ఏడేళ్ల క్రితం జరిగిన నోట్ల రద్దు గాయాల్ని వినూత్నంగా గుర్తు చేశారు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. నోట్ల రద్దు సమయంలో జన్మించిన 'ఖాజాంచి' (కోశాధికారి అని అర్థం) అనే చిన్నారి పుట్టినరోజును లక్నోలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించారు.
2016లో పెద్ద నోట్ల రద్దుతో దేశమంతా సతమతమవుతున్న సమయంలో 'ఖాజాంచి' ఈ లోకంలోకి అడుగుపెట్టాడు. రద్దు చేసిన కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి చిన్నారి తండ్రి బ్యాంక్ వద్ద క్యూలో నిలబడి ఉండగా తల్లి ఆ చిన్నారికి జన్మనిచ్చింది.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎస్పీ చీఫ్ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు వెనుక అసలు ఉద్దేశం రూ.15 లక్షల కోట్ల కార్పొరేట్ ఫ్రాడ్‌ను కప్పిపుచ్చడమేనని ఆరోపించారు. ధనికుల ఖజానాను నింపేందుకు పేదల నుంచి డబ్బులు తీసుకున్నారని బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని విమర్శించారు. బీజేపీ చెప్పినట్లుగా నోట్ల రద్దుతో అవినీతి, ఉగ్రవాదం ముగిసిపోలేదని ఆక్షేపించారు. మరో అడుగు ముందుకేసి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడానికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అప్పుడు నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఈ పుట్టినరోజు కార్యక్రమంలో ఖాజాంచి తల్లి, ఇతర పార్టీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment