
గాంధీ నగర్ : దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దేశ సమస్యలు తీర్చాలంటే దేశాన్ని ఎక్సరే తీయాలని వ్యాఖ్యానించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో రెండో రోజు ‘అఖిల భారత కాంగ్రెస్ కమిటీ’ (ఏఐసీసీ) సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు.
దళితులు,ఆదివాసీలు,పేదల కోసం కాంగ్రెస్ పనిచేస్తోంది. బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ నిత్యం పోరాటం చేస్తుంది. కులగణనతో దేశంలో ఓబీసీల సంఖ్య తేలుతుంది. తెలంగాణలో కులగణన చేపట్టాం. జాతీయ స్థాయిలో జనగణన చేసే వరకు పోరాడుతాం. కుల గణనతో ఏ వర్గం జనాభా ఎంత ఉంటుందో తేలుతుందని వ్యాఖ్యానించారు.
LIVE: Nyaypath - AICC Session | Ahmedabad, Gujarat https://t.co/8snXJNmtEM
— Rahul Gandhi (@RahulGandhi) April 9, 2025
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మంగళవారం ప్రారంభమైన ఏఐసీసీ సమావేశాలు కొనసాగుతున్నాయి. 1,700 మంది ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. తొలిరోజు ఏప్రిల్ 8న విస్తృత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఏప్రిల్ 9న ఏఐసీసీ సభ్యులతో సమావేశం కొనసాగుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ రెండు సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియాగాంధీ, లోక్‌సభ విపక్షనేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల సీఎంలు దీనిలో పాల్గొన్నారు.