Babri Mosque
-
జ్ఞానవాపి, రామ జన్మభూమి వివాదాల వెనక ములాయం సింగ్ పాత్ర ఏంటి?
లక్నో: అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ట జరిగిన కొద్ది రోజులకే జ్ఞానవాపి మసీదు సెల్లార్లో హిందువులు పూజలు చేసుకోవడానికి అనుమతినిస్తూ వారణాసి కోర్టు తీర్పునిచ్చింది. అయితే.. అయోధ్య, జ్ఞానవాపి మసీదు వివాదాల వెనక ఒక కామన్ పేరు వినిపిస్తోంది. ఆయనే దివంగత నేత ములాయం సింగ్ యాదవ్. ఈ వివాదాల వెనక ములాయం సింగ్ యాదవ్ పాత్ర ఏంటంటే..? కరసేవకులపై కాల్పులు.. 1990 అక్టోబర్‌లో ములాయం సింగ్ యాదవ్ సీఎంగా ఉన్నప్పుడు అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టాలని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) కరసేవ నిర్వహించింది. దీనికి వ్యతిరేకంగా కరసేవకులపై ములాయం ప్రభుత్వం 28,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించింది. అయినప్పటికీ బారికేడ్లను దాటి కరసేవకులు బాబ్రీ మసీదు ప్రదేశానికి చేరుకున్నారు. మసీదుపై కాశాయ జెండాలను ఎగురవేశారు. ఈ ఘటనలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 20 మంది మరణించినట్లు అధికారికంగా చెబుతున్నప్పటికీ ఆ సంఖ్య ఎక్కువగా ఉంటుందని ప్రత్యక్ష సాక్షుల కథనాలు వెలువడ్డాయి. బాబ్రి మసీదు కూల్చివేత.. అయోధ్యలో కరసేవకుల ఘటన తర్వాత 1991లో యూపీలో ఎన్నికలు జరిగాయి. బీజేపీకి చెందిన కళ్యాణ్ సింగ్ అధికారంలోకి వచ్చారు. మరుసటి ఏడాది 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చి వేత ఘటన జరిగింది. ఈ పరిణామాల తర్వాత యూపీలో బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఉన్న పీవీ నరసింహరావు ప్రభుత్వం రద్దు చేసింది. తర్వాత యూపీలో రాష్ట్రపతి పాలన కొనసాగింది. మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో ములాయం మళ్లీ అధికారంలోకి వచ్చారు. ఈ పాలనా కాలంలోనే జ్ఞానవాపి సెల్లార్లో హిందువుల పూజలను ములాయం ప్రభుత్వం నిలిపివేసింది. జ్ఞానవాపిలో పూజలు నిలిపివేత.. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సెల్లార్ (వ్యాస్జీ కా తెహ్ఖానా)లో 1993 వరకు పూజాలు జరిగాయి. సెల్లార్లో 200 ఏళ్లకు పైగా వ్యాస్ కుటుంబం పూజలు చేశారు. వారి కుటుంబ పేరుమీదుగానే ఆ సెల్లార్‌కు వ్యాస్జీ కా తెహ్ఖానా అని పేరు వచ్చింది. అయితే.. 1993 డిసెంబర్లో ములాయం సింగ్ ప్రభుత్వం జ్ఞానవాపి మసీదులో పూజలను నిలిపివేసింది. లా అండ్ ఆర్డర్ సమస్యను కారణంగా చూపుతూ ఈ చర్యను ప్రభుత్వం సమర్థించుకుంది. ఎలాంటి న్యాయ ఉత్తర్వులు లేకుండానే ఉక్కు కంచెను నిర్మించిందని శైలేంద్ర వ్యాస్ కోర్టు పిటిషన్లో పేర్కొన్నారు. మసీదు ప్రాంతంలో దేవాలయం.. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో హిందూ దేవాలయం ఉన్నట్లు ఏఎస్ఐ సర్వే తెలిపిందని హిందూ తరుపు న్యాయవాది విష్ణశంకర్ జైన్ వెల్లడించారు. 800 ఏళ్ల చరిత్ర ఉన్న దేవాలయం.. కాలక్రమంలో అనేక యుద్ధాలు, విధ్వంసం తర్వాత పునర్నిర్మాణాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. దక్షిణాసియా అధ్యయనాలలో నైపుణ్యం కలిగిన పండితుడు యుగేశ్వర్ కౌశల్ ప్రకారం.. మహారాజా జయచంద్ర తన పట్టాభిషేకం తర్వాత సుమారు 1170-89 ADలో ఈ ప్రదేశంలో ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాడు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు 1669లో కాశీ విశ్వేశ్వర్ ఆలయాన్ని ధ్వంసం చేసి, ఆ శిథిలాల పైన ప్రస్తుత జ్ఞానవాపి మసీదును నిర్మించాడని విశ్వసిస్తారు. ఇదీ చదవండి: జ్ఞానవాపి మసీదులో పూజలు ప్రారంభం -
బాబ్రీ కేసు : అద్వానీపై ప్రశ్నల వర్షం
లక్నో : భారత మాజీ ఉప ప్రధానమంత్రి, బీజేపీ కురవృద్ధుడు ఎల్కే అద్వానీపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది. 1992 బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి.. సీబీఐ కోర్టు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అద్వానీ వాంగూల్మం నమోదు చేసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల మధ్యలో దాదాపు నాలుగున్నర గంటల పాటు ఈ కేసు విచారణ కొనసాగింది. ఈ క్రమంలో న్యాయమూర్తి అద్వానీని 100 ప్రశ్నలు అడిగినట్టు ఆయన తరఫున లాయర్ తెలిపారు. అయితే ఈ సందర్భంగా తనపై ఉన్న ఆరోపణలను అద్వానీ ఖండించినట్టు వెల్లడించారు. (జోషి వాంగ్మూలం నమోదు చేసిన సీబీఐ కోర్టు) ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గురువారం బీజేపీ సీనియర్ నాయకులు మురళీ మనోహర్ జోషి వాంగ్మూలం నమోదు చేసిన సంగతి తెలిసిందే. సీఆర్పీసీ సెక్షన్ 313 కింద ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 32 మంది తమ వాదనలను వినిపించవచ్చని న్యాయమూర్తి ఇదివరకే పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, బాబ్రీ మసీదు కూల్చివేత కేసును ఆగస్టు 31 లోగా పూర్తి చేయాలని లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గడువులోగా విచారణ పూర్తిచేసి, తీర్పు వెలువరించేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రోజువారి విచారణ చేపడుతోంది. (నదిలో మధ్యలో సెల్ఫీ దిగుదామనుకుంటే..) మరోవైపు కోర్టు ముందు వాంగ్మూలం వినిపించడానికి రెండు రోజుల ముందు అద్వానీ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమైన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య భేటీ దాదాపు 30 నిమిషాల పాటు సాగింది. -
జోషి వాంగ్మూలం నమోదు చేసిన సీబీఐ కోర్టు
-
జోషి వాంగ్మూలం నమోదు చేసిన సీబీఐ కోర్టు
లక్నో : బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనకు సంబంధించి సీబీఐ ప్రత్యేక న్యాయ స్థానం బీజేపీ కురవృద్ధుడు మురళీ మనోహర్ జోషి వాంగ్మూలం నమోదు చేసింది. ప్రత్యేక న్యాయమూర్తి ఎస్కే యాదవ్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జోషి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఇదే కేసుకు సంబంధించి శుక్రవారం మాజీ ఉప ప్రధానమంత్రి ఎల్కే అద్వానీ వాంగ్మూలం కూడా రికార్డు చేయనున్నారు. కాగా, సీఆర్పీసీ సెక్షన్ 313 కింద ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 32 మంది తమ వాదనలను వినిపించవచ్చని న్యాయమూర్తి పేర్కొన్న సంగతి తెలిసిందే.(మధ్యప్రదేశ్ మంత్రికి సోకిన కరోనా) బాబ్రీ మసీదు కూల్చివేత కేసును ఆగస్టు 31 లోగా పూర్తి చేయాలని లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. నిర్ణీత గడువు లోగా విచారణ పూర్తి చేసి తుది తీర్పు వెలువరించాలని సూచించింది. ఈ నేపథ్యంలో గడువులోగా విచారణ పూర్తిచేసేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రోజువారి విచారణ చేపడుతోంది. ఈ కేసులో బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, అశోక్ సింఘాల్, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి.. వంటివారి పేర్లు ఉన్నాయి. కరసేవకులను రెచ్చగొట్టి మసీదును కూల్చివేశారని వీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.(పిల్లల కోసం ఆ కాస్త ఆసరా వదిలేశాడు!) -
అద్వానీ వాంగ్మూలం తీసుకోనున్న సీబీఐ కోర్టు
లక్నో : బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ కీలక నేతల వాంగ్మూలం నమోదు చేసేందుకు రంగం సిద్ధమైంది. బీజేపీ సీనియర్ నాయకులు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిల స్టేట్మెంట్లను రికార్డు చేసేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తేదీలు ఖరారు చేసింది. జూలై 23న మురళీ మనోహర్ జోషి, జూలై 24న అద్వానీల వాదనలు రికార్డు చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు స్పెషల్ జడ్జ్ జస్టిస్ ఎస్కే యాదవ్ సోమవారం ఉత్తర్వులు వెలువరించారు. సీఆర్పీసీ సెక్షన్ 313 కింద అద్వానీ, జోషిల వాంగ్మూలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రికార్డు చేయనున్నట్టు పేర్కొన్నారు. (బాబ్రీ మసీదు కేసులో కొత్త మలుపు) మరోవైపు బాబ్రీ మసీదు కూల్చివేత కేసును ఆగస్టు 31 లోగా పూర్తి చేయాలని లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. నిర్ణీత గడువు లోగా విచారణ పూర్తి చేసి తుది తీర్పు వెలువరించాలని సూచించింది. ఈ నేపథ్యంలో గడువులోగా విచారణ పూర్తిచేసేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రోజువారి విచారణ చేపడుతోంది. కాగా, బాబ్రీ మసీదు కేసులో బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, అశోక్ సింఘాల్, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి.. వంటివారి పేర్లు ఉన్నాయి. కరసేవకులను రెచ్చగొట్టి మసీదును కూల్చివేశారని వీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
‘అయోధ్య’పై రాజ్యాంగ ధర్మాసనం
న్యూఢిల్లీ: రాజకీయంగా ఎంతో సున్నితమైన అయోధ్య వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వివాదంపై దాఖలైన పిటిషన్లను విచారించేందుకు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వం వహించే ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ డీవై చంద్రచూడ్ సభ్యులుగా ఉంటారు. రామ జన్మభూమి– బాబ్రీ మసీదు భూవివాదం కేసులో గురువారం (ఈ నెల 10వ తేదీన) ఈ ధర్మాసనం వివిధ వర్గాల వాదనలు విననుందని సుప్రీంకోర్టు మంగళవారం తన అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతంలో ఉన్న 2.77 ఎకరాల భూమిని ఈ కేసులో కక్షిదారులుగా ఉన్న సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్ లల్లా సంస్థలు సమానంగా పంచుకోవాలంటూ 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు అయోధ్య వివాదం విషయంలో వాదనలు వినేందుకు జనవరిలో ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు గత అక్టోబర్ 29న వెల్లడించింది. అయితే, అయోధ్య కేసులో అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం ఉందంటూ ఇటీవల పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించగా వారి వాదనలను తోసిపుచ్చింది. తాజాగా ఏర్పాటైన ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి మినహా మిగిలిన నలుగురూ భవిష్యత్తులో సీజేఐ అయ్యే అవకాశం ఉన్న వారే కావడం గమనార్హం. అయోధ్యలో రామమందిరం నిర్మించేందుకు వీలుగా ఆర్డినెన్స్ తేవాలంటూ పలు హిందూత్వ సంస్థలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. అయితే, సుప్రీంకోర్టులో న్యాయ ప్రక్రియ ముగిసిన తర్వాతే.. మందిర నిర్మాణంపై ఆర్డినెన్స్ తెచ్చే విషయంలో నిర్ణయం తీసుకుంటామని ప్రధాని మోదీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. -
‘బాబ్రీ మసీదు అని పిలవడం కూడా నేరమే’
లక్నో : వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే షియా వక్ఫ్ బోర్డ్ చీఫ్ వాసీమ్ రిజ్వీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు అనేది దేశానికి ఒక మచ్చలాంటిదని.. దాన్ని మసీదు అని పిలవడం కూడా నేరమని ఆయన వ్యాఖ్యనించారు. ఈ సందర్భంగా రిజ్వీ మాట్లాడుతూ ‘ప్రస్తుతం బాబ్రీ మసీదు ఉన్న స్థలంలో తవ్వకాలు జరిపినప్పుడు చదరపు ఆకారంలో ఉన్న 50 స్తంభాలతో నిర్మితమైన ఆలయం బయటపడింది. ఆలయానికి సంబంధించి మొత్తం 265 అవశేషాలు బయటపడ్డాయి. దాదాపు 137 మంది ఇక్కడ తవ్వకాలు జరిపారు. వీరిలో 52 మంది ముస్లీంలు ఉన్నార’ని తెలిపారు. అంతేకాక బాబ్రీ మసీదు కింద ఆలయం ఉందని.. దాన్ని కూలదోసి అక్కడ మసీదు నిర్మించారని భారత పురావస్తు శాఖ కూడా నిర్ధారించిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా రిజ్వీ కేకే మహ్మద్ రాసిన ‘ఐ యామ్ ఇండియన్’ పుస్తకాన్ని ప్రస్తావించారు. ఈ పుస్తకంలో ‘ప్రస్తుతం బాబ్రీ మసీదు ఉన్న చోట ఆలయాలు ఉండేవాని.. వాటిని నాశనం చేసి ఆ శిధిలాల మీదనే బాబ్రీ మసీదును నిర్మించిరాని’ రచయిత కేకే మహ్మద్ తన పుస్తకంలో రచించినట్లు రిజ్వీ తెలిపారు. అంతేకాక ఈ బాబ్రీ మసీదు విషయంలో హిందువులు - ముస్లీంలు ఓ అగ్రిమెంట్ చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం బాబ్రీ మసీదు ఉన్న చోట రామాలయం నిర్మించే హక్కు హిందువులకు ఉన్నదని ఆయన తెలిపారు. ముస్లింలు లక్నోలోని మరో ప్రాంతంలో మసీదు నిర్మించుకోవాలని ఆయన సూచించారు. అంతేకాక బాబ్రీని మసీదు అని పిలవడం ముస్లిం సాంప్రదాయలకు విరుద్ధం అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా రిజ్వీ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. ‘అయోధ్యలో మసీదు ఉండటానికి అవకాశమే లేదు. ఇది రామ జన్మభూమి.. ఇక్కడ రామాలయం మాత్రమే ఉండాలి.. మసీదు కాద’ని తెలిపారు. -
బాబ్రీ మసీదు పునర్నిర్మించాలి
నిజామాబాద్, న్యూస్‌లైన్: బాబ్రీ మసీదును పునర్నిర్మించాలని డి మాండ్ చేస్తూ నిజామాబాద్ నగరంలో శుక్రవారం ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. గాంధీ చౌక్ ప్రాంతంలో మధ్యాహ్నం వరకు వ్యాపార సముదాయాల ను మూసివేశారు. ఈ సందర్భంగా ముస్లిం పర్సనల్ లా కమిటీ అధ్యక్షులు మౌలానా స య్యద్ వలీఉల్లా ఖాస్మీ మాట్లాడుతూ కొందరి మతవాదుల దుశ్చర్యవల్ల 6 డిసెంబర్ 1992న ఉత్తరప్రదేశ్‌లో అతి పురాతనమైన బాబ్రీ మసీదును నేలమట్టం అయ్యిందన్నారు. ఆ చర్యను నిరసిస్తూ ప్రతి ఏడు బ్లాక్‌డే నిర్వహిస్తున్నామన్నారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో జరుగకుండా కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్‌కు మెమోరాండం సమర్పించారు. కార్యక్రమంలో ము స్లిం పర్సనల్ లా కమిటీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ గఫార్, మహ్మద్ మన్జూర్ అహ్మద్, మహ్మద్ ఫాజిల్ అహ్మద్, ఎంఏ.ఖాదర్, మహ్మద్ యూసూఫ్, హబాబ్అహ్మద్, డమీరోద్దీన్, రహ్మతుల్లా ఖాన్ అల్మాస్, తదితరులు పాల్గొన్నారు.