జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మండిపాటు
జంషెడ్‌పూర్/ధన్‌బాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అనేవి రైతులు, కార్మికులు, పేదలను చంపేస్తున్న ఆయుధాలు అని ధ్వజమెత్తారు. విద్వేషాన్ని విశ్వసించే బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్, ప్రేమను నమ్మే ‘ఇండియా’కూటమి మధ్య యుద్ధం జరుగుతోందని చెప్పారు.
హింసకు, ఐక్యమత్యాన్ని మధ్య యుద్ధం కొనసాగుతోందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విధానాలతో దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతోందని ఆరోపించారు. శనివారం జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్ విభజన రాజకీయాలు చేస్తున్నాయని, కులం, మతం, భాష ఆధారంగా సమాజాన్ని విడగొట్టాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు.
రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్ ప్రయతి్నస్తుండగా, తాము పరిరక్షించేందుకు పోరాడుతున్నామని తెలిపారు. కొందరు బడా పెట్టుబడిదారులకు ప్రధాని మోదీ నిధులు అందజేస్తున్నారని, వారు ఆ సొమ్మును విదేశాల్లో పెట్టుబడులుగా పెడుతున్నారని ఆరోపించారు. జంషెడ్‌పూర్‌లో ప్రసంగిస్తుండగా మధ్యలో ‘అజాన్’వినిపించడంతో రాహుల్ గాంధీ రెండు నిమిషాలపాటు విరామం ఇవ్వడం గమనార్హం.
మహారాష్ట్రలోనూ కుల గణన
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలోనూ అధికారంలోకి వచ్చిన వెంటనే కుల గణన ప్రక్రియ ప్రారంభిస్తామని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చెప్పారు. తెలంగాణలో ప్రారంభమైన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ప్రస్తావిస్తూ ఈమేరకు ఆయన శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment