారు’ అని తెలిపింది సుప్రజ ధారిణి. మచిలీపట్నం సొంతూరు సుప్రజది మచిలీపట్నం. ముప్పై ఏళ్ల క్రితం వాళ్ల కుటుంబం చెన్నై తరలి వెళ్లింది. ఫిలాసఫీలో పిహెచ్డి చేసిన సుప్రజ చెన్నైలోనే ఒక ఆర్ట్ స్టుడియో స్థాపించుకుంది. అయితే 25 ఏళ్ల క్రితం ఆమె చెన్నైలోని నీలాంకరై బీచ్‌కు మార్నింగ్ వాక్కు వెళ్లినప్పుడు అక్కడ తాబేలు చచ్చిపడి ఉంది. దాపునే పిల్లలు తాబేలు గుడ్లు ఇసుక నుంచి బయటకు లాగి ఆడుకుంటూ ఉన్నారు. మత్స్యకారులు చూసినా వారించడం లేదు. ఇదంతా చూసి బాధపడింది సుప్రజ. తాబేళ్లు వొడ్డుకొచ్చి పడి చనిపోవడానికి కారణాలు తెలుసుకోవడానికి నిపుణులను సంప్రదించింది. ఆలివ్ రిడ్లే జాతి తాబేళ్లు చేపల వలల వల్ల గాయపడి చనిపోతున్నాయని, వాటి గుడ్ల సంరక్షణ సరిగ్గా జరగక సంతతి తరిగిపోతున్నదని తెలుసుకుంది. మొదట మత్స్యకారుల్లో చైతన్యం తెచ్చి తర్వాత సమాజంలో మార్పు తేవాలని నిశ్చయించుకుంది. అలా 2002లో ఆమె తాబేళ్ల సంరక్షణ, సముద్ర పర్యావరణ సంరక్షణ లక్ష్యంగా ‘ట్రీ ఫౌండేషన్’ అనే సంస్థను ప్రారంభించింది. 33 లక్షల తాబేలు పిల్లల రక్షణ తమిళనాడులోని కంచి నుంచి ఒరిస్సాలోని గంజాం వరకు తీర ప్రాంతంలో దాదాపు 700 కిలోమీటర్ల మేర తీర ప్రాంత సంరక్షణ, తాబేళ్ల గుడ్ల పరిరక్షణ, గాయపడిన తాబేళ్లకు చికిత్స చేసి మళ్లీ సముద్రంలో ఒదిలిపెట్టడం, గుడ్లకు గస్తీ కాయడం వంటి చర్యల కోసం గార్డ్లను ఏర్పాటు చేసింది సుప్రజ. ఇందుకు అవసరమైన గుర్తింపు కార్డులను తమిళనాడు ప్రభుత్వం నుంచి ఇప్పించగలిగింది. కొందరికి గౌరవ భత్యాలు కూడా అందుతున్నాయి. తాబేళ్లు గుడ్లు పెట్టే సీజన్లో వాటిని ఒకచోట చేర్చి వెదురు దడి కట్టి కాపాడటం వల్ల ఈ ఇరవై ఏళ్లలో దాదాపు 33 లక్షల గుడ్లు పొదగబడి తాబేళ్లు పిల్లలుగా సముద్రంలో చేరాయంటే అది సుప్రజ, ఆమె సేన ప్రయత్నం వల్లే. ‘సముద్రానికి నేలకూ ఉన్న అనుబంధం విడదీయరానిది. నేల మీద నివసించేవాళ్లమే సముద్రాన్ని కాపాడుకోవాలి’ అంటోంది సుప్రజ. -
మొనాలిసా పెయింటింగ్‌పైకి సూప్ స్ప్రే
పారిస్: ప్రపంచ ప్రఖ్యాత మొనాలిసా పెయింటింగ్‌పైకి పర్యావరణ ఉద్యమకారులు సూప్‌ను స్ప్రే చేశారు. అయితే, పెయింటింగ్‌కు గ్లాస్ రక్షణ ఉండటంతో ఎటువంటి నష్ట వాటిల్లలేదు. 16వ శతాబ్దంలో ప్రఖ్యాత చిత్రకారుడు లియోనార్డో డా విన్సీ చేతుల్లో రూపుదిద్దుకున్న మొనాలిసా చిత్రం ప్రస్తుతం సెంట్రల్ పారిస్‌లోని లౌవ్రె ప్రదర్శనశాలలో ఉంది. శుక్రవారం ఉదయం ‘రిపోస్టె అలిమెంటయిర్’అనే గ్రూపునకు చెందిన ఇద్దరు మహిళా ఉద్యమకారులు గుమ్మడి సూప్‌ను మొనాలిసా పెయింటింగ్‌పైకి స్ప్రే చేశారు. అనంతరం వారు ‘కళ, ఆరోగ్యకరమైన సుస్థిరమైన ఆహార హక్కుల్లో ఏది ముఖ్యమైంది? వ్యవసాయరంగం సమస్యల్లో ఉంది. రైతులు చనిపోతున్నారు. ప్రభుత్వం స్పందించాలి’అని డిమాండ్ చేశారు. మ్యూజియం సిబ్బంది వెంటనే వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. పెయింటింగ్‌ను తొలగించి, శుభ్రం చేశాక గంట తర్వాత తిరిగి ప్రదర్శనకు ఉంచారు. మన వారసత్వం మాదిరిగానే ఈ పెయింటింగ్ భవిష్యత్ తరాలకు చెందాల్సిందని ప్రభుత్వం పేర్కొంది. ఉద్యమకారుల వాదనలో అర్థం లేదని కొట్టిపారేసింది. ఇంధన ధరలు పెరిగాయని, నియంత్రణలు ఎక్కువయ్యాయంటూ శుక్రవారం రైతులు పారిస్‌ను దిగ్బంధించారు. గతంలోనూ దెబ్బతింది ప్రదర్శనకు ఉంచిన మొనాలిసా చిత్రంపై 1950లో ఓ సందర్శకుడు యాసిడ్ పోశాడు. దీంతో, పెయింటింగ్ దెబ్బతింది. అప్పటి నుంచి పెయింటింగ్‌కు రక్షణగా గ్లాస్‌ను ఏర్పాటు చేశారు. 2019లో పారదర్శకమైన బుల్లెట్‌ప్రూఫ్ అద్దాన్ని రక్షణగా బిగించారు. 2022లో ఓ ఉద్యమకారుడు భూ గ్రహాన్ని కాపాడాలని కోరుతూ పెయింటింగ్‌పైకి కేక్‌ను విసిరేశాడు. -
మన దేశంలోనే ఆ కంపెనీలు ఉన్నాయని తెలిసి షాక్ అయ్యాను: దియా మీర్జా
లైట్స్, కెమెరా, యాక్షన్ అనేవి సుప్రసిద్ధ నటి దియా మీర్జాకు సుపరిచిత పదాలు. అయితే ఆమెకు సంబంధించి ఈ పదాలు సినీ స్టూడియోలకే పరిమితం కాలేదు. తన కంటి కెమెరాతో ప్రకృతిని చూస్తుంది. పర్యావరణ నష్టానికి సంబంధించిన విధ్వంస చిత్రాలపై నలుగురి దృష్టి పడేలా ‘లైట్స్’ ఫోకస్ చేస్తోంది. తన వంతు కార్యాచరణగా క్లైమేట్ యాక్షన్ అంటూ నినదిస్తోంది... నటిగా సుపరిచితురాలైన దియా మీర్జా గ్లామర్ ఫీల్డ్ నుంచి పర్యావరణ స్పృహకు సంబంధించిన ప్రచారం వైపు అడుగులు వేసింది. ‘క్లైమేట్ యాక్టివిస్ట్’గా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. యూఎన్ ఎన్విరాన్మెంట్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పర్యావరణ ఉద్యమకారులతో కలిసి పనిచేస్తోంది.పర్యావరణానికి సంబంధించిన చర్చలు జరిగే ఇంట్లో పెరిగిన దియాకు సహజంగానే పర్యావరణ విషయాలపై ఆసక్తి మొదలైంది. దీనికితోడు స్కూల్లో టీచర్ ద్వారా విన్న పర్యావరణ పాఠాలు కూడా ఆమె మనసుపై బలమైన ప్రభావాన్ని వేసాయి. ఇక కాలేజీరోజుల్లో పర్యావరణ సంబంధిత చర్చాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ‘ప్రకృతిపై ప్రేమ అనే విలువైన బహుమతిని తల్లిదండ్రులు నాకు ఇచ్చారు’ అంటున్న దియ చిన్నప్పుడు చెట్లు, కొండలు ఎక్కేది. పక్షుల గానాన్ని ఎంజాయ్ చేసేది. మర్రిచెట్టు ఊడలతో ఉయ్యాల ఊగేది. ఉడతలతో గంతులు వేసేది. ఇల్లు దాటి చెట్ల మధ్యకు వెళ్లినప్పుడల్లా తనకు మరో ప్రపంచంలోకి వెళ్లినట్లుగా ఉండేది.బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాక దియాకు పర్యావరణ సంబంధిత అంశాలపై ఎన్నో సామాజిక సంస్థలతో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. ఆ సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా ఎన్నో విషయాలపై అవగాహన ఏర్పడింది. ఆ అవగాహనతోనే పర్యావరణ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొనాలని నిర్ణయించుకుంది. ‘ప్రజలకు మేలు చేసేదే పర్యావరణానికి మేలు చేస్తుంది’ అనే నినాదంతో పర్యావరణ ఉద్యమాలలో భాగం అయింది. ‘వాతావరణంలో మార్పు అనేది భవిష్యత్‌కు సంబంధించిన విషయం మాత్రమే కాదు వర్తమానాన్ని కలవరపెడుతున్న విషయం. ప్రకృతిమాత చేస్తున్న మేలును గుర్తుంచుకోలేకపోతున్నాం. పర్యావరణ సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వం, స్వచ్ఛందసంస్థలు, శాస్త్రవేత్తలకే పరిమితమైనది కాదు. అన్ని వర్గాల ప్రజలు, అన్ని వయసుల వారు శాస్త్రీయ విషయాలపై అవగాహన పెంచుకోవాలి’ అంటుంది దియ.వాయు కాలుష్యానికి సంబంధించిన అధ్యయనం దియాను ఆందోళనకు గురి చేసింది. ‘వాయు కాలుష్యం అనగానే దిల్లీ గురించే ఎక్కువగా మాట్లాడతాం. అయితే లక్నో నుంచి ముంబై వరకు ఎన్నో పట్టణాలలో వాయు కాలుష్య సమస్య తీవ్రంగా ఉంది’ అంటున్న దియా తన ఎజెండాలో ‘స్వచ్ఛమైన గాలి’కి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇక ఆమెను కలవరపెట్టిన మరో సమస్య ప్లాస్టిక్. షూటింగ్ నిమిత్తం మహా పట్టణాల నుంచి మారుమూల పల్లెటూళ్లకు వెళ్లినప్పుడు ప్లాస్టిక్ కనిపించని చోటు అంటూ ఉండేది కాదు.‘ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నప్పుడు వాటికి సంబంధించిన కంపెనీలు మన దేశంలోనే ఉన్నాయనే విషయాన్ని తెలుసుకున్నాను. బ్యాంబు బ్రష్‌లు, ఇయర్ బడ్స్ వాడుతున్నాను. నా దగ్గర ఆకర్షణీయమైన బ్యాంబు పోర్టబుల్ స్పీకర్ ఉంది’ అంటున్న దియా తాను వాడుతున్న ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువులను స్నేహితులకు కూడా పరిచయం చేస్తుంది. పర్యావరణ సంరక్షణకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పర్యావరణ స్పృహతో కూడిన జీవనవిధానాన్ని ప్రచారం చేయడానికి ఎకో–ఫ్రెండ్లీ సంస్థల్లో పెట్టుబడులు పెడుతుంది దియా మీర్జా. తాను పెట్టుబడులు పెట్టిన అయిదు కంపెనీలు మన దేశానికి చెందినవి. మహిళల నాయకత్వంలో నడుస్తున్నవి.‘నేను కష్టపడి సంపాదించిన డబ్బు, పొదుపు మొత్తాలను పర్యావరణ హిత కంపెనీలలో పెట్టుబడి పెట్టడం గర్వంగా ఉంది’ అంటుంది దియా. దియా మీర్జాకు సొంత నిర్మాణ సంస్థ ఉంది. ఆ ప్రొడక్షన్ హౌజ్ ద్వారా ప్రజల్లో మార్పును తీసుకువచ్చే చిత్రాలను వినోదం మేళవించి తీయాలనుకుంటోంది. అవును...ఈరోజే మంచిరోజు అత్యుత్తమ రోజు అంటే ఈ రోజే... అనే సామెత ఉంది. మంచి పని చేయడానికి మరోరోజుతో పనిలేదు. మన భూమిని కాపాడుకోడానికి ప్రతిరోజూ విలువైన రోజే. పిల్లలను పార్క్‌లు, వనాల దగ్గరకు తీసుకువెళ్లడం ద్వారా వారికి ప్రకృతి పట్ల ఆసక్తి కలిగించవచ్చు. పచ్చటి గడ్డిలో పాదరక్షలు లేకుండా నడిపించడం, అప్పుడే మొదలైన వానలో కొంచెంసేపైనా గంతులేసేలా చేయడం...ఇలా చిన్న చిన్న పనుల ద్వారానే వారిని ప్రకృతి నేస్తాలుగా తీర్చిదిద్దవచ్చు. పిల్లలకు వినోదం అంటే సినిమాలు మాత్రమే కాదు. ప్రకృతితో సాన్నిహిత్యానికి మించి పిల్లలకు వినోదం ఏముంటుంది! – దియా మీర్జా, నటి, క్లైమేట్ యాక్టివిస్ట్ -
Saraswati Kavula: చేనేతకు చేరువలో..
చేనేతకారులకు సాయం చేయాలనే ఆలోచనతో ఎగ్జిబిషన్స్ పెట్టి, ఆ పేరుతో పవర్‌లూమ్స్ అమ్ముతుంటారు. దీనివల్ల చేనేతకారులకు అన్యాయం జరుగుతుంటుంది. ఈ సమస్యల గురించి తెలిసి, ఆరేళ్ల నుంచి చేనేత సంత పేరుతో యాభై ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేసి, వీవర్స్‌కు సాయం చేస్తోంది హైదరాబాద్ విద్యానగర్‌లో ఉంటున్న సరస్వతి కవుల. వ్యవసాయం మీద ఉన్న ప్రేమతో యాచారం దగ్గర నందివనపర్తిలో రైతుగానూ తన సేవలను అందిస్తున్నారు. పర్యావరణ ఉద్యమకారిణిగానూ పనిచేసే సరస్వతి చేనేతకారుల సమస్యలు, వారికి అందించాల్సిన తోడ్పాటు గురించి వివరించారు. ‘‘ప్రభుత్వాలు పవర్లూమ్నే ప్రమోట్ చేస్తున్నంత కాలం చేనేతకారుల వెతలు తీరవని ఇన్నాళ్లుగా వాళ్లతో నేను చేసిన ప్రయాణం వల్ల అర్ధమైంది. దాదాపు పదిహేనేళ్లుగా వ్యవసాయం, చేనేతకారులకు సంబంధించిన విషయాలపై స్టడీ చేస్తూనే ఉన్నాను. మొదట్లో పర్యావరణానికి సంబంధించిన డాక్యుమెంటరీలు చేసేదాన్ని. అప్పట్లో రసాయన మందులతో వ్యవసాయం చేసే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టే చేనేతకారులు కూడా అదేబాట పట్టారు. కుటుంబం అంతా కలిసి చేసే హస్తకళల్లోకి చాపకింద నీరులాగ పెద్ద కంపెనీలు వచ్చి చేరుతున్నాయి. దీనివల్లే వీవర్స్‌కి సమస్యలు వచ్చాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌కు ఉన్న గ్యారంటీ చేనేతకారుల ఉత్పత్తులకు మార్కెట్ ఉండదు. ఇంకా హ్యాండ్లూమ్ బతికుంది అంటే మన చేనేతకారుల పట్టుదల వల్లనే. సమాజంలో బాధ్యతగలవారిగా మనమే వారికి సపోర్ట్‌గా నిలవాలి. ఇప్పటికే చేనేతకారులు వారి పిల్లలకు తమ వారసత్వ విద్యను నేర్పించడం లేదు. పెద్ద చదువులు, కంపెనీల్లో ఉద్యోగాలు అంటూ పంపిస్తున్నారు. దీంతో నేతపని రోజురోజుకూ కుంటుపడుతుంది. మనదేశంలో నైపుణ్యాలు కల కళాకారులు ఉన్నారు. కానీ, పెద్ద పెద్ద టెక్స్టైల్ పరిశ్రమలు వస్తాయి. వాటికి రాయితీలు పెద్దఎత్తున ఉంటాయి. కానీ, వీవర్స్‌కి ఇవ్వచ్చు. పాలిస్టర్ దారానికి సబ్సిడీ ఉంటుంది, కాటన్‌కి టాక్స్ పెంచుతారు. కరోనా సమయంలో వీవర్స్ చాలా దెబ్బతిన్నారు. సేల్స్ తగ్గిపోయి, పూట గడవడమే కష్టపడిన సందర్భాలున్నాయి. ► దిగులును చూశాను.. మొదట్లో రూరల్ ఇండియాకు సంబంధించి డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేస్తుండేదాన్ని. వ్యవసాయదారులతోనూ చేసేదాన్ని. ఎన్జీవోలతో కలిసి చేనేతకారులకు సపోర్ట్ చేసేదాన్ని. వాళ్లకు సపోర్ట్ చేసే సంస్థ మూతపడినప్పుడు ఏం చేయాలో తోచక దిగాలు పడటం చూశాను. డైరెక్ట్ మార్కెటింగ్ ఉంటే వారు తయారు చేసినదానికి సరైన ధర వస్తుంది.దానివల్ల ఆ వస్తువు తయారీదారునికి, కొనుగోలు దారికీ నేరుగా లాభం కలుగుతుంది. ఈ ఆలోచన వచ్చినప్పుడు చేనేతకారులకు డైరెక్ట్ మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలనుకున్నాను. కానీ, కొన్నాళ్లు నేనది చేయలేకపోయాను. కొంతమంది చేనేతకారుల దగ్గరకు వచ్చి ఎలాంటి సాయం కావాలి అని అడిగేవారు. వాళ్లు ‘మా సరుకును కొనండి చాలు, మాకేం చేయద్దు’ అనేవారు. ఇవన్నీ చూశాక మా ఫ్రెండ్స్‌తో కలిసి చర్చించాను. వారు కొంత ఆర్థిక సహాయం చేస్తామన్నారు. అప్పుడు హైదరాబాద్‌లో కమ్యూనిటీ హాల్స్ లాంటి చోట్ల ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేశాం. 2015 నుంచి 2017 వరకు ఫ్రెండ్స్ సాయం చేశారు. ఆ తర్వాత సేల్స్ నుంచి 2 శాతం ఇవ్వాలని చేనేతకారులకు చెప్పాం. ఇప్పుడు వారికి వచ్చిన దాంట్లో 5 శాతం ఇస్తున్నారు. పెద్ద పెద్ద హాల్స్ తీసుకొని పెట్టాలంటే ఆ హాల్స్‌కి అమౌంట్ కట్టాలి. దానివల్ల మళ్లీ వీవర్ తన వస్తువుల ధర పెంచాలి. అది కూడా మళ్లీ ధర పెరిగినట్టే కదా! అందుకే, తక్కువ ఖర్చుతో పూర్తయ్యే సంతలను ఏర్పాటు చేస్తున్నాం. స్వయంసమృద్ధిగా ఉంటే ఏ సమస్యలూ ఉండవు. ఇప్పుడైతే ప్రయాణ ఖర్చులూ పెరుగుతున్నాయి. మెటీరియల్ తీసుకొని, రైళ్లలో రావాల్సి ఉంటుంది. అలా వచ్చే ఖర్చు కూడా గతంలో వందల్లో ఉంటే, ఇప్పుడు వేలకు చేరింది. అందుకే, వసతి సదుపాయాలకు ఖర్చు పెట్టాల్సిన అవసరం రాకుండా చూస్తుంటాం. అందుకు ఇప్పటికీ సాయం చేసేవారున్నారు. ► అన్ని చేనేతలు ఒక దగ్గర ఆరేళ్ల క్రితం రెండు–మూడు స్టాల్స్‌తో ఎగ్జిబిషన్ మొదలుపెట్టాం. తర్వాత కొంతమందిని నేరుగా కలిసి చెబితే, కొంతమందికి నోటిమాట ద్వారా తెలిసి వచ్చారు. ఇప్పుడు 25 నుంచి 30 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. చిన్న వీవర్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వారు రావాలనుకుంటాం. అందుకు చాలా ప్రయత్నం చేశాం. మాస్టర్ వీవర్స్, కో ఆపరేటివ్ సొసైటీ, తూర్పుగోదావరి నుంచి మోరీ సొసైటీ, ఇంకొంతమంది ఇండివిడ్యువల్ వీవర్స్ ఉన్నారు. పొందూరు, పెన్‌కలంకారీ, కలంకారీ, గుంటూరు, చీరాల, మంగళగిరి, వెంకటగిరి, ఒరిస్సా నుంచి కూడా చేనేతకారులు తమ ఉత్పత్తులతో వస్తుంటారు. వరంగల్ నుంచి మ్యాట్స్, చందేరీ, కర్నాటక నుంచి ఇల్కల్ వీవింగ్, సిద్ధిపేట్ గొల్లభామ, ముత్యంగడి చీరలు... మొత్తం దీనిమీద ఆసక్తి కొద్దీ, కళను బతికించాలని ఆలోచనతో చేస్తున్న వర్క్ ఉన్నవాళ్లు ఒకచోట చేరుతుంటారు. కొంతమంది చదువుకున్నవారు, ఉద్యోగాలు చేస్తూ ఆసక్తితో తిరిగి చేనేతలకు వస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా, గుజరాత్ నుంచి అజ్రక్, కలకత్తా, బెంగాల్ నుంచి చేనేతకారులు ఈ సంతకు వస్తున్నారు. అయితే, ఇక్కడకు వచ్చే కొంతమంది ధర పెట్టడానికి చాలాసేపు బేరం ఆడుతుంటారు. అది బాధనిపిస్తుంది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌కి వెళ్లి, అక్కడి వస్తువులకి ఎంత డబ్బయినా ఖర్చు పెడతారు. కానీ, మనవైన చేనేతల కష్టాన్ని మాత్రం విపరీతంగా బేరం ఆడుతుంటారు. మనలో ఆర్థిక మార్పు కాదు, సామాజిక మార్పు రావాలి. ► రైతుగానూ.. మా అమ్మనాన్నలు నాకు మంచి సపోర్ట్. పర్యావరణ సంబంధిత ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా తమవంతు తోడ్పాటును అందించారు. ఎన్నిరోజుల వీవర్స్ వారు తమ శక్తిని నమ్ముకుంటారో అంతవరకు ఇలాంటి సంతలు ఏర్పాటు చేస్తూనే ఉంటాను. ఇప్పటివరకు రెండు నెలలకు ఒకసారి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మూడు – ఆరు నెలలకు ఒకసారి చేయాలనుకుంటున్నాం. ఇందుకు కారణం కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా తగ్గిపోతుండటమే. ఫలితంగా చేనేతకారులు ఆశించినంత ఆదాయం వారికి రావడం లేదు. నేటి తరం మన హస్తకళల గొప్పతనాన్ని అర్ధం చేసుకోవాలి, చేయూతనివ్వాలి. ప్రకృతితో మమేకం అవడం నాకు ఇష్టమైన పని. అందుకే, వ్యవసాయం చేస్తూ రైతులకు దగ్గరగా, చేనేతలకు చేరువలో ఉండటంలోని సంతోషాన్ని పొందుతుంటాను’’ అని వివరించారు సరస్వతి. మద్దతు ముఖ్యం క్రమం తప్పకుండా ఇలాంటి సంతలను ఏర్పాటు చేయడం వల్ల వినియోగదారులకు సులువుగా అర్ధమైపోతుంది ఫలానాచోట హ్యాండ్లూమ్స్ లభిస్తాయి అని. దీనికి డిజిటల్ మీడియా వేదికగా ప్రమోట్ చేస్తున్నాం. ఈ నెల వరకు 50 చేనేత సంతలు ఏర్పాటుచేశాం. ఇకముందు కూడా ఎన్ని వీలైతే అన్ని చేద్దామనుకుంటున్నాను. మనవంతు సాయంగా సపోర్ట్ చేయగలిగితే సరిపోతుంది. ఇది ఒక వాలంటీర్‌గా చేసే సాయం. – నిర్మలారెడ్డి -
కొలంబియా ఉపాధ్యక్షురాలిగా మార్కెజ్
బొగొటా: దక్షిణ అమెరికా దేశం కొలంబియా ఓటర్లు ఆదివారం జరిగిన ఎన్నికల్లో విలక్షణ తీర్పునిచ్చారు. మాజీ కమ్యూనిస్ట్ నేతకు అధ్యక్ష పదవి పగ్గాలు అప్పగించడంతోపాటు, మొదటిసారిగా ఫ్రాన్సియా మార్కెజ్ అనే నల్లజాతీయురాలిని ఉపాధ్యక్ష పదవికి ఎన్నుకున్నారు. దేశ కొత్త అధ్యక్షుడిగా వామపక్ష మాజీ తిరుగుబాటు నేత గుస్తావో పెట్రో ఆగస్ట్ 7న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆఫ్రో–కొలంబియన్ అయిన ఫ్రాన్సియా మార్కెజ్(40) చిన్నతనం నుంచే పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలను ముందుండి నడిపారు. నల్లజాతి కొలంబియన్ల తరఫున పోరాడారు. సుదీర్ఘకాలం కొనసాగిన సాయుధ పోరాటం కారణంగా సమాజంలో నెలకొన్న అసమానతలను రూపుమాపేందుకు కృషి చేస్తామని మార్కెజ్ మీడియాతో అన్నారు. లా టొమా అనే మారుమూల గ్రామంలోని పేద కుటుంబంలో జన్మించిన మార్కెజ్ 16 ఏళ్ల వయస్సులోనే తల్లి అయ్యారు . తన కూతురు కోసం ఎంతో కష్టపడ్డారు. ఒకవైపు రెస్టారెంట్లో పనిచేసుకుంటూనే లా డిగ్రీ పూర్తి చేశారు. చుట్టు పక్కల గ్రామాల్లోని అఫ్రో–కొలంబియన్లకు చెందిన భూముల్లో అక్రమ బంగారు గనుల తవ్వకాన్ని విజయవంతంగా అడ్డుకున్నారు. ఆమె కృషికి గాను 2018లో గోల్డ్‌మ్యాన్ ఎన్విరాన్మెంటల్ బహుమతి అందుకున్నారు. డెమోక్రటిక్ పోల్ పార్టీలో గత ఏడాది జరిగిన ప్రాథమిక ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేసి గుస్తావో పెట్రో చేతిలో ఓడిపోయారు. కానీ, పార్టీలోని మిగతా సీనియర్ నేతల కంటే ఎక్కువ ఓట్లు ఆమెకే పడ్డాయి. సాయుధ వామపక్ష తిరుగుబాటు నేత అయిన పెట్రోకు ప్రజల్లో అంతగా పలుకుబడి లేదు. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా పేదలు, యువత, పట్టణ ప్రాంత మహిళలు మార్కెజ్ వైపు మొగ్గు చూపారు. ఆఫ్రో–కొలంబియన్ల ప్రాంతాల్లో మెజారిటీ ఓట్లు పెట్రోకు పడ్డాయి. మార్కెజ్ జనాదరణ కూడా విజయానికి బాటలు వేసిందని స్పష్టం చేస్తున్నారు. -
షాకింగ్ ఘటన: మోనాలిసా పెయింటింగ్ ధ్వంసానికి యత్నం!
ప్యారిస్: సుప్రసిద్ధ కళాకృతి, ప్రపంచంలోనే పాపులర్ పెయింటింగ్ మోనాలిసాను ధ్వంసం చేసే ప్రయత్నం జరిగింది. కళా ప్రియులు, సందర్శకుల సమక్షంలోనే ఇది జరగడం గమనార్హం. వృద్ధురాలి గెటప్‌లో వీల్‌చైర్‌లో సందర్శనకు వచ్చిన ఓ యువకుడు ఈ దాడికి పాల్పడ్డాడు. వీల్‌చైర్ నుంచి ఒక్కసారిగా బయటకు దూకి.. పెయింటింగ్ వైపు దూసుకెళ్లాడు. ఆపై కేక్‌ను పెయిటింగ్ మీదకు విసిరికొట్టాడు. అంతటితో ఆగకుండా మళ్లీ పెయింటింగ్ దగ్గరగా దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇంతలో సెక్యూరిటీ గార్డులు అతన్ని నిలువరించి అదుపులోకి తీసుకున్నారు. అయితే పెయింటింగ్ మీద ఉన్న గ్లాస్‌కు ఆ కేక్ అంటడంతో పెయింటింగ్‌కు ఎలాంటి డ్యామేజ్ కాలేదు. సుప్రసిద్ధ చిత్రకారుడు లియోనార్డో డా విన్సీ గీసిన ఈ పెయింటింగ్.. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని లౌవ్రే మ్యూజియంలో ప్రదర్శనకు ఉంది. ప్రస్తుతం దాడి వీడియో వైరల్ అవుతోంది. దాడికి పాల్పడిన వ్యక్తి పర్యావరణవేత్తగా తెలుస్తోంది. ఈ భూమిని కొందరు నాశనం చేయాలనుకుంటున్నారు అంటూ ఫ్రెంచ్‌లో అతను నినాదాలు చేయడం విశేషం. Can anybody translate what ole dude was saying as they where escorting him out?😂 pic.twitter.com/Uy2taZ4ZMm — Lukeee🧃 (@lukeXC2002) May 29, 2022 అతను పెయింటింగ్ ధ్వంసం కోసమే యత్నించాడా? లేదంటే కేక్ పూయడం ద్వారా నిరసన తెలపాలనుకున్నాడా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. సెక్యూరిటీ కళ్లు గప్పి అసలు కేకును అతను లోపలికి ఎలా తీసుకెళ్లడన్నది ఇప్పుడు చర్చగా మారింది. ఇదిలా ఉంటే.. మోనాలిసా పెయింటింగ్ ఇలా దాడులకు లక్ష్యంగా మారడం ఇదేం కొత్త కాదు. 1956లో ఓ ఆగంతకుడి సల్ఫ్యూరిక్ యాసిడ్ దాడిలో పెయింటింగ్ కింది భాగంగా.. బాగా డ్యామేజ్ అయ్యింది కూడా. అప్పటి నుంచి బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాసులో ఆ పెయింటింగ్‌ను భద్రపరిచారు. -
ప్రగతిభవన్‌కు తిమ్మక్క.. సమీక్ష సమావేశానికి తీసుకెళ్లి సత్కరించిన సీఎం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ పర్యావరణవేత్త, పద్మశ్రీ గ్రహీత.. 110 ఏళ్ల వయసున్న సాలు మరద తిమ్మక్క బుధవారం సీఎం కేసీఆర్‌ను కలిశారు. సీఎం ఆమెను ప్రగతిభవన్‌లో మంత్రు లు, కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి స్వయంగా తోడ్కొని వెళ్లారు. అందరికీ పరిచయం చేశారు. ఆమెను సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. పర్యావరణం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన తిమ్మక్కను మించిన దేశభక్తులు ఎవరూ లేరని కొనియాడారు. మంచి పనిలో నిమగ్నమైతే గొప్పగా జీవించవచ్చని, మంచి ఆరోగ్యంతో ఉంటారనడానికి తిమ్మక్క నిలువెత్తు నిదర్శనమని చెప్పారు. అందరూ ఆమె బాటలో నడవాలని ఆకాంక్షించారు. కాగా.. వ్యవసాయం, అటవీ సంరక్షణ రంగాల్లో రాష్ట్రం దేశానికే తలమానికంగా నిలవడం పట్ల తిమ్మక్క సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మొక్కలు అవసరముంటే తాను అందజేస్తానని చెప్పారు. కర్ణాటకకు చెందిన తిమ్మక్క బీబీసీ ఎంపిక చేసిన 100 మంది ప్రభావశీల మహిళల్లో ఒకరు. 25 ఏళ్లవరకు పిల్లలు కలగకపోవడంతో మొక్కల్నే పిల్లలుగా భావించి.. పచ్చదనం, పర్యావరణ హితం కోసం ఆమె కృషి చేస్తున్నారు. చదవండి👉🏼 కేసీఆర్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు.. తప్పుగా అనుకోవద్దని వ్యాఖ్యలు కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రకృతి పరిరక్షకులు, ప్రముఖ పర్యావరణ వేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత, 110 సంవత్సరాల సాలుమరద తిమ్మక్క ఈ రోజు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. pic.twitter.com/j9hLTlz4cK — Telangana CMO (@TelanganaCMO) May 18, 2022 ‘ఆకుపచ్చని వీలునామా’ఆవిష్కరణ హరితహారం, గ్రీన్ ఇండియా చాలెంజ్ పై సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో పలువురు రచయితలు రాసిన వ్యాసాల సంకలనం ‘ఆకుపచ్చని వీలునామా’పుస్తకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. సీఎంను కలిసిన తమిళ హీరో విజయ్ తమిళ సినీనటుడు విజయ్ బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. విజయ్‌కు కేసీఆర్ శాలువా కప్పి సత్కరించారు. చదవండి👉 భూవివాదంలో కేసు నమోదు.. పరారీలో మంత్రి మల్లారెడ్డి బావమరిది -
లక్ష మొక్కల నోము
‘రోజూ ఉదయం బ్రష్ చేసుకున్న తర్వాత నువ్వు ఒక గ్లాసు నీళ్లు తాగు, ఒక గ్లాసు మొక్కకు తాగించు’ ఈ మాట పిల్లల మెదళ్ల మీద ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో... ఆ మాట చెప్పినప్పుడు ఊహించలేం. కానీ పిల్లలు తప్పకుండా ప్రభావితం అయి తీరుతారు. ‘నువ్వు నాటేది ఒక్క మొక్క అయినా చాలు, దానిని బతికించి తీరాలి’ అని చెబితే పిల్లలు చాలెంజ్‌గా తీసుకుని తీరతారు. తోటి పిల్లల మొక్కల కంటే తన మొక్కను ఇంకా బాగా పెంచాలని తాపత్రయపడతారు. పిల్లలను ఈ రకంగా ప్రోత్సహిస్తున్న వ్యక్తి స్వయంగా మొక్కలు నాటుతుంటే, నాటిన మొక్కల బాగోగులు స్వయంగా పట్టించుకుంటూ ఉంటే పిల్లలు రోల్‌మోడల్‌గా తీసుకోకుండా ఉంటారా? అలా పిల్లలకు మొక్కల రోల్ మోడల్‌గా మారారు బొల్లంపల్లి జ్యోతిరెడ్డి. పదివేలకు పైగా మొక్కలు నాటి పుడమిని పచ్చగా మార్చడంలో తనవంతు భాగస్వామ్యం అందిస్తున్న ఈ పర్యావరణ కార్యకర్త సాక్షితో పంచుకున్న అనుభవాలివి. బొల్లంపల్లి జ్యోతిరెడ్డి పూర్వీకులది రంగారెడ్డి జిల్లా పడకల్. యాభై ఐదేళ్ల కిందట తాతగారు హైదరాబాద్ ఓల్డ్‌సిటీకి వచ్చి స్థిరపడడంతో జ్యోతిరెడ్డి తన పుట్టిల్లు ‘పాతబస్తీ’ అంటారు. పర్యావరణ కార్యకర్తగా మారడానికి ముందు తన జీవితాన్ని క్లుప్తంగా వివరించారామె. ‘‘పుట్టింది, పెరిగింది హైదరాబాద్ పాతబస్తీలో. అక్కడి ఆర్య హైస్కూల్లో చదువుకున్నాను. ఆ తర్వాత మలక్‌పేటలోని శ్రీవాణి కాలేజ్. ఇంటర్ తర్వాత పెళ్లి, మెడిసిన్‌లో సీటు వచ్చింది. కానీ కుటుంబ బాధ్యతల రీత్యా సీటు వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ చేశాను. ముగ్గురు పిల్లలతో రామంతపూర్‌లో అత్తగారింట్లో గృహిణిగా జీవితం సాఫీగానే సాగుతూ ఉండేది. కానీ ఏదో వెలితి మాత్రం ఉండేది. అయితే మనిషిని సామాజిక జీవిగా మలచడంలో నేను చదువుకున్న ఆర్య స్కూల్‌ది చాలా కీలకమైన పాత్ర. నా సోషల్ యాక్టివిటీస్‌కి మూలం కూడా అదే. మేము ఉప్పల్‌కి మారాం. అక్కడ కూడా కాలనీలో పిల్లల కోసం సమ్మర్ క్యాంప్‌లు ఏర్పాటు చేయడం, క్రాఫ్ట్ క్లాసులు నిర్వహించడం వంటి ఏదో ఒక వ్యాపకంలో నిమగ్నమయ్యేదాన్ని. వీటితోపాటు బ్యూటీపార్లర్లు నిర్వహిస్తూ కొంతకాలం నన్ను నేను బిజీగా ఉంచుకున్నాను. అప్పుడు ఉప్పల్ మెయిన్‌రోడ్ పొల్యూషన్ ఎంత తీవ్రంగా ఉందనేది నాకు అనుభవంలోకి వచ్చింది.ఒకసారి బయటకు వెళ్తే చాలు వాహనాల కాలుష్యం కారణంగా ముక్కు కారడం, దగ్గు, రకరకాల అలర్జీలు వచ్చేవి. భూమాత ఎదుర్కొంటున్న పరీక్షలు అర్థమయ్యాయి. పచ్చదనం లోపించిన పుడమి చల్లగా ఉండాలంటే ఎలా ఉంటుంది? అనిపించింది. నన్ను నేను పనిలో నిమగ్నం చేసుకోవడానికి ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటున్నాను, ఆ చేసే పని భూమాతకు పనికి వచ్చేదే అయితే బావుంటుంది కదా... అనుకున్నాను. అలా రూపుదిద్దుకున్నదే ‘గ్రీన్ ఇండియన్ సొసైటీ’ నారు... నీరు! ‘మొక్కలు నాటడం’ అనే మాట వినగానే ‘మరి వాటిని బతికించడం?’ అనే కౌంటర్ కూడా వినిపిస్తుంటుంది. నేను మొక్కలు నాటుతున్నాను, అలాగే వాటిని బతికించే బాధ్యత కూడా తీసుకున్నాను. నేను చేస్తున్నది మొక్కుబడిగా మొక్కలు నాటడం కాదు, బాధ్యతగా పచ్చదనాన్ని పెంపొందించడం. నేను మొక్క నాటుతున్నది భూమాతకు చల్లదనాన్నివ్వడం కోసం, కాబట్టి మొక్కను బతికించి చిగురు తొడిగితే మురిసిపోవడం కూడా నా సంతోషాల్లో భాగమే. అందుకే ఎవరి ఇంటి ముందు నాటుతున్నానో ఆ ఇంటి వాళ్ల నుంచి ‘మొక్కను బతికిస్తాం’ అనే మాట తీసుకుంటాను. పబ్లిక్ ప్రదేశాల్లో నాటే మొక్కలకు మనుషులను పెట్టి నీళ్లు పోయిస్తున్నాను. నా బాధ్యతలో స్కూల్ టీచర్లు బాగా సహకరిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని స్కూళ్లతోపాటు జిల్లాల్లో విశాలమైన ఆవరణ ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఎంచుకుంటున్నాను. మొక్క నాటి ట్రీ గార్డు పెట్టిన తర్వాత ఆ ట్రీ గార్డుకు నంబరు ఇస్తాం. పెద్ద క్లాసుల పిల్లలకు ఒక్కో చెట్టు బాధ్యత ఒక్కొక్కరికి అప్పగిస్తాం. ఆ మొక్కలు చిగురించినప్పుడు ఫొటో తీసి వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేస్తారు టీచర్లు. స్కూళ్లలో మొక్కలు నాటడానికంటే ముందు పిల్లలకు చెట్లు ఎంత అవసరమో, చెట్లు లేకపోతే ఎదురయ్యే పరిణామాలెలా ఉంటాయో... వివరించి చెబుతాను. అలాగే ఇంట్లో మొక్కలు నాటి పెంచమని కూడా చెబుతాను. ‘మనకు దాహమైతే గ్లాసుతో నీళ్లు తీసుకుని తాగుతాం. మొక్కలకు దాహమైతే మరి? అవి కదలలేవు కాబట్టి వాటికి మనమే నీళ్లు తాగించాలి. మీరు అన్నం తినే ముందు మొక్కకు నీళ్లు పోస్తారా లేక నీళ్లు తాగిన తర్వాత మొక్క దాహం తీరుస్తారా? అదేదీ కాకపోతే ఉదయం నిద్ర లేచిన వెంటనే నీళ్లు పోస్తారా? అని పిల్లల డైలీ రొటీన్లో మొక్కకు నీళ్లు పోయడాన్ని ఒక తప్పనిసరి పనిగా చెప్తాను. బాల్యంలో మెదడు మీద పడిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు. అందుకే నా గ్రీన్ ఇండియన్ సొసైటీ నిర్మాణానికి బాలయోధులను తయారు చేసుకుంటున్నాను. లక్ష మొక్కలు నాటాలనే నా లక్ష్యసాధనకు బ్రాండ్ అంబాసిడర్లు పిల్లలే అవుతారు’’ అని చెప్పారామె. కరోనా కారణంగా ఆమె మొక్కల నోముకు కొంత విరామం వచ్చింది. ఇప్పుడు మళ్లీ మొదలవుతోంది. లక్ష మొక్కల టార్గెట్‌ని చేరే వరకు ఇక విరామం తీసుకునేది లేదంటున్నారు జ్యోతిరెడ్డి. తొలి మొక్క వేప! మొక్కల ఎంపికలో కొన్ని నియమాలు పాటిస్తున్నాను. నిమ్మ, కలబంద, వేప, సపోట, నారింజ, తులసి, యూకలిప్టస్, గన్నేరు మొక్కలు ప్రధానంగా ఉంటాయి. నా తొలి మొక్క వేప. ఆలయాల్లో పండ్లు, పూల మొక్కలు. పబ్లిక్ ప్రదేశాల్లో గాలిని శుద్ధి చేయడమే ప్రధానమైన ఔషధ మొక్కలు, త్వరగా పెరిగే వృక్షజాతులను ఎంచుకుంటున్నాను. మొదట్లో అన్ని మొక్కలనూ నర్సరీ నుంచి కొనేదాన్ని. తర్వాత ప్రభుత్వ అధికారులు సంబంధిత డిపార్ట్మెంట్ల నుంచి కొన్ని రకాల మొక్కలు ఇచ్చి సహకరిస్తున్నారు. – జ్యోతిరెడ్డి, పర్యావరణ కార్యకర్త – వాకా మంజులారెడ్డి -
ప్రకృతి రక్షకు స్త్రీ శక్తి..
వ్యవసాయ రంగంలో స్త్రీ శక్తి పెరిగిందా?! మనం ఎలా ఉండాలో.. ఏం తినాలో.. ఎలా జీవించాలో.. మార్కెట్ శక్తులు మనపైన పనిచేస్తున్నాయా?! పర్యావరణవేత్త, రచయిత, వక్త, సామాజిక కార్యకర్త అయిన డాక్టర్ వందనశివ డెహ్రాడూన్ నుంచి ఇటీవల హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, పరిణామాలపై ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ మన దేశంలో సేంద్రీయ వ్యవసాయానికి ప్రజాదరణ వేగంగా పెరుగుతోంది. సేంద్రీయ ఆహార ఉద్యమంలో మార్గదర్శకులుగా ఉన్న మీరు ఈ విషయాన్ని ఎలా చూస్తారు? ఇది మంచి పరిణామం. అయితే, మన మూలాలను మర్చిపోయి చాలా ముందుకు వచ్చేశాం. ఇప్పుడు మళ్లీ మూలాలను వెతుక్కుంటూ వెళుతున్నాం. ఎవరు ఎంత సంపాదించినా ఆరోగ్యకరమైన జీవనం కోసమే కదా. మంచి ఆహారం వల్లే ఇది సాధ్యమని మనందరికీ తెలుసు. హరిత విప్లవంలో భాగంగా 1984లో వ్యవసాయ రంగంపై దృష్టిసారించినప్పుడు రసాయనాల వాడకం అంతగా లేదన్నది నిజం, కానీ, ఆ తర్వాత సంభవించిన పరిణామాలతో వ్యవసాయంలో రసాయనాల వాడకం వల్ల జీవ వైవిధ్యం, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటూ వచ్చాయి. ఇటీవల కాలంలో దేశంలో క్యాన్సర్ వ్యాప్తి ఎంత వేగంగా పెరుగుతోందో మనకు తెలిసిందే. దీనితోపాటు పరిశ్రమల్లో తయారయ్యే ఇన్స్టంట్ ఫుడ్ ప్రజలపై మరీ హానికరమైన ప్రభావం చూపుతోంది. వేగంగా విజృంభించిన వ్యాధుల్లో డయాబెటిస్ కూడా ఒకటి. ఒక దేశ స్థితి అక్కడి వాతావరణం, ప్రజల ఆదాయం, ఆరోగ్యం.. ఈ మూడింటిపైన ఆధారపడి ఉంటుంది. నేటి సేంద్రియ వ్యవసాయ పద్ధతులన్నీ మన దగ్గర 10 వేల ఏళ్ల క్రితమే ఉన్నాయి. నీటి సదుపాయాలు తక్కువగా ఉన్న ప్రాంతాలు ముఖ్యంగా దక్కన్ ఏరియా వ్యవసాయం నుంచి మిగతా రంగాలకు వలసపోయింది. ఇప్పుడిప్పుడు ఇతర రంగాల్లో ఉన్నవారూ వ్యవసాయరంగం వైపు చూస్తున్నారు. మనిషికి కావల్సింది ఆరోగ్యకరమై ఆహారం. దానిని తనే స్వయంగా పండించుకోవాలనే ఆలోచన పెరగడం శుభపరిమాణం. ప్రస్తుతం మార్కెట్‌ను సేంద్రీయ ఉత్పత్తులు, జన్యుపరంగా మార్పులు చేసిన ఆహార ఉత్పత్తులు ముంచెత్తుతున్నాయి కదా... ఇవి మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయి? నేను అర్థం చేసుకున్నదేంటంటే.. క్వాంటమ్ థియరీ ప్రకారం ప్రతీదానికి ఒక జెనోమ్ ఉంటుంది. ఉదాహరణకు మన శరీరంలోని ప్రతి భాగానికి ఒక సంపూర్ణత్వం ఉంటుంది. ఏ ఒక్క భాగానికి విఘాతం కలిగినా మిగతా వ్యవస్థ అంతా దెబ్బతింటుంది. అలాగే, జీవరాశి కూడా. ప్రపంచ మార్కెట్‌ను చూస్తే కార్న్, కనోలా, కాటన్, సోయా.. ఈ ఉత్పత్తులే. ఆహారం పైనే కాదు జీవనశైలిపైనా విపరీతమైన ప్రభావం చూపాయి. మన దేశంలో బీటీ పత్తి అతి పెద్ద డిజాస్టర్ అని చెప్పవచ్చు. సుమారు ఇరవై ఏళ్ల క్రితం తెలంగాణలో పత్తి పంట కారణంగా రైతుల ఆత్మహత్యలు చూశాం. ఆ సమయంలో రైతు ఆత్మహత్యలకు గల కారణాలేంటో తెలుసుకోవడానికి వరంగల్‌తో పాటు మిగతా ప్రాంతాలకూ వెళ్లాను. మొత్తం రసాయనాలే. అమెరికాలో అక్కడి వ్యవసాయం దాదాపు రైతుల చేతుల్లోనే ఉంటుంది. కానీ, మన దగ్గర అలా లేదు. జన్యుపరమైన మార్పుల వల్ల జంతుజాలంపై తీవ్ర ప్రభావం పడింది. పంట దిగుబడి పెరగడానికి అవలంబించే విధానాల వల్ల నిరంతర హాని జరుగుతూనే ఉంది. ఈ ప్రభావం నుంచి జీవవైవిధ్యాన్ని కాపాడాలంటే ఏం చేయాలి? దేశీ విత్తనాలు. ఇప్పుడు రైతులు వేసే విత్తనాలన్నీ బహుళజాతి కంపెనీల చేతుల్లో ఉన్నాయి. అవన్నీ కెమికల్ సీడ్స్. ముందు దేశీ విత్తనాలు రావాలి. కమ్యూనిటీ సీడ్ బ్యాంక్స్ పెరగాలి. విత్తనం గురించి ముందు మనం అర్థం చేసుకోవాలి. ఇండస్ట్రియల్ సీడ్స్‌లో ఎలాంటి పోషకాలు ఉండవు అని గుర్తించాలి. మన ప్రాంత వాతావరణానికి అవి ఏ మాత్రం అనువైనవి కావు. దేశీ విత్తనాల అభివృద్ధిలో భాగంలో దేశవ్యాప్తంగా 150 కమ్యూనిటీ సీడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేశాం. నాలుగు వేల వరివంగడాలు, 300 రకాల గోధుమ, మిల్లెట్స్.. దేశీ విత్తనాలలో పెద్ద మార్పు తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే, ఆహారమే అతి పెద్ద ఆయుధం. దానిని ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలిసుండాలి.. మనం తినే తిండి, విత్తనాన్ని మనకు మనంగా సాధించుకోవాలి. గ్రీన్ రెవల్యూషన్ రావాలి. ఇండస్ట్రియల్ ఫార్మింగ్ తగ్గాలి. ప్రభుత్వాలు స్థానికంగా రైతుల మార్కెట్లు ఏర్పాటు చేయాలి. ఎవరు పండిస్తున్నారో వారే అమ్ముకోగలగాలి. అంతేకాదు, వాటిని ఆ కుటుంబం కూడా తినగలగాలి. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం నేపథ్యంలో అనారోగ్యకరమైన వంటనూనెలకు గాంధీజీ సూచించిన కట్టెగానుగ నూనె సరైన పరిష్కారమా? కచ్చితంగా! గానుగ నూనెలు, మిల్లు నూనెలను చూస్తే మనకే ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది వేటిలో పోషకాలు ఉన్నాయి అనేది. సత్యాగ్రహకాలంలోనే గానుగ నూనె ల ప్రాధాన్యం గురించి గాంధీజీ సూచించారు. దీనిని కూడా మార్కెట్ శక్తులు మనపై పనిచేశాయి. విదేశీ కంపెనీలు మన గానుగ నూనెలు మంచివి కావని, ఫిల్టర్, పోషకాలు కలిసిన నూనెలు మంచివని నూరిపోశారు. తమ ఆదాయాలు పెంచుకోవడానికి పరిశ్రమలు వేసిన ఎత్తుగడలకు మనం బలయ్యాం. దానిని మనం గుర్తించాలి. మీ ‘నవధాన్య’ కేంద్రం ఏర్పాటు గురించి.. ప్రాంతాలవారీగా ఉన్న జీవరాశి అక్కడి వాతావరణ స్థితిగతులపైన ఆధారపడి మనుగడ సాగిస్తుంది. దేశంలోనే ప్రాంతాలవారీగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పంట దిగుబడులను చూస్తుంటాం. వాటి మీద ఒక మనిషి మాత్రమే కాదు, అక్కడ ఉన్న సమస్త జీవరాశి మనుగడసాగిస్తూ ఉంటుంది. అంతర్జాతీయ శక్తుల కారణంగా మన దేశీయ జీవవైవిధ్యం దెబ్బతినే ప్రమాదం నెలకొంది. మనవైన వేప, బాస్మతి, వరి, గోధుమలపై విదేశీ కంపెనీలు పెత్తనం చెలాయించాలని చూశాయి. వాటి హక్కులు పొందే ప్రయత్నాలను న్యాయపోరాటాల ద్వారా విజయవంతంగా తిప్పికొట్టాం. ఇవన్నీ గమనించే ‘నవధాన్య’ కేంద్రం ద్వారా దేశీ విత్తనాల పెంపునకు కృషి జరుగుతోంది. మీకు ఇష్టమైన ‘ఎకోఫెమినిజం’ గురించి. ప్రపంచంలో ఈ భావన ఎలా ఉంది? వ్యవసాయంలో ఏ ఇజం ఉండదనేదే నా అభిప్రాయం. అయితే, మనం భూమిని తల్లిగా భావిస్తాం. వందల ఏళ్ల క్రితం నుంచి మహిళ ఇలాంటి పనులను చేయలేరు అనే ఒక విధానం మన వ్యవస్థలో ఉండేది. ప్రకృతి శక్తి, స్త్రీ శక్తి స్వరూపిణి. ఈ రెండింటినీ విడదీయలేం. శక్తి చూపడంలో స్త్రీ అన్నింటా ముందుంటుంది. పైగా పిల్లల్ని, కుటుంబాన్ని కాపాడుకోవడంలో ఎప్పుడూ రక్షగా ఉండే స్త్రీ, ప్రకృతిలోని జీవరాశిని కాపాడటంలోనూ ముందుంటుంది. అందుకే సేంద్రీయ వ్యవసాయంలో మహిళ చాలా బాగా వర్క్ చేస్తోంది. ప్రకృతిలో జీవించే హక్కు, తనకు, కావల్సినవి సాధించుకునే శక్తి అన్ని జీవులకు ఉంటుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసినా ఆహారం, వ్యవసాయం రంగాల్లో మహిళల శాతం అధికంగా ఉంది. ఇంకా పెరుగుతూనే ఉంటుంది. – నిర్మలారెడ్డి ఫొటో: మోహనాచారి -
Sunderlal Bahuguna: ‘చిప్కో’ ఉద్యమ కర్త ఇకలేరు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, చిప్కో ఉద్యమానికి ఊపిరిపోసిన సుందర్‌లాల్ బహుగుణ(94) కన్నుమూశారు. సుందర్‌లాల్ బహుగుణకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఈ నెల 8వ తేదీన రిషికేశ్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో చేర్పించారు. పరిస్థితి విషమించి శుక్రవారం మధ్యాహ్నం 12.05 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఎయిమ్స్ డైరెక్టర్ రవికాంత్ తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. బహుగుణ మృతికి ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం రిషికేశ్‌లో గంగానదీ తీరాన పూర్ణానంద్ ఘాట్‌లో బహుగుణకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. 13 ఏళ్లకే స్వాతంత్య్ర పోరాటంలోకి ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో 1927 జనవరి 9వ తేదీన జన్మించిన బహుగుణ 13 ఏళ్ల వయస్సులోనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. మహాత్మాగాంధీ అహింసా వాదాన్ని జీవితాంతం ఆచరించారు. 1947లో లాహోర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకొని తెహ్రీ సంస్థాన రాచరికానికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్నారు. 1948లో ఏర్పడిన ప్రభుత్వంలో ప్రచారశాఖ మంత్రి అయ్యారు. 1974లో హిమాలయ ఘర్వాల్ ప్రాంతంలో చెట్ల నరికివేతను అడ్డుకొనేందుకు శాంతియుత నిరసన ఉద్యమం చిప్కోను ప్రారంభించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు చెట్లను నరికివేసే సమయంలో వాటిని కౌగిలించుకోవడం ద్వారా కాపాడుకోవడమే దీని లక్ష్యం. ఇలా వృక్షాలను రక్షించే ఉద్యమంగా ప్రారంభమై పర్యావరణ పరిరక్షణ ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ఉద్యమాలకు ప్రేరణగా నిలిచింది. 84 రోజుల నిరశన దీక్ష చెట్లను నరికివేయడాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ 1981లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీని తీసుకోవడానికి బహు గుణ నిరాకరించారు. సొంత జిల్లా తెహ్రీలో ప్రభుత్వం తలపెట్టిన డ్యాంతో పెద్ద సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యే ప్రమాదముంది. దీంతో తెహ్రీ డ్యామ్ నిర్మాణాన్ని తీవ్రంగా నిరసిస్తూ 84 రోజులపాటు ఉపవాస దీక్ష సాగించారు. హిమాలయాల పర్యావరణ పరి రక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయన పలు పర్యాయాలు పాదయాత్రలు కూడా చేపట్టారు. ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ సహా పలు అవార్డులు ఆయన్ను వరించాయి. బహుగుణ మరణం మన జాతికి తీరని నష్టం. ప్రకృతితో మమేకం కావాలనే మన వారసత్వ విలువల ను పరిరక్షించేందుకు ఆయన కృషి చేశారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని ప్రధాని ట్విట్టర్లో పేర్కొన్నారు. సుందర్‌లాల్ బహుగుణ ‘అద్భుతమైన సంఘ సేవకుడు’అని ప్రముఖ పర్యావరణవేత్త చండీప్రసాద్ భట్ అభివర్ణించారు. -
గ్రెటా థన్‌బర్గ్‌పై కేసు నమోదు!
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో పోరాటం కొనసాగిస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటిస్తూ ట్వీట్లు చేసిన స్వీడన్ పర్యావరణ ఉద్యమకారిణి, 18 ఏళ్ల గ్రెటా థన్‌బర్గ్‌పై ఢిల్లీ పోలీసులు గురువారం కేసు నమోదు చేసినట్లు సమాచారం. మతం, జాతి, భాష, పుట్టిన ప్రాంతం ఆధారంగా వివిధ గ్రూప్‌ల మధ్య శత్రుత్వాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారన్న కారణంతోపాటు విదేశాల నుంచి కుట్రలు సాగిస్తున్న ఆరోపణలతో ఆమెపై కేసు పెట్టినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ గ్రెట్గా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తాను ఇప్పటికీ రైతులకు మద్దతు ప్రకటిస్తున్నానని స్పష్టం చేస్తూ మరో ట్వీట్ చేశారు. బెదిరింపులు, కేసులు తన వైఖరిని మార్చలేవని తేల్చిచెప్పారు. భారత్‌లో రైతన్నల ఆందోళనలు, నిరసనలపై రెండు రోజుల క్రితం థన్‌బర్గ్ చేసిన ట్వీట్లు అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించాయి. ఆమెను తప్పుపడుతూ భారత్‌లో పలువురు ప్రముఖులు ట్వీట్లు చేశారు. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తగదంటూ హితవు పలికారు. థన్‌బర్గ్ ట్వీట్లు వివాదాస్పదం కావడంతో ఢిల్లీ సైబర్ సెల్ పోలీసులు వీటిపై దర్యాప్తు ప్రారంభించారు. థన్‌బర్గ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు స్పష్టమవుతోంది. ‘థన్‌బర్గ్‌కు సాహస బాలిక అవార్డివ్వాలి’ గ్రెటా థన్‌బర్గ్‌కు భారత ప్రభుత్వం సాహస బాలిక పురస్కారం ప్రదానం చేయాలని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ గురువారం పేర్కొన్నారు. దేశాన్ని అస్తిరపర్చేందుకు జరుగుతున్న కుట్రకు సంబంధించిన పత్రాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినందుకు గ్రెటా థన్‌బర్గ్‌కు ఈ అవార్డు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. రైతులకు మద్దతు పేరిట భారతదేశాన్ని అస్తిరపర్చేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు. ఆయన గురువారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. భారత ప్రజాస్వామ్యానికి విదేశీ సర్టిఫికెట్ అక్కర్లేదని తేల్చిచెప్పారు. నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కేనని అన్నారు. అయితే, దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీయులు జోక్యం చేసుకోవడం సరైంది కాదని స్పష్టం చేశారు. దేశాన్ని బలహీనపర్చేందుకు ప్రయత్నిస్తే సహించబోమని హెచ్చరించారు. విదేశీ శక్తులకు వ్యతిరేకంగా దేశం ఐక్యంగా నిలుస్తోందని పేర్కొన్నారు. విదేశీ శక్తులకు పరాజయం తప్పదని వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో ఆమోదించిన చట్టం విషయంలో విదేశీయుల జోక్యం ఏమిటని బీజేపీ నేత అమిత్ మాలవియా ప్రశ్నించారు. -
కేజీ ప్లాస్టిక్ ఇవ్వండి.. నచ్చింది తినండి!
కరోనా వైరస్ ప్రపంచ మానవాళిని ఒక కుదుపు కుదిపేసింది. దీనివల్ల ఆర్థిక నష్టంతోపాటు, ప్రాణ నష్టం భారీగానే జరిగిందని.. నెనోరు కొట్టుకుని మరీ చెబుతున్నాం. కానీ మనం నిత్యం ప్లాస్టిక్ వస్తువులను వాడుతూ.. ప్రకృతిని ప్రమాదం లో పడేస్తున్నామన్న బాధ ఏమాత్రం కనిపించడం లేదు. ప్లాస్టిక్ వాడొద్దని, ఒకవేళ వాడితే జరిమానాలు విధిస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా.. వాడకం మాత్రం ఆపడంలేదు. పర్యావరణానికి ప్లాస్టిక్ పెను ముప్పుగా పరిణమిస్తోందని పర్యావరణవేత్తలు మొత్తుకుంటున్నారు. ఈ క్రమంలోనే సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ‘ప్లాస్టిక్ లావో ఖానా ఖిలావో’ అనే వినూత్న కార్యక్రమాన్ని జనవరి 23న ప్రారంభించారు. నజాఫ్‌గర్ జోన్లో తొలి ‘గార్బేజ్ కేఫ్’ను ప్రారంభించారు. అయితే.. తాజాగా మరో 23 గార్బేజ్ కేఫ్‌లను మున్సిపల్ కార్పొరేషన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. రోడ్లమీద తినడానికి తిండిలేక ఎంతోమంది చెత్తా చెదారం ఏరుకుని అది అమ్మి పొట్టనింపుకుంటుంటారు. ఇటువంటివారు ఈ గార్బేజ్ కేఫ్స్‌కు ఒక కేజీ ప్లాస్టిక్ ఇస్తే వారికి ఇష్టమైన భోజనాన్ని ఆరగించవచ్చు. ఎవరైనా సరే ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ క్యాన్స్, కూల్‌డ్రింక్ బాటిల్స్ వంటివి ఏవైనా ఒక కేజీ తీసుకు వచ్చి గార్బేజ్ కేఫ్స్ వద్ద ఇస్తే.. మున్సిపల్ కార్పొరేషన్ భాగస్వామ్యంలోని ఏ రెస్టారెంట్‌లోనైనా వారికి ఇష్టమైన ఫుడ్‌ను ఆర్డర్ చేసుకుని తినవచ్చు. ప్లాస్టిక్ ఇచ్చి బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్లలో ఏదైనా ఒక దానికోసం కూపన్లను తీసుకుని నచ్చిన ఆహారాన్ని ఆరగించవచ్చు. ఒకవేళ కేజీ ప్లాస్టిక్ తీసుకొచ్చిన వారికి ఫుడ్ తీసుకోవడం ఇష్టం లేకపోతే అరకేజీ స్వీట్స్ తీసుకోవచ్చు. ప్రస్తుతం దేశరాజధాని ఢిల్లీ వ్యాప్తంగా ఈ తరహా కేఫ్‌లు 23 ప్రారంభించారు. సౌత్‌జోన్–12,సెంట్రల్ జోన్–10,వెస్ట్‌జోన్–1 చొప్పున ఉన్నాయని మేయర్ అనామిక వెల్లడించారు. కాగా 2019లో ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో దేశంలోనే తొలి గార్బేజ్ కేఫ్ ప్రారంభమైంది. అక్కడ చెత్త సేకరించి అందిస్తే మీల్స్‌తోపాటు పేదలకు షెల్టర్కూడా ఇస్తారు. ఇలా సేకరించిన 8 లక్షల ప్లాస్టిక్ బ్యాగ్స్‌తో ఒక రోడ్డు కూడా వేశారు. ఈ రోడ్లు సాధారణ రోడ్లకంటే కూడా మన్నిక కలిగి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. -
నాకు అవార్డులు అక్కర్లేదు... కేవలం..
వాషింగ్టన్ : పర్యావరణ పరిరక్షణకై విశేష కృషి చేస్తున్నందుకుగానూ స్వీడిష్ యువ కెరటం గ్రెటా థంబర్గ్‌ను ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ఈ ఏడాది పర్యావరణ అవార్డు విజేతగా స్వీడన్, నార్వే ఆమె పేరును ప్రకటించాయి. ఈ క్రమంలో గ్రెటాకు అవార్డుతో పాటు 3 లక్షల యాభై వేల దానిష్ క్రోనర్లు(దాదాపు 35 లక్షల రూపాయలు) బహుమతిగా లభించాయి. అయితే గ్రెటా మాత్రం ఈ ప్రతిష్టాత్మక అవార్డును తిరస్కరించారు. తనకు అవార్డులు అక్కర్లేదని, వాతావరణ మార్పుపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుంటే చాలు అని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న గ్రెటా ఈ మేరకు... ‘ వాతావరణ మార్పు ఉద్యమానికి ఇదే కాదు ఇలాంటి అవార్డులు ఏమీ అక్కర్లేదు’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ‘మన రాజకీయ నాయకులు, ప్రజల సహకారం మాత్రమే మనకు కావాలి. సైన్స్ చెబుతున్న వాస్తవాలు వారు గ్రహించాలి’ అని విఙ్ఞప్తి చేశారు. ఇక తనకు అవార్డు ప్రకటించిన సందర్భంగా అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... పర్యావరణం విషయంలో నార్డిక్(స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, ఐస్లాండ్, డెన్మార్క్) దేశాలు వ్యవహరిస్తున్న తీరును గ్రెటా విమర్శించారు. ‘ చాలా అందమైన మాటలు చెబుతారు. అయితే కర్భన ఉద్గారాల విషయానికి వచ్చేసరికి మాత్రం వెనకడుగు వేస్తారు. తలసరి ఆదాయం గురించి లెక్కిస్తారు గానీ ఒక్కక్కరు పర్యావరణానికి ఎలా హాని చేస్తున్నారో మాత్రం లెక్కలు వేయరు’ అని చురకలు అంటించారు. కాగా.. ‘‘నా కలల్ని, నా బాల్యాన్నీ మీరు దొంగిలించారు. వట్టి మాటలు మీవి. మీకేం పట్టదా? ప్రజలు జబ్బున పడుతున్నారు. చనిపోతున్నారు. మొత్తం పర్యావరణమే ధ్వంసమైపోయింది. కొద్దిమంది అదృష్టవంతులలో నేనొక దానిని. మేం బతికే ఉన్నాం. అంతరించిపోతున్న జీవజాతుల అంతిమ దినాలలో ఆఖరి శ్వాసను పీలుస్తూ కొన ఊపిరితో ఉన్నాం. మీకు డబ్బు కావాలి. అభివృద్ధి కావాలి. వాటి కోసం కట్టుకథలతో మమ్మల్ని మభ్యపెడుతున్నారు. హౌ డేర్ యూ!!’’ అంటూ అమెరికా కాంగ్రెస్ వేదికగా ప్రజాప్రతినిధులను, ప్రపంచ దేశాధినేతలను ప్రశ్నించి గ్రెటా పతాక శీర్షికల్లో నిలిచిన విషయం తెలిసిందే. కాగా అస్పెర్జర్ సిండ్రోమ్‌తో బాధ పడుతున్న 16 ఏళ్ల గ్రెటా.. గతేడాది డిసెంబరులో పోలాండ్‌లో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన కాప్24 సదస్సులో ప్రసంగించారు. ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ పేరిట వాతావరణ మార్పులపై అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఐక్యరాజ్యసమితిలో ప్రసంగిస్తూ ‘మా గురించి పట్టించుకోమని అడుక్కోవడానికి ఇక్కడకు రాలేదు. చాలా ఏళ్లుగా మమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. అయినా ఎన్నోసార్లు క్షమించాం. కానీ ఇప్పుడు సమయం మించిపోయింది. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలు భవిష్యత్తును అంధకారం చేస్తాయి. ప్రజల చేతుల్లోనే నిజమైన అధికారం ఉంటుంది’ అంటూ వ్యాఖ్యానించి ప్రపంచ దేశాధినేతపై విరుచుకుపడ్డారు. ఇక కర్భన ఉద్గారాలను నియంత్రించాల్సిన అవసరం ఉందంటూ... భారత ప్రధాని మోదీకి సైతం ఓ పవర్ఫుల్ వీడియో మెసేజ్ పంపారు. -
థానె జైలు నుంచి విడుదలైన పర్యవరణ కార్యకర్తలు
-
పర్యావరణ కార్యకర్తలకు సుప్రీంకోర్టులో భారీ విజయం
-
లక్ష కోట్ల వృక్షార్చన!
భూమి భగ్గుమంటోంది.. నీటి కటకట.. కాలుష్యం కోరలు చాస్తోంది.. ఈ సమస్యలకు పరిష్కారం.. చెట్టు.. అవును ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా లక్ష కోట్ల వృక్షాలు కావాలంటున్నారు శాస్త్రవేత్తలు! ‘వృక్షో రక్షతి రక్షితః’మహానుభావులు ఎప్పుడో చెప్పారు.. వాతావరణ మార్పులను అడ్డుకోవాలంటే.. మొక్కలు పెంచడమే మేలైన పరిష్కారమని ఇప్పుడు చాలా మంది శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. ఇది అందరికీ తెలిసిందే.. అయితే ఎన్ని మొక్కలు నాటాలి? ఎక్కడ నాటాలి? వంటి చిక్కు ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు. కాలుష్యం కారణంగా పెరిగిపోతున్న భూమి సగటు ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు కనీసం లక్ష కోట్ల నుంచి లక్షన్నర కోట్ల మొక్కలు నాటాలని వీరు అధ్యయనపూర్వకంగా చెబుతున్నారు. వాతావరణంలో ఇప్పటికే చేరిపోయిన కార్బన్డయాక్సైడ్ మోతాదును 66 శాతం వరకూ తగ్గించేందుకు ఇన్ని మొక్కలు అవసరమన్నది వీరి అంచనా. ఇంకోలా చెప్పాలంటే అమెరికా భూభాగమంత విస్తీర్ణంలో కొత్తగా మొక్కలు నాటితే భూమి ఇంకొంత కాలం ‘పచ్చ’గా ఉంటుందన్నమాట! వాతావరణ మార్పుల ప్రభావాన్ని అడ్డుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా బోలెడన్ని కొత్త టెక్నాలజీలను ఆవిష్కరిస్తున్నాం. సౌర, పవన విద్యుత్తు ఉత్పత్తితోపాటు అనేక ఇతర చర్యలు తీసుకుంటున్నాం. ప్రపంచదేశాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి భూమి సగటు ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీ సెల్సియస్‌కు పరిమితం చేయాలని ప్యారిస్ ఒప్పందం చేసుకున్న విషయమూ మనకు తెలిసిందే. ప్రపంచదేశాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి భూమి సగటు ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీ సెల్సియస్‌కు పరిమితం చేయాలని ప్యారిస్ ఒప్పందం చేసుకున్న విషయమూ మనకు తెలిసిందే. వీటి మాటెలా ఉన్నా కేవలం లక్ష కోట్ల మొక్కలు నాటడం ఈ సమస్యకు అతి చౌకైన పరిష్కారమన్నది స్విట్జర్లాండ్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జ్యూరిచ్ శాస్త్రవేత్త థామస్ క్రోథర్ అంచనా. భూమ్మీద పచ్చదనం ఎంతుందన్న అంశంపై వీరు వేల ఉపగ్రహ ఛాయాచిత్రాలను పరిశీలించారు. మరిన్ని మొక్కలు నాటేందుకు ఉన్న అవకాశాలనూ లెక్కకట్టారు. మానవ ఆవాసాలు, వ్యవసాయ భూమి వంటి వాటిని మినహాయించి చూసినప్పుడు దాదాపు 160 కోట్ల హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కలు నాటేందుకు అవకాశాలున్నట్లు తెలిసింది. ఈ విస్తీర్ణంలో మొక్కలు నాటితే భూమ్మీద మొత్తం 440 కోట్ల హెక్టార్లలో పచ్చదనం ఏర్పడుతుంది. అదనంగా నాటే 1 – 1.5 లక్షల కోట్ల మొక్కలు పెరిగి పెద్దయితే.. వాతావరణంలో పేరుకు పోయిన దాదాపు 20,500 టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకోగలవు. పారిశ్రామిక విప్లవం సమయం నుంచి భూ వాతావరణంలోకి దాదాపు 30,000 టన్నుల కార్బన్డయాక్సైడ్ వాతావరణంలో కలిసిందని అంచనా. ఎక్కడ?..: ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇంత పెద్ద స్థాయిలో కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకునేందుకు ఎక్కడపడితే అక్కడ మొక్కలు నాటితే సరిపోదు అంటున్నారు శాస్త్రవేత్తలు. రష్యా, అమెరికా, కెనెడా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా వంటి దేశాల్లో సుమారు 47 కోట్ల హెక్టార్ల అడవులు పెంచేందుకు అవకాశముంది. వాతావరణ మార్పుల కారణంగా సైబీరియా ప్రాంతంలోని ఉత్తర బోరియాల్ అడవుల విస్తీర్ణం భవిష్యత్తులో పెరిగే అవకాశముండగా.. దట్టమైన ఉష్ణమండల అడవులు అననుకూ లంగా మారతాయి. కాబట్టి ఉష్ణమండల ప్రాంతాల్లో అడవుల పెంపకం అంత మేలు చేకూర్చదని థామస్ అంటున్నారు. వీలైనంత తొందరగా ఈ బృహత్ వృక్షార్చనను మొదలుపెట్టాలని.. అవి ఎదిగేందుకు దశాబ్దాల సమయం పడుతుందన్నది మరచిపోకూడదని చెప్పారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
పచ్చనాకు సాక్షిగా ఒక్కటయ్యారు.
సాక్షి, విశాఖపట్టణం : ఆలోచనకి.. ఆచరణకి మధ్య చిన్న వ్యత్యాసం ఉంటుంది. వాస్తవంగా చూస్తే ఆలోచన.. ఆచరణగా మారడానికి ఎంతో కృషి అవసరం. పర్యావరణంపై ప్రేమ కలిగిన ఓ కుటుంబం ‘పచ్చనాకు సాక్షి’గా వివాహాన్ని జరిపించింది. హాజరైన అతిథులు పదికాలాల పాటు‘పచ్చ’గా వర్థిల్లాలని దీవించారు. బెంగళూరులో నివాసం ఉంటున్న కాంతిరత్న, అరుణ్ దంపతులు. పర్యావరణ ప్రియులు. తమ కుమార్తె అదితి వివాహాన్ని ప్లాస్టిక్ రహితంగా చేయాలని నిర్ణయించారు. బంధువులందరూ విశాఖలోనే ఉండడంతో నగరంలోనే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ముంబైకి చెందిన సౌమిత్రతో ఆదివారం జిల్లా పరిషత్ సమీపంలోని ఓ కల్యాణ మండపంలో వివాహాన్ని జరిపించారు. పర్యావరణానికి విఘాతం కలిగించే ఎలాంటి వస్తువుల్ని వినియోగించకుండా పెళ్లితంతును పూర్తి చేశారు. ఆకుల పందిరి... ఉన్నత విద్యావంతులైన కాంతిరత్న, అరుణ్ దంపతులకు పర్యావరణ స్పృహ చాలా ఎక్కువ. దీనిని మాటలకు పరిమితం చేయకుండా వీరు ఆచరణలో చూపారు. కల్యాణ మండపం అలంకరణకు ఆకులు, పువ్వుల్ని వినియోగించారు. కొబ్బరాకుల్ని మండపంపై వేశారు. మండపానికి నాలుగు వైపుల అరటి మెక్కలు కట్టారు. మధ్యలో మెగలి రేకులతో అందంగా అలంకరించారు. కొబ్బరి ఆకులు, అరటి మెక్కలు, మెగలి రేకులతో తీర్చిదిద్దిన కళ్యాణ వేదిక ప్రకృతి విందు.. బహుపసందు.. వివాహం అనగానే విందు ఎంతో ప్రత్యేకం. దీనికోసం పెద్దసంఖ్యలో ఆహార పదార్థాలు వండడం, వృధా చేయడం సర్వసాధరణంగా మారింది. దీనికి భిన్నంగా ఈ వివాహ వేడుకలో ఎలాంటి రసాయనాలు, రంగులు వినియోగించకుండా తయారు చేసిన వంటల్ని అతిథులకు వడ్డించారు. ► ఫలహారం, భోజనం, సాయంత్రం టిఫిన్ వంటివి ఆరగించేందుకు అరటి ఆకులు, పోకచెక్క బెరడుతో చేసిన ప్లేట్లను వినియోగించారు. ►రసాయనాలు కలిపిన పానీయాలను అందివ్వకుండా సహజ సిద్ధమైన పెరుగుతో లస్సీని తయారు చేశారు. పేపర్ గ్లాస్‌లలో పంపిణీ చేశారు. ►టిఫిన్‌లో సాంబార్ కోసం పోకచెక్క బెరడుతో కప్పులను వాడారు. ►ఆహారాన్ని తినేందుకు చెక్క చెంచాలను పంపిణీ చేశారు. ►భోజనం ముగిసిన తరువాత కిళ్లీని ప్లాస్టిక్ కవర్లో పెట్టకుండా, టూత్‌పిక్‌తో గుచ్చి చేతికి అందించారు. ►భోజనాలు చేసే బల్లపై సైతం ప్లాస్టిక్ కవర్ వేయకుండా కాగితంతో తయారైనదే వినియోగించారు. ప్లాస్టిక్‌కు నో... ఈ మధ్యకాలంలో వివాహాల్లో చిన్న ప్లాస్టిక్ మంచినీటి సీసాలు లేదా పాలిథీన్ వాటర్ ప్యాకెట్లను అధికంగా వినియోగిస్తున్నారు. లేదంటే వందలాది పాలిథీన్ గ్లాసుల్ని వాడుతున్నారు. ఇలా చేయడం వల్ల ప్లాస్టిక్ వ్యర్థాలు అధికంగా పేరుకుపోతాయి. ఈ విధానానికి స్వస్తి చెప్పారు ఈ దంపతులు. 20 లీటర్ల మంచినీటి బాటిళ్లను తీసుకువచ్చి పేపర్ గ్లాస్‌ల్లో నీటిని అతిథులకు అందించారు. అలాగే ఒక్క చుక్క నీరు కూడా వృథా కాకుండా చర్యలు తీసుకున్నారు. మెనూ కూడా ప్రత్యేకమే.. మెనూ రూపకల్పనలో సైతం కాంతిరత్న, అరుణ్‌లు ఎంతో శ్రద్ధ వహించారు. అతిథులకు పదులసంఖ్యలో ఆహార పదార్థాలు వడ్డించే విధానానికి స్వస్తి పలికారు. ఈ విధానం వలన ఆహార పదార్థాలు భారీగా వృథా అవుతున్నాయని వీరు గ్రహించారు. రెండు కూరలు, పప్పు, పులుసు, పచ్చళ్లు, పొడులు, రెండు రకాల స్వీట్లు వడ్డించారు. రాత్రికి రెండు కూరలు, పుల్కా, చపాతి, సాంబర్, అన్నం, పెరుగు, రెండు రకాల స్వీట్లు అందించారు. ఐస్‌ను ఎక్కడా వినియోగించలేదు. ఐస్‌క్రీమ్‌కు వీరి మెనూలో చోటు కల్పించలేదు. -
బ్రిటన్‌లో భారతీయుడిపై జాత్యహంకార దాడి
లండన్: రన్వీత్పాల్ సింగ్ అనే పర్యావరణ కార్యకర్తపై బ్రిటన్‌లో జాత్యహంకార దాడి జరిగింది. బ్రిటన్ పార్లమెంటు ఎదుట ‘ముస్లిం వెనక్కి వెళ్లు’ అని అరుచుకుంటూ వచ్చిన ఓ శ్వేత జాతీయుడు సింగ్ తలపాగాను లాగేందుకు ప్రయత్నించాడు. సింగ్ గట్టిగా ప్రతిఘటించడంతో దుండగుడు పారిపోయాడు. ఎకోసిక్ సంస్థకు దక్షిణాసియా ప్రాజెక్టు మేనేజర్‌గా ఉన్న రన్వీత్పాల్ సింగ్.. మార్చి 14న నిర్వహించనున్న ప్రపంచ సిక్కు పర్యావరణ దినోత్సవంపై బ్రిటిష్ సిక్కు ఎంపీ తన్ దేశీతో చర్చించేందుకు వెళ్లారు. పోర్ట్కల్లిస్ హౌస్ వద్ద సెక్యూరిటీ క్యూలో ఉండగా ఈ దాడి జరిగింది. ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిందని, దాడి చేసిన వ్యక్తిని పట్టుకుంటామని పోలీసులు చెప్పినట్లు ఆయన వివరించారు. -
ఎస్ఆర్డీపీని ఆపండి...కేబీఆర్‌ను రక్షించండి
పర్యావరణ వాదులు, వాకర్స్ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ‘ఎస్ఆర్డీపీ ప్రాజెక్టును నిలిపేయండి.. కేబీఆర్ జాతీయ పార్క్‌ను రక్షించండి..’ ఇప్పుడు పర్యావరణవాదులు, వాకర్స్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులందరిదీ ఇదే నినాదం! ఈ ప్రాజెక్టు పనులతో పార్కులోని అరుదైన వృక్ష, జంతు, పక్షి జాతుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం మొం డిగా ముందుకు వెళ్తోందని మండిపడుతున్నారు. సుమారు 400 ఎకరాల్లో విస్తరించిన కేబీఆర్ పార్కులో.. 500 అరుదైన వృక్షజాతులు, 120 అరుదైన పక్షి జాతులు, 20 క్షీరదజాతులు, సరీసృపాలు, ఉభయచరాలతోపాటు వందలాది కీటకజాతులు ఉన్నాయి. వీటన్నింటి కలయికతో పార్కు జీవవైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ప్రభుత్వం తలపెట్టిన ఎస్ఆర్డీపీ(స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్)తో పార్క్‌లోని రమణీయ దృ శ్యాలు, పక్షులు, సీతాకోక చిలుకలు, ఇతర జీవజాలం ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుం దన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చెట్లు కొట్టివేయడం అవివేకం నగరంలో కాలుష్య భూతం పెరుగుతున్న తరుణంలో ఉన్న చెట్లను నరికివేయడం అవివేకం. గ్రేటర్ పరిధిలో 33 శాతం హరితం పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎస్‌ఆర్‌డీపీపై చూపే ఉత్సాహం చెట్లు నాటడంలో చూపాలి. - జీవానందరెడ్డి, ఫోరం ఫర్ సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ పక్షి జాతులకు ముప్పు నగరం నడిబొడ్డున స్థానికులు, వాకర్స్‌కు ప్రాణవాయువును అందించే పార్కు ఇదొక్కటే. ఈ పార్కును విధ్వంసం చేస్తూ ఎస్ఆర్డీపీ పనులను చేపడితే అరుదైన పక్షి జాతులు, వృక్ష జాతుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. - అంబిక, హైదరాబాద్ రైజింగ్ సంస్థ ప్రతినిధి పార్కును పరిరక్షించాల్సిందే ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు పనుల నుంచి కేబీఆర్ పార్కును మినహాయించాలి. పార్కు పరిరక్షణ విషయంలో అందరం ముందుంటాం. ప్రభుత్వం మొండిగా ముందుకె ళ్తే పార్కు మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. - మహేశ్, వ్యాపారి జీవవైవిధ్యం దెబ్బతింటుంది పార్కు వద్ద ఎస్ఆర్డీపీ పనులతో పార్కులో జీవవైవిధ్యం దెబ్బతింటుంది. కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరంలో ఈ పార్కు స్థానికులకు ఎంతో మానసిక ఉల్లాసాన్నిస్తోంది. -ప్రీతి, గృహిణి ఎస్ఆర్డీపీతో ట్రాఫిక్ తగ్గదు బహుళ అంతస్తుల ఫ్లైఓవర్ల నిర్మాణంతో ట్రాఫిక్ తగ్గదు. పలు అభివృద్ధి చెందిన నగరాల్లోనూ ఇదే విషయం నిరూపితమైంది. స్మార్ట్ సిటీ అంటే నగరంలో ప్రజారవాణా వ్యవస్థను పటిష్టం చేయాలి. వాక్‌వేస్‌ను అభివృద్ధి చేయాలి. ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లడం దారుణం. - కాజల్ మహేశ్వరి, పర్యావరణ నిపుణులు పచ్చదనం తగ్గిపోతోంది ఇప్పటికే నగరంలో పచ్చదనం కనుమరుగవుతోంది. ఇక్కడి పచ్చదనాన్ని మాయం చేస్తూ ఎస్ఆర్డీపీ పనులు చేపట్టడం అవివేకం. తక్షణం పనులు నిలిపివేయాలి. - ఎస్.ఎం.రెడ్డి, వాకర్ పర్యావరణాన్ని నాశనం చేయడమే కాంక్రీట్ నిర్మాణాలతో పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుంది. వాక్‌వేను తొలగించి చేపట్టే పనులతో ఆవరణ వ్యవస్థ దెబ్బతింటుంది. పార్కులోని జంతుజాలం మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. -అనిత, పర్యావరణవాది -
'జపాన్ సంస్థలతో ఒప్పందం విరమించుకోకుంటే తీవ్ర ఉద్యమం'
శ్రీకాకుళం: జిల్లాలోని సోంపేట మండలం బారువా వద్ద పర్యావరణ ఉద్యమకారులు ఆందోళన చేపట్టారు. 4వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి జపాన్ సంస్థలతో ఒప్పందంపై వారు నిరసనకు దిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 2,640 మెగావాట్ల నాగార్జున కన్స్ట్రక్షన్ థర్మల్ పవర్ ప్లాంట్‌ను చంద్రబాబు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఇప్పుడు కొత్తగా జపాన్ సంస్థలతో మరో థర్మల్ పవర్‌ప్లాంట్‌కు ఒప్పందం కుదుర్చుకున్నారని ఉద్యమ వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సాయిరాజు విమర్శించారు. జపాన్ సంస్థలతో ఒప్పందం విరమించుకోకుంటే తీవ్ర ఉద్యమం చేపడుతామని సాయిరాజు హెచ్చరించారు.