షియా వక్ఫ్ బోర్డ్ చీఫ్ వాసీమ్ రిజ్వీ(ఫైల్ ఫోటో)
లక్నో : వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే షియా వక్ఫ్ బోర్డ్ చీఫ్ వాసీమ్ రిజ్వీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు అనేది దేశానికి ఒక మచ్చలాంటిదని.. దాన్ని మసీదు అని పిలవడం కూడా నేరమని ఆయన వ్యాఖ్యనించారు. ఈ సందర్భంగా రిజ్వీ మాట్లాడుతూ ‘ప్రస్తుతం బాబ్రీ మసీదు ఉన్న స్థలంలో తవ్వకాలు జరిపినప్పుడు చదరపు ఆకారంలో ఉన్న 50 స్తంభాలతో నిర్మితమైన ఆలయం బయటపడింది. ఆలయానికి సంబంధించి మొత్తం 265 అవశేషాలు బయటపడ్డాయి. దాదాపు 137 మంది ఇక్కడ తవ్వకాలు జరిపారు. వీరిలో 52 మంది ముస్లీంలు ఉన్నార’ని తెలిపారు.
అంతేకాక బాబ్రీ మసీదు కింద ఆలయం ఉందని.. దాన్ని కూలదోసి అక్కడ మసీదు నిర్మించారని భారత పురావస్తు శాఖ కూడా నిర్ధారించిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా రిజ్వీ కేకే మహ్మద్ రాసిన ‘ఐ యామ్ ఇండియన్’ పుస్తకాన్ని ప్రస్తావించారు. ఈ పుస్తకంలో ‘ప్రస్తుతం బాబ్రీ మసీదు ఉన్న చోట ఆలయాలు ఉండేవాని.. వాటిని నాశనం చేసి ఆ శిధిలాల మీదనే బాబ్రీ మసీదును నిర్మించిరాని’ రచయిత కేకే మహ్మద్ తన పుస్తకంలో రచించినట్లు రిజ్వీ తెలిపారు. అంతేకాక ఈ బాబ్రీ మసీదు విషయంలో హిందువులు - ముస్లీంలు ఓ అగ్రిమెంట్ చేసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం బాబ్రీ మసీదు ఉన్న చోట రామాలయం నిర్మించే హక్కు హిందువులకు ఉన్నదని ఆయన తెలిపారు. ముస్లింలు లక్నోలోని మరో ప్రాంతంలో మసీదు నిర్మించుకోవాలని ఆయన సూచించారు. అంతేకాక బాబ్రీని మసీదు అని పిలవడం ముస్లిం సాంప్రదాయలకు విరుద్ధం అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా రిజ్వీ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. ‘అయోధ్యలో మసీదు ఉండటానికి అవకాశమే లేదు. ఇది రామ జన్మభూమి.. ఇక్కడ రామాలయం మాత్రమే ఉండాలి.. మసీదు కాద’ని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment