samaj vadhi party
-
జ్ఞానవాపి, రామ జన్మభూమి వివాదాల వెనక ములాయం సింగ్ పాత్ర ఏంటి?
లక్నో: అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ట జరిగిన కొద్ది రోజులకే జ్ఞానవాపి మసీదు సెల్లార్లో హిందువులు పూజలు చేసుకోవడానికి అనుమతినిస్తూ వారణాసి కోర్టు తీర్పునిచ్చింది. అయితే.. అయోధ్య, జ్ఞానవాపి మసీదు వివాదాల వెనక ఒక కామన్ పేరు వినిపిస్తోంది. ఆయనే దివంగత నేత ములాయం సింగ్ యాదవ్. ఈ వివాదాల వెనక ములాయం సింగ్ యాదవ్ పాత్ర ఏంటంటే..? కరసేవకులపై కాల్పులు.. 1990 అక్టోబర్‌లో ములాయం సింగ్ యాదవ్ సీఎంగా ఉన్నప్పుడు అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టాలని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) కరసేవ నిర్వహించింది. దీనికి వ్యతిరేకంగా కరసేవకులపై ములాయం ప్రభుత్వం 28,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించింది. అయినప్పటికీ బారికేడ్లను దాటి కరసేవకులు బాబ్రీ మసీదు ప్రదేశానికి చేరుకున్నారు. మసీదుపై కాశాయ జెండాలను ఎగురవేశారు. ఈ ఘటనలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 20 మంది మరణించినట్లు అధికారికంగా చెబుతున్నప్పటికీ ఆ సంఖ్య ఎక్కువగా ఉంటుందని ప్రత్యక్ష సాక్షుల కథనాలు వెలువడ్డాయి. బాబ్రి మసీదు కూల్చివేత.. అయోధ్యలో కరసేవకుల ఘటన తర్వాత 1991లో యూపీలో ఎన్నికలు జరిగాయి. బీజేపీకి చెందిన కళ్యాణ్ సింగ్ అధికారంలోకి వచ్చారు. మరుసటి ఏడాది 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చి వేత ఘటన జరిగింది. ఈ పరిణామాల తర్వాత యూపీలో బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఉన్న పీవీ నరసింహరావు ప్రభుత్వం రద్దు చేసింది. తర్వాత యూపీలో రాష్ట్రపతి పాలన కొనసాగింది. మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో ములాయం మళ్లీ అధికారంలోకి వచ్చారు. ఈ పాలనా కాలంలోనే జ్ఞానవాపి సెల్లార్లో హిందువుల పూజలను ములాయం ప్రభుత్వం నిలిపివేసింది. జ్ఞానవాపిలో పూజలు నిలిపివేత.. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సెల్లార్ (వ్యాస్జీ కా తెహ్ఖానా)లో 1993 వరకు పూజాలు జరిగాయి. సెల్లార్లో 200 ఏళ్లకు పైగా వ్యాస్ కుటుంబం పూజలు చేశారు. వారి కుటుంబ పేరుమీదుగానే ఆ సెల్లార్‌కు వ్యాస్జీ కా తెహ్ఖానా అని పేరు వచ్చింది. అయితే.. 1993 డిసెంబర్లో ములాయం సింగ్ ప్రభుత్వం జ్ఞానవాపి మసీదులో పూజలను నిలిపివేసింది. లా అండ్ ఆర్డర్ సమస్యను కారణంగా చూపుతూ ఈ చర్యను ప్రభుత్వం సమర్థించుకుంది. ఎలాంటి న్యాయ ఉత్తర్వులు లేకుండానే ఉక్కు కంచెను నిర్మించిందని శైలేంద్ర వ్యాస్ కోర్టు పిటిషన్లో పేర్కొన్నారు. మసీదు ప్రాంతంలో దేవాలయం.. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో హిందూ దేవాలయం ఉన్నట్లు ఏఎస్ఐ సర్వే తెలిపిందని హిందూ తరుపు న్యాయవాది విష్ణశంకర్ జైన్ వెల్లడించారు. 800 ఏళ్ల చరిత్ర ఉన్న దేవాలయం.. కాలక్రమంలో అనేక యుద్ధాలు, విధ్వంసం తర్వాత పునర్నిర్మాణాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. దక్షిణాసియా అధ్యయనాలలో నైపుణ్యం కలిగిన పండితుడు యుగేశ్వర్ కౌశల్ ప్రకారం.. మహారాజా జయచంద్ర తన పట్టాభిషేకం తర్వాత సుమారు 1170-89 ADలో ఈ ప్రదేశంలో ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాడు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు 1669లో కాశీ విశ్వేశ్వర్ ఆలయాన్ని ధ్వంసం చేసి, ఆ శిథిలాల పైన ప్రస్తుత జ్ఞానవాపి మసీదును నిర్మించాడని విశ్వసిస్తారు. ఇదీ చదవండి: జ్ఞానవాపి మసీదులో పూజలు ప్రారంభం -
హ్యపీ బర్త్‌డే: ‘నోట్ల రద్దు’ను వినూత్నంగా గుర్తు చేసిన అఖిలేష్ యాదవ్
ఏడేళ్ల క్రితం జరిగిన నోట్ల రద్దు గాయాల్ని వినూత్నంగా గుర్తు చేశారు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. నోట్ల రద్దు సమయంలో జన్మించిన 'ఖాజాంచి' (కోశాధికారి అని అర్థం) అనే చిన్నారి పుట్టినరోజును లక్నోలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. 2016లో పెద్ద నోట్ల రద్దుతో దేశమంతా సతమతమవుతున్న సమయంలో 'ఖాజాంచి' ఈ లోకంలోకి అడుగుపెట్టాడు. రద్దు చేసిన కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి చిన్నారి తండ్రి బ్యాంక్ వద్ద క్యూలో నిలబడి ఉండగా తల్లి ఆ చిన్నారికి జన్మనిచ్చింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎస్పీ చీఫ్ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు వెనుక అసలు ఉద్దేశం రూ.15 లక్షల కోట్ల కార్పొరేట్ ఫ్రాడ్‌ను కప్పిపుచ్చడమేనని ఆరోపించారు. ధనికుల ఖజానాను నింపేందుకు పేదల నుంచి డబ్బులు తీసుకున్నారని బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని విమర్శించారు. బీజేపీ చెప్పినట్లుగా నోట్ల రద్దుతో అవినీతి, ఉగ్రవాదం ముగిసిపోలేదని ఆక్షేపించారు. మరో అడుగు ముందుకేసి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడానికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అప్పుడు నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఈ పుట్టినరోజు కార్యక్రమంలో ఖాజాంచి తల్లి, ఇతర పార్టీ సభ్యులు పాల్గొన్నారు. -
వివాదంగా మారిన హీరోయిన్ సీక్రెట్ పెళ్లి.. ట్రోలింగ్ షురూ
నిత్యం వార్తల్లో నిలిచే హీరోయిన్ స్వర భాస్కర్ పెళ్లి విషయంలోనూ టాక్‌ఆఫ్ ది టౌన్‌గా మారింది.సమాజ్‌వాదీ పార్టీ ఫహాద్ అహ్మద్‌ను రహస్యంగా పెళ్లాడిన ఆమె తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టింది. గతనెల 6నే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న స్వర భాస్కర్ తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈమేరకు తన భర్తతో ఏర్పడిన పరిచయం నుంచి పెళ్లి వరకు సాగిన వారి జర్నీని ఓ షార్ట్ వీడియో ద్వారా పంచుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే ఇప్పుడీ పెళ్లి వివాదంగా మారింది. వేరే మతానికి చెందిన వ్యక్తిని స్వర భాస్కర్ పెళ్లాడటంతో ముస్లిం వర్గాల నుంచి ఒకింత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు గతంలో ఫహాద్‌ను స్వర భాస్కర్ అన్నయ్య అని పిలిచి ఇప్పుడు పెళ్లెలా చేసుకుంటుందంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. స్వరా భాస్కర్ 2020లో సమాజ్ వాది పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు.ఆ సమయంలోనే ఫహాద్‌తో పరిచయం ఏర్పడింది. మొదట్లో ఆమె ఫహాద్‌ని అన్నయ్య అని పిలిచేది. అతని పుట్టినరోజు సందర్భంగా కూడా.. ఫహద్‌ను ‘భాయ్(సోదరుడు)అంటూ సంబోదిస్తూ బర్త్‌డే విషెస్ తెలిపింది. ఇప్పుడీ ట్వీట్‌ను వైరల్ చేస్తూ.. అన్నా అని పిలిచిన వ్యక్తిని పెళ్లి ఎలా చేసుకోవాలనిపించి అంటూ స్వర భాస్కర్‌ను ట్రోల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. మరి దీనిపై ఆమె ఏమైనా కౌంటర్ ఇస్తుందా అన్నది చూడాల్సి ఉంది. -
పొలిటికల్ వార్.. అఖిలేష్ యాదవ్‌తో కేసీఆర్ కీలక భేటీ
బీజేపీపై వార్ ప్రకటించి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ హస్తినలో చక్రం తిప్పుతున్నారు. శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే. ఇక, దేశంలో తాజా రాజకీయాలపై ఫోకస్ పెట్టిన కేసీఆర్.. శనివారం సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీలో తుగ్లక్ రోడ్-23లోని కేసీఆర్ నివాసంలో ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల గురించి ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. ప్రత్యామ్నాయ కూటమి, ప్రాంతీయ పార్టీల అవసరం గురించి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం సీఎం కేసీఆర్.. జాతీయ మీడియా సంస్థలకు చెందిన ప్రముఖ జర్నలిస్టులతో భేటీ కానున్నట్టు సమాచారం. కాగా, కేసీఆర్ వెంట ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ ఉన్నారు. ఇదిలా ఉండగా.. గులాబీ బాస్.. ఈ నెల 30 వరకు వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం మధ్యాహ్నం చండీగఢ్‌కు చేరుకోనున్న ముఖ్యమంత్రి.. రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 600 మంది కుటుంబాలను పరామర్శించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఒక్కొక్క కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున పరిహారం అందజేస్తారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం అర వింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్సింగ్ కూడా పాల్గొంటారు. అనంతరం రాష్ట్రానికి తిరిగి వస్తారు. అనంతరం, ఈ నెల 26న బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడతో, 27న మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్దిలో సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో భేటీ అవుతారు. షిర్డీ సాయిబాబా దర్శనం అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. తిరిగి ఈ నెల 29 లేదా 30న పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల పర్యటనకు సీఎం వెళ్లే అవకాశం ఉంది. Former Uttar Pradesh Chief Minister Sri @YadavAkhilesh met Chief Minister Sri K. Chandrashekar Rao at his residence in New Delhi. The two leaders discussed current national issues. pic.twitter.com/eVKRymyFiE — Telangana CMO (@TelanganaCMO) May 21, 2022 ఇది కూడా చదవండి: బీజేపీ వ్యతిరేక నినాదాలు.. పార్టీ కార్యకర్తలను కొట్టిన మాజీ సీఎం భార్య.. వీడియో వైరల్ -
ఎమ్మెల్యే పదవికి అఖిలేష్ రాజీనామా? ఎందుకలా?
లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఓటమి చెందినప్పటికీ కమలం పార్టీకి కాస్త పోటీ ఇచ్చిందనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కర్హాల్ అసెంబ్లీ స్ధానం నుంచి గెలుపొందగా, ఆ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్ రాంపూర్ స్ధానం నుంచి గెలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎస్పీ నేతలు అఖిలేష్ యాదవ్, ఆజంఖాన్ శాసన సభ్యలుగానే కాకుండా లోక్‌సభ సభ్యులుగానే ఉన్నారు. (చదవండి: ఆమె బీజేపీ ఏజెంట్.. మమ్మల్ని ఓడించారు ) అయితే తాజా సమాచారం ప్రకారం.. వీరిద్దరు శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసి లోక్‌సభ సభ్యులుగానే కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరు వరుసగా ఆజంఘఢ్, రాంపూర్ లోక్‌సభ స్ధానాల నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కర్హాల్ అసెంబ్లీ స్థానంలో యాదవ్ 67,504 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆయనకు 1,48,196 ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్‌కు 80,692 ఓట్లు వచ్చాయి. కర్హల్ ఎస్పీకి కంచుకోటగా భావిస్తారు. పోలైన ఓట్లలో యాదవ్‌కు 60.12 శాతం ఓట్లు రాగా, బాఘేల్‌కు 32.74 శాతం ఓట్లు వచ్చాయి. యాదవ్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. సీఎంగా ఉన్న సమయంలో అఖిలేష్ యాదవ్ శాసనమండలి సభ్యుడిగా ఉన్నారు. లోక్‌సభలో ఎస్పీకి ఐదుగురు సభ్యులుండగా సభలో తమ సంఖ్యాబలం మరింత బలహీనపడకుండా చూసుకోవాలని ఆ పార్టీ యోచిస్తోంది. దీంతో వీరిద్దరూ అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామా చేసి లోక్‌సభ ఎంపీలుగా కొనసాగుతారని ఎస్పీ వర్గాలు వెల్లడించాయి. కాగా, మార్చి 21న లక్నోలోని పార్టీ కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల సమావేశానికి అఖిలేష్ యాదవ్ అధ్యక్షత వహించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ తర్వాత సమాజ్ వాదీ పార్టీ 111 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. -
పశ్చిమ యూపీ... కాషాయానికి కీలకం!
ఉత్తరప్రదేశ్‌లో అప్పుడే తమ విజయావకాశాల మీద పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కానీ అసలైన పరీక్ష అవి ఇంకా దాటాల్సే ఉంది. ఏడు దశలుగా జరుగుతున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఫిబ్రవరి 10, 14 తేదీల్లో రెండు దశలు ముగిశాయి. మూడో దశ పోలింగ్ 20న జరగనుంది. ఈ దశ బరిలో సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఉన్నారు. 70 ఏళ్ల ఆ రాష్ట్ర ఎన్నికల చరిత్రలో వరుసగా రెండుసార్లు గెలిచిన ముఖ్యమంత్రులు లేరు. మరి ఆ రికార్డును యోగి ఆదిత్యనాథ్ బద్దలుకొడతారా? ప్రతిష్ఠాత్మక సీఎస్డీఎస్, ఢిల్లీ ఎన్నికల విశ్లేషణ ‘సాక్షి’కి ప్రత్యకం. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలిప్పుడు దేశా ద్యంతం హాట్ టాపిక్! సాధారణ ఎన్నికల సెమీఫైనల్స్‌గా పరిగణిస్తారు వీటిని. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ భవిష్యత్తు రాజకీయాల తీరు తెన్నులను నిర్దేశిస్తాయంటే అతిశయోక్తి ఏమీ కాదు. ఏకంగా పది హేను కోట్ల ఓటర్లు, 1.70 లక్షల పోలింగ్ కేంద్రాల్లో 403 మంది ఎమ్మె ల్యేలను ఎన్నుకునేందుకు ఏడు దశల్లో నిర్వహిస్తున్న ఈ ఎన్నికల్లో ఇప్పటికే రెండు దశలు ముగిశాయి. మూడో దశ ఓటింగ్‌కూ సన్నాహాలు జరిగిపోతున్నాయి. ఈ ఎన్నికలు ముఖ్యమైనవి అనడంలో సందేహం ఏమీ లేదు కానీ... యూపీలో గెలుపు ఢిల్లీ పీఠాన్ని సులువు చేస్తుందన్న మీడియా కథనాల్లో కొంత అతిశయోక్తి ఉందేమో! యూపీఏ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్‌కు ఇక్కడ చెప్పుకోదగ్గ స్థానాలేవీ లేని విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. 2022 యూపీ ఎన్నికల నగారా ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ మాటల యుద్ధంతోనే మొదలైందనవచ్చు. ఫిరాయింపులు, మతోన్మాదంతో కూడిన ప్రకట నలు, రాజకీయ ఆధిపత్యం కోసం పోటాపోటీ ఈ తాజా ఎన్నికల తీరు. కుల, కూటమి రాజకీయాలకు ప్రాధాన్యం దక్కే ఉత్తరప్రదేశ్‌లో ప్రతి పార్టీ తమ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు, అధికా రాన్ని అందుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. 2017 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన కాషాయ సునామీలో భారతీయ జనతా పార్టీ మొత్తం 403 స్థానాల్లో 312 గెలుచుకుంది. బీజేపీ కూటమి సభ్యులైన అప్నా దళ్ (సోనోలాల్) తొమ్మిది స్థానాలు, సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) నాలుగు స్థానాలు దక్కించు కున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ 22 స్థానాలు, కూటమి భాగస్వామి కాంగ్రెస్ ఏడు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ 22 శాతం ఓట్లతో 19 సీట్లు దక్కించుకుంది. అలాగే మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్ మనవడు రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షుడు జయంత్ చౌదరి ఒకే ఒక్క సీటుతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. గత ఎన్నికలు ఉత్తరప్రదేశ్‌లో దశాబ్దాలుగా సాగుతున్న ప్రాంతీయ పార్టీల ఆధిపత్యానికి గండికొట్టి చరిత్ర సృష్టిం చాయనడంలో సందేహం లేదు. ఓపీనియన్ పోల్స్ చెబుతున్నదేమిటి? ఉత్తరప్రదేశ్‌లో ఈసారి ఎన్నికలు భిన్న పరిస్థితుల్లో జరుగుతున్నా యని చెప్పాలి. ఆమ్ ఆద్మీ పార్టీ, ఏఐఎంఐఎం బరిలోకి దిగు తూండటం ఒక ప్రత్యేకత కాగా... కూటమి సమీకరణల్లోనూ మార్పులు వచ్చాయి. పోటీ బహుముఖంగానే కనిపిస్తోంది కానీ... తరచి చూస్తే ప్రధాన పోటీ బీజేపీ, ఎస్పీల కూటమి మధ్యే అన్నది అర్థమవుతుంది. నిర్బన్ ఇండియన్ సోషిత్ హమారా ఆమ్ దళ్ (నిషాద్), అప్నాదళ్ (సోనేలాల్)లతో బీజేపీ పొత్తు పెట్టుకోగా... ఆర్ఎల్డీ, ఎస్బీఎస్సీ, ఎన్సీపీ, ఆర్జేడీ, ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ (లోహియా)లతో కలిసి ఎస్పీ బరిలోకి దిగింది. బీఎస్పీ కూడా చిన్న, చితక పార్టీలతో కలిసి పోటీ చేస్తూండగా, కాంగ్రెస్ మాత్రం ఒంటరి పోటీకి సిద్ధమైంది. ఓటింగ్ మొదలు కాకముందు నిర్వహిం చిన అనేక ఓపీనియన్ పోల్స్ బీజేపీ 225–267 సీట్లతో విజయం సాధిస్తుందని అంచనా కట్టాయి. ఎస్పీ 111–160 స్థానాలతో రెండో స్థానానికి పరిమితమవుతుందనీ, బీఎస్పీ, కాంగ్రెస్ మూడు, నాలుగు స్థానాల్లో నిలుస్తాయనీ లెక్కకట్టాయి. అయితే చరిత్రను ఒకసారి పరి శీలిస్తే ఉత్తరప్రదేశ్‌లో ఒపీనియన్ పోల్స్ అంచనాలు ఫలించిన సందర్భాలు తక్కువే. 2007, 2012లలో ఒపీనియన్ పోల్స్ హంగ్ అసెంబ్లీని అంచనా వేయగా బీఎస్పీ, ఎస్పీలు స్పష్టమైన విజయం సాధించాయి. గత ఎన్నికల్లో మాత్రం బీజేపీ విజయాన్ని ఒపీనియన్ పోల్స్ కరెక్టుగానే అంచనా వేశాయి. కానీ మోదీ వేవ్‌ను మాత్రం స్పష్టంగా చూడలేకపోయాయి. మూడు వందలకు పైగా సీట్లు సాధి స్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. కుల, మత, కూటమి రాజకీయాలు... ఉత్తరప్రదేశ్‌లో ప్రతి రాజకీయ పార్టీ కూడా రాష్ట్రంలోని కుల, మత సమీకరణలు, భావసారూప్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసు కునే కూటమి మిత్రులను ఎంచుకుంటాయి. యూపీ ఓటర్లలో 41% మంది ఓబీసీలు, 21% మంది దళితులు ఉండగా... ముస్లింలు, అగ్ర వర్ణాల వారు 19% చొప్పున ఉన్నారు. ప్రాంతీయ పార్టీలు బలో పేతం కాకమునుపు వరకూ ఉత్తరప్రదేశ్‌లో అగ్రవర్ణాలు, దళిత, ముస్లిం వర్గాల సాయంతో కాంగ్రెస్ పెత్తనమే చలాయించింది. బీఎస్సీ, ఎస్పీల రాకతో ఈ కుల సమీకరణకు గండి పడింది. సరికొత్త రాజకీయ సమీకరణలు మొదలయ్యాయి. దళితుల్లో అధికులు బీఎస్పీ వైపు వెళ్లిపోగా, జనాభాలో తొమ్మిది శాతమున్న యాదవులు ఎస్పీకి ప్రధాన ఓట్‌బ్యాంక్‌గా మారారు. ముస్లింలలో అధికశాతం మంది ఎన్నికల వాతావరణానికి అనుగుణంగా బీఎస్పీ, ఎస్పీలకు మద్ద తిచ్చారు. గెలుపునకు కావాల్సిన సరైన కుల సమీకరణలు చేపట్టిన ప్రాంతీయ పార్టీలకు 2014 సాధారణ ఎన్నికలు గట్టి షాక్ ఇచ్చాయి. అగ్రవర్ణాలు, ఓబీసీల్లోని కొన్ని వర్గాలు, ఎస్సీలను కలుపుకొని బీజేపీ అత్యధిక శాతం లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. బీజేపీకి సంస్థా గతమైన బలం చేకూరడం, కులాల ఆధారంగా కూటములు ఏర్పాటు చేసుకోవడం, హిందుత్వ రాజకీయాలన్నీ కలిపి ఆ పార్టీకి 2017లో రికార్డు స్థాయిలో అసెంబ్లీ సీట్లు దక్కించాయి. రెండేళ్ల తరువాత జరి గిన సాధారణ ఎన్నికల్లోనూ బీజేపీ ఆధిపత్యం కొనసాగింది. ఈసారి ఎన్నికల్లోనూ బీజేపీ అగ్రవర్ణాలు, యాదవులు, జాటేతర దళితులను మినహాయించి ఓబీసీల్లోని కొన్ని ఉపకులాలను తనవైపు తిప్పుకుంది. హిందుత్వ వాదనతో ఈ ఎన్నికలను గెలుచుకునే ప్రయత్నం చేస్తోంది. ఎస్పీ కూడా యాదవుల పార్టీ అన్న ముద్రను తొలగించుకునేందుకు ఓబీసీల్లోని కొన్ని వర్గాలకు చెందిన పార్టీలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. కాషాయ పార్టీ పాలనలో బ్రాహ్మణ వర్గం ఒంటరి అయ్యిందన్న వాదనను తన విజయావకాశాలను మెరుగుపరచు కునేందుకు ఉపయోగిస్తోంది. ఆర్ఎల్డీతో పొత్తుతో పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో ఆధిపత్యం చలాయించే జాట్ల ఓట్లు తమకు దక్కుతాయని ఎస్పీ భావిస్తోంది. 2013 మతఘర్షణల తరువాత జాట్లు బీజేపీ వైపు మొగ్గిన విషయం తెలిసిందే. అయితే రైతు ఆందోళనల నేపథ్యంలో బీజేపీ–జాట్ల బంధం బలహీనమైందన్న వాదనలు ఉన్నాయి. రాజ ధాని ఢిల్లీకి సమీపంలోని 113 యూపీ అసెంబ్లీ స్థానాల్లో జాట్లు, ముస్లింలు తమ విజయానికి దోహద పడతారని ఎస్పీ భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ రాజకీయాలకు ప్రియాంక గాంధీ వాద్రా నేతృత్వం వహిస్తున్నారు. నలభై శాతం సీట్లు మహిళా అభ్యర్థులకు కేటాయించి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 70 ఏళ్ల రికార్డు బద్దలవుతుందా? ఈసారి ఉత్తరప్రదేశ్ ఓటర్లను ప్రభా వితం చేయగల అంశాల్లో పాలనకు సంబంధించినది ప్రధానమైంది కాగా... నేతృత్వం, ఎన్నికల మ్యాని ఫెస్టోలు తమ వంతు ప్రభావం చూపనున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగైందనీ, నేరాలు తగ్గాయనీ, మహిళలకు భద్రత లభిస్తోందనీ బీజేపీ ప్రచారం చేస్తోంది. మౌలిక సదుపాయాల వృద్ధి, సంక్షేమ కార్యక్రమాల తక్షణ అమలు, పెట్టుబడులు పెరగడం, కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టు పూర్తి కావడం తమకు విజయం తెచ్చి పెడతాయని బీజేపీ అంచనా. అయితే ఈ అంశాలతో ఏకీభవించని పార్టీలు దళితులు, మహిళలు, మైనారిటీలపై పెరుగుతున్న అత్యాచారాలను ఓటర్ల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. రెండో దశ కోవిడ్ నిర్వహణలో వైఫల్యం, నిరుద్యోగిత, ధరల పెరుగుదల, ఆర్థిక పరిస్థితులు, వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత వంటివి ప్రతిపక్షాల ఆయుధాలుగా మారాయి. ఉత్తరప్రదేశ్‌లో వరుసగా రెండుసార్లు గెలి చిన ముఖ్యమంత్రులు ఇప్పటివరకూ ఎవరూ లేరు. బీజేపీ సీఎం అభ్యర్థి యోగి ఆదిత్యనాథ్ ఈ రికార్డును బద్దలు కొట్టగలరా? చెప్ప లేము. ఎందుకంటే తమిళనాడు, కేరళల్లోనూ దశాబ్దాల పోకడలకు భిన్నమైన ఫలితాలు వచ్చాయి. కేంద్రంలో, రాష్ట్రంలోనూ బీజేపీ అధి కారంలో ఉండటం ఆ పార్టీకి కొంతవరకూ కలిసి రావచ్చు. బీజేపీ యేతల పార్టీలన్నింటినీ ఒక్క తాటిపైకి తీసుకురావడంలో ఎస్పీ తది తర పార్టీలు విఫలం కావడమూ కాషాయ పార్టీకి ప్రయోజనం చేకూర్చవచ్చు. ఎస్పీ, కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు అనేందుకు కారణాలు ఎన్నో ఉన్నాయి. మొట్టమొదటగా చెప్పుకోవాల్సింది బీజేపీ కుల సమీకరణలు, హిందుత్వ అజెండాకు సెంట్రల్, తూర్పు ఉత్తర ప్రదేశ్‌లో ఆదరణ తగ్గకపోవడం. పశ్చిమ యూపీలోనూ జాట్ల కోపాన్ని తగ్గించేందుకు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతో పాటు, ఇతర సమస్యలను ఇంటింటి ప్రచారం ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేసింది. గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా మోదీ ప్రభావం కొంత ఉండవచ్చు. పశ్చిమ యూపీలో ఎస్సీ తదితర పార్టీలు ఆశిస్తున్నట్లుగా జాట్– ముస్లిం ఓట్ల ఏకీకరణ ఎంతవరకూ జరుగుతుందన్నది ఇంకో ప్రశ్న. జాట్ల ప్రతినిధిగా నిలవాలని అను కుంటున్న ఆర్ఎల్డీ ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాల్సి ఉంది. మొత్తమ్మీద చూస్తే... ఈ సారి ఎన్నికల్లోనూ ఓటర్ల మద్దతు కాషాయ పార్టీ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్పీ గూండారాజ్‌ను అంతమొందించగలిగామన్న బీజేపీ వాదనకు ఓటర్లు జై కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూపీ ఎన్నికలు బీజేపీ పాలనకు ఒక రిఫరెండమ్ అనుకుంటే రెండు రకాల ఫలితాలు వచ్చే సంభావ్యత ఉంది. ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి పశ్చిమ యూపీలో అత్యధిక స్థానాలు గెలుచుకోవడమే నిజమైతే, బీజేపీ కూటమికి దక్కే సీట్ల సంఖ్య 250 కంటే దిగువకు చేరుతుంది. బీజేపీ ప్రభుత్వం చెప్పుకుంటున్న ‘ప్రగతి‘ని ఓటర్లు చూడగలిగి, ఎస్పీ– ఆర్ఎల్డీ కూటమి ఓటర్లను తమవైపు మళ్లించుకోవడంలో విఫలమైతే బీజేపీకి 250 కంటే ఎక్కువ సీట్లు కచ్చితంగా దక్కే అవకాశం ఉంది. అయితే యూపీ రాజకీయాలను కచ్చితంగా అంచనా వేయడం ఎప్పుడూ కత్తిమీద సామే. అందుకే ఈ సారి ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చినా రావచ్చు! వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు,సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, ఢిల్లీ -
మొదట రైతులం! తర్వాతే హిందువులం!!
ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ నేడు జరగనుంది. ఏడు విడతల ఎన్నికల్లో మొదట 58 స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో రైతు ఉద్యమం ప్రభావం కీలకం కానుంది. ఏడాదిపాటు సాగిన రైతు ఉద్యమం పశ్చిమ యూపీలోని అన్ని కులాల, మతాల రైతులను దగ్గర చేసింది. మొదట రైతులం, తర్వాతే ఇంకేదైనా అనేట్టుగా చేయగలిగింది. ఆర్థికంగా మెరుగవ్వడం అన్న ఒక్క ఆలోచన మీదే వారి ఐక్యత సాగుతోంది. మూడు సాగు చట్టాల రద్దు తర్వాత కూడా సంయుక్త కిసాన్ మోర్చా తన ఆందోళనను కొనసాగిస్తోంది. 23 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించాలన్నది వీరి డిమాండ్లలో ప్రధానమైనది. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూలంగా, ఎస్.పి–ఆర్.ఎల్.డి. పొత్తుకు అనుకూలంగా ఫలితాలు ఉండే అవకాశం ఉం ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల్లో రైతులు తమకు ఏ విధంగా ఓటు వేస్తారు? భారతీయ జనతాపార్టీని ప్రస్తుతం అమితంగా వ్యాకులతకు గురిచేస్తున్న అంతర్లోచన ఇది. సంకేతాలేమీ బాగోలేవు. తాజా బడ్జెట్ కూడా ఆ సంకేతాలను మెరుగుపరిచేదేమీ కాదు. రైతుల ఆగ్రహ జ్వాలలూ ఇప్పట్లో చల్లారేలా లేవు. దీర్ఘకాలంగా ఉన్న తమ డిమాండ్లను ఏ ఒక్కటీ నెరవేర్చకుండా నరేంద్ర మోదీ ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందనే విషయాన్ని ఎత్తిచూపేందుకు గానూ ఇటీవల వారు ‘విశ్వాస ఘాతుక దినం’ కూడా పాటించారు. బహుశా బీజేపీ ఇప్పుడు ఈ రెండు రాష్టాల్లో మరీ ఎక్కువ సీట్లు కోల్పోకూడదన్నంత వరకే తన ఆశను పరిమితం చేసుకుని ఉండాలి. రైతులు తీవ్ర నిరసనతో తిరస్కరించిన మూడు సాగు చట్టాలను రద్దు చేశాం కాబట్టి తమకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని ఆ పార్టీ నమ్మవచ్చు. కానీ ఆ లెక్క తప్పేలా ఉంది. సాగు చట్టాల రద్దు నిర్ణయాన్ని మోదీ కానుకగా ముద్రవేయడానికి బీజేపీ ప్రయత్నిం చింది. అయితే ఇందులో మోదీ తమకు చేసిందేమీ లేదని రైతులు బలంగా విశ్వసిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడి దీర్ఘకాల పోరాటంతో, ప్రాణత్యాగాలతో సాధించుకున్న ‘ట్రోఫీ’గా మాత్రమే ఈ రద్దును రైతులు పరిగణిస్తున్నారు. నలభైకి పైగా రైతు సంఘాల సమష్టి నాయకత్వంతో రైతుల ఉద్యమాన్ని నడిపించిన ‘సంయుక్త కిసాన్ మోర్చా’ (ఎస్కేయం) సాగు చట్టాల రద్దు తర్వాత కూడా నేటికింకా ఆందోళనను కొనసా గిస్తూనే ఉంది. 23 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించాలన్నది ఎస్కేయం డిమాండ్లలో ప్రధానమైనది. ‘ఏ పార్టీకైనా ఓటు వెయ్యండి కానీ, బీజేపీకి మాత్రం వేయకం’డని అది ప్రజలను కోరుతోంది. ఈ ఎన్నికల్లో మోదీ విజయం సాధిస్తే కనుక రద్దు చేసిన సాగు చట్టాలను వేరే రూపంలో తిరిగి పునరుద్ధరిస్తారన్న భయం రైతులలో స్పష్టంగా కనిపిస్తోంది. మోదీని వారు కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైన వ్యక్తిగా మాత్రమే చూడగలుగుతున్నారు. ఈ పరిస్థితి మోదీ, బీజేపీల స్వయంకృతమే. ఎండనక, వాననక, చలికి వణుకుతూ, కరోనా బారిన పడుతూ ఏడాది పాటు నిర్విరా మంగా రైతులు ఢిల్లీ శివారు వీధులలో సాగు చట్టాలకు నిరసనగా ఏకబిగిన ప్రదర్శనలు జరిపారు. వీధుల్లోనే వండుకున్నారు. ఆరోగ్యం బాగోలేనప్పుడు వీధుల్లోనే పడకేశారు. ఈ మహోద్యమ కాలంలో 700 మంది వరకు అనారోగ్యంతో, వాతావరణ అననుకూలతతో కన్ను మూశారు. వాళ్లను ఆందోళన జీవులనీ, అలవాటుగా ఆందోళన చేస్తు న్నవారనీ, వాళ్లది ధిక్కార ప్రదర్శన కనుక ఏ విధంగానూ పట్టించు కోనవసరం లేదనీ మోదీ విమర్శించారు. ఆ చేదు అలా రైతుల గుండెల్లో ఉండిపోయింది. జనవరి 5న పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ పర్యటనలో భద్రత లోపాలను చూపి ప్రధాని అర్ధంతరంగా వెనుదిరిగి వెళ్లిపోవడం కూడా పాలకులకు, రైతులకు మధ్య సంబంధాలను మరింతగా క్షీణింపజేసింది. గత అక్టోబరులో లఖింపూర్ ఖేరీ ప్రాంతంలోని టికూనియా వద్ద నిరసనకారులపైకి కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా తన వాహనాన్ని నడిపి నలుగురు రైతుల దుర్మరణానికి కారణం అవడం కూడా రైతుల ఆగ్రహానికి ఆజ్యం పోసింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ వేర్వేరు వ్యూహాలను అనుసరిస్తోంది. యూపీలో తనకు మాత్రమే ప్రత్యేకమనుకున్న హిందుత్వను అస్త్రంగా చేసుకుంది. ఎనిమిదేళ్ల క్రితం జాట్లకూ, ముస్లింలకూ మధ్య జరిగిన హింసాత్మక ఘటనల్ని తవ్వి బయటికి తీస్తోంది. నాటి మత కలహాలలో 60 మందికి పైగా మరణించారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. ఈ ఏడాది 29న హోంశాఖ మంత్రి అమిత్‌షా ముజఫర్‌నగర్‌లో జాట్లు ఉండే ప్రాంతాలలో ఇల్లిల్లూ తిరిగి... ‘ఆనాటి అల్లర్లను మీరు మర్చిపోయారా?’ అని జాట్ ఓటర్లను ప్రశ్నించి పాత గాయాలను గుర్తు చేశారు. దీనిని బట్టి ఓటర్లకు బీజేపీ ఏం చెప్పదలచుకుందో స్పష్టంగానే అర్థమౌతోంది. ‘మొదట మీరు హిందువులు. ఆ తర్వాతే రైతులు’ అని చెప్పడం ఆ పార్టీ ఉద్దేశం. ఆ మాటతో కొంతమంది జాట్ల పట్టును సాధించగలిగింది కానీ... ఉద్యమంలో ఉన్న జాట్ రైతులు మాత్రం... ‘మొదట మేము రైతులం. ఆ తర్వాతే జాట్లం’ అంటున్నారు. రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్.ఎల్.డి.) అధ్యక్షుడు జయంత్ చౌధురి మాటల్లో కూడా ఇదే అర్థం ధ్వనించింది. ఆర్.ఎల్.డి. రైతు ఉద్యమా నికి సంఘీభావం ప్రకటించడంతో పశ్చిమ యూపీలోని జాట్లు జయంత్ చౌధురితో ఉన్నారు. ఆయన పార్టీకి సమాజ్‌వాది పార్టీతో పొత్తు ఉంది. ఆ పొత్తును రద్దు చేసుకుని తమతో చేయి కలపమని బీజేపీ కోరినప్పుడు జాట్లను తను జాట్లుగా కాక రైతులుగా మాత్రమే చూస్తున్నానని జయంత్ చౌధురి అన్నారు. ఢిల్లీలో జనవరి 26న అమిత్ షా కొంతమంది జాట్ నాయకులతో సమావేశ మైనప్పుడు బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జయంత్ చౌధురిని మా ఇంటికి రమ్మని ఆహ్వానించాం. కానీ ఆయన తగని ఇంటిని ఎంచుకున్నారు. అయితే ఆయన కోసం మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయి’’ అని అన్నారు. చౌధురి అందుకు స్పందిస్తూ.. ‘‘నన్ను మీ ఇంటికి రమ్మని అడగటం కాదు... మీరు కూల్చేసిన 700 మందికి పైగా రైతుల కుటుంబాల వాళ్లను రమ్మని ఆహ్వానించండి’’ అని ట్వీట్ చేశారు. పశ్చిమ యూపీలో బీజేపీపై అసంతృప్తి, ఆగ్రహం ఉన్న జాట్ కులస్థులు, ఇతర కులాల్లోని రైతులు చౌధురికి మద్దతుగా ఉన్నారు. ‘మొదట రైతులం, తర్వాతే హిందువులం’ అని ఇప్పుడు చెబుతున్న వీళ్లంతా 2014, 2017, 2019 ఎన్నికల్లో ‘మొదట హిందువులం, తర్వాతే రైతులం’ అని బీజేపీకి ఓటు వేసినవారే. కానీ 2022లో మత విశ్వాసాలకన్నా, ఆర్థిక అవసరాలే ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ కారణంతోనే ముస్లిం రైతులు కూడా రాష్ట్రీయ లోక్ దళ్‌కు మద్దతు ఇస్తున్నారు. ఏడాదిపాటు సాగిన రైతు ఉద్యమం పశ్చిమ యూపీలోని హిందూ, ముస్లిం రైతులను దగ్గర చేసింది. ముజఫర్‌నగర్‌లో ఇటీవల సంయుక్త కిసాన్ మోర్చా నిర్వహించిన మహాపంచాయత్‌కు రెండు మతాల రైతులూ హాజరయ్యారు. ‘హర హర మహాదేవ్’, ‘అల్లాహో అక్బర్’ అనే నినాదాలతో మతసామరస్యం మిన్నంటింది. రైతు ఉద్యమంలో హిందూ, ముస్లింలు కలిసికట్టుగా పాల్గొనడం 2013 నాటి గాయాల్ని మాన్పగలిగింది. ఇప్పుడు వాళ్ల ఆలోచన ఒక్కటే. ఆర్థికంగా మెరుగవ్వాలి. ఈ ఆలోచనే తాజా ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూలంగా, ఎస్.పి–ఆర్.ఎల్.డి. పొత్తుకు అనుకూలంగా ఫలితా లను ఇవ్వబోతోంది. రైతుల ఆర్థిక ఇబ్బందులు హిందువుల మత విశ్వాసాలను కూడా రెండోస్థానంలోకి తీసుకెళ్లాయి. హిందువులు గోవును మాతగా పూజిస్తారని అంటూ యోగి ప్రభుత్వం గోవిక్రయా లను, గోవధను నిషేధించింది. అయితే రాష్ట్రంలోని రైతులు, వాళ్లలో హిందువులు అయినవాళ్లు కూడా పోషణ లేక ఆకలితో అలమటిస్తున్న ఆవులు, ఎద్దులు తమ పంటలను తినేస్తుండటంలో ప్రభుత్వ నిషేధ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. రైతు ఉద్యమంలో భాగస్వాములైన రైతు సంఘాలలో కొన్ని రాజకీయ పార్టీలుగా ఏర్పడి ఎన్నికల్లో తలపడుతుండటం వెనుక ఉన్నవి కేవలం రైతు ప్రయోజనాలే తప్ప వేరొకటి కాదు. పంజాబ్‌లో బీజేపీ ఎప్పటిలాగే ఎన్నికల్లో హిందూవాదాన్ని కాకుండా, జాతీయ వాదాన్ని ప్రయోగిస్తోంది. అయితే ఆ ప్రయత్నం ఫలించకపోవచ్చు. ఈసారి పంజాబ్ ఎన్నికలు రైతుల చుట్టూనే తిరుగుతాయి తప్ప జాతీయ భద్రత అనేది ఒక విషయమే కాదు. అందుకే బీజేపీతో తన రెండు దశాబ్దాల పొత్తును కూడా శిరోమణి అకాలీ దళ్ తెంపేసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి ఉన్న మద్దతు తగ్గిపోవడమే అందుకు కారణం. – అరుణ్ సిన్హా జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు -
తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్..
తొలిసారిగా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెరంగేట్రం చేస్తున్న సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ బలమైన స్థానం నుంచే పోటీ చేయనున్నారు. ఈ మేరకు అఖిలేశ్ యాదవ్ వచ్చే నెలలో ఎన్నికలలో మైన్‌పురి జిల్లాలోని కర్హాల్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం పార్టీ వర్గాల అందించిన ఈ సమాచారాన్ని అతని మామ రాజ్యసభ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ఈ రోజు అధికారికంగా ధృవీకరించారు. అంతేకాదు ఆయన మేనల్లుడు మెజార్టీ ఓట్లతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. అయితే 1993 నుంచి కర్హాల్ వాసులు ప్రతి ఎన్నికలలో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థికి ఓటు వేశారు. కానీ బీజేపి 2002 ఎన్నికలలో ఆ స్థానాన్ని గెలిచినప్పటికీ, 2007లో మళ్లీ సమాజ్‌వాదీ పార్టీ కర్హాల్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంది. ప్రస్తుతం కర్హాల్ సోబరన్ యాదవ్ ఆధ్వర్యంలో ఉంది. అంతేకాదు అఖిలేశ్ తండ్రి సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికైన ఐదు అసెంబ్లీ స్థానాల్లో మైన్‌పురి లోక్‌సభ సీటు ఒకటి కావడం విశేషం. పైగా యూదవ్ స్వగ్రామమైన సైఫాయ్కి 5 కి.మీ దూరంలోనే కర్హాల్ ఉంది. అధికార పార్టీని గద్దె దింపేందకు ప్రాంతీయ పార్టీల కూటమికి నాయకత్వం వహిస్తున్న అఖిలేశ్ యాదవ్ తొలిసారిగా రాష్ట్ర ఎన్నికల్లో తెరంగేట్రం చేస్తున్నారు. అయితే ఆయన గతేడాది నవంబర్ నెలలో అసెంబ్లీ స్థానంలో పోటీ చేయనని చెప్పారు. కాగా, బీజేపీ యోగి ఆదిత్యనాథ్‌ను గోరఖ్‌పూర్ నుంచి పోటీకి దిగనుండటంతో అఖిలేశ్ యాదవ్ సైతం ఒత్తిడిని అధిగమించేందుకు పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. అయితే అఖిలేశ్ ప్రస్తుతం యూపీలోని అజంగఢ్ నుండి లోక్‌సభ ఎంపీగా ఉన్నా సంగతి తెలిసిందే. కాగా, అఖిలేశ్ యాదవ్ ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2012లో ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఎంఎల్సీ హోదాలోనే ఆయన ముఖ్యమంత్రిగా సేవలందించారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగలేదు. అలాగే ఆదిత్యనాథ్ కూడా బలమైన స్థానం నుంచే పోటీచేస్తున్నారు. గోరఖ్‌పూర్ నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచిన యోగి.. ఆ నియోజకవర్గంలో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారు. (చదవండి: యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు?... క్లూ ఇచ్చిన ప్రియాంక!) కాంగ్రెస్ సీఎం అభ్యర్థిత్వంపై ప్రియాంక క్లారిటీ.. ‘అసలేం జరిగిందంటే’ -
గుట్టల్లా నోట్ల కట్టలు.. రూ.150 కోట్లకు పైనే, షాక్‌లో అధికారులు.. ఫోటోలు వైరల్!
లక్నో: పన్ను ఎగవేత ఆరోపణలపై సుగంధ ద్రవ్యాల వ్యాపారి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీలు చేస్తుండగా సంచుల కొద్ది నోట్ల కట్టలు గుట్లల్లా కనిపించడంతో అధికారులు షాకయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ జనరల్ బృందం గురువారం ఉదయం పెర్ఫ్యూమ్ వ్యాపారి పియూష్ జైన్ ఇల్లు, ఫ్యాక్టరీ, కార్యాలయం, కోల్డ్ స్టోరేజీ, పెట్రోల్ బంకలపై దాడులు నిర్వహించారు. ఈ తనిఖీలు ఏకకాలంలో.. కాన్పూర్, కన్నౌజ్, గుజరాత్, ముంబైలో ఉన్న సంస్థలలో జరిగాయి. వ్యాపారి ఇంట్లో తనిఖీలు చేస్తుండగా అధికారుల కళ్లు బైర్లు కమ్మేలా నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. దీంతో వెంటనే బ్యాంక్ అధికారులను పిలిపించి నోట్లను లెక్కించడం ప్రారంభించారు. శుక్రవారం ఉదయం వరకు లెక్కించగా.. నగదు, పత్రాలతో కలిపి 150 కోట్ల రూపాయల పన్ను ఎగవేతలకు సంబంధించి ఆధారాలు లభించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పీయూష్ జైన్ ఎస్పీ నేతకు సన్నిహితుడు కూడా. కొన్ని రోజుల క్రితమే సమాజ్ వాదీ పేరుతో పెర్ఫ్యూమ్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సంస్థకు ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. కన్నౌజ్‌లో ఉన్న ఫ్యాక్టరీ నుంచి పెర్ఫ్యూమ్ ముంబైకి వెళ్తుందని అక్కడి నుంచి పెర్ఫ్యూమ్ దేశ విదేశాల్లో కూడా అమ్ముడవుతోందని తెలిపారు. సౌదీ అరేబియాలో రెండు, దేశంలోని తూర్పు రాష్ట్రాల్లో రెండు సహా పీయూష్ జైన్‌కు దాదాపు 40 కంపెనీలు ఉన్నాయని తెలిపారు. समाजवादियों का नारा है जनता का पैसा हमारा है! समाजवादी पार्टी के कार्यालय में समाजवादी इत्र लॉन्च करने वाले पीयूष जैन के यहाँ GST के छापे में बरामद 100+ करोड़ कौन से समाजवाद की काली कमाई है? pic.twitter.com/EEp7H5IHmt— Sambit Patra (@sambitswaraj) December 24, 2021 చదవండి: Aaditya Thackeray: సీఎం కొడుకు ఆదిత్య ఠాక్రేకు బెదిరింపులు.. -
Lakhimpur Kheri Violence: నకిలీ బాబా పాలన అంతం కానుంది
లక్నో: లాఖీమ్‌పూర్ ఖేరీ ఘటనపై మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ బీజేపీపై తీవ్రసస్థాయిలో మండిపడ్డారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని వారిపాలన త్వరలో అంతం కానుందని అన్నారు. లాఖీమ్‌పూర్ ఖేరీలో బీజేపీ కార్యకర్తలు వాహనాలతో రైతుల మీది నుంచి దూసుకువెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల ధరలు పెంచి రైతులను ఇబ్బంది పెడుతున్న నకిలీ బాబా త్వరలో అధికారం కోల్పొతాడని పరోక్షంగా సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, వారి పాలనలో అవినీతి పెరిగిందని మండిపడ్డారు. శాంతి భద్రతలను గాలికి వదిలేశారని, దీంతో నేరాలు పెరుగుతున్నాయని దుయ్యబట్టారు. 2022లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ.. పలు చిన్న పార్టీలతో కలిసి బరిలోకి దిగనుందని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. -
తాలిబన్లది స్వాతంత్య్ర పోరాటం.. ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
సంభాల్/లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఒకరు తాలిబన్లకు అనుకూలంగా మాట్లాడడం వివాదాస్పదంగా మారింది. ఆయనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంభాల్ నియోజకర్గ ఎంపీ షఫీక్ ఉర్ రెహ్మాన్ బర్ఖ్ తాజాగా అఫ్గాన్ పరిణామాలపై తాజాగా మీడియాతో మాట్లాడారు. అఫ్గాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడాన్ని భారత స్వాతంత్య్ర పోరాటంతో పోల్చారు. భారతీయుల పోరాటం, తాలిబన్ల పోరాటం దాదాపు సమానమేనని అన్నారు. తాలిబన్లది ఒకరకంగా స్వాతంత్య్ర పోరాటమేనని చెప్పారు. తమ దేశానికి స్వేచ్ఛ కావాలని తాలిబన్లు కోరుకున్నారని, అనుకున్నది సాధించారని చెప్పారు. అయినా అదంతా అఫ్గానిస్తాన్ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు. సమాజ్‌వాదీ ఎంపీ షఫీక్ ఉర్ వ్యాఖ్యలను సీఎం యోగి ఆదిత్యనాథ్ తప్పుపట్టారు. ప్రతిపక్ష ఎంపీ సిగ్గులేకుండా తాలిబన్లను సమర్థిస్తున్నారని విమర్శించారు. తాలిబన్లను సమర్థించడం అంటే వారి రాక్షసకాండను సైతం సమర్థించినట్లేనని అన్నారు. మానవత్వానికి మచ్చగా మారిన వారికి మద్దతుగా మాట్లాడుతున్నారంటే అసలు మనం ఎక్కడి వెళ్తున్నట్లు? అని ఆవేదన వ్యక్తం చేశారు. -
యూపీ మాజీ సీఎంపై కేసు నమోదు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జర్నలిస్టులపై దాడి చేశారనే ఆరోపణలతో మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, 20 మంది సమాజ్‌వాది పార్టీ కార్యకర్తలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అఖిలేష్ యాదవ్ సమక్షంలో పార్టీ కార్యకర్తలు జర్నలిస్టులపై దాడికి పాల్పడ్డారు. సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడి భద్రతా సిబ్బంది జర్నలిస్టులను నెట్టివేయడంతో వారికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఇరు వర్గాలవారు వేరువేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారని యూపీ శాంతి భద్రతల ఏడీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. వారి ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ఘటనను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మీడియా సలహాదారు షలాబ్‌మణి త్రిపాఠి తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టులు ప్రశ్నలు అడుగుతున్నారని సమాజ్ వాది పార్టీ కార్యకర్తలు వీధిరౌడీల మాదిరిగా జర్నలిస్టులపై దారుణంగా దాడి చేశారని ఆరోపించారు. అదే విధంగా ఈ ఘటనపై కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ స్పందిస్తూ.. భారతదేశ ప్రజాస్వామ్యానికి భావప్రకటనా స్వేచ్ఛ ప్రధానమైందని గుర్తుచేశారు. జర్నలిస్టులపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు ట్విటర్లో పేర్కొన్నారు. (చదవండి:ట్రాక్టర్ ర్యాలీకి డీజిల్ నిషేధం బీజేపీ కుట్ర: అఖిలేష్ యాదవ్) -
కరోనాతో ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి మృతి
సాక్షి, లక్నో : కరోనా సామాన్యుల నుంచి రాజకీయనేతల వరకు అందరినీ కబలిస్తుంది. తాజాగా ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఘూరా రామ్ గురువారం కరోనా వైరస్ కారణంగా మరణించారు. దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో రెండు రోజుల క్రితం ఆయన్ని లక్నోలోని కింగ్ జార్జ్ హాస్పిటల్లో చేర్పించినట్లు ఆయన కుమారుడు సంతోష్ కుమార్ వెల్లడించారు. పరీక్షలు నిర్వహించగా ఘూరా రామ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రత్యేక వైద్య సిబ్బంది ఆయనకు చికిత్స అందించగా, అప్పటికే ఆరోగ్యం విషమించడంతో కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్‌కు ఘూరా రామ్ ఎంతో విశ్వాసపాత్రుడిగా కొనసాగారు. ఘూరా రామ్ 1993, 2002, 2007 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా, మాయావతి ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవల సమాజ్‌వాదీ పార్టీలో చేరిన ఆయన జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. (క్షీణించిన మధ్యప్రదేశ్ గవర్నర్ ఆరోగ్యం) -
కరోనాతో కేంద్ర మాజీ మంత్రి కుమారుడు మృతి
లక్నో : ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తూనే ఉంది. కరోనాకు సామాన్యులు, ప్రముఖులు అన్న తేడా లేదు. ఇప్పటికే ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి బేణి ప్రసాద్ వర్మ కుమారుడు దినేష్ వర్మ (40) మంగళవారం కరోనా కారణంగా మరణించాడు. స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్లో ప్రభుత్వ ఉద్యోగి అయిన దినేష వర్మకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. లక్నో నగరానికి చెందిన దినేష్‌కు కొద్ది రోజుల క్రితమే కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. అయితే గతంలోనూ దినేష్ వర్మకు కిడ్నీ సంబంధిత సమస్యలున్నట్లు సమాచారం. 2007లో దినేష్ మూత్రపిండ మార్పిడి చేయుంచుకున్నాడని అప్పటినుంచి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆయన స్నేహితుడు వెల్లడించారు. (మార్నింగ్ వాక్కు వెళ్లిన బీజేపీ అధ్యక్షుడిపై దాడి ) కాగా సమాజ్ వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడైన బేణిప్రసాద్ వర్మ కాంగ్రెస్ హయాంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా పనిచేశారు. అనారోగ్య సమస్యలతో ఈ ఏడాది మార్చి 27న మరణించారు. నెలల వ్యవధిలోనే ఇప్పుడు కూమారుడు కూడా చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాజ్ వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు బేణిప్రసాద్ వర్మకు ములాయం సింగ్‌తో ఎంతో సాన్నిహిత్యం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ దినేష్ వర్మ కుటుంబానికి సంతాపం తెలిపారు. (కరోనా ఔషధం : పతంజలి కొత్త ట్విస్టు ) -
నేర రాజకీయాల పర్యవసానం!
హిందీ ప్రాబల్యప్రాంతంలో ముగ్గురు ప్రత్యేక నేతలు కులదీప్ సింగ్ సెంగార్, సంజయ్ సింహ్, సాక్షి మహరాజ్ సింగ్. వక్రమార్గం పట్టిన భారత రాజకీయాలకు వీరు సమకాలీన ప్రతీకలు. రాజకీయ ఫిరాయింపులు, నేరమయ రాజకీయాలు, అవినీతి, హత్యలు, అత్యాచారాలు, దోపిడి, వంచన వంటి సమస్త అనైతిక చర్యల కలబోత వీరు. ఈ లక్షణాలను కలిగి ఉంటూనే గత మూడు దశాబ్దాలుగా వారు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో వెలుగొందుతున్నారు. భారత రాజకీయాల గురించి వీరు మనకు చెబుతున్నదేమిటి? మొదటిది ఏమిటంటే గెలుపుతత్వం ఒక్కటే రాజకీయ నీతిగా మారి పార్టీలు దాన్ని మాత్రమే చూస్తున్నాయి. నేరతత్వం, లెక్కలేనన్ని అత్యాచారాలకు పాల్పడటం అనేవి ఎవరూ లెక్కించలేదు. హిందీ ప్రాబల్య ప్రాంతంలో గెలుపుతత్వానికి సంబంధించిన లక్షణాలు... కులం, స్థానిక ఓటు.. ఇవి ఉంటే ఏమైనా చేయవచ్చు. కులదీప్ సింగ్ సెంగార్, సంజయ్ సింహ్, సాక్షి మహరాజ్ సింగ్ అనే ఈ ముగ్గురి బాగోతాలను కాస్త పరిశీలించండి. వర్తమాన రాజకీయాలు, పోలీసింగ్, న్యాయవ్యవస్థ, బీజేపీ తీరుతెన్నులను అచ్చుగుద్దినట్లు వెల్లడించే గాథలు వీరి సొంతం మరి. ఈ ముగ్గురు ఫిరాయింపుదార్లే ఇవాళ మన రాజకీయసంబంధిత ప్రధాన శీర్షికలలో వెలిగిపోతున్నారు. వీరిలో మొదటివారు, అపఖ్యాతిని మూట గట్టుకున్నవారు అయిన కులదీప్ సింగ్ సెంగార్ ఉన్నావ్ అత్యాచార–హత్యా కేసుల్లో మునిగితేలుతున్నారు. ఇక రెండోవారు అమేథీ మాజీ రాజా, ఎంపీ, మాజీ మంత్రి సంజయ్ సింహ్. మునిగిపోతున్న కాంగ్రెస్ నావ నుంచి ఫిరాయించి బీజేపీలోకి గెంతేశారు. మూడవవారు సాక్షి మహరాజ్. పార్లమెంటరీ ఎన్నికలల్లో ఉన్నావ్ నియోజకవర్గ ఎంపీగా గెలిచారు. ఈయన రాజీకయంగాను, నేరపూరితంగానూ ఇటీవలి కాలంలో పెద్దగా తప్పు చేసిందేమీ లేదు. అడపాదడపా చేసే కువ్యాఖ్యలు, అప్రతిష్టాకరమైన మాటలకు మాత్రమే తనది బాధ్యత. లోక్‌సభ ఎన్నికల్లో తనకు పూర్తి మద్దతునిచ్చినందుకుగానూ జైలుకెళ్లి మరీ సెంగార్‌కి కృతజ్ఞతలు చెప్పివచ్చిన పెద్దమనిషి ఇతడు. ముగ్గురు నేతలూ తమ బాధ్యతలను పూర్తిగా విస్మరించారనే చెప్పాలి. వీరిపై పూర్తిగా లేక పాక్షికంగా పరిష్కృతం కాని హత్యానేరాలు ఆరు ఉన్నాయి. లేక హత్యా నేరారోపణల్లో వీరికి పాత్ర ఉంది. వీరు చేసిన హత్యల్లాగే మరో మూడు అత్యాచార కేసులు కూడా ఇంకా కొలిక్కి రాలేదు. పైగా ఈ ముగ్గురికీ ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంటోంది. తమ సొంత కులానికి చెందిన ఓట్లు వీరు గుప్పిట్లోనే ఉంటున్నాయి. పైగా డబ్బు ఆశ చూపి ఓట్లు రాబట్టడం కూడా తెలుసు. చట్టాన్ని ఎలా ఎదుర్కోవాలో వారికి కొట్టినపిండి. అన్ని రాజకీయ పార్టీలు తమనే కోరుకునే ప్రత్యేక గుణాలు వీరి సొంతం. యోగ్యత, నిజాయతీ, నైతికత ఇవి లేకున్నా గెలుపు సాధించడం కూడా వీరికి తెలిసిన విద్యే. ఎట్టకేలకు ఈ ముగ్గురూ బీజేపీలో కలిసిపోయారు. 48 గంటలకు ముందుగా సెంగార్‌పై బీజేపీ బహిష్కరణ వేటు వేసింది. నేరస్తుడిగా, డాన్‌గా లేక బాహుబలిగా (హిందీ ప్రాబల్య ప్రాంతంలో ఇతడిని ఇదే పేరుతో పిలుస్తారు) ఇతడి జీవితం నేరపూరితమైందని మనకు స్థిరమైన అభిప్రాయం ఉంది. అందుకనే వైవిధ్యపూరితమైన, వర్ణరంజితంతో కూడిన అతడి జనరంజక ప్రజా జీవితం గురించి, మనం నిర్లక్ష్యం వహిస్తున్నాం. 2002లో స్థానిక దాదాగా ఉన్న ఇతడు తొలిసారిగా బీఎస్పీ తరపున నిలిచి ఉన్నావ్ నుంచి గెలుపొందారు. అతడు మొదట్లో సమాజ్‌వాదీ పార్టీలోకి ఫిరాయించాడు. 2007, 2012లో బంగేర్‌మావు, భాగవత్ నగర్ నియోజకవర్గాలనుంచి గెలుపొందారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రత్యేకించి యాదవులు, రాజపుత్రులకు చెందిన మాఫియా నేరస్తులను సమాజ్‌వాది పార్టీ పెంచి పోషించేదని అందరూ అంగీకరిస్తారు. అయితే 2017లో మారుతున్న పరిణామాలను గమనించి బీజేపీలోకి చెక్కేసి అక్కడా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే సంవత్సరం అంటే బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన మూడునెలలకు ఆ దురదృష్టపు అమ్మాయి ఉద్యోగం కోసం సహాయం చేయమంటూ అతడి వద్దకు వచ్చినప్పుడు అతడు తనపై అత్యాచారం సల్పాడని ఆరోపిం చింది. ఆ తర్వాత తన కన్నీళ్లు తుడిచి, సహాయం చేస్తానని, ఉద్యోగం వెదికి పెడతానని మాట ఇచ్చాడని పేర్కొంది. ఇక సంజయ్ సింగ్ విషయానికి వస్తే చాలా పార్టీలు మారాడు. బాగా పేరొందిన ఒక హత్య కేసులో అతడికి సంబంధముందని ఆరోపణలు వచ్చాయి. తర్వాత అవి వీగిపోయాయనుకోండి. జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్ సయ్యద్ మోదీని 1988 జూలై 28న సుఫారీ ఇచ్చి మరీ చంపించిన ఘటనలో సంజయ్ ప్రధాన అనుమానితుడు. అయితే దీనికి సాక్ష్యాధారాలు కనుగొనడంలో యూపీ పోలీసు శాఖ, సీబీఐ రెండూ విఫలమైనందున కేసు వీగిపోయింది. నేరం రుజువయ్యేం తవరకు నిందితుడు అమాయకుడేనని మనం అంగీకరిస్తాం కదా. తుపాకులతో కాల్చడం వాస్తవం, హత్య జరగడం వాస్తవం కానీ ఎవరు ఆ పనికి ప్రేరేపించారో తెలీదు. కనుగొనలేదు. ఆ కేసులో ఒక హంతకుడికి శిక్షపడింది. మరొకరు విచారణ సమయంలోనే చనిపోయాడు. హత్య జరిగిన కొంతకాలానికే సయ్యద్ మోదీ భార్య అమీతా మోదీని సంజయ్ సింగ్ పెళ్లాడాడు. ఈ హత్యకేసు విచారణను సీబీఐకి అప్పగించిన సమయంలోనే వీపీసింగ్ కాంగ్రెస్‌కి ఎదురుతిరిగి తానే ప్రధానమంత్రి అయ్యారు. సంజయ్ సింగ్‌కు వీపీసింగ్ దూరపు బంధువు కావడంతో సంజయ్ కూడా కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి తన మామయ్య చెంత చేరాడు. సరిగ్గా దశాబ్దం తర్వాత ఇతడు బీజేపీలోకి మారాడు. 1988లో అమేధీనుంచి గెలిచి కాంగ్రెస్ నేత సతీష్ శర్మను ఓడించాడు. కానీ వాజ్‌పేయి ప్రభుత్వం లోక్‌సభలో ఒక ఓటు తేడాతో ప్రభుత్వాన్ని కోల్పోయింది. తర్వాత 1999 ఎన్నికల్లో సంజయ్ సింగ్ ఒకప్పటి తన స్నేహితుడు, బోధకుడు అయిన రాజీవ్ గాంధీ సతీమణి సోనియాపైనే రాయ్‌బరేలీలో బీజేపీ తరపున పోటీ చేశాడు. ఎందుకైనా మంచిదని సోనియా దక్షిణాదిలో బళ్లారి నుంచి కూడా పోటీకి తలపడ్డారు. ఆ నేపథ్యంలో సంజయ్ సింగ్‌ను చూసి భీతిల్లిన సోనియా బళ్లారికి పారిపోయిందంటూ నినాదం పుట్టుకొచ్చింది. కానీ సోనియా రెండు చోట్లా గెలిచారు. అయితే గాలి మళ్లీ కాంగ్రెస్ వైపు తిరుగుతుందని గ్రహించగానే సంజయ్ సింగ్ 2003లో మళ్లీ కాంగ్రెస్‌లోకి దూకాడు. 2009లో రాయ్ బరేలీ, అమేధీ పక్కన ఉండే సుల్తాన్పూర్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచాడు. అయిదేళ్లు గడిచాక 2014లో యూపీలో కాంగ్రెస్ ఊచకోతకు గురయ్యాక అసోం నుంచి కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ నామినేషన్ గెల్చుకున్నాడు. ఇక 2019లో ఈ టర్మ్ కూడా ముగిశాక, గాంధీ కుటుంబం పని పూర్తయ్యాక, మళ్లీ బీజేపీలో కొత్త మామయ్యలను వెదికి పట్టి దూరిపోయాడు. ఇక సాక్షి మహరాజ్. బీజేపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ కులానికి చెందిన వెనుకబడిన లోధ్ కమ్యూనిటీలో స్టార్‌లాగా ఎదిగివచ్చాడు. 1991, 96 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరపున గెలిచాడు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో నిందితుడైన సాక్షి మహరాజ్ సైద్ధాంతిక పవిత్రత ఉన్నవాడిగా కనిపిస్తాడు. కానీ అతని నిబద్ధత బీజేపీనుంచి మళ్లీ టికెట్ సాధించలేకపోయింది. తనకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి బీజేపీ పేదల వ్యతిరేక పార్టీగా మారిపోయిందని ఆరోపిస్తూ సమాజ్‌వాదీ పార్టీలోకి చెక్కేశాడు. అసలు కారణం ఏమిటంటే నాటి ప్రధాని వాజ్‌పేయి సన్నిహితుడైన బ్రహ్మదత్ ద్వివేదీ హత్య కేసులో సాక్షి ఒక నిందితుడు. 2000 సంవత్సరంలో ములాయం సింగ్ యాదవ్ అతడిని రాజ్యసభకు పంపారు. ఈ క్రమంలో తనపై పాత హత్యా కేసు వీగిపోయింది. అయితే తర్వాత కూడా అలాంటి నేర చర్యలనుంచి పక్కకు తప్పుకోలేదు. తన తోటి మేనల్లుళ్లతో కలిసి ఒక కాలేజీ ప్రిన్సిపాల్‌పై సామూహిక అత్యాచారం జరిపిన కేసులో బుక్కయ్యాడు. 2002 నాటికి సమాజ్ వాదీ పార్టీ రంగు వెలిసిపోతోందని గ్రహించాక ములాయంపైనే బోలెడు ఆరోపణలు గుప్పించి బీజేపీ తిరుగుబాటు నేత కల్యాణ్ సింగ్ స్థాపిం చిన రాష్ట్రీయ క్రాంతి పార్టీలో చేరిపోయాడు. ఇది లోధీల పార్టీ అని చెప్పనక్కరలేదు. తర్వాత కూడా సాక్షి హవా కొనసాగింది. ఒక నకిలీ ఎన్జీవో సంస్థను స్థాపించి అక్రమంగా రూ.25 లక్షలను వసూలు చేసిన కేసులో నాటి ప్రభుత్వం సాక్షిపై ఆరోపణలు చేసింది. ఇతడితోబాటు తన అనుయాయి అయిన సుజాత వర్మను కూడా ఈ కేసులో నిందితులుగా ఆరోపించారు. 2012లో సాక్షి మహారాజ్ మళ్లీ బీజేపీలో చేరాడు. కొద్దికాలం లోపే సుజాత వర్మ హత్యకు గురయ్యారు. సాక్షి అనుయాయులే హంతకులుగా ఆరోపణలకు గురయ్యారు. ఈ కేసులో సాక్షి మహరాజ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తర్వాత లొంగిపోయి బెయిల్‌పై బయటకు వచ్చాడు. తనపై ఎఫ్ఐఆర్ని కొట్టివేయాలని అలహాబాద్ హైకోర్టులో ఇతడు వేసిన పిటిషన్‌ని కోర్టు కొట్టివేసింది. ఆ తర్వాతి సంవత్సరం బీజేపీ నుంచి లోక్‌సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశాడు. అలా అతడి గౌరవాన్ని మళ్లీ నిలబెట్టారు. ఇంతటి నేరమయ కెరీర్ కలిగిన సాక్షి మహరాజ్‌ని సీతాపూర్ జైలుకెళ్లి తన గెలుపుకు దోహదం చేసిన కులదీప్ సింగ్ సెంగార్‌కు ధన్యవాదాలు చెప్పాడంటూ మనం అమాయకంగా ఆరోపిస్తున్నాం మరి. భారత రాజకీయాల గురించి వీరు మనకు చెబుతున్నదేమిటి? గెలుపుతత్వం ఒక్కటే రాజ కీయ నీతిగా మారి పార్టీలు దాన్ని మాత్రమే చూస్తున్నాయి. నేరతత్వం, లెక్కలేనన్ని అత్యాచారాలకు పాల్పడటం అనేవి ఎవరూ లెక్కించలేదు. హిందీ ప్రాబల్య ప్రాంతంలో గెలుపుతత్వానికి సంబంధించిన లక్షణాలు ఏమిటి? స్థానిక వోటు బ్యాంకును నిర్మించుకోవడం. దానికి కులం, మాఫియా ప్రాతిపదిక కావటం. రెండూ కలిసివుంటే మరీ మంచిది. అప్పుడే మీరు గెలిచే వ్యక్తి కాగలరు. లేదా ఇతరుల గెలుపుకు, ఓటమికి ముఖ్య పాత్ర కాగలరు. అప్పుడు అన్ని పార్టీలు మీకోసం క్యూ కడతాయి. వాటిలో గెలిచే పక్షమేదో మీరు సంతోషంగా ఎంచుకోవచ్చు. ఈ క్రమంలో మీరు ఏమైనా చేయవచ్చు. హత్య, అత్యాచారం, దోపిడీ, దొమ్మీ, మోసం, దురాక్రమణ దేనికైనా మీరు పాల్పడవచ్చు. చిన్నస్థాయినుంచి వచ్చిన ఒక టీనేజ్ బాలిక వెంటిలేటర్ గుండా శ్వాస పీల్చుకుంటున్న స్థితిలో, ఆమె తండ్రితోపాటు కుటుంబంలోని చాలామంది హత్యకు గురైన స్థితిలో మీ ప్రాభవం మొత్తం క్షణాల్లో కరిగిపోవచ్చు. ఉన్నావ్ ఘటన రగిలించిన న్యాయం ఇదే మరి. వ్యాసకర్త :శేఖర్ గుప్తా,ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్, twitter@shekargupta -
‘ఖురాన్లో ఏముంటే దానికే మా పార్టీ మద్ధతు’
న్యూఢిల్లీ: ముస్లింల పవిత్ర గ్రంధం ‘ఖురాన్’లో ఏం రాసి ఉందో దానికే మా పార్టీ మద్ధతిస్తుందని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజం ఖాన్ వ్యాఖ్యానించారు. ఎన్డీఏ ప్రభుత్వం శుక్రవారం త్రిపుల్ తలాక్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడంతో ఈ విషయంపై ఆజంఖాన్ ఢిల్లీలో స్పందించారు. ‘ 1500 సంవత్సరాల క్రితమే ఏ మతంలో లేని విధంగా ఇస్లాంలో మహిళలకు సమాన హక్కులు ఇచ్చారు. మహిళలకు సమానత్వం కల్పించిన మతాల్లో ఇస్లాం మతమే మొట్టమొదటిది. ఒక్క ఇస్లాం మతంలోనే మహిళలపై దాడులు, విడాకులు తక్కువగా ఉన్నాయి. మహిళలపై పెట్రోలు పోసి తగలపెట్టడం, చంపడం లాంటివి ఇస్లాంలో లేవ’ని ఆజం ఖాన్ పేర్కొన్నారు. ‘ త్రిపుల్ తలాక్ అనేది మతానికి సంబంధించిన విషయం. ఇది ఎంతమాత్రం రాజకీయానికి సంబంధించిన విషయం కాదు. ఇస్లాంలో ఖురాన్ కంటే ఏదీ సుప్రీం నిర్ణయం కాదు. పెళ్లి, విడాకులు, ఇతరత్రా అన్ని విషయాల గురించి ఖురాన్లో స్పష్టంగా సూచనలు ఉన్నాయ’ని ఆజం ఖాన్ చెప్పారు. గత సంవత్సరం ముస్లిం(ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్) మహిళ బిల్లు-2018 లోక్‌సభలో పాసైనప్పటికీ రాజ్యసభలో పెండింగ్‌లోనే ఉంది. ప్రభుత్వం రద్దు కావడంతో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ ముస్లిం మహిళ బిల్లు-2019ను తీసుకువచ్చింది. -
ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ సీట్లు: అఖిలేశ్
లక్నో: ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ సీట్లొస్తాయని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. ‘బీజేపీ, కాంగ్రెస్‌ల కన్నా ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ సీట్లొస్తాయనుకుంటున్నాను. తదుపరి ప్రధాని ప్రాంతీయ పార్టీల నుంచే అవుతారు’ అని ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని రేసులో మీరున్నారా? అని అడిగిన ప్రశ్నకు బదులుగా ‘నేను ప్రధాని రేసులో లేను. కానీ తర్వాతి పీఎం ఉత్తర ప్రదేశ్ నుంచే అయితే నేను సంతోషిస్తా. ప్రధాని అభ్యర్థికి నా పూర్తి మద్దతుంటుంది’ అని అన్నారు. ఒక వేళ ఎస్పీ–బీఎస్పీ కూటమి ప్రియాంక గాంధీ వాద్రాకు మద్దతునిస్తే అన్న ప్రశ్నకు ‘మా కూటమి బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీతోనే ఉంటుంది. వారణాసి నుంచి పోటీకి మా అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తాం’ అని తేల్చి చెప్పారు. బీజేపీ–కాంగ్రెస్ మధ్య రహస్య కూటమి ఉందని ఆయన ఆరోపించారు. అలాగే ఇటీవల యోగి ఆదిత్యనాథ్ తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘ఎవరికైనా గర్వం ఎక్కువ కాలం కొనసాగదు. ఈసారి రాష్ట్ర ప్రజలు ఆయనకు తగిన సమాధానం చెప్తారు’ అని వ్యాఖ్యానించారు. -
‘పుల్వామా ఉగ్ర దాడి వెనుక బీజేపీ’
న్యూఢిల్లీ: ఓట్ల కోసమే జవాన్లను చంపేశారని, పుల్వామా ఉగ్రవాద ఘటన వెనుక కాషాయ పార్టీ కుట్ర ఉందని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రామ్‌గోపాల్ యాదవ్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పుల్వామా ఉగ్రవాద దాడిపై సమగ్ర దర్యాప్తు జరిపితే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. పూల్వామా ఉగ్రవాద దాడులను బీజేపీ చేసిన కుట్రపూరిత చర్యగా అభివర్ణించిన ఆయన ఆ పార్టీ ఓట్ల రాజకీయంలో సైనికులు బలయ్యారని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం వస్తే.. పుల్వామా దాడిపై విచారణ జరిపిస్తుందని, ఆ దర్యాప్తులో అసలు నిజాలు బయటికొస్తాయన్నారు. పారా మిలిటరీ దళాలు కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్నాయని.. అసలు జమ్మూ-శ్రీనగర్‌ల మార్గంలో సెక్యూరిటీ తనిఖీలు లేవని, సైనికులను సాధారణ బస్సుల్లో తరలించారన్నారు. తాను ఇప్పడీ విషయాల గురించి ఎక్కువ మాట్లాడదలచుకోలేదని, ప్రభుత్వం మారినప్పడు జరిగే దర్యాప్తుతో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాంగోపాల్ యాదవ్ చెప్పారు. -
దళిత ఓట్లకు ప్రియాంక గాలం
లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకోబోమని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి ప్రకటించిన నేపథ్యంలో ఎస్పీ–బీఎస్పీ కూటమికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ చురుగ్గా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ప్రియాంకా గాంధీ బుధవారం మీరట్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను పరామర్శించారు. దీంతో బీఎస్పీకి పట్టుకొమ్మలుగా ఉన్న దళితుల ఓట్లను ఆకర్షించేందుకే ప్రియాంక ఆజాద్‌ను కలుసుకున్నారని రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. ఈ భేటీ అనంతరం ప్రియాంక మీడియాతో మాట్లాడుతూ..‘ఆజాద్ ఓ లక్ష్యం కోసం పోరాడుతున్నారు. ఆయన పోరాటాన్ని నేను గౌరవిస్తున్నా. ఈ పరామర్శ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవు. ఆజాద్ తమ సమస్యలను వినాల్సిందిగా గొంతెత్తి అరుస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అహంకారంతో యువత గొంతు నొక్కేస్తోంది. ఈ ప్రభుత్వం ఉద్యోగాలను కల్పించడం లేదు. వాళ్లు యువత సమస్యలను వినాలనుకోవడం లేదు’ అని తెలిపారు. మరోవైపు ఈ విషయమై ఆజాద్ స్పందిస్తూ..‘ప్రియాంక ఆసుపత్రికి వచ్చినట్లు మీడియా ద్వారానే నాకు తెలిసింది. నా ఆరోగ్యం గురించి వాకబు చేసేందుకు ఆమె ఆసుపత్రికి వచ్చారు. మామధ్య రాజకీయాలకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదు’ అని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలన్నీ కలిస్తే బీజేపీని ఓడించవచ్చని అభిప్రాయపడ్డారు. కాగా, ఈ సందర్భంగా ‘ఆజాద్ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారా?’ అన్న ప్రశ్నకు ప్రియాంక జవాబును దాటవేశారు. నిబంధనలకు విరుద్ధంగా భారీ సంఖ్యలో వాహనాలతో ర్యాలీ నిర్వహించడంతో ఆజాద్‌ను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అస్వస్థతకు లోనుకావడంతో మీరట్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. యూపీలోని 80 లోక్‌సభ స్థానాలకు గానూ ఎస్పీ 37, బీఎస్పీ 38, ఆర్ఎల్డీ 3 స్థానాల్లో పోటీచేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాయ్‌బరేలి(సోనియాగాంధీ) అమేథీ(రాహుల్ గాంధీ) స్థానాల్లో మాత్రం పోటీచేయకూడదని నిర్ణయించాయి. ప్రియాంక పోటీలో లేనట్టే! సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితులైన ప్రియాంక గాంధీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయదని పార్టీ వర్గాలు చెప్పాయి. గుజరాత్లో బుధవారం ఆమె చేసిన తన తొలి ప్రసంగానికి మంచి మార్కులు పడ్డాయి. ఆ ప్రసంగం తర్వాత పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంగా, సంతోషంగా ఉన్నాయి. ఈ ఏడాది జవనరిలో ప్రియాంక క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చాక ఆమె లోక్‌సభకు పోటీ చేస్తారని భారీ ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేయరనీ, ప్రచారానికి మాత్రమే వస్తారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ప్రియాంక ఇప్పటికే పలుమార్లు పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. -
యూపీలో ఎస్పీ–బీఎస్పీ జట్టు!
లక్నో: త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)లు జట్టు కట్టడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ రెండింటితోపాటు రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) వంటి చిన్న పార్టీలు కూడా ఈ కూటమిలో ఉండనున్నాయి. అయితే కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందా లేక ఎస్పీ–బీఎస్పీల కూటమితో కలిసే సాగుతుందా అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ కూటమితో కాంగ్రెస్ కలిస్తే, ఆ పార్టీకి అతి తక్కువ స్థానాల్లోనే టికెట్లు దక్కనున్నాయి. ఎస్పీ–బీఎస్పీల కూటమిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఎస్పీ జాతీయ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి చెప్పారు. అమేథీ, రాయ్‌బరేలీల్లో పోటీ చేయం.. ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతిలు ఇప్పటికే పలుమార్లు సమావేశమై కూటమి ఏర్పాటుపై చర్చించారనీ, తాజాగా శుక్రవారం వారు ఢిల్లీలో భేటీ అయ్యి మాట్లాడారని రాజేంద్ర చెప్పారు. కూటమి ఏర్పాటుకు వీరిరువురూ సూత్రప్రాయ అంగీకారం తెలిపారన్నారు. కూటమిలో కాంగ్రెస్ ఉండాలా లేదా అన్న అంశాన్ని అఖిలేశ్, మాయావతిలు తర్వాత నిర్ణయిస్తారనీ, అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీల నియోజకవర్గాలైన అమేథీ, రాయ్‌బరేలీల్లో మాత్రం తమ కూటమి అభ్యర్థులను పోటీలో నిలపకుండా ఆ సీట్లను కాంగ్రెస్‌కే విడిచిపెట్టాలని నిర్ణయించామన్నారు. యూపీసీసీ అధ్యక్షుడు రాజ్ బబ్బర్ మాట్లాడుతూ అఖిలేశ్–మాయావతిల భేటీపై అధికారిక ప్రకటనేదీ లేదనీ, దీనిపై తాను మాట్లాడేదీ లేదంటూ ఆయన స్పందించేందుకు నిరాకరించారు. యూపీలో 80 లోక్‌సభ స్థానాలుండగా గత ఎన్నికల్లో 71 సీట్లు బీజేపీ, మరో రెండు సీట్లు బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ గెలిచాయి. ఎస్పీ ఐదు, కాంగ్రెస్ రెండు సీట్లు గెలవగా బీఎస్పీ ఒక్క స్థానంలోనూ గెలవలేదు. -
త్వరలోనే కూటమి సాకారం
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ– బహుజన్ సమాజ్ పార్టీల మధ్య పొత్తుపై వస్తున్న వార్తలపై ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ స్పందించారు. పొత్తుపై చర్చలు ప్రారంభమవుతాయని త్వరలోనే కూటమి ప్రజల ముందు ఉంటుందని ఆయన తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ –బీఎస్పీలు కలసి పనిచేయడంతో బీజేపీ ఓటమి పాలైంది. దీంతో ఈ రెండు పార్టీలు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కూడా కలిసే పోటీచేయాలని భావిస్తున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య పొత్తుకు సంబంధించి త్వరలోనే చర్చలుంటాయని అఖిలేశ్ తెలిపారు. ఈ కూటమిలో కాంగ్రెస్ ఉంటుందా అన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫెడరల్ ఫ్రంట్ కోసం చేస్తున్న ప్రయత్నాలను అఖిలేశ్ మెచ్చుకున్నారు. అందుకే ఎన్కౌంటర్ ఎత్తుగడలు ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు బదిలీలు తప్పించుకునేందుకే ఎన్కౌంటర్ ఎత్తుగడలను అనుసరిస్తున్నారని అఖిలేశ్ అన్నారు. యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేరస్తులు రెట్టింపయ్యారని, శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. గతంలో ఎన్నడూ ఇలా లేదన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్కౌంటర్లను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఆయన ప్రోత్సాహంతోనే పోలీసు ఉన్నతాధికారులు బదిలీల అంశంలో లబ్ది పొందుతున్నారన్నారు. వచ్చే ఏడాది దేశం మరో కొత్త ప్రధానిని చూస్తుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరిగిపోయాయన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉంది బీజేపీకాదని, ఆరెస్సెస్ ప్రభుత్వమని మండిపడ్డారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని అఖిలేశ్ విమర్శించారు. -
వారణాసిలో మోదీ వర్సెస్ శత్రుఘ్న సిన్హా..?
సాక్షి, న్యూఢిల్లీ : సొంత పార్టీపైనే విమర్శల దాడితో విరుచుకుపడుతున్న సీనియర్ బీజేపీ నేత శత్రుఘ్న సిన్హా సార్వత్రిక ఎన్నికలకు ముందు కాషాయ పార్టీకి గట్టి షాక్ ఇవ్వనున్నారనే ప్రచారం సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీని బాహాటంగా పలు సందర్భాల్లో విమర్శించిన శత్రుఘ్న సిన్హా రానున్న ఎన్నికల్లో ఆయనపైనే పోటీకి దిగుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి వైదొలగితే సమాజ్ వాదీ పార్టీ నాయకత్వం సిన్హాను ప్రధాని మోదీపై వారణాసి నుంచి బరిలోకి దింపేందుకు యోచిస్తోందని తెలుస్తోంది. వారణాసిలో ప్రధాని మోదీకి ప్రజాదరణపై ఎలాంటి సందేహాలు లేకున్నా ఓటర్లకు చిరపరిచితుడు కావడంతో పాటు వారణాసిలోని కాయస్థ వర్గంలో గట్టి మద్దతు కలిగిన శత్రుఘ్న సిన్హా పోటీని తోసిపుచ్చలేమని చెబుతున్నారు. గుజరాత్లో ఇటీవల యూపీ, బిహార్ వలస కార్మికులు భయంతో స్వస్థలాలకు తిరిగివస్తున్న ఉదంతం వారణాసిలో బీజేపీ అవకాశాలను ప్రభావితం చేయనుంది. మరోవైపు లక్నోలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శత్రుఘ్న సిన్హా ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో వేదికను పంచుకున్నారు. ఇదే వేదిక నుంచి మోదీ సర్కార్‌పై సిన్హా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. రాఫెల్ యుద్ధవిమానాల తయారీకి దసాల్ట్ ఏవియేషన్ భాగస్వామిగా ప్రభుత్వ రంగ హిందుస్ధాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ను పక్కనపెట్టి ప్రయివేటు సంస్థను ఎందుకు ఎంచుకున్నారని ఆయన నిలదీశారు. రాఫెల్ డీల్‌పై ప్రభుత్వం నుంచి ప్రజలు సమాధానం కోరుతున్నారన్నారు. -
యూపీలో కీలక సర్వే.. బీజేపీకి కష్టమే!
న్యూఢిల్లీ: 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి అధికారం రావడంలో కీలకపాత్ర పోషించిన యూపీలో విపక్ష మహా కూటమి ప్రభావం స్పష్టంగా ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రజల్లో మోదీ పాలనపై సానుకూలత ఉన్నప్పటికీ.. ఎస్పీ–బీఎస్పీ కలిసి పోటీచేస్తే బీజేపీకి చిక్కులు తప్పవని స్పష్టమైంది. 47% మంది ప్రాంతీయ పార్టీలు ఏకమైతే బీజేపీ ఇప్పుడున్న స్థానాల్లో కొన్నింటిని కోల్పోవాల్సి వస్తుందని అభిప్రాయపడగా.. 32% మంది కూటమి ప్రభావం ఉండదని.. 21% మంది చెప్పలేమని పేర్కొన్నారు. ఇండియాటుడే సంస్థ సెప్టెంబర్ 15–19 మధ్యలో 30,400 మంది అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ సర్వే నిర్వహించింది. దీని ప్రకారం యూపీలో 48% మంది మళ్లీ మోదీనే ప్రధానిగా కావాలని కోరుకోగా.. 22% మంది రాహుల్ గాంధీ వైపు మొగ్గుచూపారు. 9% మంది మాయావతి ప్రధాని కావాలని అభిప్రాయపడగా.. అఖిలేశ్‌కు 7% మంది ఓకే చెప్పారు. 80 ఎంపీ స్థానాలున్న యూపీలో 2014 ఎన్నికల్లో బీజేపీ 71 స్థానాల్లో విజయ దుందుభి మోగించి కేంద్రంలో అధికారాన్ని చేపట్టింది. ప్రధానిగా మోదీ భేష్ : వారణాసి ఎంపీగా ఉన్న నరేంద్ర మోదీ పాలనపై 53% మంది సంతృప్తి వ్యక్తం చేయగా.. 16%మంది పర్వాలేదన్నారు. 28% మాత్రం కేంద్రం పాలన బాగాలేదని అభిప్రాయపడ్డారు. ఎస్సీల్లో 39% మోదీకే జై కొట్టగా.. మాయావతికి 24%, రాహుల్‌కు 20%, అఖిలేశ్‌కు 4%మంది మద్దతు తెలిపారు. రాఫెల్ ఒప్పందం విషయంలో కేంద్రంపై విపక్షాలు చేస్తున్న విమర్శల ప్రభావం యూపీలో పెద్దగా కనిపించలేదు. 79% మంది తమకు రాఫెల్ వివాదం గురించి తెలియదని వెల్లడించారు. సీఎంగా యోగి ఓకే! ఉత్తరప్రదేశ్ తదుపరి సీఎంగా యోగికి 43% మంది మద్దతు తెలుపగా.. అఖిలేశ్‌కు 29%, మాయావతికి 18% మంది ఓటేశారు. సీఎంగా యోగి పాలనపై 41% సంతృప్తి చెందుతుండగా.. 20%మంది పర్వాలేదన్నారు. 37% మందిలో మాత్రం అసంతృప్తి వ్యక్తమైంది. అఖిలేశ్, మాయావతిలతో పోలిస్తే.. ఓబీసీలు, బ్రాహ్మణులు, ఎస్టీల్లో ఎక్కువ మంది యోగికే మద్దతు తెలిపారు. ముస్లింలు అఖిలేశ్‌కు (71%), ఎస్సీలు మాయావతికి (49%) మద్దతు ప్రకటించారు. పీఎం ఓకే.. కానీ ముఖ్యమంత్రే? ఉత్తరాఖండ్‌లో బీజేపీకి భిన్నమైన పరిస్థితి ఎదురవుతోంది. ప్రధానిగా మోదీ పనితీరుపై సంతృప్తిగానే ఉన్నా.. సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌పై స్వల్ప వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొత్తంగా ప్రధానిగా మోదీకి 57% మంది, రాహుల్‌కు 32%మంది మద్దతు తెలిపారు. మోదీ పాలనపై 45% సంతృప్తి వ్యక్తం చేయగా.. 23% పర్వాలేదని, 24% బాగాలేదని అభిప్రాయపడ్డారు. అయితే సీఎంగా రావత్ పనితీరుపై 35% మంది అసంతృప్తిని వ్యక్తం చేయగా.. 30% బాగుందని, 29% పర్వాలేదని పేర్కొన్నారు. యూపీలో బీఎస్పీ–ఎస్పీ జోడీ ప్రభావం బీజేపీపై ఉంటుందా? అన్నప్రశ్నకు అవును అని 47% మంది, చెప్పలేమని 21% మంది, ప్రభావం ఉండదని 32%మంది అభిప్రాయపడ్డారు. -
అసహనంతోనే బంగ్లా ధ్వంసం
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన విషయంలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బీజేపీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. లక్నోలో అఖిలేశ్ ఇన్నాళ్లూ నివసించిన ఆ బంగ్లా ఇప్పుడు బాగా ధ్వంసమైందనీ, ఇది ఆయనకు వచ్చిన అసహనానికి నిదర్శనమని బీజేపీ ఆరోపించింది. యూపీ మాజీ సీఎంలంతా ప్రభుత్వ అధికారిక బంగ్లాలను ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడం తెల్సిందే. మాజీ సీఎంలు ములాయం సింగ్, కల్యాణ్ సింగ్, రాజ్‌నాథ్, మాయవతి, అఖిలేశ్ ఆయా భవనాలను ఖాళీ చేశారు. అయితే అఖిలేశ్ బంగ్లాను ఖాళీ చేశాక, దాని ఫొటోలు తీసుకోవడానికి అధికారులు ఫొటోగ్రాఫర్లను అనుమతించారు. సైకిల్ ట్రాక్, ఏసీలు పెట్టిన గోడలు, బ్యాడ్మింటన్ కోర్టు తదితరాలు బాగా దెబ్బతిన్నట్లు చిత్రాల్లో తెలుస్తోంది. నివాసం ఖాళీ చేయాల్సిరావడంతో అఖిలేశ్ కావాలనే బంగ్లాను ధ్వంసం చేశారనే కోణంలో బీజేపీ ఆరోపణలు చేయగా, అవన్నీ సాధారణంగా దెబ్బతిన్నవేననీ, కల్యాణ్ సింగ్, రాజ్‌నాథ్‌ల బంగ్లాల ఫొటోలను ఎందుకు బయటకు రానివ్వలేదని ఎస్పీ నాయకులు ప్రశ్నించారు. తాజా ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం, పెరిగిన అఖిలేశ్ ప్రజాదరణతో బీజేపీ ఆరోపణలు చేస్తోందని ఎస్పీ నాయకులు ఎదురుదాడి చేశారు. -
కతియార్‌కు షాకిచ్చిన ‘కమలం’
లక్నో: ‘ముస్లింలకు భారత్‌లో చోటు లేదు. వారు పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్‌కు వెళ్లిపోవాలి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ వినయ్ కతియార్‌కు అధిష్ఠానం షాక్ ఇచ్చింది. వివిధ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాలో ఆయనకు చోటు కల్పించలేదు. కతియార్‌కు మొండిచూపిన పార్టీ పెద్దలు సమాజ్‌వాదీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన అశోక్ బాజ్‌పేయి, హరనాథ్ సింగ్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. పార్టీలోని సీనియర్ నేతలైన సుధాంశు త్రివేది, లక్ష్మీకాంత్ బాజ్‌పేయిలను పక్కకు పెట్టి మరీ అశోక్ బాజ్‌పేయిని అభ్యర్థిగా ప్రకటించడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వివాదాల కారణంగానే...? ‘ముస్లింలకు భారత్‌లో చోటు లేదు. జనాభా ఆధారంగా దేశాన్ని విభజించినపుడు వారికి ఇంకా ఇక్కడ ఏం పని’ అంటూ ఐదు రోజుల క్రితం కతియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘సుప్రీం కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నాం. రామునికి చెందిన భూభాగంలో కచ్చితంగా రామమందిరం నిర్మించి తీరతామ’ని గతంలోనూ వ్యాఖ్యానించారు. తేజో మందిరాన్ని విధ్వంసం చేసి తాజ్ మహల్ నిర్మించారంటూ వివాదం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కారణంగానే ఆయనకు సీటు నిరాకరించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తా: కతియార్ ‘ప్రస్తుతం ఈ అంశంపై స్పందించాలనుకోవడం లేదు. రెండుసార్లు రాజ్యసభ సభ్యునిగా, మూడుసార్లు లోక్‌సభ సభ్యునిగా అవకాశం ఇచ్చిన పార్టీ ఆదేశాలను పాటిస్తాను. ఇప్పుడైతే రాజకీయపరమైన అంశాలపై చర్చించాలనుకోవడం లేద’ ని వినయ్ కతియార్ మీడియాకు తెలిపారు ఉపరాష్ట్రపతికి ఫిర్యాదు.. పలు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో కతియార్ రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ రాజ్యసభ చైర్మన్‌కు పలువురు సామాజిక కార్యకర్తలు లేఖ రాశారు.