
న్యూఢిల్లీ: వక్ఫ్ బోర్డులను నియంత్రించాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జె.పి.నడ్డా స్పష్టంచేశారు. వక్ఫ్ బోర్డులు చట్ట పరిధిలోనే పని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆయా బోర్డుల ఆస్తులు విద్య, వైద్యం, ఉపాధి కల్పన కోసం ఉపయోగపడాలని, తద్వారా ముస్లిం వర్గానికి మేలు జరగాలని చెప్పారు. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జె.పి.నడ్డా పాల్గొన్నారు.
పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టర్కీతోపాటు చాలా దేశాల్లో వక్ఫ్ బోర్డుల ఆస్తులను అక్కడి ప్రభుత్వాలు నియంత్రణలోకి తీసుకున్నాయని గుర్తుచేశారు. మన దేశంలో మాత్రం బోర్డులు చట్ట పరిధిలో పని చేయాలని చెబుతున్నామని పేర్కొన్నారు. ఎవరైనా సరే నిబంధనల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. అలాగే బీజేపీ ప్రస్థానాన్ని నడ్డా ప్రస్తావించారు. నేడు బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీల్లో ఒకటిగా మారిందని అన్నారు. ప్రస్తుతం బీజేపీకి 240 మంది లోక్‌సభ సభ్యులు, 98 మంది రాజ్యసభ సభ్యులు, 1,600 మందికిపైగా ఎమ్మెల్యేలు ఉన్నారని గుర్తుచేశారు.