సాక్షి, లక్నో : కరోనా సామాన్యుల నుంచి రాజకీయనేతల వరకు అందరినీ కబలిస్తుంది. తాజాగా ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఘూరా రామ్ గురువారం కరోనా వైరస్ కారణంగా మరణించారు. దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో రెండు రోజుల క్రితం ఆయన్ని లక్నోలోని కింగ్ జార్జ్ హాస్పిటల్‌లో చేర్పించినట్లు ఆయన కుమారుడు సంతోష్ కుమార్ వెల్లడించారు. పరీక్షలు నిర్వహించగా ఘూరా రామ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రత్యేక వైద్య సిబ్బంది ఆయనకు చికిత్స అందించగా, అప్పటికే ఆరోగ్యం విషమించడంతో కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్‌కు ఘూరా రామ్ ఎంతో విశ్వాసపాత్రుడిగా కొనసాగారు. ఘూరా రామ్ 1993, 2002, 2007 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా, మాయావతి ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవల సమాజ్‌వాదీ పార్టీలో చేరిన ఆయన జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. (క్షీణించిన మధ్యప్రదేశ్ గవర్నర్ ఆరోగ్యం)
Comments
Please login to add a commentAdd a comment