
వక్ఫ్ చట్ట సవరణలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15లను ఉల్లంఘించడమే
మతం ఆధారంగా వివక్ష తగదు
వక్ఫ్ నిర్వహణ సరిగా లేకుంటే జోక్యం చేసుకోవాలి తప్ప మత విశ్వాసాలకు విరుద్ధంగా ప్రభుత్వాలు వ్యవహరించకూడదు
వక్ఫ్ చట్ట ‘సవరణ’లను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలి
వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు ప్రాతినిధ్యం కల్పించడం రాజ్యాంగ విరుద్ధం
కొత్త చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో వైఎస్సార్‌సీపీ పిటిషన్
సాక్షి, అమరావతి: వక్ఫ్ చట్టం–1995కు సవరణలతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సవరణల రాజ్యాంగ బద్ధతను ప్రశ్నిస్తూ.. మతం ఆధారంగా వివక్ష చూపేలా కొత్త చట్టం ఉందని పేర్కొంది. ఆర్టికల్ 14, 15లను ఉల్లంఘిస్తున్న సవరణలను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
వక్ఫ్ నిర్వహణ సక్రమంగా లేకుంటే జోక్యం చేసుకోవచ్చే తప్ప, మత విశ్వాసాలకు విరుద్ధంగా ప్రభుత్వాలు వ్యవహరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. వక్ఫ్ బోర్డు సీఈవోగా ముస్లిం వ్యక్తే ఉండాలన్న నిబంధనను కొత్త చట్టంలో తొలగించారని తెలిపింది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు అవకాశం కల్పించడం మౌలిక సూత్రాలకు విరుద్ధమని.. ఇది తరాలుగా వస్తున్న హక్కులకు విఘాతం కలిగించడమేనని పేర్కొంది. కీలక వ్యక్తులను తొలగించేందుకు కూడా కొత్త సవరణలు అవకాశం కల్పిస్తున్నాయంది.
⇒ ముస్లిం ధార్మిక సంస్థల వ్యవహారాల్లో ప్రభుత్వం పెద్దఎత్తున జోక్యం చేసుకునే అవకాశం ఇస్తూ, పాత వక్ఫ్ చట్ట ఉద్దేశాలను కాలరాసేలా ఉన్న సవరణలతో వక్ఫ్‌ల పాలన బలహీనం అవుతుందని పేర్కొంది.
⇒ వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, పునర్విభజన విషయంలో జోక్యం చేసుకునేందుకు అధికారులకు అపరిమిత అధికారాలు ఇచ్చారని వైఎస్సార్‌సీపీ పిటిషన్‌లో తెలిపింది. కానీ, ఒకసారి వక్ఫ్ అయితే అది ఎప్పటికీ వక్ఫ్ అవుతుందన్న సూత్రాన్ని న్యాయస్థానాలు కూడా గుర్తించాయని తెలిపింది. మైనారిటీ ఆస్తులకు రాజ్యాంగ రక్షణ ఉందని, కొత్త చట్టంతో అన్ని రక్షణలు పోతున్నాయని పేర్కొంది. ఇది అత్యంత ఆందోళన కలిగించే విషయమని పేర్కొంది. రక్షిత స్మారక చిహ్నాలు, రక్షణ ప్రాంతాల ప్రకటనను చెల్లనివిగా తేల్చే ప్రమాదం ఉందని తెలిపింది.
⇒ ఏ చట్టమైనా దాని మాతృ చట్టం స్ఫూర్తికి అనుగుణంగా ఉండాలని సుప్రీంకోర్టు ఎన్నో తీర్పుల్లో చెప్పిందని తెలిపింది. కానీ, కొత్త చట్టంతో పురాతన వక్ఫ్‌ల స్వరూపాన్ని సవాలు చేసే పరిస్థితి వచ్చిందని వైఎస్సార్‌సీపీ తన పిటిషన్‌లో వివరించింది.
⇒ ఏ వక్ఫ్ ఆస్తినైనా ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించే అధికారాన్ని అధికారులకు కొత్త చట్టం కట్టబెట్టిందని తెలిపింది. గతంలో ఉన్న రక్షణలేవీ లేకుండా చేస్తోందని, అందువల్ల ఈ సవరణ చట్టం విషయంలో జోక్యం చేసుకోవాలని కోరింది.

⇒ ఇస్లామిక్ చట్టాలు, కట్టుబాట్లకు అనుగుణంగా వక్ఫ్‌ల నిర్వహణ ఉంటుందని, కానీ, సవరణలు అందుకు విరుద్ధంగా ఉన్నాయంది. ముస్లిం సంస్థల్లో ముస్లింల ప్రాబల్యాన్ని తగ్గించడానికి తీసుకొచ్చిన ఈ సవరణలను కొట్టేయాలని వైఎస్సార్‌సీపీ అభ్యర్థించింది.
⇒ వక్ఫ్ ఆస్తుల రక్షణ కోసం దశాబ్దాలుగా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటూ వస్తున్నాయంది. అందులో భాగంగానే ట్రిబ్యునళ్ల ఏర్పాటు జరిగిందని తెలిపింది. తద్వారా వక్ఫ్ ఆస్తుల రక్షణకు ఆస్కారం లభించిందని తెలిపింది.
⇒ కొత్త సవరణ చట్టం ముస్లిం ధార్మిక సంస్థలు, వక్ఫ్‌ల స్వతంత్రతలను సవాలు చేసేలా సవరణ చట్టం ఉందని స్పష్టం చేసింది. వక్ఫ్‌లతో ముడిపడి ఉన్న విద్యా, సాంస్కృతిక సంస్థల మనుగడ ప్రమాదంలో పడిందని పిటిషన్‌లో తేల్చి చెప్పింది.
⇒ వక్ఫ్ బోర్డు సభ్యుల కోసం ఎన్నికల స్థానంలో నామినేషన్ విధానాన్ని తేవడం ద్వారా ప్రజాస్వామ్య ఎన్నిక విధానాన్ని కాలరాసినట్లైందని తెలిపింది.
⇒ ఆస్తి యజమానికి తెలిసి.. ఆ ఆస్తిని సుదీర్ఘ కాలంగా ధార్మిక కార్యకలాపాలకు వాడుతుంటే ఆ ఆస్తి వక్ఫ్‌ది అవుతుందని–1995 చట్టంలో స్పష్టంగా ఉందని, దానికి తూట్లు పొడిచేలా సవరణలు ఉన్నాయంది. ఈ పరిస్థితుల్లో కొత్త సవరణ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించడంతో పాటు చెల్లనిదిగా కూడా ప్రకటించాలని సుప్రీంకోర్టును వైఎస్సార్‌సీపీ అభ్యర్థించింది.