లక్నో : బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ కీలక నేతల వాంగ్మూలం నమోదు చేసేందుకు రంగం సిద్ధమైంది. బీజేపీ సీనియర్ నాయకులు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిల స్టేట్‌మెంట్‌లను రికార్డు చేసేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తేదీలు ఖరారు చేసింది. జూలై 23న మురళీ మనోహర్ జోషి, జూలై 24న అద్వానీల వాదనలు రికార్డు చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు స్పెషల్ జడ్జ్ జస్టిస్ ఎస్‌కే యాదవ్ సోమవారం ఉత్తర్వులు వెలువరించారు. సీఆర్‌పీసీ సెక్షన్ 313 కింద అద్వానీ, జోషిల వాంగ్మూలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రికార్డు చేయనున్నట్టు పేర్కొన్నారు. (బాబ్రీ మసీదు కేసులో కొత్త మలుపు)
మరోవైపు బాబ్రీ మసీదు కూల్చివేత కేసును ఆగస్టు 31 లోగా పూర్తి చేయాలని లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. నిర్ణీత గడువు లోగా విచారణ పూర్తి చేసి తుది తీర్పు వెలువరించాలని సూచించింది. ఈ నేపథ్యంలో గడువులోగా విచారణ పూర్తిచేసేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రోజువారి విచారణ చేపడుతోంది. కాగా, బాబ్రీ మసీదు కేసులో బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, అశోక్ సింఘాల్, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి.. వంటివారి పేర్లు ఉన్నాయి. కరసేవకులను రెచ్చగొట్టి మసీదును కూల్చివేశారని వీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment