పర్యావరణ హిత
హైదరాబాద్‌కు చెందిన దండోతికర్ అంబిక చిన్నప్పటి నుంచి మూసీ నది కాలుష్యాన్ని చూస్తూ పెరిగింది. ప్లాస్టిక్ వ్యర్థాలు మూసి నీళ్లలో నింపుతున్న విషాన్ని గురించి తెలుసుకుంది. అప్పటి నుంచే ప్లాస్టిక్‌కు ప్రత్నామ్నాయాలు వెదకడం మొదలుపెట్టింది. ప్రత్యామ్నాయంగా కాటన్ బ్యాగులను తయారుచేయడమే కాదు వాటి గురించి విస్తృత ప్రచారం చేస్తోంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేస్తున్న ఆమె కృషికి గుర్తింపుగా ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. తాజాగా ఎంఎస్ స్వామినాథన్ అవార్డు అందుకుంది.
ఉస్మానియా యూనివర్సిటీలో ‘సోషల్ సర్వీసెస్’లో పీజీ చేసింది అంబిక. ఇది కేవలం చదువు కాదు. సామాజిక సేవ దిశగా వేసిన తొలి అడుగు. రైతుల ఆత్మహత్యలతో కలత చెందిన అంబిక ఎన్నో గ్రామాల్లోకి వెళ్లి ఎంతోమంది పత్తి రైతులతో మాట్లాడింది. వారి సమస్యలను తెలుసుకుంది.
ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా కాటన్ బ్యాగులను వినియోగంలోకి తీసుకువస్తే పర్యావరణానికే కాదు పత్తి రైతుకూ మేలు జరుగుతుందని ఆలోచించింది. మచ్చలు వచ్చిన పత్తిని కూడా సేకరించి వస్త్రాన్ని తయారుచేసి, బ్యాగులు తయారు చేయాలని నిర్ణయించుకుని ముందడుగు వేసింది. పర్యావరణ స్పృహ, ఉపాధి కల్పన, కాటన్ దుస్తుల గురించి ప్రచారం... అనే మూడు లక్ష్యాలను నిర్దేశించుకుంది. మూసీ ప్రక్షాళన చేసే దిశగా విద్యార్థులతో కలిసి ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది.
2016లో జరిగిన హిల్లరీ వెబర్ బూట్ క్యాంప్‌లో పాల్గొని కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంది. ఎన్ ఐఆర్‌డీ ఏర్పాటు చేసిన రిస్క్ కాంక్లేవ్‌లో అంబిక ఇచ్చిన ప్రెజెంటేషన్ కు ‘బెస్ట్ స్టార్టప్ ఇన్ సస్టెయినబుల్ లైవ్‌లీహుడ్’ ‘బెస్ట్ ఇన్నొవేటివ్ ఆస్పైరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్’ అవార్డులు వచ్చాయి. సామాజిక సేవ పునాదిపై సొంతంగా స్టార్టప్‌ను నిర్మించిన అంబిక రూపాయి లాభంతో మాత్రమే సేవలు అందించింది. రైతుల నుంచి పత్తిని సేకరించడం నుంచి బ్యాగులు తయారు చేయడం వరకు ఎంతో మందికి శిక్షణ ఇచ్చింది. సంప్రదాయంగా వస్తున్న డైయింగ్, ప్రింటింగ్ కళలను ప్రోత్సహించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.
‘పర్యావరణ స్పృహతో ఒక్క అడుగు పడినా....ఒక్క అడుగేనా అని నిరాశపడాల్సిన పనిలేదు. ఆ అడుగును అనుసరిస్తూ వందల అడుగులు పడతాయి’ అంటుంది దండోతికర్ అంబిక.
కాలుష్య సమస్యకు కలత చెందడం కంటే ‘నా వంతుగా ఒక పరిష్కారం’ అనుకుంటే ఎంతో కొంత పరిష్కారం దొరుకుతుంది. ఎటు చూస్తే అటు ప్లాస్టిక్ వ్యర్థాల వరద భయపెడుతున్న వేళ, వాటి దుష్పరిణామాల గురించి తెలిసినా....అవి మన దైనందిన జీవితంలో భాగమైన దురదృష్ట కాలాన.....అంబికలాంటి పర్యావరణ ప్రేమికులు పరిష్కార మార్గాలు ఆలోచిస్తున్నారు.
తన వంతు పరిష్కారంగా ప్లాస్టిక్ బ్యాగులకు ప్రత్యామ్నాయంగా కాటన్ బ్యాగులు తయారుచేస్తూ వాటి ్రపాముఖ్యత గురించి ప్రచారం చేస్తోంది దండోతికర్ అంబిక.
‘పత్తి మనదే ప్రతి ఫలం మనదే’ అనే నినాదంతో రైతుల కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న అంబికకు ‘యూనివర్శిటీ ఆఫ్ దిల్లీ’ ఎంఎస్ స్వామినాథన్ అవార్డ్‌ను ప్రధానం చేసింది.
– ఎన్.సుధీర్‌రెడ్డి, సాక్షి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment