భివాండీలో మర మగ్గాల శబ్దమేది?
ముంబై: మహారాష్ట్రలోని ముంబై నగరానికి 30 కిలోమీటర్ల దూరంలోవున్న భివాండి పేరు వినగానే మర మగ్గాల శబ్దం వినిపిస్తుంది. ఆసియాలోనే జౌళి పరిశ్రమకు పుట్టినిల్లనే విషయం గుర్తొస్తుంది. దేశ జనాభాలో ఎక్కువ మంది వ్యవసాయ రంగం తర్వాత మర మగ్గాల మీద ఆధారపడి బతుకుతున్నారనే విషయం మదిలో మెదలవుతుంది. ఇదంతా గతం. ఇప్పుడు 80 శాతం మర మగ్గాలు మూగబోయాయి. యంత్రాలకు బూజులు పట్టాయి. తెగిన దారపు ముక్కలతో, దుమ్మూ దూళితో ఫ్యాక్టరీలు అదోరకమైన కంపు కొడుతున్నాయి.
వియత్నాం, బంగ్లాదేశ్ లాంటి దేశాల నుంచి పోటీ పెరిగిపోయి ఉత్పత్తులు, ఎగుమతులు పడిపోతున్న నేపథ్యంలో మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్టు దేశంలో పెద్ద నోట్ల రద్దు మర మగ్గాలకు శాపంగా మారింది. లక్షలాది మంది కార్మికుల బతుకులను బుగ్గిపాలు చేసింది. దేశవ్యాప్తంగా 65లక్షల మరమగ్గాలుండగా, ఒక్క మహారాష్ట్రలోని భివాండి, మాలేగావ్, ధూలే, సాంగ్లీ, సోలాపూర్‌లలోనే 11లక్షల మరమగ్గాలున్నాయి. వీటిలో దాదాపు 15 లక్షల మంది కార్మికులు ప్రత్యక్షంగా పనిచేసేవారు. గత మూడేళ్లలోనే దాదాపు ఐదు లక్షల మంది కార్మికులు ఈ రంగంలోకి వచ్చారు. జాతీయ స్థూల ఉత్పత్తిలో రెండు శాతం ఆదాయం ఈ రంగం నుంచే సమకూరేది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇప్పుడు వాటిలో 20శాతం మరమగ్గాలు మాత్రమే పనిచేస్తున్నాయని భివాండి టెక్స్‌టైల్స్ మిల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మన్నన్ సిద్దిఖీ తెలిపారు.
పొలం నుంచి దారం ఫ్యాక్టరీకి, అక్కడి నుంచి మర మగ్గాల ఫ్యాక్టరీకి, అక్కడి నుంచి హోల్‌సేల్‌కు, అక్కడి నుంచి రిటేలర్‌కు, అక్కడి నుంచి వినియోగదారుడికి సాగే జౌళి నెట్‌వర్క్‌లో ప్రతి చోట నగదు లావాదేవీలే కొనసాగుతాయి. హోల్‌సేల్ నుంచి రిటేలర్, అక్కడి నుంచి వినియోగదారుడికి కొంత మేరకు నగదు రహిత లావాదేవీలు నిర్వహించవచ్చుగానీ రైతు పొలం నుంచి దూదిని సేకరించడం, రంగుల అద్దకం, జిప్‌లు, బటన్లు కుట్టడం, బేళ్లు ఎత్తడం లాంటి పనులకు కచ్చితంగా నగదునే చెల్లించాల్సి ఉంటుంది. అందుకనే ఈ రంగంపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఎక్కువగా పడింది.
‘నోట్ బందీనే హమ్‌కో పాంచ్ సాల్ పీచె ఫేక్ దియా’ అని 65 ఏళ్ల లేబర్ కాంట్రాక్టర్ అసద్ ఫరూకి వ్యాఖ్యానించారు. ఆయన 30 ఏళ్లుగా వంద మర మగ్గాలను నడుపుతున్నారు. ‘అన్ని మరమగ్గాలపై కలిపి గత నెలలో మాకు 17 వేల రూపాయలు లాభం వచ్చింది. 1990వ దశకంలో మాకు నెలకు 20 వేల రూపాయల లాభం వచ్చేది.
ఇప్పటి లెక్కల్లో చెప్పాలంటే నెలకు 70 వేల రూపాయలు వచ్చేవి’ అని ఇదే వ్యాపారంలో కొనసాగుతున్న అసద్ కుమారుడు అఫ్తాబ్ మీడియాకు తెలిపారు. ముంబైకి 270 కిలోమీటర్ల దూరంలోవున్న మాలేగావ్‌లో కూడా మర మగ్గాల పరిస్థితి ఇలాగే ఉంది. ఎప్పుడు జరిగేకన్నా వ్యాపారం 20 శాతం తక్కువగా జరుగుతోందని ముంబైలోని ఎన్. చంద్రకాంత్ అనే వస్త్ర వ్యాపారి తెలిపారు. గార్మెంట్స్ డిమాండ్ 30 శాతం, హోల్‌సేల్ డిమాండ్ 50 శాతం తగ్గిందని అదే మార్కెట్‌లో వస్త్ర దుకాణం నడుపుతున్న రిటేలర్ కపేష్ భయాని తెలిపారు.