bhivandi
-
ట్రాన్స్‌జెండర్‌తో సహజీవనం.. డబ్బుల విషయంలో గొడవ.. చివరకు
సాక్షి, ముంబై: మహారాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. థానే జిల్లాలోని భీవండీ పట్టణంలోని ట్రాన్స్‌జెండర్ తలపై బండతో కొట్టి హత్య చేసిన సంఘటన తాజాగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవీబస్తీ ప్రాంతానికి చెందిన హిజ్రా (ట్రాన్స్‌జెండర్) తౌహిక్తో లాహోటి ప్రాంతానికి చెందిన స్నేహితుడు కామిల్ జమీల్ అన్సారీ గత కొన్ని నెలలుగా అసహజ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే డబ్బుల విషయంలో వీరిద్దరి మధ్య పరస్పర తగాదాలు నెలకొన్నాయి. ఆదివారం రాత్రి సుమారు 3 గంటలకు రోడ్డుపై ఇదే విషయమై మరోసారి ఇద్దరికీ వాగ్వాదం జరిగింది. కోపంతో ట్రాన్స్‌జెండర్ బెబ్బొ తలపై జమీల్ బలమైన రాయితో కొట్టడంతో తీవ్ర రక్తస్రావం అయి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన అనంతరం అనేక మంది హిజ్రాలు భీవండి పట్టణ పోలీస్ స్టేషన్ చుటుముట్టి వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సీనియర్ ఇన్స్పెక్టర్ చేతన్ కాకడే ఆదేశాల మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. చదవండి: ఎంత విషాదం.. పెళ్లి రిసెప్షన్ నుంచి వెళ్తుండగా ఊహించని ప్రమాదం -
‘వ్యాక్సిన్ వేసుకున్నాను.. కంటిచూపు తిరిగొచ్చింది’
ముంబై: ఇప్పటికీ చాలా మంది కోవిడ్ నివారణ వ్యాక్సిన్ వేసేందుకు జంకుతూనే ఉన్నారు. టీకా వేసుకుంటే కొత్త ఇబ్బందులు ఎదురవుతాయేమోనన్న భయాలతో వెనుకడుగు వేస్తున్నారు. అపోహల కారణంగా వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉంటున్నారు. కానీ మహారాష్ట్రలోని భీవండికి చెందిన మథురాబాయి బిడ్వే(70) అనే వృద్ధురాలు మాత్రం ఇందుకు అతీతం. వ్యాక్సిన్ చేయించుకోవాలని చెప్పగానే ధైర్యంగా ముందుకు వచ్చారు. జూన్ 26న కోవిషీల్డ్ ఫస్ట్‌డోస్ వేయించుకున్నారు. అయితే, టీకా వేసుకున్న తర్వాత జ్వరం రావడం, ఒళ్లు నొప్పులు, స్వల్ప అస్వస్థతకు గురౌవుతున్నామని కొంతమంది చెబుతుంటే.. మథురాబాయి మాత్రం వ్యాక్సిన్ తనకు ఎంతగానో మేలు చేసిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా... ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె... గత రెండేళ్లుగా తనకు కంటిచూపు పోయిందని, అప్పటి నుంచి అంధకారంలోనే బతుకుతున్నానన్నారు. అయితే, టీకా వేసుకున్న మరుసటి రోజు నుంచి మసకగానైనా వస్తువులు చూడగలుగుతున్నానని, 30- 40 శాతం కంటిచూపు తిరిగి వచ్చిందని పేర్కొన్నారు. కాగా, టీకాకు, కంటిచూపునకు ఏమైనా సంబంధం ఉన్నా విషయాలపై మాత్రం ఎటువంటి స్పష్టత లేదు. -
తెలుగు ఓటర్ల ప్రభావమెంత?
సాక్షి ముంబై: మహారాష్ట్రలో నాలుగో విడత, ఆఖరి దశ పోలింగ్‌కు సమయం దగ్గరపడింది. ముంబైలోని ఆరు స్థానాలతోపాటు 17 స్థానాలకు సోమవారం ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ముంబై, థాణేతోపాటు భివండీలో నివసించే తెలుగు ప్రజలు అభ్యర్థులు గెలుపోటములపై ప్రభావం చూపనున్నారు. దీంతో వీరిని ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రయత్నాలు చేశాయి. తెలుగు రాజకీయ నేతలతో ప్రచారం చేయించాయి. బీజేపీ తరఫున రాపోలు ఆనంద్ భాస్కర్, బాబూ మోహన్, కాంగ్రెస్ తరఫున విజయ శాంతి, నేరెళ్ల శారద తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. మహానగరి ముంబైలో.. దక్షిణ ముంబై ఎంపీ స్థానంలోని వర్లీ, కమాటిపురా, కొలాబా, సాత్‌రాస్తా తదితర ప్రాంతాల్లో సుమారు 50 వేల మంది తెలుగు ఓటర్లున్నారు. దక్షిణమధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గంలోని ధారావి, వాడాలా, చెంబూర్, సైన్ కొలివాడా తదితర ప్రాంతాల్లో తెలుగు ఓటర్లు సుమారు 45 వేల మంది ఉంటారు. మరోవైపు ఉత్తర ముంబైలోని బోరివలి, దహిసర్, కాందివలి తదితర ప్రాంతాల్లో సుమారు 40 వేల ఓటర్లుండగా ఉత్తర పశ్చిమ ముంబైలో సుమారు 30 వేల వరకు ఓటర్లుంటారని అంచనా. అదేవిధంగా ఉత్తర తూర్పు ముంబై, ఉత్తర మధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని ములూండ్, విక్రోలి, ఘాట్కోపర్, విలేపార్ల, కుర్లా, బాంద్రా తదితర ప్రాంతాల్లో కూడా పెద్ద సంఖ్యలో తెలుగు ఓటర్లున్నారు. ముఖ్యంగా దక్షిణ ముంబై, దక్షిణ మధ్య ముంబై, ఉత్తర ముంబై లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో తెలుగు ఓటర్లు ఉన్నారు. దీంతో ఇక్కడి తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ పార్టీల నేతలు ప్రత్యేక దృష్టిపెట్టారు. భివండీలో మనవాళ్లే కీలకం.! భివండీ లోక్‌సభ నియోజకవర్గంలో తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. భివండీ లోక్‌సభ పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కీలకమైన తూర్పు భివండీ, పశ్చిమ భివండీ, పశ్చిమ కళ్యాణ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గణనీయ సంఖ్యలో తెలుగు వారున్నారు. ఈ మూడు అసెంబ్లీ స్థానాల పరిధిలో 1.50 లక్షల మంది తెలుగు ఓటర్లుంటారు. వీరిలో తెలంగాణ వాసులు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. దీంతో భివండీ లోక్‌సభ స్థానంలో అభ్యర్థుల గెలుపోటములపై తెలుగు ఓటర్లు ప్రభావం చూపే అవకాశం ఉంది. ధాణేలో కొంతమేర.. థాణే లోక్‌సభ నియోజకవర్గంలో తెలుగు ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. థాణేలోని కిసన్‌నగర్, సిపి తలావ్, హజూరి, కల్వా, లోకమాన్యనగర్, బాల్కుమ్, గాంధీనగర్, సుభాష్‌నగర్, మీరా–భయిందర్, ఐరోలి, బేలాపూర్ తదితర ప్రాంతాల్లో తెలుగు ప్రజలున్నారు. భివండీలో బాబూమోహన్ ప్రచారం భివండీలోని తెలుగు వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ పేర్కొన్నారు. ముంబైతోపాటు భివండీలో బీజేపీ, శివసేన కూటమి అభ్యర్థుల ప్రచారం కోసం ఇక్కడికి చేరుకున్న ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. తెలుగు భవన్, ముంౖ»ñ వర్సిటీలో తెలుగు పీఠం ఏర్పాటుతో పాటు తెలుగు ప్రజల ఇతర సమస్యలపై స్థానిక నేతలతో మాట్లాడి పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. -
లైంగిక వేధింపులు: ఎడిటర్ హత్య!
ముంబై: ఇంటర్న్‌షిప్ చేస్తున్న మహిళ చేతిలో మ్యాగజీన్ ఎడిటర్ హత్యకు గురైన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. నిత్యానంద్ పాండే(44) ముంబై కేంద్రంగా నడిచే న్యూస్ పోర్టల్ మ్యాగజీన్ ఎడిటర్. న్యూస్ పోర్టల్ సంస్థలో ఇంటర్న్‌గా పనిచేసే మహిళ, అదే అఫీసులో ప్రింటింగ్ సెక్షన్లో విధులు నిర్వహిస్తున్న సతీష్ మిశ్రా (34) కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దాడికి పాల్పడిన ఇద్దర్నీ వారి ఫోన్ కాల్ రికార్డుల (సీడీఆర్) ఆధారంగా పోలీసులు పట్టుకున్నట్టు సమాచారం. ఈ ఘటనపై మీడియాతో భివండీ ఎస్సై సంజయ్ హజారే మాట్లాడుతూ ‘‘రెండు సంవత్సరాలుగా న్యూస్ పోర్టల్ సంస్థలో ఇంటర్న్‌గా పని చేస్తున్న మహిళను ఆ మ్యాగజీన్ ఎడిటర్ పాండే పదేపదే లైంగిక వేధింపులకు గురిచేసేవాడు. ఆ మహిళ ఎదురుతిరగడంతో ఆమెకు ప్రమోషన్ ఇవ్వడానికి అతడు నిరాకరించాడు. విసుగెత్తిన మహిళ పాండే బారి నుంచి తప్పించుకోవడానికి అదే ఆఫీసులో ప్రింటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసే మిశ్రా సహాయం కోరింది. కొంతకాలంగా ఎడిటర్ పాండే తన వేతన చెల్లింపుల్లో ఆలస్యం చేస్తుండటంతో అతడి మీద మిశ్రా కోపంగా ఉన్నాడు. దీన్ని అదనుగా తీసుకున్న నిందితురాలు.. పాండే అడ్డును మిశ్రా సహాయంతో తొలగించాలని పథకం వేసింది. నిందితులిద్దరూ పాండేను ముంబైకి 8 కి.మీల దూరంలోని ఉత్తర భయందర్‌కు వెళ్లేలా ఒప్పించి తీసుకెళ్లారు. అలా వెళ్తున్న సమయంలో పాండేకు మత్తు మందు కలపి ఉన్న మద్యం తాగించారు. అతడు స్పృహ కోల్పోయిన అనంతరం తాడు సహాయంతో చంపి, భివండీ సమీపంలో పడేసి వెళ్లారని’’ తెలిపారు . -
బాలుడి ఊపిరితిత్తుల్లో స్ప్రింగ్
ముంబాయి: మహారాష్ట్రలోని భీవండికి చెందిన ఏడేళ్ల బాలుడు టాయ్ గన్‌లోని స్ప్రింగ్ మింగేయడంతో పరిస్థితి విషమంగా మారింది. బాలుడు ఇంటి వద్ద టాయ్ గన్‌తో ఆడుకుంటూ నోట్లో పెట్టుకున్నాడు. అనుకోకుండా టాయ్గన్లోని స్ర్పింగ్ బాలుడి స్వరపేటిక ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయి ఇరుక్కుపోయింది. ఈ విషయం ఎవరూ గమనించలేదు. ఆ తర్వాత బాలుడు నిరంతరాయంగా దగ్గుతుండటంతో తల్లిదండ్రులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. బాలుడిని పరిశీలించిన థానేలోని ప్రైవేటు ఆసుపత్రి డాక్టర్లు, ఊపిరితిత్తుల్లో 1.5 సెంటీమీటర్ల పొడవున్న స్ప్రింగ్ ఉన్నట్లు గుర్తించారు. బాలుడు కావడంతో ఆపరేషన్ చేసి స్ప్రింగ్‌ను తీయడానికి డాక్టర్లు వెనకాడారు. బయోస్కోపీ ద్వారా స్ప్రింగ్‌ను తొలగించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉంది. బాలుడి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని డాక్టర్లు తెలిపారు. -
భివాండీలో మర మగ్గాల శబ్దమేది?
ముంబై: మహారాష్ట్రలోని ముంబై నగరానికి 30 కిలోమీటర్ల దూరంలోవున్న భివాండి పేరు వినగానే మర మగ్గాల శబ్దం వినిపిస్తుంది. ఆసియాలోనే జౌళి పరిశ్రమకు పుట్టినిల్లనే విషయం గుర్తొస్తుంది. దేశ జనాభాలో ఎక్కువ మంది వ్యవసాయ రంగం తర్వాత మర మగ్గాల మీద ఆధారపడి బతుకుతున్నారనే విషయం మదిలో మెదలవుతుంది. ఇదంతా గతం. ఇప్పుడు 80 శాతం మర మగ్గాలు మూగబోయాయి. యంత్రాలకు బూజులు పట్టాయి. తెగిన దారపు ముక్కలతో, దుమ్మూ దూళితో ఫ్యాక్టరీలు అదోరకమైన కంపు కొడుతున్నాయి. వియత్నాం, బంగ్లాదేశ్ లాంటి దేశాల నుంచి పోటీ పెరిగిపోయి ఉత్పత్తులు, ఎగుమతులు పడిపోతున్న నేపథ్యంలో మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్టు దేశంలో పెద్ద నోట్ల రద్దు మర మగ్గాలకు శాపంగా మారింది. లక్షలాది మంది కార్మికుల బతుకులను బుగ్గిపాలు చేసింది. దేశవ్యాప్తంగా 65లక్షల మరమగ్గాలుండగా, ఒక్క మహారాష్ట్రలోని భివాండి, మాలేగావ్, ధూలే, సాంగ్లీ, సోలాపూర్లలోనే 11లక్షల మరమగ్గాలున్నాయి. వీటిలో దాదాపు 15 లక్షల మంది కార్మికులు ప్రత్యక్షంగా పనిచేసేవారు. గత మూడేళ్లలోనే దాదాపు ఐదు లక్షల మంది కార్మికులు ఈ రంగంలోకి వచ్చారు. జాతీయ స్థూల ఉత్పత్తిలో రెండు శాతం ఆదాయం ఈ రంగం నుంచే సమకూరేది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇప్పుడు వాటిలో 20శాతం మరమగ్గాలు మాత్రమే పనిచేస్తున్నాయని భివాండి టెక్స్టైల్స్ మిల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మన్నన్ సిద్దిఖీ తెలిపారు. పొలం నుంచి దారం ఫ్యాక్టరీకి, అక్కడి నుంచి మర మగ్గాల ఫ్యాక్టరీకి, అక్కడి నుంచి హోల్‌సేల్‌కు, అక్కడి నుంచి రిటేలర్కు, అక్కడి నుంచి వినియోగదారుడికి సాగే జౌళి నెట్‌వర్క్‌లో ప్రతి చోట నగదు లావాదేవీలే కొనసాగుతాయి. హోల్‌సేల్ నుంచి రిటేలర్, అక్కడి నుంచి వినియోగదారుడికి కొంత మేరకు నగదు రహిత లావాదేవీలు నిర్వహించవచ్చుగానీ రైతు పొలం నుంచి దూదిని సేకరించడం, రంగుల అద్దకం, జిప్‌లు, బటన్లు కుట్టడం, బేళ్లు ఎత్తడం లాంటి పనులకు కచ్చితంగా నగదునే చెల్లించాల్సి ఉంటుంది. అందుకనే ఈ రంగంపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఎక్కువగా పడింది. ‘నోట్ బందీనే హమ్కో పాంచ్ సాల్ పీచె ఫేక్ దియా’ అని 65 ఏళ్ల లేబర్ కాంట్రాక్టర్ అసద్ ఫరూకి వ్యాఖ్యానించారు. ఆయన 30 ఏళ్లుగా వంద మర మగ్గాలను నడుపుతున్నారు. ‘అన్ని మరమగ్గాలపై కలిపి గత నెలలో మాకు 17 వేల రూపాయలు లాభం వచ్చింది. 1990వ దశకంలో మాకు నెలకు 20 వేల రూపాయల లాభం వచ్చేది. ఇప్పటి లెక్కల్లో చెప్పాలంటే నెలకు 70 వేల రూపాయలు వచ్చేవి’ అని ఇదే వ్యాపారంలో కొనసాగుతున్న అసద్ కుమారుడు అఫ్తాబ్ మీడియాకు తెలిపారు. ముంబైకి 270 కిలోమీటర్ల దూరంలోవున్న మాలేగావ్‌లో కూడా మర మగ్గాల పరిస్థితి ఇలాగే ఉంది. ఎప్పుడు జరిగేకన్నా వ్యాపారం 20 శాతం తక్కువగా జరుగుతోందని ముంబైలోని ఎన్. చంద్రకాంత్ అనే వస్త్ర వ్యాపారి తెలిపారు. గార్మెంట్స్ డిమాండ్ 30 శాతం, హోల్‌సేల్ డిమాండ్ 50 శాతం తగ్గిందని అదే మార్కెట్లో వస్త్ర దుకాణం నడుపుతున్న రిటేలర్ కపేష్ భయాని తెలిపారు. -
కొత్త ప్రయోగాలతోనే పురోగతి
విజ్ఞాన ప్రదర్శనలో ఎంపీ కపిల్ పాటిల్ భివండీ, న్యూస్‌లైన్: ప్రపంచానికి ఏదైన కొత్తదనాన్ని ఇవ్వాలనే దృఢ సంకల్పంతో విద్యార్థులు ప్రయోగాలు చేయాలని, అప్పుడే దేశం పురోగతి చెందుతుందని భివండీ ఎంపీ కపిల్ పాటిల్ అన్నారు. పంచాయితీ సమితి భివండీ శిక్షణ్ విభాగం ఆధ్వర్యంలో పద్మశాలి ఇంగ్లిష్ మీడియం స్కూల్, జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన విజ్ఞాన ప్రదర్శన 2014-15 ను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ ప్రదర్శన మంగళవారం కూడా ఉంటుంది. ఇందులో భివండీ తాలూకా పరిధిలో ఉన్న పాఠశాలల్లోని విద్యార్థులు పాల్గొని బయో గ్యాస్ ప్రాజెక్టు, సౌర విద్యుత్, పర్యావరణ పరిరక్షణ, మద్యపాన నిషేధం,వాననీటి సంరక్షణ తదితర అంశాలను ప్రదర్శించారు. ప్రదర్శనలను తిలకించిన ఎంపీ కపిల్ పాటిల్, ఎమ్మెల్యేలు రుపేష్ మాత్రే, మహేశ్ చౌగులే, రామనాథ్ మోరే, భివండీ మేయర్ తుషార్ చౌదరి తదితరులు విద్యార్థులను ప్రశంసించారు. ఉత్తమ విజ్ఞాన ప్రదర్శన చేపట్టిన విద్యార్థులకు మంగళవారం సాయంత్రం బహుమతులు అందజేయనున్నారు. కార్యక్రమ ఏర్పాట్లను తెలుగు శిక్షణ్ సంస్థ ట్రస్టీలు భైరి రామస్వామి, అధ్యక్షులు గుండ్ల శంకర్, చైర్మన్ డాక్టర్ పాము మనోహర్, కళ్యాణపు భూమేష్ తదితరులు పర్యవేక్షించారు. -
భివండీ మేయర్‌గా తుషార్ చౌదరి ఎన్నిక
భివండీ న్యూస్‌లైన్: భివండీ నిజాంపూర్ శహర్ మహానగర్ పాలిక (బీఎన్‌ఎంసీ) మేయర్‌గా శివసేన కార్పొరేటర్ తుషార్ చౌదరి భారీ మెజార్టీతో విజయం సాధించారు. 90 ఓట్లకు గాను ఆయనకు 87 ఓట్లు పడ్డాయి. అదేవిధంగా డిప్యూటి మేయర్‌గా కాంగ్రెస్‌కు చెందిన అహ్మద్ సిద్ధికి ఏకగ్రీవమయ్యారు. మొదట 8 మంది నామినేషన్లు వేయగా, తర్వాత ఏడుగురు తమ నామినేషన్లను వెనుక్కి తీసుకోవడంతో అహ్మద్ సిద్ధికి విజయం లాంఛనప్రాయమైంది. బీఎన్‌ఎంసీ ఎన్నికలు గురువారం ముంబై ఉప నగరం కలెక్ట ర్ శేఖర్ చెనై, భివండీ కమిషనర్ జీవన్ సోనావునే సమక్షంలో కార్పొరేషన్ సభా గృహంలో మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమయ్యాయి. రెండున్నరేళ్లుగా మేయర్‌గా పనిచేస్తూ నేడూ మేయర్ బరిలో దిగిన ప్రతిభా పాటి ల్ చివరి నిమిషంలో శివసేన అభ్యర్థికి మద్దతు పలుకుతూ తన ఓటు కూడా అతడికే వేయడం గమనార్హం. నూతన మేయర్ తుషార్ చౌదరి, డిప్యూటీ మేయర్ అహ్మద్ సిద్ధికిని కాంగ్రెస్, సమాజ్‌వాదీ, శివసేన కార్పొరేటర్లుతో పాటు శివసేన ఎమ్మెల్యే రూపేష్ మాత్రే పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు కార్పొరేషన్ ప్రాంగణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. -
భివండీలో పట్టపగలు హత్య
భివండీ, న్యూస్‌లైన్: పట్టపగలు ఒక వ్యక్తిని కత్తితో పొడిచి హత్యచేశారు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం సోమానగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. హత్యచేసిన అనంతరం నిందితుడు నేరుగా బోయివాడ పోలీస్‌స్టేషన్‌కు పోయి స్వచ్ఛందంగా లొంగిపోయాడు. వివరాలిలా ఉన్నాయి.. ముక్తార్ అహ్మద్ షేక్(28), మోమిన్ షేక్(పప్పు) ఇద్దరూ ప్లంబర్లుగా జీవనాన్ని సాగిస్తున్నారు. వీరిద్దరి మధ్య గత పదేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత విధానసభ ఎన్నికల్లో ముక్తార్ బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశాడు. అతడు గెలుపొందడంతో సహజంగానే ముక్తార్‌కు పని పెరిగింది. ఇదే సమయంలో మోమిన్‌షేక్‌కు పనులు తగ్గిపోయాయి. దీంతో ముక్తార్‌పై మోమిన్ కక్ష పెంచుకున్నాడు. కాగా, బుధవారం మధ్యాహ్నం ముక్తార్ సోమానగర్ ప్రాంతంలో కుళాయి మరమ్మతులు చేస్తుండగా మోమిన్ వెనుకనుంచి వచ్చి అతడిపై కత్తితో దాడిచేశాడు. సుమారు పది కత్తిపోట్లు పడటంతో ముక్తార్ తీవ్ర రక్తస్రావంతో మరణించాడు. దాడి అనంతరం మోమిన్ బోయివాడ పోలీస్ స్టేషన్‌కు పోయి నేరాన్ని ఒప్పుకుని లొంగిపోయాడు. ముక్తార్ మృతదేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం ఇందిరా గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
గ్రే వస్త్రాల ఉత్పత్తి తగ్గిద్దాం..
భివండీ, న్యూస్‌లైన్: గ్రే వస్త్రాలకు డిమాండ్ తగ్గిన నేపథ్యంలో ఉత్పత్తి తగ్గిద్దామని తెలుగువారికి చెందిన పవర్లూమ్ పరిశ్రమల యజమానులు నిర్ణయించారు. ఈ మేరకు శనివారం వారు పట్టణంలోని పద్మశాలి సమాజ్ యువక్ మండలి కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు వ్యాపారులు మాట్లాడుతూ.. మూడు నెలలుగా గ్రే వస్త్రాల మార్కెట్ పడిపోవడంతో మీటర్‌కు రూ.8-12 వరకు నష్టం వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వస్త్రాల డిమాండ్ తగ్గినందున యధావిధిగా ఉత్పత్తి కొనసాగిస్తే మరింత నష్టాల పాలవుతామని వ్యాపారులు అభిప్రాయపడ్డారు. త్వరలో మజూరీ వీవర్స్‌తో చర్చించి కనీసం వారానికి ఒక రోజైనా పరిశ్రమల బంద్ పాటిస్తే కాస్త నష్టాల నుంచి బయటపడే అవకాశముందని వారు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు మజూరీ వీవర్స్‌తో చర్చించేందుకు యజమానుల తరఫు నుంచి యెల్ల సాగర్, వల్లాల్ శ్రీనివాస్, బొల్లు నవీన్, కొక్కు శ్రీనివాస్, గడ్డం మహేందర్‌ను ఎంపిక చేశారు. ఈ బృందం త్వరలో మజూరీ వీవర్స్ అసోసియేషన్‌తో చర్చించిన అనంతరం అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని పవర్లూమ్ యజమానుల సంఘం పేర్కొంది. ఇదిలా ఉండగా, రాష్ట్రంలోనే అతి ఎక్కువ సంఖ్యలో పవర్లూమ్ పరిశ్రమలు భివండీలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిమంది ఇక్కడకు వలసవచ్చి పవర్లూమ్ పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. అలాగే చాలామంది తెలుగువాళ్లు సొంతంగా పరిశ్రమలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం భివండీలో ఉన్న సుమారు 50 వేల పవర్లూమ్ పరిశ్రమల్లో 7.5 లక్షల య్రంతాలు ఉన్నాయి. ఇందులో తెలుగువారి వాటా కూడా ఎక్కువగానే ఉంది. వీరు ఎక్కువగా కాటన్-సాటిన్ వస్త్రాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు. అయితే మూడు నెలలుగా మార్కెట్లో గ్రే వస్త్రాలకు డిమాండ్ తగ్గింది. ఉత్పత్తికి సరిపడా డిమాండ్ లేకపోవడంతో యజమానులు నష్టాలను చవిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితి ఇలాగే కొనసాగితే తమ సంస్థలు పూర్తి నష్టాలబారిన పడిపోతాయనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. వస్త్రాలకు డిమాండ్ తగ్గడంతో పాటు, విద్యుత్, లేబర్ ఖర్చులు కూడా పెరిగిపోవడంతో మీటర్‌కు రూ.8 నుంచి 12 వరకు ఆ సంస్థలు నష్టపోతున్నట్లు అంచనా. దీన్ని బయటపడేందుకు త్వరలోనే తగిన కార్యాచరణ చేపట్టేందుకు పవర్లూమ్ సంస్థల యాజమాన్యాలు చర్యలు తీసుకుంటున్నాయి. -
ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం
ముంబై: భివండీ పట్టణంలో ఎనిమిదేళ్ల బాలికపై వృద్ధుడు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి... భివండీ వాసి అయిన 62 యేళ్ల వృద్ధుడు సాయంత్రం అదే ప్రాంతంలో నివసించే ఎనిమిదేళ్ల బాలికను వడా పావ్ ఇస్తానని పిలిచాడు. దాంతో ఆ బాలిక వృద్ధుని ఇంటికి వెళ్లింది. అనంతరం ఆమెపై వృద్ధుడు అత్యాచారం చేసి విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. కాగా, జరిగిన విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పగా వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేశారు. -
విద్యార్థుల ఆధ్వర్యంలో ‘స్వచ్ఛ్ భివండీ’
భివండీ , న్యూస్‌లైన్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘స్వచ్ఛ్ భారత్’ను ప్రేరణగా తీసుకున్న భివండీలో కళాశాల విద్యార్థులు సోమవారం పలు ప్రాంతాల్లో ‘స్వచ్ఛ్ భివండీ’ నిర్వహించారు. కామత్‌ఘర్‌లోని పలు వీధులను శుభ్రపర్చారు. అదేవిధంగా కామత్‌ఘర్‌లోని గణేష్ నగర్, బ్రహ్మానంద్ నగర్లో వీధులు, ప్రధాన రహదారులపై ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించారు. అంతేకాకుండా మురికి కాలువలను శుభ్రపర్చారు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యతపై స్థానికులకు కోరారు. అయితే చెత్తను కేవలం చెత్త కుండీలలోనే వేయాలని సూచించారు. పరిశుభ్రతపై స్థానికుల్లో అవగాహన కల్పించారు. తర్వాత పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని వారితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో దాదాపు 60 మంది కళాశాల విద్యార్థినులు, 57 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో బల్లూరి చంద్రశేఖర్, మచ్చ మాధురి, జోరీగల బాలకృష్ణ, ధార శ్రీనివాస్, గౌరి సదానంద్, వడ్లకొండ నితిన్, కోట అన్వేష్, బండారి రవిరాజ్, రాపెల్లి సూర్య తదితర విద్యార్థులు పాల్గొన్నారు. -
ఏకమయ్యే సమయమిదే!
సాక్షి, ముంబై: ముంబై, భివండీలతోపాటు తెలుగు ఓటర్లు గెలుపోటములను శాసించే నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. ఓట్లు చీలిపోతుండడంతో ప్రతి ఎన్నికల్లోనూ తెలుగువారి ఓట్లు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయనే అభిప్రాయాలను అన్ని పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. అదే తెలుగువారు ఐక్యంగా నిలబడి, ఒకే అభ్యర్థికి ఓటువేసేలా నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తే గెలుపోటములను శాసించే స్థాయికి చేరడం ఏమంత కష్టం కాదని రాజకీయ పార్టీలే అంగీకరిస్తున్నాయి. ఇది సాధ్యం కావాలంటే తెలుగు సంఘాలన్నీ ముందు ఏకతాటిపైకి రావాల్సిన అవసరముంది. నిజానికి ఎన్నికలకు ముందే తమ ప్రతినిధిగా ఒకరిని నిలబెట్టి, అసెంబ్లీకి పంపేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే అసెంబ్లీ తెలుగు అభ్యర్థుల సంఖ్య చెప్పుకోదగిన స్థాయిలో ఉండేది. అయితే ఇప్పుడు అందుకు సమయం దాటిపోయింది. ఇప్పుడు తెలుగువారి చేతుల్లో ఉన్నదల్లా ఐక్యంగా నిలబడి, తెలుగువారి సంక్షేమానికి కృషి చేస్తాడని నమ్మే అభ్యర్థిని గెలిపించడమే. బరిలో ఉన్న కొంతమంది తెలుగువారికైనా మద్దతుగా నిలవడమే.. అయితే రాష్ట్రవ్యాప్తంగా బరిలో ఉన్న తెలుగువారి వివరాలు ఇలా ఉన్నాయి... మహాసంగ్రామంలో మనోళ్లు 15 మంది.. సాక్షి, ముంబై: రాష్ట్రవ్యాప్తంగా భివండీ మినహా ముంబై, పశ్చిమ మహారాష్ట్ర షోలాపూర్, మరాఠ్వాడా జాల్నా, విదర్భ చంద్రాపూర్, యావత్మాల్ తదితర జిల్లాల్లో 15 మంది తెలుగు అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 15 మంది తెలుగు అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో అత్యధికంగా షోలాపూర్‌లో రెండు స్థానాలకుగాను ఐదుగురు, యావత్మాల్ జిల్లాలో నలుగురు, చంద్రాపూర్ జిల్లాలో ఇద్దరు, నాందేడ్ జిల్లాలో ఇద్దరు, ముంబై, జాల్నాలలో ఒక్కొక్కరు పోటీ చేస్తున్నారు. వీరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలైన కైలాస్ గోరింట్యాల్, వామన్రావ్ కాసంవార్, సుధీర్ మునగంటివార్లు మళ్లీ బరిలో ఉండగా మాజీ ఎమ్మెల్యే ఆడెం నర్సయ్య మరోసారి బరిలోకి దిగారు. దీంతో 2014 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర అసెంబ్లీలో తెలుగు ఎమ్మెల్యేల సంఖ్య పెరిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. షోలాపూర్‌లో ముగ్గురు హోరాహోరీ.. పశ్చిమ మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో భారీ సంఖ్యలో తెలుగు ప్రజలున్నారు. జిల్లా కేంద్రమైన షోలాపూర్ పట్టణంలో సుమారు 70 శాతం మంది తెలుగువారే. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో షోలాపూర్ సిటీ సెంట్రల్ నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థిగా ఆడెం నర్సయ్య, కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్ షిండేకు అత్యంత సన్నిహితులైన విష్ణుకోటే కుమారుడైన మహేష్ కోటే బరిలో ఉన్నారు. ఇండిపెండెంట్లుగా మరో ముగ్గురు పోటీ చేస్తున్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం ఆడెం నర్సయ్య, మహేష్ కోటేలతోపాటు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, సుశీల్‌కుమార్ షిండే కుమార్తె ప్రణతి షిండేల మధ్యే ఉంటుందని భావిస్తున్నారు. వీరికి ఎన్సీపీ అభ్యర్థి విద్యా లోల్గే, బీజేపీ అభ్యర్థి మోహినీ పట్కి, ఎంఐఎం అభ్యర్థి షేఖ్ తౌఫిక్ల నుంచి గట్టి పోటీ ఎదురుకానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. విదర్భలో... విదర్భలోని చంద్రాపూర్ జిల్లాలో పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు ఆనుకొని ఉన్న చంద్రాపూర్ జిల్లాలో పెద్ద సంఖ్యలో కరీంనగర్, అదిలాబాద్లతోపాటు ఇతర జిల్లాలకు చెందిన తెలుగు ప్రజలున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేస్థాయికి ఎదిగిన మహారాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షులు సుధీర్ మునగంటివార్ బల్లార్షా నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు. వరుసగా మూడు సార్లు విజయం సాధించిన సుధీర్ మునగంటివార్ బల్లార్షాలో మరోసారి విజయం సాధించేందుకు శాయశక్తులా ప్రచారం చేశారు. మరోవైపు చంద్రాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శివసేన తరఫున కిషోర్ జోరగేవార్ పోటీ చేస్తున్నారు. అయితే ఆయనకు ఇక్కడ పలువురి నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. ఇక విదర్భలోని వనీ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే వామన్రావ్ కాసావార్ మళ్లీ బరిలోకి దిగారు. ఆయనకు పోటీగా తెలుగు వ్యక్తి అయిన బోద్కువార్ సంజీవరెడ్డిని బీజేపీ బరిలోకి దింపింది. దీంతో ఇక్కడ తెలుగువారి మధ్య హోరాహోరి పోరు సాగడం ఖాయమంటున్నారు. మరోవైపు యావత్మల్లో ప్రధాన పార్టీలైన బీజేపీ నుంచి తెలుగు అభ్యర్థులు మదన్ యేర్వార్, పీడబ్ల్యూపీ నుంచి దిలీప్ ముక్కావార్లు పోటీ పడుతున్నారు. మరాఠ్వాడాలో... నిజాంపరిపాలనలో తెలంగాణతో కలిసి ఉండే మరాఠ్వాడా ప్రాంతంలో పెద్ద సంఖ్యలో తెలుగుప్రజలున్నారు. నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాలను ఆనుకొని ఉన్న నాందేడ్‌లో భారీ సంఖ్యలో తెలుగువారున్నారు. దీంతో సౌత్ నాందేడ్ నుంచి తెలుగు వ్యక్తి దిలీప్ కందుకుర్తి బీజేపీ నుంచి బరిలోకి దిగుతుండగా ఎమ్మెన్నెస్ ప్రకాశ్ మారావార్ను బరిలోకి దింపింది. దీంతో ఇక్కడ కూడా తెలుగువారి మధ్య పోటీ ఏర్పడింది. మరోవైపు జాల్నాలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కైలాస్ గోరింట్యాల్ మళ్లీ బరిలోకి దిగారు. మరాఠ్వాడాలోనే తెలుగు నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన గెలుపు నల్లేరుమీద నడకేనంటున్నారు విశ్లేషకులు. ముంబై, భివండీలలో... ముంబైతోపాటు తెలుగువారు అధికంగా ఉండే భివండీలో రాజకీయంగా ఉన్నతస్థాయికి ఎవరూ ఎదగలేకపోతున్నారు. అనేక నియోజకవర్గాల్లో తెలుగువారు కీలకంగా ఉన్నప్పటికీ రాజకీయంగా ఇంకా వెనుబడే ఉన్నామనే చెప్పాలి. ముంబైలో ఈసారి మహీం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా తెలుగు వ్యక్తి నాగ్‌సేన్ మాల బరిలో ఉన్నారు. ఇక భివండీలో ఒక్క తెలుగు అభ్యర్థి కూడా లేకపోవడం గమనార్హం. -
పక్కా ఇళ్లపట్టాలు ఇప్పిస్తా..
శివసేన సిట్టింగ్ ఎమ్మెల్యే రూపేష్ మాత్రే భివండీ, న్యూస్‌లైన్: కొన్నేళ్లుగా ప్రభుత్వ స్థలాల్లో స్థిరనివాసాలు ఏర్పాటుచేసుకున్న తెలుగు, మరాఠి, ఉత్తరాది ప్రజలకు పక్కా ఇంటి నంబర్లు ఇప్పిస్తానని రూపేష్ మాత్రే హామీ ఇచ్చాడు. కామత్‌ఘర్,పేనాగావ్ ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాత్రే మాట్లాడుతూ తూర్పు భివండీ నియోజక వర్గ పరిధిలోని కామత్‌ఘర్, పేనాగావ్, గణేష్‌నగర్, భాగ్యనగర్, ఆశీర్వాద్‌నగర్, పద్మనగర్‌లో నివాసముంటున్న కార్మిక కుటుంబాలన్నింటికీ గ్యాస్ కనెక్షన్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అఖిల పద్మశాలి సమాజ్ అధ్యక్షుడు కముటం శంకర్ మాట్లాడుతూ......తెలుగు ప్రజలకు అండగా ఉంటున్న మాత్రేను గెలిపించుకోవలసిన అవసరం మనకు ఎంతైనా ఉంద న్నారు. ఈ సభలో స్థానిక శివసేన కార్పొరేటర్లు తుషార్ చౌదరి, కమలాకర్ పాటిల్, మదన్ బువ్వా, పూనం పాటిల్, దిలీప్ గుల్వీ, అరుణ్ రాహుత్, సుందర్ నాయిక్‌తో భారీసంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. -
భివండీలో టెక్స్టైల్ పార్క్: కిషన్‌రెడ్డి
భివండీ, న్యూస్‌లైన్: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన వెంటనే భివండీలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుచేయించేందుకు కృషిచేస్తానని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. పట్టణంలోని 136-పడమర భివండీ, 137-తూర్పు భివండీ నియోజక వర్గాల్లో బీజేపీ తరఫున పోటీచేస్తున్న మహేష్ చౌగులే, సంతోష్ శెట్టి తరఫున శుక్రవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ స్థానిక తెలుగు ప్రజలకు కుల ధ్రువీకరణ పత్రాలు, పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రి, రవాణా ట్రాన్స్‌పోర్టు, లోకల్ సేవ సదుపాయాలు, మహిళలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి పొందేలా చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. సభకు ముఖ్య అతిథులుగా కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యే నారాయణ స్వామి, ఎమ్మెల్యే తిప్పారెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జయప్రకాశ్ నారాయణ్, కొల్లా వెంకట్రావ్, ముంబై నుంచి వచ్చిన మండల గురునాథ్‌తో పాటు స్థానిక ఎంపీ కపిల్ పాటిల్, ఆర్పిఐ పట్టణ అధ్యక్షుడు మహేంద్ర గైక్వాడ్, శిక్షణ్ మండలి సభాపతి రాజు గాజెంగి, తెలుగు సమాజ్ శిక్షణ్ సంస్థ అధ్యక్షుడు గుండ్ల శంకర్, చైర్మన్ పాము మనోహర్, శ్యామ్ అగర్వాల్, కముటం సుధాకర్, నిష్కమ్ భైరి, నిలేశ్ చౌదరితో పాటు తెలుగు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
భివండీలో శివసేన విస్తృత ప్రచారం
భివండీ, న్యూస్‌లైన్: భివండీలో శివసేన పార్టీ విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తోంది. 136-పడమర భివండీ నియోజక వర్గం నుంచి శివసేన అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన మనోజ్ కాటేకర్ ప్రచార జోరును పెంచారు. శివాజీ చౌక్‌లోగల శివాజీ మహరాజ్ విగ్రహానికి పూలమాల వేసి ప్రచార మహార్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో మరాఠీలు, ఉత్తర భారతీయులు, గుజరాతీలు, ముస్లింలతోపాటు తెలుగు ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. శివాజీ చౌక్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పాంజలాపూర్, మండాయి, తీన్‌బత్తి, కుంబార్‌వాడ, అజయ్‌నగర్ తదితర ప్రాంతాలగుండా సాగింది. ఈసారి ఎన్నికల్లో తనకు మద్దతు పలకాలని మనోజ్ కాటేకర్ కోరారు. 23 సంవత్సరాలుగా కార్పొరేటర్‌గా, ప్రస్తుతం డిప్యూటీ మేయర్‌గా సేవలందిస్తున్నాని గుర్తు చేశారు. పవర్లూమ్ కార్మికులకు సొంత ఇల్లు ఉండేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మండాయిలో భాజీ మార్కెట్ ఏర్పాటు చేస్తానని, సీసీ రోడ్లు వేయిస్తానని, దొంగతనాలు అరికట్టేందుకు పట్టణ వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని, ప్రభుత్వ ఆసుపత్రి, వృద్ధుల కోసం విశ్రాంతి ఉధ్యానవనం, ప్రభుత్వ ఇంజనీరింగ్, మెడికల్ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ ర్యాలీలో పట్టణ మాజీ అధ్యక్షుడు మోహన్ వల్లాల్, కార్పొరేటర్లు కమ్లాకర్ పాటిల్, వందనా కాటేకర్, సుభాష్ మానే, బాలారామ్ చౌదరి, గుల్వీ, మధన్ బువ్వా, ఉప విభాగ అధ్యక్షుడు శ్రీరాం కుమార్, మనోజ్ చిల్కేవార్తోపాటు భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా పండుగలు జరుపుకోవాలి : డీసీపీ
భివండీ, న్యూస్‌లైన్: పట్టణంలో బతుకమ్మ, దసరా పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని డీసీపీ సుదీర్ దాబాడే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అఖిల పద్మశాలి సమాజం కార్యాలయంలో తెలుగు ప్రజలు బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన సభలో డీసీపీ సుదీర్ దాబాడే మాట్లాడుతూ.. ఠాణే జిల్లాలో బతుకమ్మ వేడుకలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తెలుగు సమాజానికి చెందిన మహిళా వాలంటీర్లను ప్రధాన ఘాట్ల వద్ద నియమిస్తున్నామని, దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మహిళా పోలీసులు, కానిస్టేబుళ్లు ప్రధాన వీధుల్లో సివిల్ డ్రస్స్‌లల్లో విధులు నిర్వహిస్తారని చెప్పారు. గురువారం నిమజ్జనం సందర్భంగా విదుత్ కోత ఉండకుండా చర్యలు తీసుకోవాలని టోరంట్ పవర్ కంపెనీ అధికారులకు సూచించామని చెప్పారు. రాత్రి 12 గంటల లోపే బతుకమ్మల నిమజ్ఞం నిర్వహించాలని, పోలీసులకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ ఎన్డీ రోడేతో పాటు అఖిల పద్మశాలి సమాజ అధ్యక్షుడు కముటం శంకర్, కార్యదర్శి దాసి అంబాదాస్, న్యాయదాని కమిటి చైర్మన్ కొంక మల్లేశం, వేముల నర్సయ్య, పాశికంటి లచ్చయ్య, గాజుల రాజారాం, వంగ పురుషోత్తం, మాజీ నగరాధ్యక్షుడు ఎస్. మల్లేశం, బొల్లి రమేశ్, వడ్లకొండ రాముతో పాటు భారీ సంఖ్యలో కుల బాంధవులు పాల్గొన్నారు. -
సమస్య ఏదైనా.. ఎస్ఎంఎస్ పంపు
భివండీ, న్యూస్‌లైన్: భివండీ నిజాంపూర్ షహర్ మహానగర్ పాలికలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కార్పొరేషన్ నడుంబిగించింది. ఇందులోభాగంగా స్వాతంత్య దినోత్సవం పురస్కరించుకొని కార్పొరేషన్ కమిషనర్ ఎస్ఎంఎస్ సేవా సదుపాయాన్ని ప్రారంభించారు. ఈ సదుపాయాన్ని మహరాష్ట్రలో మొదటి సారిగా ప్రారంభించారు. దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో ఇలాంటి ఎస్.ఎమ్.ఎస్. సేవా సదుపాయాలు చేపట్టారు. దీంతో 100 శాతం క్లీన్ సిటీగా యావత్ భారత దేశంలో పేరుగాంచిన విషయం తెలిసిందే. దీని స్ఫూర్తిగా తీసుకున్న భివండీ నిజాంపూర్ షహర్ మహానగర్ పాలిక కమిషనర్ జీవన్ సోనావునే ఎస్ఎంఎస్ సేవల సదుపాయాన్ని కల్పించారు. గతంలో ఇలా.. కార్పొరేషన్ పరిధిలో ఐదు ప్రభాగ్ సమితి కార్యాలయాలు ఉన్నాయి. ఈ కార్యాలయాల పరిధిలో ఉన్న సమస్యలైన చెత్త పేరుకొని పోవడం, మురికి కాలువల శుభ్రత, విష క్రిమికీటనాశక మందులు వెదజల్లుట, వీధి దీపాలు, మంచినీటి సమస్య, మరుగు దొడ్ల అపరి శుభ్రత తదితర సమస్యలపై ఆయా కార్యాలయాలల్లో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించేవారు. ప్రస్తుతం పట్టణంలో జన సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతోపాటే సమస్యలు కూడా అధికమయ్యాయి. సమస్యల పరిష్కారానికి కార్పోరే షన్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు ఇవ్వాల్సి ఉండేది. ఈ ఫిర్యాదులను అందుకుని పనులు నిర్వహించే వరకు కనీసం నాలుగైదు రోజులు పట్టేది. అలా సమయం వృథా కావడంతోపాటు ప్రజలు ఇబ్బందులు తొలగిపోలేదు. ప్రస్తుతం ఇలా.. కానీ ఇప్పుడు కమిషనర్ సోనావునే ప్రజల నుండి ఫిర్యాదు స్వీకరించడానికి మొబైల్ నంబర్‌ను (9970001312) ప్రకటించారు. సంబంధించిన సమస్యను టైపు చేసి ఎస్ఎంఎస్ చేయవచ్చుని, ఇంకా 10 భాగాలకు ఇంటర్‌కం సదుపాయాలు కల్పించామని కమిషనర్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రతి ఇంట్లో ఒక్కరైనా ముబైల్ వాడుతున్నారని, వారికి కలుగుతున్న సమస్యలను వెంటనే ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేయవచ్చన్నారు. ఇది ఖర్చుతో కూడిన పని కాదని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. -
సల్లగసూడు తల్లీ!
రాజధానితోపాటు భివండీ ప్రాంతాల్లో ఉంటున్న తెలంగాణ ప్రజలు ఆదివారం బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పోచమ్మకు బోనాలు, జంతుబలులతో మొక్కులు తీర్చుకున్నారు. సాక్షి, ముంబై: తెలంగాణ ప్రజల పర్వదినాల్లో ముఖ్యమైన బోనాల ఉత్సవాల్లో భాగంగా ముంబై, ఇతర ప్రాంతాల్లోని తెలంగాణ ప్రజలు పోచమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఏటా ఆశాఢమాస పౌర్ణమి మరుసటి రోజు నుంచి దాదాపు 15 రోజుల వరకు పోచమ్మకు బోనాలు, జంతుబలులతో తెలంగాణవాసులు మొక్కులు తీర్చుకుంటా రు. కామాటిపుర, వర్లీ, దాదర్, పరేల్ తదితర ప్రాం తాలకు చెందిన అనేక మంది వేడుకలకు వచ్చారు. వందలాది మంది మహిళలు నెత్తిన బోనాలు పెట్టుకుని బ్యాండుమేళాలతో ఊరేగింపుగా మందిరాలకు వెళ్లారు. అనంతరం అక్కడ ప్రత్యేకంగా చేసిన బోనాలతోపాటు నైవేద్యం సమర్పించి పూజలు చేసి కోళ్లు, మేకలను బలిచ్చారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజ లు పోచమ్మ బోనాలను జరుపుకుంటున్నారు. ఈయేడు తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పాటు కావడంతో వీరిలో కొత్త ఉత్సాహం కనిపించింది. బోయివాడలో... పరేల్ బోయివాడలో ‘టర్నర్ సానెటోరియం తెలు గు సంఘం’ ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ బోనాల పండుగ ఘనంగా జరిగింది. నల్గొండ జిల్లా కు చెందిన ప్రజలు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉన్నారు. వీరంతా సుమారు 50 ఏళ్ల కిందటే సం ఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి బోయివాడ అవరణలో శ్రీ పోచమ్మ దేవిని కొలుస్తున్నారు. ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆషాఢమాసంలో ప్రత్యేకంగా పోచమ్మ బోనాల ఉత్సవాలు నిర్వహించినట్టు సంఘం ప్రధాన కార్యదర్శి కొండ సత్యనారాయణ తెలిపారు. పోచమ్మ పండుగను పురస్కరించుకుని పిల్లపాపలతోపాటు కుటుంసభ్యులంతా పోచమ్మకు ప్రార్థనలు చేశారు. ప్రతి ఒక్కరూ సంప్రదాయ దుస్తుల్లో కనిపించడంతో తెలంగాణలో ఉన్న అనుభూతి కలిగింది. ఇక్కడి పోచమ్మ తల్లిని స్థానిక భక్తులే కాకుండా ముంబైలోని ఇతర ప్రాంతాల్లోని తెలుగు ప్రజలు దర్శించుకుంటారు. ఈ ఉత్సవాలకు సంఘం అధ్యక్షుడు తీరందాస్ సత్యనారాయణ, కార్యదర్శులు శ్రీపతి సహదేవ్, ఆడెపు దయానంద్, కోశాధికారి సంగిశెట్టి ధనంజయ్ ఏర్పాట్లు చేశారు. భివండీలో.. పట్టణంలోని తెలుగు ప్రజలు పోచమ్మ పండుగను ఆదివారం వైభంగా నిర్వహించారు. పద్మనగర్‌లో ఉంటున్న తెలుగు ప్రజలు వరాలదేవి మందిరం వద్ద అమ్మవారి దర్శనం కోసం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బారులు తీరారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా స్థానిక తెలుగు కార్పొరేటర్ మురళి మచ్చ, లక్ష్మీ అశోక్ పాటిల్ వరాలదేవి మందిరం వద్ద భక్తులు ఇబ్బం దులు పడకుండా తగు చర్యలు చేపట్టారు. భివండీచుట్టు పక్కల ప్రాంతాలు కామత్‌ఘర్, బండారి కంపౌండ్, పద్మనగర్, కన్నేరి వంటి దూర ప్రాం తాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు వర్షంలో తడవకుండా మందిర ప్రాంగణంలో మండపాలు వేసి మంచినీటి సదుపాయాలు కల్పించారు. భివండీ తెలుగు సమాజ్ (బీటీఎస్) కార్యవర్గ సభ్యులు..భక్తులు దొంగలబారిన పడకుండా నిరోధించడానికి ప్రత్యేకంగా వాలంటీర్లను నియమించారు. పారిశుద్ధ్యానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. -
మరాఠా గడ్డపై తెలుగు లెస్సేనా?
సాక్షి ముంబై: రాష్ట్రంలో ఏడాదికేడాది తెలుగు విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఉపాధి కోసం, వ్యాపారం కోసం ముంబైకి వచ్చి స్థిరపడుతున్న తెలుగువారి సంఖ్య ఏటా పెరుగుతున్న తెలుగు చదివే విద్యార్థుల సంఖ్య తగ్గుతుండడం తెలుగు భాషా ప్రియులకు ఆందోళన కలిగిస్తోంది. తెలుగు చదువుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గుతుండడంతో తెలుగు మీడియం పాఠశాలల సంఖ్య కూడా పడిపోతోంది. తెలుగు మీడియంలో చదివించేందుకు పిల్లల తల్లిదండ్రులు ఆసక్తి చూపకపోవడం మొదటి కారణమైతే మరోవైపు తమ పిల్లలను తెలుగు మీడియంలో చేర్చాలనుకున్నా అందుబాటులో తెలుగు మీడియం పాఠశాలలు లేకపోవడం మరో కారణంగా చెప్పుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే ప్రస్తుతం తెలుగు మీడియం పాఠశాలలు ముంబైతోపాటు భివండీ, షోలాపూర్, చంద్రపూర్, నాందేడ్ తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ పాఠశాలల్లో కూడా సరిపడా అధ్యాపకులు లేరు. ఏటికేటా ఈ విభాగానికి సంబంధించిన టీచర్లు పదవీ విరమణ చేస్తున్నప్పటికీ వారి స్థానంలో కొత్తవారిని నియమించకపోవడంతో ఈ కొరత నానాటికీ అధికమవుతోంది. వీరిని నియమించే విషయంలో సర్కారు కూడా శ్రద్ధ చూపకపోవడంతో ఈ సమస్య పరిష్కారమవడం లేదు. రాష్ట్రంలో తెలుగు బోధనకు సంబంధించి ప్రాథమిక విద్యస్థాయిలో ఈ కొరత తీవ్రంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగు పిల్లలు తమ భాషను పూర్తిగా మరచిపోయే పరిస్థితులు దాపురిస్తున్నాయి. పదో తరగతిలో తెలుగును మొదటి భాషగా తీసుకున్నవారి సంఖ్య నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఫస్ట్ లాంగ్వేజ్ వారీగా పరిశీలిస్తే రాష్ట్రవ్యాప్తంగా 2012-13 విద్యా సంవత్సరంలో మొత్తం 924 మంది విద్యార్థులుండగా 2013-14లో వీరి సంఖ్య 788కి దిగజారింది. వీరిలో 780 మంది తెలుగు సబ్జెక్టులో పరీక్షలు రాయగా 699 మంది (89.62 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మరోవైపు సెకండ్, థర్డ్ లాంగ్వేజ్ వారీగా పరిశీలిస్తే 2012-13లో ముగ్గురు తెలుగు సబ్జెక్ట్‌లో పరీక్షలు రాసినప్పటికీ 2013-14 విద్యాసంవత్సరంలో ఒక్క విద్యార్థి కూడా లేకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా హిందీ-తెలుగు సబ్జెక్టులు సెకండ్, థర్డ్ లాంగ్వేజ్లుగా 356 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 347 (97.47 శాతం) మంది పాసయ్యారు. ఇక ముంబై డివిజన్‌ను పరిశీలిస్తే ఫస్ట్ లాంగ్వేజ్‌గా తెలుగు సబ్జెక్ట్‌లో పరీక్షలు రాసినవారి సంఖ్య గతంలో కంటే తగ్గింది. 2011-12లో 810 మంది పరీక్షలు రాయగా 2012-13లో 762 మంది పరీక్షలు రాశారు. అయితే 2013-14లో వారి సంఖ్య మరింత తగ్గి 649కి చేరింది. వీరిలో 576 (88.75 శాతం) మంది ఉత్తీర్థులయ్యారు. తల్లిదండ్రులూ ఆసక్తి చూపాలి.. తెలుగుభాష అభివృద్ధి విషయంలో వాస్తవానికి అధికారుల నుంచి ఉన్నంతలో ప్రోత్సాహం లభిస్తున్నా తల్లిదండ్రులే ఆసక్తి చూపడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎలాగూ ఇతర రాష్ట్రంలో నివసిస్తున్నందున తెలుగు భాష వల్ల కలిగే ప్రయోజనాలు పెద్దగా ఏమీ లేవన్న భావనతో తల్లిదండ్రులే మరో భాషపట్ల మక్కువచూపుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంపై ములుండ్ బీఎంసీ పాఠశాల ఇన్చార్జి నాయిని ఆదినారాయణ మాట్లాడుతూ.. మాతృభాషను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ముంబైలో కేవలం తమ పాఠశాలలో మాత్రమే తెలుగుమీడియంలో పదో తరగతి వరకూ బోధన అందిస్తోందన్నారు. పాఠ్యపుస్తకాలన్నీ సకాలంలో అందజేస్తున్నామని, పిల్లలకు ఉపయుక్తమయ్యే బ్యాగు, పుస్తకాలు, రెయిన్ కోటు, షూ తదితర 27 రకాల వస్తువులను ఉచితంగా అందిస్తూ ప్రోత్సహిస్తున్నామన్నారు. బీఎంసీ స్కూల్లో ఉత్తమ ఫలితాలు.. ములుండ్‌లోని బీఎంసీ స్కూల్లో ఈ ఏడాది ఎస్సెస్సీలో మంచి ఫలితాలు సాధించినట్లు ఆదినారాయణ తెలిపారు. 29 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా 23 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. వీరిలో ఎస్.రామకృష్ణ (87.20 శాతం) సీహెచ్ చంద్రావతి (70.40), జె.జ్యోతి (69.20), టి.సోనీ (67.20), డి.పూజా (64.20) శాతం మార్కులు సాధించారన్నారు. మార్పు అవసరం.. తెలుగుభాషను కాపాడుకునేందుకు ప్రాథమిక స్థాయినుంచే మార్పు అవసరమని భాషాభిమానులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 లక్షల మంది వరకూ తెలుగువారు ఉంటున్నప్పటికీ వీరిలో అనేకమందికి తెలుగు భాషే రాదు. ఇదే పరిస్థితి కొనసాగితే మున్ముందు తరాలు తెలుగును పూర్తిగా మర్చిపోయే ప్రమాదం ఉందన్న ఆవేదన భాషాభిమానుల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కనీసం తెలుగు భాషను ఒక అంశంగా తీసుకొని దాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. పిల్లల్లో భాష పట్ల మక్కువను ప్రేరేపించేందుకు పెద్దలే ముందుకు రావాల్సిన అవసరముంది. ఇందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటైన తెలుగు సంఘాలు, తెలుగు కవులు, ప్రవాస తెలుగువారు తమవంతు ప్రయత్నం చేయాలన్నారు. తెలుగు పాఠశాలల ఏర్పాటు కోసం స్థానిక నాయకులపై ఒత్తిడి తేవాలని, ఏర్పాటైన పాఠశాలల్లో విద్యార్థులు చేరేలా కృషి చేయాలని పలువురు సూచిస్తున్నారు. అప్పుడే పరాయి రాష్ట్రంలో కూడా తెలుగు శాశ్వతంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
దర్జాగా తాగునీటి చౌర్యం..
భివండీ, న్యూస్‌లైన్: మున్సిపాలిటీ సరఫరా చేస్తున్న తాగునీరు చౌర్యానికి గురవుతోంది. పట్టణంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన వాహన సర్వీసింగ్ సెంటర్లు, మరమగ్గాల కార్ఖానాలు ఈ చౌర్యానికి తెగబడుతున్నాయనే ఆరోపణలున్నాయి. భివండీలో సుమారు 200కు పైగా సర్వీసింగ్ సెంటర్లు ఉన్నాయి. వాటిలో వాహనాలను శుభ్రం చేసేందుకు నీటిని వాడాల్సి ఉంటుంది. వాస్తవానికి వారు సెంటర్లలో బోర్లు వేయించుకుని, ఆ నీటితో వాహనాలను శుభ్రపరచాల్సి ఉంటుంది. అయితే ఆయా సెంటర్ల నిర్వాహకులు కార్పొరేషన్‌కు చెందిన మంచినీటి సరఫరా పైప్లైన్ల నుంచి అక్రమంగా నీటిని వాడుకుంటున్నారు. ఈ విషయమై కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదులున్నా పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. మరికొంత మంది సర్వీసింగ్ సెంటర్ల నిర్వాహకులు సదరు సెంటర్ల కింద లోతైన నిర్మాణాలు చేపట్టి అందులో మున్సిపల్ నీటిని అక్రమంగా నిల్వ చేస్తూ ఉపయోగించుకుంటున్నారు. ఇదిలా ఉండగా, పట్టణంలో వేల సంఖ్యలో కాటన్ దుస్తులు తయారు చేసే యంత్రాల పరిశ్రమలు ఉన్నాయి. వాటి పైకప్పులు చల్లగా ఉంటేనే నూలు దుస్తుల తయారీ సాధ్యమవుతుంది. అందువల్ల పైకప్పుగా వేసిన సిమెంట్ రేకులను చల్లబరచడానికి నీరు చాలా అవసరం. అలాగే కార్ఖానా లోపల ఫువారా యంత్రాన్ని అమర్చి యంత్రాలకు నిత్యం చల్లటి వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి కూడా నీరు చాలా అవసరం. దీంతో నిత్యం కొన్ని లక్షల లీటర్ల నీటిని ఈ పరిశ్రమలు వినియోగించాల్సి ఉంటుంది. దీనికోసం వారు బావుల పైనో, బోరింగులపైనో ఆధారపడాల్సి ఉంటుంది. కాని ఆయా పరిశ్రమలు మంచినీటి పైపులైన్ల నుంచి అక్రమంగా కనెక్షన్లు పొంది లక్షలాది లీటర్ల మంచినీటిని చౌర్యం చేస్తున్నారనే విమర్శలున్నాయి. పట్టణంలో గాయిత్రీనగర్, నాగావ్, బండారి కాంపౌండ్, శాంతినగర్, నయీబస్తీ, పద్మనగర్ తదితర ప్రాంతాల్లో మంచి నీటి ఎద్దడి నెలకొంది. మున్సిపాలిటీ సర ఫరా చేస్తున్న మంచినీరు స్థానికుల అవసరాలకు ఏమాత్రం సరిపోవడంలేదు. దాంతో వారు అధికారులకు, స్థానిక కార్పొరేటర్లకు ఫిర్యాదు చేస్తున్నారు. మున్సిపాలిటీ సైతం తమకు సరఫరా చేస్తున్న మంచినీటి శాతాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. వాస్తవానికి భివండీ మహానగర్ పాలిక ముంబై మహానగర్ పాలిక నుంచి 35 ఎంఎల్డీ, అదేవిధంగా స్టేమ్ నుంచి 73 ఎంఎల్డి మంచినీటిని కొనుగోలు చేస్తోంది. మున్సిపాలిటీ పరిధిలో 5 ప్రభాగ్ సమితులు ఉన్నాయి. ఇందులో కేవలం 10 సర్వీసింగ్ సెంటర్లకే అనుమతులు ఉన్నట్లు కార్పొరేషన్ అధికారి తెలిపారు. అయితే 200పైగా ఉన్న అనధికార సర్వీసింగ్ సెంటర్లలో ద్విచక్ర వాహనాలను శుభ్రపరచడానికి రూ.50-60 లు, త్రిచక్ర వాహనానికి రూ.75, నాలుగు చక్రాల వాహనానికి రూ.100- 150లు వసూలు చేస్తున్నారు. రోజూ ఈ సెంటర్లలో రెండు వేల నుంచి మూడు వేల వాహనాలను శుభ్రపరుస్తున్నారు.దీని నిమిత్తం లక్షలాది లీటర్ల నీటిని వినియోగిస్తున్నారు. ఈ నీరంతా మున్సిపాలిటీ సరఫరా చేసే నీరు కావడంతో సామాన్యులకు మంచినీటి సమస్యలు తప్పడంలేదు. కాగా, మంచినీటిని అక్రమంగా వినియోగించుకుంటున్న పరిశ్రమల లెసైన్సులు రద్దుచేయాలని, అనుమతులు లేని సర్వీసింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
‘తెలుగువారి విశ్వాసాన్ని చూరగొంటా’
ఎమ్మెన్నెస్ అభ్యర్థి సురేష్ మాత్రే భివండీ, న్యూస్‌లైన్: ఎన్సీపీలో రాజకీయ జీవితం ప్రారంభించిన కపిల్ పాటిల్ బీజే పీ, శివసేనలను దెబ్బతీయడానికి యత్నించారని ఎమ్మెన్నెస్ అభ్యర్థి సురేష్ మాత్రే ఆరోపించారు. స్థానిక మార్కండేయనగర్ ప్రాంతంలో గల గణేశ్ టాకీస్ వద్ద భివండీ తెలుగు సమాజం (బీటీఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అటువంటి వ్యక్తిని ప్రజలంతా నిలదీయాలన్నారు. పద్మనగర్‌లోని అత్యధికంగా స్థిరపడ్డ తెలుగు ప్రజల విశ్వాసాన్ని చూరగొనేందుకు యత్నిస్తానన్నారు. తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. ఇంజన్ ఏ ప్రాంతానికి వస్తే ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుందన్నారు. తాను మాటలు చెప్పే వ్యక్తిని కాదని, చేతల మనిషినని అన్నారు. భివండీని అభివృద్ధి చేయలేకపోతే మరోసారి ఓట్లు అడిగేందుకు రానన్నారు. ఈ సభలో బీటీఎస్ అధ్యక్షుడు తుమ్మ రమేశ్, డాక్టర్ శ్రీధర్ సుంక, ఎలిగేటి శ్రీనివాస్, వడ్లకొండ రాము, బొల్లి నవీన్, మామిడాల ధనవంత్రి, నందాల భాస్కర్‌తో పాటు స్థానికుఉల పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. సభికులను మధుప్రియ తెలంగాణ పాటటతో ఆకట్టుకుంది. -
కనులారా రాములోరి కల్యాణం
భివండీ, న్యూస్‌లైన్: పట్టణంలోని పద్మనగర్ ప్రాంతంలోని శ్రీ రామ మందిర ప్రాంగణంలో రాములోరి కల్యాణం అంగరంగా వైభవంగా జరిగింది. గత 25 సంవత్సరాలుగా నవమి వేడుకలు నిర్వహిస్తున్న శ్రీ రామ మందిర్ ట్రస్ట్ సభ్యులు ఈసారి కూడా మందిరాన్ని రంగు రంగు పుష్పాలు, విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఈ నెల మూడో తేదీ నుంచి నిత్య పూజా కార్యక్రమాలతో పాటు రామాయణ పారాయణం, హోమం, అభిషేకాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం ప్రభాత భే రి, సంపూర్ణ గీతా పారాయణం, యజ్ఞం నిర్వహించిన అనంతరం అభిజిత్ లగ్నమందు స్వామివారికి కల్యాణ తంతు ప్రారంభించి ఉదయం 11.45 గంటలకు మాంగల్యధారణ చేశారు. ఈ కమనీయ కల్యాణాన్ని తిలకించడం కోసం పద్మనగర్ ప్రాంతవాసులతో పాటు కామత్‌ఘర్, అంజూర్‌పాట, నాయిబస్తీ, బాలాజీనగర్, నార్‌పోళి దేవ్జీనగర్, బండారి కాంపౌండ్, కోమల్పాడ, సంఘం పాడ నుంచి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. వివాహనంతరం స్వామివారికి మహిళా భక్తులు వడి బియ్యం, కానుకలు సమర్పించుకున్నారు. 12 గంటలకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో సుమారు 10 వేల మందికి పైగా భక్తులు పాల్గొన్నారని నిర్వాహకులు డాక్టర్ అంకం నర్సయ్య, కట్ల మల్లేశ్, చేర్యాల వెంకటి తెలిపారు. దాదర్‌లో... సాక్షి, ముంబై: దాదర్‌లోని ఆంధ్రమహాసభ ఆవరణలో మంగళవారం ఉదయం శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. ఉదయం నుంచి పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాసభ అధ్యక్షుడు సంకు సుధాకర్, శ్రీ వేంకటేశ్వర పూజ మందిర ట్రస్టీ ఏఎస్ఆర్కే ప్రసాద్ దంపతులు పాల్గొని వేదమంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా రాములోరి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. తర్వాత అష్టోత్తర అర్చన, మహిళా శాఖవారు భక్తి గీతాలు ఆలపించారు. దీంతో భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారు. అనంతరం మహాసభ మాజీ అధ్యక్షుడు డాక్టర్.జి.హరికిషన్ సీతారాములకు మంగళహారతులు ఇచ్చిన తర్వాత పూజా కార్యక్రమాలు ముగిశాయి. ఆ తర్వాత భక్తులు శ్రీ సీతారాములను దర్శించుకున్నారు. శ్రీ వేంకటేశ్వర పూజా మందిర ట్రస్టీ చైర్మన్ కె.ఎస్.కృష్ణమూర్తి, కార్యదర్శి కె.ఎస్.ఆర్.మూర్తి, సభ్యులు ఓ.సుబ్రహ్మణ్యం, ఆంధ్ర మహాసభ ధర్మకర్తలు, కె. రమేశ్‌బాబు, ప్రధాన కార్యదర్శి యాపురం వెంకటేశ్వర్, కస్తూరి హరిప్రసాద్‌లతోపాటు మహిళాశాఖ అధ్యక్షురాలు పి.భారతలక్ష్మి, కార్యదర్శి సోమల్ లత, ఉపాధ్యక్షురాలు టి.కరుణశ్రీ, సంయుక్త కార్యదర్శి టి.అపరాజిత, సభ్యులు భోగ జ్యోతిలక్ష్మి, పి.పద్మ, పి.దేవి రావు, సంగెవేని విజయ, వై.లత తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉల్లాస్‌నగర్‌లో...: ఉల్లాస్‌నగర్‌లోని బాలాజీ ముంబై తెలుగు సమాజ్ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఫార్వర్డ్‌లైన్ వాల్మీకినగర్‌లోని ఓ శివాలయంలో ఉన్న సీతారాముల విగ్రహాలను తీసుకొచ్చి స్థానిక పూజా పంచాయతీ హాలులో కల్యాణం నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానికంగా ఉంటున్న తూర్పు గోదావరి జిల్లా అమలాపురం తాలూకా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభాదేవిలో...: ప్రభాదేవిలోని భగవాన్ శ్రీసత్యానందమహర్షి భక్త మండలి ఆధ్వర్యంలో మంగళవారం శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంతో భక్తిశ్రద్ధ్రలతో ఉగాది పర్వదినం నుంచి కొనసాగిన ‘అఖండ హరినామ సంకీర్తన సప్తాహ’ మంగళవారం ముగించారు. శ్రీ రామ నవమి ఉత్సవాలు పుర స్కరించుకుని మంగళవారం ఉదయం హోమం, పూజ, ఇతర అర్చన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం లాలిపాటలతో శ్రీరామ జన్మదిన వేడుకలను నిర్వహించారు. వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలతోపాటు అన్నదానం కూడా చేసినట్లు మండలి కార్యదర్శి పురుషోత్తం చెప్పారు. షిర్డీలో...: సాక్షి, ముంబై: షిర్డీలో సాయిబాబా సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీరామ నవమి ఉత్సవాలు మంగళవారం అంగరంగా వైభవంగా జరిగాయి. సోమవారం రాత్రంతా ఆలయాన్ని తెరిచే ఉంచడంతో లక్షలాది మంది భక్తులు బాబా సమాధిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం కాకడ్ ఆరతి, అనంతరం ద్వారకామయిలో సోమవారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన అఖండ పరాయణ పఠనం ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా దాదాపు నాలుగు వేల మంది భక్తులు కావడితో తీసుకొచ్చిన శుద్ధమైన నీటితో బాబాకు జలాభిషేకం చేశారు. అనంతరం బాబా చిత్రపటం, పవిత్ర గ్రంథాన్ని ఊరేగించారు. ఆలయం పక్కనే ఏర్పాటుచేసిన వేదికపై ఉదయం 10 గంటలకు విక్రం నాందేడ్కర్ అనే భక్తుడు రాముని జీవిత చరిత్రను హరికథ రూపంలో వివరించారు. అనంతరం బాబా రథాన్ని షిర్డీ పురవీధుల్లో ఊరేగించారు. ఇందులో సాయి భక్తులు పెద్ద సంఖ్యలో పొల్గొన్నారు. దీంతో షిర్డీ పుణ్యక్షేత్రం మంగళవారం పూర్తిగా రామనామ స్మరణతో మారుమోగింది. ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. భక్తులకు ఎలాంటి లోటులేకుండా బాబా సంస్థాన్ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. భక్తులు బస చేసేందుకు టెంట్లు, మండపాలు, షామియాలు, తాగునీరు, సంచార మరుగుదొడ్లు, స్నానాలకు ట్యాంకర్లు, లడ్డు ప్రసాదం తదితర సౌకర్యాలు కల్పించారు. ఉత్సవాల సందర్భంగా మంగళవారం కూడా భక్తులకి ఉచిత భోజన వసతి కల్పించారు. ముంబైకి చెందిన సునీల్ అగ్రవాల్, గోండియా జిల్లాకు చెందిన సుశీలాదేవి మాసాని, అహ్మదాబాద్‌కు చెందిన దిలీప్ మెహత, బెంగళూర్‌కు చెందిన శ్రీనివాస్ శిర్గూకర్, భువనేశ్వర్‌కు చెందిన దుశ్యంతకుమార్, డెహరాడూన్‌కు చె ందిన సచిన్‌కుమార్, అమెరికాకు చెందిన సీతా హరిహరణ్ తదితర దాతలు అందించిన విరాళాలతో ఉచిత భోజనం కల్పించినట్లు బాబా సంస్థాన్ అధ్యక్షుడు బాలచంద్ర దేబాడ్వార్ చెప్పారు. -
ఫ్యాబ్రిక్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ ఆవిష్కరణ
భివండీ, న్యూస్‌లైన్: పద్మశాలి యువత తెలుగువారి కీర్తిని దశదిశలా చాటిందంటూ పలువురు వక్తలు కొనియాడారు. కొందరు పద్మశాలి యువకులు మొట్టమొదటిసారిగా జాతీయస్థాయిలో ఫ్యాబ్రిక్ డిజైనింగ్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. దీనిని శుక్రవారం సాయంత్రం శ్రీ వేంకటేశ్వర కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. పద్మశాలీలకు ఇది మర్చిపోలేని రోజని, నేటి యువతరం కూడా మున్ముందు ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ను తయారుచేసి తెలుగువారి కీర్తి నలుదిశలా చాటాలని కోరారు. అనంతరం దీని రూపకర్తలు మాట్లాడుతూ తాము రూపొందించిన సాఫ్ట్వేర్ విదేశీ సాఫ్ట్వేర్ ధరతో పోలిస్తే 90 శాతం తక్కువని పేర్కొన్నారు. అత్యంత సులభమైన రీతిలోఅందరికీ అర్ధమయ్యేవిధంగా ఒకే సమయంలో ఎక్కువ నమూనాలను చూపించ వచ్చన్నారు. అనంతరం దీనిని ప్రత్యేక ప్రదర్శన ద్వారా చూపించారు. ఈ సాఫ్ట్వేర్ రూపకల్పనకు ఎంతో తాము చాలా కష్టపడ్డామని, ఇందుకు తమ తల్లిదండ్రులు, డిజైన్ మాస్టర్లు ఎలిగేటి శ్రీనివాస్, చిలుకూరి శంకర్, కనుకుంట్ల పర శురామ్, సిరిమల్ల శ్రీనివాస్, చెన్న శివ, అజయ్ మాస్టర్ లాంటి సీనియర్లు ఎంతగానో సహకరించారన్నారు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసిన యువకుల తల్లిదండ్రులను అతిథులు సత్కరించారు. ఈ కార్యక్రమం అనంతరం సుమారు 50 మందికి పైగా స్థానికులు ఈ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేశారు. ఈ నెల 7,8,9 తేదీలలో ఇచల్కరేంజిలో జరగనున్న అంతర్జాతీయ టెక్స్టైల్ ప్రదర్శనలో ఈ సాఫ్ట్వేర్ నమూనాను ప్రదర్శించబోతున్నామని సిరిపురం సాగర్ తెలి పారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని సుమారు ఐదువందల మంది డిజైన్ మాస్టర్లతో పాటు ముంబై నుంచి నక్క మనోహర్, ఆడెపు మురళి , రఘు మాస్టర్, అశోక్ మాస్టర్, రాజేశ్, స్థానిక కార్పొరేటర్ మురళి మచ్చ, బీజేిపీ పట్టణ శాఖ కార్యదర్శి నిష్కం భైరిలు హాజరయ్యారు. మాంచెస్టర్గా పేరుగాంచిన భివండి పట్టణంలో అత్యధికంగా తెలుగు వారు టెక్స్టైల్ పరిశ్రమలు నెలకొల్పి దేశవిదేశాలకు వస్త్రాలను ఎగుమతి చేస్తున్నారు. అయితే నమూనాల కోసం చేతిమగ్గంతో తయారుచేసిన వస్త్రాన్ని వ్యాపారస్తులకు చూపించేవారు. దేశ విదేశాలకు ఈ నమూనాలను పంపించేందుకు అనేక రోజుల సమయం పట్టేది. ఈ నేపథ్యంలో కొన్నేళ్లుగా కొంతమంది డిజైన్ మాస్టర్లు విదేశాల నుంచి దుస్తుల డిజైనింగ్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసి తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సాఫ్ట్వేర్ చాలా తక్కువ మంది వద్ద ఉంది. అయితే ఈ సాఫ్ట్వేర్ ఉన్న వారికి మాత్రమే మార్కెట్లో మంచి రాబడి ఉంటుంది. అయితే మధ్య తరగతి పరిశ్రమలవారికి ఈ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసే స్తోమత లేకపోవడంతో వీరి వ్యాపారం దెబ్బతింటోంది. దీనిని దృష్టిలో ంచుకుని భివండీ పద్మశాలి టెక్స్టైల్ టెక్నీషియేషన్స్ అసోసియేషన్ (ిపీటీటీఏ) సంస్థ యాజమాన్యం ‘యాక్యురేట్ సొల్యూషన్స్ కంపెనీ’కి చెందిన పద్మశాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సిరిపురం శ్రీనివాస్, భైరి చంద్రశేఖర్, సిరిపురం సాగర్, దీకొండ శ్రీనివాస్, గొరిట్యాల హరిష్, వేముల శ్రీనివాస్, సిరిపురం సురేష్లను దుస్తుల డిజైన్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని కోరింది. దీంతో ఈ బృందం ఆరు నెలలపాటు శ్రమించి ఈ సాఫ్ట్వేర్ ను రూపొందించింది. -
అక్రమ నిర్మాణం కూల్చివేత
భివండీ, న్యూస్‌లైన్: అక్రమ నిర్మాణాలపై (బీఎన్‌ఎంసీ) కొరడా ఝళిపించింది. ఎటువంటి అనుమతులు పొందకుండానే ప్రభాగ్ సమితి నాలుగులో నిర్మించిన మూడంతస్తుల భవనాన్ని కార్పొరేషన్ అధికారులు మంగళవారం మధ్యాహ్నం కూల్చారు. నవీన్ గౌరీపాడా ప్రాంతానికి చెందిన నయీమ్ పఠాన్‌కు చెందిన ఖాళీస్థలాన్ని అక్రమ్ శేఖ్ అనే బిల్డర్ అభివృద్ధి కోసం తీసుకున్నాడు. అయితే కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా మూడంతస్తుల భవన నిర్మాణ పనులను చేపట్టాడు. ఈ నేపథ్యంలో పనులు నిలిపివేయాల్సిందిగా కార్పొరేషన్ అధికారులు ఇటీవల నోటీసులు జారీ చేశారు. అయినా బిల్డర్ ఆ నోటీసులను పట్టించుకోకుండా పనులను కొనసాగించాడు. దీంతో స్థానిక బోయివాడ స్టేషన్‌కు చెందిన పోలీసుల బందోబస్తు మధ్య కార్పోరేషన్ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చారు. ఇందులో నాలుగో ప్రభాగ్ సమితి అధికారి సునీల్ బాలేరావ్తోపాటు గోండాంబే, బాలారామ్ జాదవ్, భగత్ ఉగడే, సోమనాథ్ సోస్టే, దిలీప్ మాళీ, శేఖర్ మడకే తదితరులున్నారు. ఇదిలాఉండగా పట్టణంలో ప్రస్తుతం సుమారు వెయ్యికిపైగా నిర్మాణాలు అనుమతులు లేకుండా జరుగుతున్నట్టు తెలియవచ్చింది.