లక్నో: అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ట జరిగిన కొద్ది రోజులకే జ్ఞానవాపి మసీదు సెల్లార్‌లో హిందువులు పూజలు చేసుకోవడానికి అనుమతినిస్తూ వారణాసి కోర్టు తీర్పునిచ్చింది. అయితే.. అయోధ్య, జ్ఞానవాపి మసీదు వివాదాల వెనక ఒక కామన్ పేరు వినిపిస్తోంది. ఆయనే దివంగత నేత ములాయం సింగ్ యాదవ్. ఈ వివాదాల వెనక ములాయం సింగ్ యాదవ్ పాత్ర ఏంటంటే..?
కరసేవకులపై కాల్పులు..
1990 అక్టోబర్‌లో ములాయం సింగ్ యాదవ్ సీఎంగా ఉన్నప్పుడు అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టాలని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) కరసేవ నిర్వహించింది. దీనికి వ్యతిరేకంగా కరసేవకులపై ములాయం ప్రభుత్వం 28,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించింది. అయినప్పటికీ బారికేడ్లను దాటి కరసేవకులు బాబ్రీ మసీదు ప్రదేశానికి చేరుకున్నారు. మసీదుపై కాశాయ జెండాలను ఎగురవేశారు. ఈ ఘటనలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 20 మంది మరణించినట్లు అధికారికంగా చెబుతున్నప్పటికీ ఆ సంఖ్య ఎక్కువగా ఉంటుందని ప్రత్యక్ష సాక్షుల కథనాలు వెలువడ్డాయి.
బాబ్రి మసీదు కూల్చివేత..
అయోధ్యలో కరసేవకుల ఘటన తర్వాత 1991లో యూపీలో ఎన్నికలు జరిగాయి. బీజేపీకి చెందిన కళ్యాణ్ సింగ్ అధికారంలోకి వచ్చారు. మరుసటి ఏడాది 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చి వేత ఘటన జరిగింది. ఈ పరిణామాల తర్వాత యూపీలో బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఉన్న పీవీ నరసింహరావు ప్రభుత్వం రద్దు చేసింది. తర్వాత యూపీలో రాష్ట్రపతి పాలన కొనసాగింది. మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో ములాయం మళ్లీ అధికారంలోకి వచ్చారు. ఈ పాలనా కాలంలోనే జ్ఞానవాపి సెల్లార్‌లో హిందువుల పూజలను ములాయం ప్రభుత్వం నిలిపివేసింది.
జ్ఞానవాపిలో పూజలు నిలిపివేత..
ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సెల్లార్ (వ్యాస్‌జీ కా తెహ్‌ఖానా)లో 1993 వరకు పూజాలు జరిగాయి. సెల్లార్‌లో 200 ఏళ్లకు పైగా వ్యాస్ కుటుంబం పూజలు చేశారు. వారి కుటుంబ పేరుమీదుగానే ఆ సెల్లార్‌కు వ్యాస్‌జీ కా తెహ్‌ఖానా అని పేరు వచ్చింది. అయితే.. 1993 డిసెంబర్‌లో ములాయం సింగ్ ప్రభుత్వం జ్ఞానవాపి మసీదులో పూజలను నిలిపివేసింది. లా అండ్ ఆర్డర్ సమస్యను కారణంగా చూపుతూ ఈ చర్యను ప్రభుత్వం సమర్థించుకుంది. ఎలాంటి న్యాయ ఉత్తర్వులు లేకుండానే ఉక్కు కంచెను నిర్మించిందని శైలేంద్ర వ్యాస్ కోర్టు పిటిషన్‌లో పేర్కొన్నారు.
మసీదు ప్రాంతంలో దేవాలయం..
జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో హిందూ దేవాలయం ఉన్నట్లు ఏఎస్‌ఐ సర్వే తెలిపిందని హిందూ తరుపు న్యాయవాది విష్ణశంకర్ జైన్ వెల్లడించారు. 800 ఏళ్ల చరిత్ర ఉన్న దేవాలయం.. కాలక్రమంలో అనేక యుద్ధాలు, విధ్వంసం తర్వాత పునర్నిర్మాణాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. దక్షిణాసియా అధ్యయనాలలో నైపుణ్యం కలిగిన పండితుడు యుగేశ్వర్ కౌశల్ ప్రకారం.. మహారాజా జయచంద్ర తన పట్టాభిషేకం తర్వాత సుమారు 1170-89 ADలో ఈ ప్రదేశంలో ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాడు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు 1669లో కాశీ విశ్వేశ్వర్ ఆలయాన్ని ధ్వంసం చేసి, ఆ శిథిలాల పైన ప్రస్తుత జ్ఞానవాపి మసీదును నిర్మించాడని విశ్వసిస్తారు.
ఇదీ చదవండి: జ్ఞానవాపి మసీదులో పూజలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment