లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన విషయంలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బీజేపీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. లక్నోలో అఖిలేశ్ ఇన్నాళ్లూ నివసించిన ఆ బంగ్లా ఇప్పుడు బాగా ధ్వంసమైందనీ, ఇది ఆయనకు వచ్చిన అసహనానికి నిదర్శనమని బీజేపీ ఆరోపించింది. యూపీ మాజీ సీఎంలంతా ప్రభుత్వ అధికారిక బంగ్లాలను ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడం తెల్సిందే. మాజీ సీఎంలు ములాయం సింగ్, కల్యాణ్ సింగ్, రాజ్‌నాథ్, మాయవతి, అఖిలేశ్ ఆయా భవనాలను ఖాళీ చేశారు.
అయితే అఖిలేశ్ బంగ్లాను ఖాళీ చేశాక, దాని ఫొటోలు తీసుకోవడానికి అధికారులు ఫొటోగ్రాఫర్‌లను అనుమతించారు. సైకిల్ ట్రాక్, ఏసీలు పెట్టిన గోడలు, బ్యాడ్మింటన్ కోర్టు తదితరాలు బాగా దెబ్బతిన్నట్లు చిత్రాల్లో తెలుస్తోంది. నివాసం ఖాళీ చేయాల్సిరావడంతో అఖిలేశ్ కావాలనే బంగ్లాను ధ్వంసం చేశారనే కోణంలో బీజేపీ ఆరోపణలు చేయగా, అవన్నీ సాధారణంగా దెబ్బతిన్నవేననీ, కల్యాణ్ సింగ్, రాజ్‌నాథ్‌ల బంగ్లాల ఫొటోలను ఎందుకు బయటకు రానివ్వలేదని ఎస్పీ నాయకులు ప్రశ్నించారు. తాజా ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం, పెరిగిన అఖిలేశ్ ప్రజాదరణతో బీజేపీ ఆరోపణలు చేస్తోందని ఎస్పీ నాయకులు ఎదురుదాడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment