Cotton clothing
-
పత్తి మనదే ప్రతిఫలం మనదే
హైదరాబాద్‌కు చెందిన దండోతికర్ అంబిక చిన్నప్పటి నుంచి మూసీ నది కాలుష్యాన్ని చూస్తూ పెరిగింది. ప్లాస్టిక్ వ్యర్థాలు మూసి నీళ్లలో నింపుతున్న విషాన్ని గురించి తెలుసుకుంది. అప్పటి నుంచే ప్లాస్టిక్‌కు ప్రత్నామ్నాయాలు వెదకడం మొదలుపెట్టింది. ప్రత్యామ్నాయంగా కాటన్ బ్యాగులను తయారుచేయడమే కాదు వాటి గురించి విస్తృత ప్రచారం చేస్తోంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేస్తున్న ఆమె కృషికి గుర్తింపుగా ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. తాజాగా ఎంఎస్ స్వామినాథన్ అవార్డు అందుకుంది.ఉస్మానియా యూనివర్సిటీలో ‘సోషల్ సర్వీసెస్’లో పీజీ చేసింది అంబిక. ఇది కేవలం చదువు కాదు. సామాజిక సేవ దిశగా వేసిన తొలి అడుగు. రైతుల ఆత్మహత్యలతో కలత చెందిన అంబిక ఎన్నో గ్రామాల్లోకి వెళ్లి ఎంతోమంది పత్తి రైతులతో మాట్లాడింది. వారి సమస్యలను తెలుసుకుంది.ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా కాటన్ బ్యాగులను వినియోగంలోకి తీసుకువస్తే పర్యావరణానికే కాదు పత్తి రైతుకూ మేలు జరుగుతుందని ఆలోచించింది. మచ్చలు వచ్చిన పత్తిని కూడా సేకరించి వస్త్రాన్ని తయారుచేసి, బ్యాగులు తయారు చేయాలని నిర్ణయించుకుని ముందడుగు వేసింది. పర్యావరణ స్పృహ, ఉపాధి కల్పన, కాటన్ దుస్తుల గురించి ప్రచారం... అనే మూడు లక్ష్యాలను నిర్దేశించుకుంది. మూసీ ప్రక్షాళన చేసే దిశగా విద్యార్థులతో కలిసి ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. 2016లో జరిగిన హిల్లరీ వెబర్ బూట్ క్యాంప్‌లో పాల్గొని కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంది. ఎన్ ఐఆర్డీ ఏర్పాటు చేసిన రిస్క్ కాంక్లేవ్‌లో అంబిక ఇచ్చిన ప్రెజెంటేషన్ కు ‘బెస్ట్ స్టార్టప్ ఇన్ సస్టెయినబుల్ లైవ్లీహుడ్’ ‘బెస్ట్ ఇన్నొవేటివ్ ఆస్పైరింగ్ ఎంటర్ప్రెన్యూర్’ అవార్డులు వచ్చాయి. సామాజిక సేవ పునాదిపై సొంతంగా స్టార్టప్‌ను నిర్మించిన అంబిక రూపాయి లాభంతో మాత్రమే సేవలు అందించింది. రైతుల నుంచి పత్తిని సేకరించడం నుంచి బ్యాగులు తయారు చేయడం వరకు ఎంతో మందికి శిక్షణ ఇచ్చింది. సంప్రదాయంగా వస్తున్న డైయింగ్, ప్రింటింగ్ కళలను ప్రోత్సహించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ‘పర్యావరణ స్పృహతో ఒక్క అడుగు పడినా....ఒక్క అడుగేనా అని నిరాశపడాల్సిన పనిలేదు. ఆ అడుగును అనుసరిస్తూ వందల అడుగులు పడతాయి’ అంటుంది దండోతికర్ అంబిక. కాలుష్య సమస్యకు కలత చెందడం కంటే ‘నా వంతుగా ఒక పరిష్కారం’ అనుకుంటే ఎంతో కొంత పరిష్కారం దొరుకుతుంది. ఎటు చూస్తే అటు ప్లాస్టిక్ వ్యర్థాల వరద భయపెడుతున్న వేళ, వాటి దుష్పరిణామాల గురించి తెలిసినా....అవి మన దైనందిన జీవితంలో భాగమైన దురదృష్ట కాలాన.....అంబికలాంటి పర్యావరణ ప్రేమికులు పరిష్కార మార్గాలు ఆలోచిస్తున్నారు.తన వంతు పరిష్కారంగా ప్లాస్టిక్ బ్యాగులకు ప్రత్యామ్నాయంగా కాటన్ బ్యాగులు తయారుచేస్తూ వాటి ్రపాముఖ్యత గురించి ప్రచారం చేస్తోంది దండోతికర్ అంబిక. ‘పత్తి మనదే ప్రతి ఫలం మనదే’ అనే నినాదంతో రైతుల కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న అంబికకు ‘యూనివర్శిటీ ఆఫ్ దిల్లీ’ ఎంఎస్ స్వామినాథన్ అవార్డ్‌ను ప్రధానం చేసింది.– ఎన్.సుధీర్‌రెడ్డి, సాక్షి, హైదరాబాద్ -
దర్జాగా తాగునీటి చౌర్యం..
భివండీ, న్యూస్‌లైన్: మున్సిపాలిటీ సరఫరా చేస్తున్న తాగునీరు చౌర్యానికి గురవుతోంది. పట్టణంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన వాహన సర్వీసింగ్ సెంటర్లు, మరమగ్గాల కార్ఖానాలు ఈ చౌర్యానికి తెగబడుతున్నాయనే ఆరోపణలున్నాయి. భివండీలో సుమారు 200కు పైగా సర్వీసింగ్ సెంటర్లు ఉన్నాయి. వాటిలో వాహనాలను శుభ్రం చేసేందుకు నీటిని వాడాల్సి ఉంటుంది. వాస్తవానికి వారు సెంటర్లలో బోర్లు వేయించుకుని, ఆ నీటితో వాహనాలను శుభ్రపరచాల్సి ఉంటుంది. అయితే ఆయా సెంటర్ల నిర్వాహకులు కార్పొరేషన్‌కు చెందిన మంచినీటి సరఫరా పైప్లైన్ల నుంచి అక్రమంగా నీటిని వాడుకుంటున్నారు. ఈ విషయమై కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదులున్నా పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. మరికొంత మంది సర్వీసింగ్ సెంటర్ల నిర్వాహకులు సదరు సెంటర్ల కింద లోతైన నిర్మాణాలు చేపట్టి అందులో మున్సిపల్ నీటిని అక్రమంగా నిల్వ చేస్తూ ఉపయోగించుకుంటున్నారు. ఇదిలా ఉండగా, పట్టణంలో వేల సంఖ్యలో కాటన్ దుస్తులు తయారు చేసే యంత్రాల పరిశ్రమలు ఉన్నాయి. వాటి పైకప్పులు చల్లగా ఉంటేనే నూలు దుస్తుల తయారీ సాధ్యమవుతుంది. అందువల్ల పైకప్పుగా వేసిన సిమెంట్ రేకులను చల్లబరచడానికి నీరు చాలా అవసరం. అలాగే కార్ఖానా లోపల ఫువారా యంత్రాన్ని అమర్చి యంత్రాలకు నిత్యం చల్లటి వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి కూడా నీరు చాలా అవసరం. దీంతో నిత్యం కొన్ని లక్షల లీటర్ల నీటిని ఈ పరిశ్రమలు వినియోగించాల్సి ఉంటుంది. దీనికోసం వారు బావుల పైనో, బోరింగులపైనో ఆధారపడాల్సి ఉంటుంది. కాని ఆయా పరిశ్రమలు మంచినీటి పైపులైన్ల నుంచి అక్రమంగా కనెక్షన్లు పొంది లక్షలాది లీటర్ల మంచినీటిని చౌర్యం చేస్తున్నారనే విమర్శలున్నాయి. పట్టణంలో గాయిత్రీనగర్, నాగావ్, బండారి కాంపౌండ్, శాంతినగర్, నయీబస్తీ, పద్మనగర్ తదితర ప్రాంతాల్లో మంచి నీటి ఎద్దడి నెలకొంది. మున్సిపాలిటీ సర ఫరా చేస్తున్న మంచినీరు స్థానికుల అవసరాలకు ఏమాత్రం సరిపోవడంలేదు. దాంతో వారు అధికారులకు, స్థానిక కార్పొరేటర్లకు ఫిర్యాదు చేస్తున్నారు. మున్సిపాలిటీ సైతం తమకు సరఫరా చేస్తున్న మంచినీటి శాతాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. వాస్తవానికి భివండీ మహానగర్ పాలిక ముంబై మహానగర్ పాలిక నుంచి 35 ఎంఎల్డీ, అదేవిధంగా స్టేమ్ నుంచి 73 ఎంఎల్డి మంచినీటిని కొనుగోలు చేస్తోంది. మున్సిపాలిటీ పరిధిలో 5 ప్రభాగ్ సమితులు ఉన్నాయి. ఇందులో కేవలం 10 సర్వీసింగ్ సెంటర్లకే అనుమతులు ఉన్నట్లు కార్పొరేషన్ అధికారి తెలిపారు. అయితే 200పైగా ఉన్న అనధికార సర్వీసింగ్ సెంటర్లలో ద్విచక్ర వాహనాలను శుభ్రపరచడానికి రూ.50-60 లు, త్రిచక్ర వాహనానికి రూ.75, నాలుగు చక్రాల వాహనానికి రూ.100- 150లు వసూలు చేస్తున్నారు. రోజూ ఈ సెంటర్లలో రెండు వేల నుంచి మూడు వేల వాహనాలను శుభ్రపరుస్తున్నారు.దీని నిమిత్తం లక్షలాది లీటర్ల నీటిని వినియోగిస్తున్నారు. ఈ నీరంతా మున్సిపాలిటీ సరఫరా చేసే నీరు కావడంతో సామాన్యులకు మంచినీటి సమస్యలు తప్పడంలేదు. కాగా, మంచినీటిని అక్రమంగా వినియోగించుకుంటున్న పరిశ్రమల లెసైన్సులు రద్దుచేయాలని, అనుమతులు లేని సర్వీసింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.