భివండీ, న్యూస్‌లైన్: మున్సిపాలిటీ సరఫరా చేస్తున్న తాగునీరు చౌర్యానికి గురవుతోంది. పట్టణంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన వాహన సర్వీసింగ్ సెంటర్లు, మరమగ్గాల కార్ఖానాలు ఈ చౌర్యానికి తెగబడుతున్నాయనే ఆరోపణలున్నాయి. భివండీలో సుమారు 200కు పైగా సర్వీసింగ్ సెంటర్లు ఉన్నాయి. వాటిలో వాహనాలను శుభ్రం చేసేందుకు నీటిని వాడాల్సి ఉంటుంది. వాస్తవానికి వారు సెంటర్లలో బోర్లు వేయించుకుని, ఆ నీటితో వాహనాలను శుభ్రపరచాల్సి ఉంటుంది. అయితే ఆయా సెంటర్ల నిర్వాహకులు కార్పొరేషన్‌కు చెందిన మంచినీటి సరఫరా పైప్‌లైన్ల నుంచి అక్రమంగా నీటిని వాడుకుంటున్నారు. ఈ విషయమై కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదులున్నా పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. మరికొంత మంది సర్వీసింగ్ సెంటర్ల నిర్వాహకులు సదరు సెంటర్ల కింద లోతైన నిర్మాణాలు చేపట్టి అందులో మున్సిపల్ నీటిని అక్రమంగా నిల్వ చేస్తూ ఉపయోగించుకుంటున్నారు.
ఇదిలా ఉండగా, పట్టణంలో వేల సంఖ్యలో కాటన్ దుస్తులు తయారు చేసే యంత్రాల పరిశ్రమలు ఉన్నాయి. వాటి పైకప్పులు చల్లగా ఉంటేనే నూలు దుస్తుల తయారీ సాధ్యమవుతుంది. అందువల్ల పైకప్పుగా వేసిన సిమెంట్ రేకులను చల్లబరచడానికి నీరు చాలా అవసరం. అలాగే కార్ఖానా లోపల ఫువారా యంత్రాన్ని అమర్చి యంత్రాలకు నిత్యం చల్లటి వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి కూడా నీరు చాలా అవసరం. దీంతో నిత్యం కొన్ని లక్షల లీటర్ల నీటిని ఈ పరిశ్రమలు వినియోగించాల్సి ఉంటుంది. దీనికోసం వారు బావుల పైనో, బోరింగులపైనో ఆధారపడాల్సి ఉంటుంది. కాని ఆయా పరిశ్రమలు మంచినీటి పైపులైన్ల నుంచి అక్రమంగా కనెక్షన్లు పొంది లక్షలాది లీటర్ల మంచినీటిని చౌర్యం చేస్తున్నారనే విమర్శలున్నాయి.
పట్టణంలో గాయిత్రీనగర్, నాగావ్, బండారి కాంపౌండ్, శాంతినగర్, నయీబస్తీ, పద్మనగర్ తదితర ప్రాంతాల్లో మంచి నీటి ఎద్దడి నెలకొంది. మున్సిపాలిటీ సర ఫరా చేస్తున్న మంచినీరు స్థానికుల అవసరాలకు ఏమాత్రం సరిపోవడంలేదు. దాంతో వారు అధికారులకు, స్థానిక కార్పొరేటర్లకు ఫిర్యాదు చేస్తున్నారు. మున్సిపాలిటీ సైతం తమకు సరఫరా చేస్తున్న మంచినీటి శాతాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది.
వాస్తవానికి భివండీ మహానగర్ పాలిక ముంబై మహానగర్ పాలిక నుంచి 35 ఎంఎల్‌డీ, అదేవిధంగా స్టేమ్ నుంచి 73 ఎంఎల్‌డి మంచినీటిని కొనుగోలు చేస్తోంది. మున్సిపాలిటీ పరిధిలో 5 ప్రభాగ్ సమితులు ఉన్నాయి. ఇందులో కేవలం 10 సర్వీసింగ్ సెంటర్లకే అనుమతులు ఉన్నట్లు కార్పొరేషన్ అధికారి తెలిపారు. అయితే 200పైగా ఉన్న అనధికార సర్వీసింగ్ సెంటర్లలో
ద్విచక్ర వాహనాలను శుభ్రపరచడానికి రూ.50-60 లు, త్రిచక్ర వాహనానికి రూ.75, నాలుగు చక్రాల వాహనానికి రూ.100- 150లు వసూలు చేస్తున్నారు. రోజూ ఈ సెంటర్లలో రెండు వేల నుంచి మూడు వేల వాహనాలను శుభ్రపరుస్తున్నారు.దీని నిమిత్తం లక్షలాది లీటర్ల నీటిని వినియోగిస్తున్నారు. ఈ నీరంతా మున్సిపాలిటీ సరఫరా చేసే నీరు కావడంతో సామాన్యులకు మంచినీటి సమస్యలు తప్పడంలేదు. కాగా, మంచినీటిని అక్రమంగా వినియోగించుకుంటున్న పరిశ్రమల లెసైన్సులు రద్దుచేయాలని, అనుమతులు లేని సర్వీసింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
దర్జాగా తాగునీటి చౌర్యం..
Published Thu, May 1 2014 11:06 PM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM
Advertisement
Advertisement